Like-o-Meter
[Total: 0 Average: 0]
ఈ చిత్రాన్ని మొదటిసారిగా చూడగానే నా ఒళ్ళు గగుర్పొడిచింది. “శివగంగ శివమెత్తి పొంగగా, నెలవంక సిగపూవు నవ్వగా” అన్న సినీ కవి మాటలు మదిలో మెదిలాయి. ఆ వెంటనే “ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు – శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి య – స్తోకాంబోధి, బయోధి నుండి పవనాంథోలోకముం జేరె గంగా…” అన్న భర్తృహరి శ్లోకానువాదం గుర్తుకొచ్చింది.
భర్తృహరి గంగను “వివేక భ్రష్ట సంపాతా”నికి ప్రతీకగా చూపాడు. కానీ కొద్దిరోజుల క్రితం ఆమె చేసిన విలయతాండవం వెనుక మన వివేక భ్రష్టత్వమే ఎక్కువగా ఉందనిపిస్తోంది. చెడ్ద పనులు చేసేందుకు పరుగులు పెట్టే మానవాళి ఒక మంచిపని చేయడానికి పూనుకోదు. “ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై…” అని భర్తృహరి నిరసనను బలంగా తెలియజేసిన ఏనుగు లక్ష్మణ కవి వాక్కు వృధా పోవడం లేదు.
గంగా వరద నియంత్రణా ఆయోగ్ (Ganga Flood Control Commission) తన 2010-11 నివేదిక ఎన్నో చర్యల్ని ప్రతిపాదించినా అడవుల నరికివేత, ప్రకృతి ద్వ్హంసం పై ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది చాలదూ, గంగమ్మకు కోపం రావడానికి? విచక్షణారహితంగా కట్టిన హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టులే గంగా నదీ పరీవాహక ప్రాంతాల్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని పర్యావరణ పరిశీలకులు వాదిస్తున్నారు. అడవుల్ని అడ్డంగా నరికేయడం వల్ల భూమి కోతకు గురి అవుతోంది. ఈ భూమి కోత ఉత్తరాఖండ్ లాంటి కొండప్రాంతాలకు ప్రాణ సంకటం తెచ్చిపెట్టిందన్న నిజం మొన్నటి మెరుపు వరదలవల్ల తేలింది.
ఇది గంగమ్మకు వచ్చిన కోపం కాదు, మానవులు ఆమెను రెచ్చగొట్టిన పాపం.
అవిచ్చిన్న విష్ణు భక్తికి అచ్చెరువొంది
శివుని జటాజూటమున్ విడచి
ఝరి గా మారి జయజయ నాదం చేస్తూ
పరవశించి శివునే ముంచే శ్రీపాదోదక గంగ
మహాదానంగా మహోగ్రం గా
గంగా ఝరి మారెను ప్రళయం గా
గంగాధర జటాజూట నిలయ
పావని పాపహారిణి జీవదాత
తన స్వస్తలమున్ మరచనో
లేక విడచి ఆ శివునే తన్మయంలో
ముంచెత్త తలచనో జనుల పై
కినుకతో క్రిందకు దిగెనో
పాపులతో కూడిన భూభారాన్ని
తన ప్రవాహంతో కరిగించి దలచనో
మంద గమన మందాకినీ తిరిగి
అంబరాన్ని చేరే ఉత్సాహం తో
తన ఉధృతి పెంచనో
శాంతించు తల్లీ కరుణించు మాతా