ఈ ధర చంద్ర క గురు వి భ
గో ధర భవ మణిగతిన్ నగుఁ గళా తేజో
మేధా జవ నయ శమ ధృతి
బోధ వితర ణాత్మవిహృతి మురరిపుఁ డెపుడున్.
గణపవరపు వేంకటకవి రచించిన సాటిలేని చిత్రకావ్యం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము లోని 328-వ పద్యం ఇది. ఈ శబ్దచిత్ర రచనకు గూఢ దశమి అని పేరు.
ముందుగా పద్యార్థాన్ని పరిశీలిద్దాము. వేంకటేశ్వరస్వామి సాయంతనపు వాహ్యాళికి బయలుదేరి కొండమీది తిరునాళ్ళను చూసుకొంటూ పరివారంతో ముందుకు సాగుతుంటాడు. శ్రీవారి చేతిలో ఉన్న కేళి డేగ ఆకాశరాజు కుమార్తె నాంచారు దేవి ఉద్యానవనంలో వాలుతుంది. శ్రీవారు అక్కడికి మంత్రిసహితుడై విచ్చేసి, ఆమె వృత్తాంతాన్ని తెలిసికొనిరమ్మని మంత్రిని పంపిస్తాడు. మంత్రి ఆమెను చెలికత్తెలతో ఉండగా చూసి, వారితో మాటలు కలిపి వేంకటేశ్వరుని మహిమను అభివర్ణించే సందర్భంలోనిది ఈ పద్యం.
శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగప్రత్యక్ష దైవతం. శ్రీమహావిష్ణువు యొక్క అర్చావతారం కనుక తాద్రూప్యభావన వల్ల శ్రీమహావిష్ణుకృతమైన మురాసుర సంహారకర్తృత్వం ఆయనయందు అధ్యారోపింపబడుతున్నది. లోకకంటకుడైన మురాసురునికి ప్రారబ్ధం నిండి, చేసిన పాపం పండి, కర్మశేషం తీరిన తర్వాత భగవంతుని చేతిలో మరణం సిద్ధించింది. భగవన్నామాలన్నీ భగవంతుని గుణకర్మలను బట్టి ఏర్పడినవి కాబట్టి భగవద్గుణవైభవాన్ని వర్ణించేందుకు మురరిపుత్వాన్ని ప్రాతిపదికగా ఎన్నుకొన్నాడు కవి.
మురరిపుఁడు = శ్రీ వేంకటేశ్వర స్వామి, ఈ ధరన్ = ఈ ధరణియందు శేషాద్రిశిఖరం పైని స్వయంవ్యక్తుడై వెలసిన తరుణాన, చంద్ర = చంద్రునియొక్క, క = సూర్యునియొక్క, గురు = బృహస్పతి యొక్క, వి = పక్షిరాజైన గరుత్మంతునియొక్క, భ = శుక్రుని యొక్క, గో = భూమి యొక్క, ధర = పర్వతము యొక్క, భవ = ఈశ్వరుని యొక్క, మణి = చింతామణి యొక్క, గతిన్ = స్వరూపస్థితిని, కళా = తన సర్వకళామయత్వం చేత, తేజః = నిండైన వెలుగు చేత, మేధా = బుద్ధివిశేషం చేత, జవ = జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అన్న ధర్మత్రయము చేత, నయ = నేర్పుచేత, శమ = సర్వోపాధులకు అతీతుడైనందువలన విక్షేపాది విక్రియలు లేని ఇంద్రియశాంతి సిద్ధించటం చేత, ధృతి = ఎల్లవేళల ఆనంద స్వరూపానుభవాన్ని పొంది ఉండటం చేత, బోధ = తత్త్వజ్ఞానసంపత్తి చేత, వితరణ = సర్వజీవులకు అభీష్టసిద్ధిదాయకత్వం చేత, ఎపుడున్ = త్రికాలములలో, నగున్ = పరిహసిస్తుంటాడు – అని ప్రతిపదార్థం.
మురరిపుఁడు = శ్రీ వేంకటేశ్వర స్వామి, ఈ ధరన్ = ఈ ధరణియందు శేషాద్రిశిఖరాన స్వయంవ్యక్తుడై వెలసిన తరుణాన, చంద్ర = చంద్రుని యొక్క స్వరూపస్థితిని, కళా = తన సర్వకళామయత్వం చేత, క = సూర్యునియొక్క స్థితిని, తేజః = నిండైన తన వెలుగు చేత, గురు = బృహస్పతిని, మేధా = బుద్ధివిశేషం చేత, వి = గరుత్మంతుని, జవ = మహాశక్తి చేత, భ = శుక్రుని, నయ = నేర్పుచేత, నీతికోవిదత్వం చేత, గో = భూమిని, శమ = శాంతావస్థ చేత, ధర = పర్వతమును, ధృతి = ధారణశక్తి చేత, భవ = ఈశ్వరుని, బోధ = తత్త్వజ్ఞానసంపత్తి చేత, మణి = చింతామణిని, వితరణ = తన అభీష్టవరదానం చేత – తిరస్కరిస్తాడని ఇందులోని దళాల క్రమాన్వయం.
చంద్రుడు షోడశకళాపూర్ణుడు. అయితే ఆ కళలకు వృద్ధిక్షయాలున్నాయి. స్వామి అక్షయకళాప్రపూర్ణుడు. ఆయన కళాత్మికతకు కాలానుసారిత లేదు. అందువల్ల చంద్రుని తన కళచేత పరిహసించాడని కవి భావం.
సూర్యుని వెలుగుకూడా అంతే. కాలాధీనం. స్వామి తేజం అటువంటిది కాదు. అది శబ్ద స్పర్శ రూప గుణాలను కలిగిన ఒక తన్మాత్ర మాత్రమే కాదు. అది చిత్స్వరూపం. చైతన్యాత్మకమైన ప్రకాశం. సూర్యుని వెలుగు అందులోని అంశమాత్రం. అందువల్ల సూర్యుని యొక్క స్వరూపస్థితిని తన తేజోమయత్వం చేత అధఃకరించటం జరిగింది.
గురువు యొక్క బుద్ధి తత్త్వాపతత్త్వాల వివేకసామర్థ్యం వల్ల ఏర్పడినది. అది బ్రహ్మజ్ఞానరూపం. స్వామి తానే బ్రహ్మమైనవాడు. ఆయన మేధాశక్తియే మహత్తత్త్వం. అదే జగదంతరాత్మ. అతిమానుషమైన ఆయన నిశ్చయాత్మికవృత్తి ముందు బృహస్పతి యొక్క బోధస్వరూపం వెలవెలపోతుంది. అందువల్ల అది పరిహసనీయమని చిత్రణ.
గరుత్మంతుడు మహాబలసంపన్నుడు. అయితే స్వామికి వాహనభూతుడే కాని స్వతంత్రుడు కాడు. జవము అంటే వేగము అన్న అర్థం కూడా ఉన్నది. గరుత్మంతుని వేగం వాయుసంచారానికి లోగి ఉంటుంది. స్వామి శక్తి అటువంటిది కాదు. అది కారణనిష్ఠమై కార్యోత్పాదనరూపమైన ఒక ధర్మం. ఆ శక్తిసామర్థ్యం సగుణమైనప్పుడు దానిముందు గరుత్మంతుని బలం సాటిరాదు. అందువల్ల అది నవ్వులపాలయింది.
శుక్రుడు నీతికోవిదుడు. అది యోగ్యవ్యహారబోధరూపమైన రాజవిద్యానుబంధం. స్వామి నయవిద్య ఒక భగవద్విభూతిభేదం. రెండింటిని సాటిచేసినప్పుడు కవి దృష్టిలో శుక్రుని స్థితి పరిహాసాస్పదం అయింది.
భూమిని శమముయొక్క గతిని బట్టి పరిహసించటం భవ్యంగా అమరింది. ఆమె క్షమాస్వరూపిణి. ఓరిమి ఆమె స్వభావం. స్వామి ఎంతటి క్షమాస్వరూపుడో అంతటి దుష్టసంహారక్రియానిపుణుడు. సృష్టిస్థితిలయాలు మూడూ ఆయన సంకల్పాధీనాలు. ఆ శక్తి సమగ్రిమ ముందు ఏదీ తులనీయం కాదని కవి భావం. అందువల్ల తిరస్కరణం. పైగా భూమియొక్క గతి తానంతకు మునుపే అధఃకరించిన సూర్యుని ఆశ్రయించుకొని ఉంటుంది. అందువల్ల కూడా హసనీయం.
ధరను ధృతిచేత పరిహసించటమూ సముచితమైన కల్పనే. ధర అంటే పర్వతం. భూమిభారాన్ని ధరించేది అన్న అర్థంలో పర్వతానికి ధర అన్న సంకేతం ఏర్పడింది. భగవంతుడు ఆ పర్వతానికంటె ధృతిమంతుడు. పర్వతం భూమిభారాన్ని మాత్రమే వహిస్తున్నది. భగవంతుడో? విశ్వ విశ్వంభరా భార సంభరణ దీక్షాదక్షుడు. అందువల్ల చిన్నచూపు.
ఈశ్వరుడు సర్వశ్రేయోఽనువర్తి. భవ శబ్దం చేత పుట్టుక కలవాడని సాభిప్రాయమైన విమర్శయుక్తి ఉన్నది. హరిహరులకు భేదభావం లేకపోయినా, శ్రీ వేంకటేశ్వరునిలో ఈశ్వరత్వం నిబిడమై ఉన్నా, వక్ష్యమాణాన్ని బట్టి కవి భవుని యొక్క బోధశక్తికంటె శ్రీ వేంకటేశ్వరుని బోధసంపదను ప్రమాణీకరిస్తున్నాడు.
మణి అంటే కోరిన కోర్కెలను తీర్చే చింతామణి. ఆ చింతామణికంటె గొప్ప చింతామణి స్వామి. చింతామణి కోరినవారి కోరికలను మాత్రమే తీర్పగలుతుంది. పరుసవేది ఇనుమును బంగారుగా మార్చగలదే కాని, ఇనుమును పరుసవేదిగా మార్చి, తక్కిన వస్తువులను బంగారంగా మార్చే శక్తిని ప్రసాదింపలేదు. చింతామణి కూడా అటువంటిదే. కాని, స్వామి కరుణ అటువంటిది కాదు. ప్రారబ్ధాన్ని అనుభవించి, కర్మశేషం తీరిన భక్తునికి విదేహ కైవల్యముక్తిని ప్రసాదింపగలదు. చింతనపరులకు శుద్ధము, బుద్ధము, ముక్తము, కేవలము, అఖండము, సచ్చిదానందస్వరూపము అయిన స్వామి స్వరూపానుభవం కలుగుతుంది. కోరినవారికి కొంగుబంగారం ఆయన.
పద్యంలో చంద్ర – క – గురు – వి – భ – గో – ధర – భవ – మణి అని మొత్తం తొమ్మిది పదార్థముల సంచయం ఉన్నది. వాటి స్వస్థితిని అధఃకరించేందుకు కళా – తేజో – మేధా – జవ – నయ – శమ – ధృతి – బోధ – వితరణములు అని తొమ్మిది శక్తులు చెప్పబడ్డాయి.
గూఢ దశమి
పద్యం చివరి దళంలో ‘ఆత్మవిహృతి’ అన్న పదబంధం ఉన్నది. అందుకు సిద్ధమైన ఉపమానం లేదు. దాని బోధ్యబోధకం ఏమిటో కవి చెప్పలేదు. అన్వయస్థితిని నిరూపించలేదు. యథావస్థితంగా దానికి అన్వయం చెప్పటం సాధ్యం కాదు.
ఇదే ‘గూఢ దశమి’ అన్నమాట. పాఠకుడు ప్రయత్నించి తెలుసుకోవలసిన గూఢార్థం. తొమ్మిదింటిని చెప్పి దశమ వస్తువును గూఢంగా ఉంచినందువల్ల ‘గూఢ దశమి’ అయింది.
కీలకం ఇది: అర్థక్రమంలో పాఠకుడు మళ్ళీ వెనక్కి రావాలి. చంద్ర – క – గురు – వి – భ – గో – ధర – భవ – మణి గతిన్ అన్న దళంలోని పదాలను, ‘చంద్రక గురువిభ గోధరభవమణి గతిన్’ అని పునర్విభాగం చేసుకోవాలి.
స్వామివారి ఆత్మవిహృతి (ఇంద్రియాలను ఉపశమింపజేసి మనోలయాన్ని సాధించి నిత్యమూ ఆత్మయందు విహరింపగలిగి ఉండటం) చంద్రక = బంగారము యొక్క, గురు విభ = కాంతికంటె అధికమైన కాంతిని కలిగిన, గోధర – గో = గోవును (వేదవాక్కును), ధర = ముఖమండలమందు నిలిపికొన్నవాడైన బ్రహ్మదేవునికి, భవ = జన్మించినవారిలో, మణి = శ్రేష్ఠుడైన వసిష్ఠుని యొక్క (గోధరభవమణి = వసిష్ఠుడు), గతిన్ = వర్తనమును, నగున్ = పరిహసించును అని భావాన్ని గుర్తించాలి. ఒకప్పుడు వసిష్ఠుడు నిమి చక్రవర్తి యొక్క శాపం వల్ల శరీరపతనం చెంది, తేజోరూపంలో మిత్రావరుణుల యందు ప్రవేశింపవలసి వచ్చింది. ఊర్వశీ దర్శనం చేత మిత్రావరుణులకు రేతఃపతనమై వారు దానిని ఒక కుండలో ఉంచారు. అందులో నుంచి కుంభసంభవులై అగస్త్య వసిష్ఠులు రూపుదాల్చారు. ఆనాటి ఆ కథోదంతం ఇక్కడ స్మరింపబడుతున్నది. శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క నిరూపమానమైన ఆత్మవిహృతి కారణంగా మహాత్ముడైన గోధరభవమణి అంతటివానికి విడంబన ప్రతిపాదింపబడింది.
ఈ విధంగా పదవదైన విశేషణం, దానికి అన్వయింపదగిన ఉపమానం అన్నవి రెండూ పద్యంలో గూఢంగా ఉన్నందువల్ల దీనికి గూఢ దశమి అని పేరు. ఇదిగాక గూఢతృతీయ, గూఢపంచమి, గూఢాష్టమి వంటి నిక్షిప్తచిత్రాలను వేంకటకవి వ్రాశాడు. కవులు పరిపరివిధాల వ్రాశారు. గూఢచిత్రాలకు లక్షణగ్రంథాలలో గోపన చిత్రములు, గుప్తి చిత్రములు అని కూడా పేర్లున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ భాండమునకు నాయకుడైనవాడు. తాను నిర్మించిన స్థావర జంగమాత్మకమైన జగత్తులోని జీవకోటిని పరమ కారుణికస్వభావుడైన ఆయన పరిహసిస్తాడని అపార్థం చేసుకోకూడదు. ఆయన స్వరూపావస్థితి ముందు సర్వజీవుల యొక్క శక్తివిలాసం వెలవెలపోతుందని చెప్పటానికి కవి ఆ విధమైన వర్ణన కావించాడు. భగవంతుని సమక్షంలో జీవుడు అహంకరించి ఆయనతో తుల్యయోగాన్ని భావింపకూడదని తాత్పర్యం.
పద్యంలో క్రమాన్వయముఖంగా రెండు రెండు వస్తువుల వ్యవస్థ ఉన్నది. శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క కళ, చంద్రుని యొక్క కళ; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క తేజస్సు, సూర్యుని యొక్క తేజస్సు; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క బుద్ధివిశేషం, గురువు యొక్క బుద్ధివిశేషం; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క మహాశక్తి, గరుత్మంతుని యొక్క మహాశక్తి; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క నయము, శుక్రుని యొక్క నయము; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క శమము, భూమి యొక్క శమము; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క ధృతి, పర్వతము యొక్క ధృతి; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క బోధము, ఈశ్వరుని యొక్క బోధము; శ్రీ వేంకటేశ్వరస్వామి యొక్క వితరణము, చింతామణి యొక్క వితరణము – అన్నవి ఇందులో నిబంధింపబడ్డాయి.
పైపై మాటలలో చూసినప్పుడు శబ్దశక్తి మూలాన అవి రెండూ సమాన గుణముల వలెనే ఉంటాయి. అయితే, స్వామి యొక్క అలౌకిక మహాశక్తి ముందు అన్యశక్తిమంతుల శక్తి మీలనము చెందుతున్నది. ఒక మహాశక్తి ముందు వేరొక శక్తి అల్పతరమై అణగారిపోతున్నదని అర్థం. పోలికకు వచ్చిన రెండు వస్తువులలోనూ ధర్మసామ్యం ఉన్నప్పటికీ ఒక వస్తువుకు కొండంత ఆధిక్యమూ, దాని ముందు వేరొక వస్తువుకు గోరంత అల్పత్వమూ చెప్పబడ్డాయి. ఆలంకారికులు ఈ విధమైన వాక్యనిర్మితిని మీలనము (లేదా) మీలితము అనే అలంకారమని నిర్ణయించారు.
పద్యంలో అక్కడక్కడ ఏకాక్షర పదాలున్నాయి. అవన్నీ సప్రమాణమయినవే. “కో బ్రహ్మాత్మానిలార్కేషు సుఖశీర్షజలేషు చ” అని మహేశ్వర సూరి కృతమైన విశ్వప్రకాశ కోశం. “విః పక్షీ గరుడః సూర్యో జలధిః సోమ ఉచ్యతే” అని సౌభరి కృతమైన ఏకాక్షర నామమాల. “భః శమ్భౌ భ్రమరే భావే శుక్రేంఽశే జలదే పుమాన్” అని రాఘవ కవి కృతమైన ఏకాక్షర కాండ. “గౌ ర్వాణీ బాణ భూ రశ్మి వజ్ర స్వ ర్గాక్షి వారిషు, దిశి ధేనౌ శ్రు తేశ్వర్యాం గణేశే చాపి” అని సుధాకలశ ముని కూర్చిన ఏకాక్షర నామమాల. సంభృతశ్రుతులు కాగోరిన విద్యార్థులు ఈ కోశాలను నేర్చుకోవటం మంచిది.
క్లిష్టకల్పనలున్న ఇటువంటి రచనలలోని భావప్రతీతిని అర్థం చేసికొని మహాకవుల రచనలలోని అందాలను మనము ఆత్మహితం చేసుకోవలసి ఉన్నది. వ్యాఖ్యానములు లేనప్పుడు గురుముఖంగానూ, స్వయంకృషితోనూ అర్థాన్వయాన్ని అభ్యసింపవలసి ఉంటుంది. భాషాప్రపంచం ఎంత విశాలమైనదో, కవుల కల్పనా శక్తి ఎంత నిరవధికమైనదో ఇటువంటి ప్రౌఢరచనల మూలాన పాఠకులకు తెలిసివస్తుంది.
లాక్షణికులు ఈ గూఢదశమిని గురించి చెప్పలేదు. ఇది చిత్రకవితా సార్వభౌముడైన గణపవరపు వేంకటకవి తన విదగ్ధతతో వినూత్నంగా చెక్కిన విశిష్టమైన కవితాశిల్పం.