Like-o-Meter
[Total: 0 Average: 0]
వరాలను దయచేయవు ఇవి
వారాలకు పరదాలు వేసి చూపిస్తాయి
పరదా తీస్తే అది వరం కాదని తెలుస్తుంది
ఈలోగా మరో వరద వస్తుంది
మొల లోతు నీళ్ళలో
మనుషులు సహాయం కోరడం
మార్చి మార్చి చూపిస్తాయి టీ వీలు
వరదనీరుతొ బాటూ ఈ వార్తా “మరుగు”న పడిపోతుంది
ఒక రోజు భోజనం పెట్టి
ఫోటోలు, వ్యాసాలూ ముద్రించుకొనే వాళ్లకు
వచ్చే ఎన్నికలకు వరద పునాది ఔతుంది
బురద మిగిలిపోయి బడుగుల బతుకు భారమౌతుంది
ఈ వరదలు ఈ విపత్తులు రాకపోతే
ఎలా బతికేది రాజకీయనాయకులు?
ఔను సగటు మనిషి బతుకులో అన్నీ అనువైనవే
ఎన్నికలకు రాజకీయాలకు
ఉన్న పూరి పాక మునిగి పోయి
కట్టిన మరుగుదొడ్డి కూలిపోయి
వంట చెరకు తడిసిపోయి
బియ్యం వరదపాలై
బిడియం ఒక్కటే మిగిలింది
ఆ పల్లె పడచు జీవితంలో
ఇందిరమ్మ పక్కా ఇళ్ళు
ఇంకా ఎందరికో అందని ద్రాక్ష పళ్ళు
గరీబులను గారీబులుగా ఉంచడం
మన పేదరిక నిర్మూలన పధకం
అందరూ అక్షరాశ్యులైతే
రాజీవ్ గ్రామీణ అక్షరాశ్యత ఎలా అమలు చేయాలి
అందరి కడుపు నిండితే
పనికి ఆహారం పధకం ఎలా ప్రవేశ పెట్టాలి
వరద రాకుండా చేయగలిగితే
వరద సహాయం ఎలా చేయాలి?
కల కాలం నిలచిపోయే పధకాలు
కావలి మన పాలకులకు!
ఈ వరదల్లో కొందరు మంత్రులై
మంత్రాంగం సిద్దం చేసుకొంటున్నారు సంపాదన కోసం
వాళ్ళూ వరద ప్రాంతాలలో పర్యటిస్తారు
బడా నేతలు ఆకాశంలో ఎగురుతూ విమానం కిటికీలోంచి చూస్తారు
పేదోడు మాత్రం పెద్ద చిత్రం చూస్తూ ప్రగతి లేక అలాగే పడి ఉంటాడు.