Like-o-Meter
[Total: 0 Average: 0]
వేంకటేశుడే సాక్షి తిరుమల లో భక్తుల వెతలకు
దేవస్థాన నిర్వాహకుల నిర్వాకాలకు
ప్రజా పాలకుల అక్రమాలకూ అధికార దుర్వినియోగానికి
ధర్మం పేరున జరుగుతున్న హద్దులెరగని అధర్మానికి
రాచరికం సమసిపోలేదనడానికి నిదర్శనం వి. ఐ. పి. దర్శనం
అన్ని ఆర్జనలకు మూల మైన వానికి ఆర్జన అంటగట్టడం
వేల కొలది భక్తులను కాదని కొందరికే శ్రీవారి సామీప్య దర్శనం
భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే కాని
దేవస్థాన పాలకుల దృష్టిలో కాదు!
ట్రాఫిక్ దిగ్బంధం చేస్తే ఏ.సి కారులో సాఫీగా సాగిపోయే సారుకి
ఏమి తెలుస్తుంది రద్దీ సమయంలో సామన్యుని ఆరాటం, పోరాటం?
వేల భక్తులు వేసారుతుంటే మహా ద్వార దర్శనం చేసికొనే సారుకి
ఏమి తెలుస్తుంది భ్రష్టుపట్టిన పరిపాలన గురించి?
వెంకన్నకు తెలియదా ఏ దారిలో వచ్చి చూసావో?
ఎంత సొమ్ము లంచంగా చెల్లించావో?
ఎన్ని పాపాలు పుణ్యాలు చేసావో చేయ్యబోతున్నవో
ఎవరిని ఎమార్చదానికీ దర్శనాలు, దర్శన విధానాలు
మనల్ని మనం మోసం చేసికొని కుమిలిపోవడం మినహా!
ఎంత ఆధ్యాత్మికత ఉంది మన దేవాలయ నిర్వహణలో?
తిరుపతి అంటే పద్మావతి గెస్టుహౌసు, మహాద్వార దర్శనం
కళ్యాణ లడ్డు, దేవాలయ మర్యాదలు తక్క
మరింకేమి తెలుసు మన పాలకులకు?
ప్రాణం పోతుందనే సాకుతో, భయంతో
ఈ పాపాల భైరవులు నిజాలకు నిజంగా దూరమయ్యారు
అవాస్తావంలో కూర్చొని వాస్తవానికి ప్రణాళికలు వేస్తారు
వాస్తవంలో సత్యాలను గిట్టని మాటలుగా కొట్టిపారేస్తారు
సాత్వికులు చేసే దేవాలయ నిర్వహణ
స్వలాభం ఒకటే తెలిసిన వారి చేతిలో ఉంటె
ఆధ్యాత్మిక కేంద్రాలైన మన దేవాలయాలు
అన్ని రకాల వ్యాపారాలకు నిలయాలైనాయి
కలి ఇలలో బలియిచునున్నాడు
వీని గెలువ వచ్చు వెంకన్న దయతోడ!!