వైరుధ్యాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Published on 20/10/2007 in www.aavakaaya.com

‘బతికిన క్షణాల’ గురించి ఎంత అందంగా వ్రాసారు వేగుంట మోహనప్రసాదు గారు. మనిషి జీవితంలో ‘బతికిన క్షణాలు’ వేళ మీద లెక్కించుకోవచ్చు. మనం ‘బతకని క్షణాలు’ కూడా గుర్తు చేస్తూ సాగే పుస్తకం అది. ఓ ఇరవైనాలుగు గంటలు సుబ్బుతో నేను బతికిన క్షణాల ప్రేరణతో వ్రాసుకుపోతున్నా. ఇది వ్రాస్తున్న ప్రతిక్షణం నేను బతుకుతున్న క్షణమే. ఇది కథ కాకపోయినా ఓ అనుభవంగానే వ్రాస్తున్నాను.

* * * * *

ఓ మాదిరి అందంగానే ఉందని చెప్పొచ్చు ఆ అమ్మాయి. తేరిపార కాకపోయినా మామూలుగానే చూసాననుకున్నా. అంత అసహ్యకరమైనదేం ఉందో నా చూపుల్లో, నాకైతే తెలీదు. కానీ, చూపులతోనే చాచి లెంపకాయ కూడా కొట్టొచ్చునని మాత్రం మొదటిసారి తెలుసుకున్నాను. రేపోసారి నా అద్దాన్ని కడిగేయాలి.

అయినా, అందంగా ఆహ్లాదంగా ఉంటాయనే కదా పూలు, మొక్కలు, చెట్లు, చెరువులు చూస్తూ ప్రయాణం చేస్తాం. మరి అమ్మాయి అందంగా ఉందని చూస్తే తప్పేంటో? తన స్టేషనులో దిగిన ఆ అమ్మాయే, ఓరకంట నేను మళ్ళీ చూస్తున్నానో లేదో గమనిస్తుంటే ‘ఐ కేర్ ఎ డామ్ ‘ అనే లుక్కిచ్చా. ఇంకా ఆలోచిస్తే.. వైరుధ్యాల మధ్య దారులు వెదుక్కోవటమే మనిషి నైజం అన్న విషయం మరోసారి రూఢీ అయ్యిందనిపించింది.

నిజానికి, ట్రైనులో చిరాగ్గా మొహం ముడుచుకున్న ఆ అమ్మాయి నా చూపుల్లో వెదుక్కున్న అర్ధం ఏమిటో నాకైతే తెలీదు. అందంగా కనిపించిందని చూసానే కానీ, ఆరాధనగా కాదని ఆ అమ్మాయికి చెప్పే అవకాశం లేదు. అంతలోనే మారిపోయే అభిప్రాయాల విలువేమిటో తెలుసు కాబట్టి, అవకాశం ఉన్నా చెప్పే అవసరం ఉందనుకోను.

తడిసిన రెక్కల కింద ముక్కుతో పొడుచుకుంటూ కాకి. తీరిగ్గా చూసేలోపే కనుమరుగైపోయింది. వర్షంలో తడిసిన కాకి కూడా ఎంత అందంగా ఉందో అని అనుకోకుండా ఉండలేకపోయాను.

నిన్న కూడా వాన పడిందట, కాబట్టి ఈరోజు వాన పడుతుందనుకున్నా, పడదనుకున్నా వచ్చే నష్టం ఏముంది? కేవలం ఆ విషయం గురించి అనర్గళంగా వాదిస్తూ, బతికే క్షణాలు వ్యర్థం చేసుకోవటం దేనికి? పక్కవాళ్ళ మాటలు ఆలోచనల్లో దూరుతున్నాయి. క్షమించేయండి.

ప్రస్తుతానికి సన్నగానైనా వానపడుతున్నదనేది సత్యం. కిటికీ తుంపర పడుతున్నదని కిటికీ మూయమంటున్నాడు బతికిన క్షణాలు వ్యర్థం చేసుకున్న పెద్దమనిషి. దిగాల్సిన సమయం వచ్చింది కాబట్టి వాడి విషయం నాకిక అనవసరం.

చేతిలో గొడుగు లేదని బాధో, భయమో ఇతమిత్థంగా చెప్పలేను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో దారి వెదుక్కున్నట్లున్నాడు. వాడు మాత్రం చేతులో గొడుగుని ఓమారు సర్దుకుంటున్నాడు. నేను ముందస్తుగా దారి వెదుక్కోలేదు కాబట్టి, వాన ఆగితే బాగుండు అనుకుంటున్నా.

ఒక అనుమానం…. ముందస్తు దారులు వెదుక్కుంటే అవి తకాలనుకున్న క్షణాలే అవుతాయి కానీ, బతికిన క్షణాలు ఎలా అవుతాయి? అందుకేనేమో, ‘లివ్ ద లైఫ్ ద వే ఇట్ కంస్’ అన్నారు.

వాన ఆగితే బాగుండు అనుకున్నా కాబట్టి, ఆగుతుందనే అనుమానం లేదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవటమే మనిషి పని అని ఎప్పుడో చెప్పాడో సినీ కవి.

స్టేషన్ మెట్ల మీద నిలబడి చూస్తుంటే… పోయినేడాది చూసిన కొబ్బరి చెట్టు…. గంపెడు ఆశలు తీర్చమని ఆకాశాన్ని దేబిరించిన చెట్టు…. గంపెడు బరువు మోయలేక తీగలకి అడ్డంగా దారులు వెదుక్కుంటున్నది.

చెట్టు మీద నుంచి ఓ కాకి, నన్ను నా సూట్ కేసుని చూస్తూ …

Your views are valuable to us!