మహామంత్రి తిమ్మరుసు తిరుమల శాసనాలు

Spread the love
Like-o-Meter
[Total: 9 Average: 5]

తిమ్మరసు తిరుమల శాసనాలు లఘుచిత్రం
 

మహామంత్రి తిమ్మరుసు

మధ్యయుగపు దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చారిత్రక వ్యక్తి. సుప్రసిద్ధ విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలతో అతనికి ఉన్న సన్నిహిత సంబంధాలు వీరగాథలుగా గత ఐదు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి.

తిమ్మరుసు, కేవలం ఒక రాజకీయవేత్త మాత్రమే కాదు, ఒక తెలివైన సైన్యాధ్యక్షుడు మరియు ఒక నిష్ణాతుడైన వేదాంత పండితుడు కూడా.

కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన తరువాత సామ్రాజ్యపు భవిష్యత్తును రూపుదిద్దడంలో తిమ్మరుసు కీలక పాత్రను పోషించాడు.

20వ శతాబ్దపు చరిత్రకారుడైన కె. ఈశ్వరదత్  “చరిత్రలోని అనేక సందర్భాలను మలచడంలో తిమ్మరుసు యొక్క సైనిక పరాక్రమం, రాజకీయ పరిఙ్ఞానం మరియు అసాధారణమైన దూరదృష్టి దోహదపడ్డాయి” అని ఉల్లేఖించారు.

మంగళగిరి శాసనాల ద్వారా తిమ్మరుసు యొక్క వ్యూహరచనా పాటవాన్ని ( military genuineness), యుద్ధ నైపుణ్యాన్ని  అర్థం చేసుకోవచ్చు.

పదహారవ శతాబ్దపు దక్షిణ భారతంలోని అసమాన ప్రతిభావంతులలో తిమ్మరుసు కూడా ఒకరు. ఇంతటి శక్తివంతుడు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రమేయం లేకుండానే పతనానికి లోనైనాడు తిరోగమనం చెందాడు.

1525లో కృష్ణదేవరాయల ఒక్కగానొక్క పుత్రుడి పై విషప్రయోగం జరగడమే అందుకు కారణం. ఇది నిస్సందేహంగా చక్రవర్తి యొక్క శత్రువుల చేసిన రాజకీయ కుట్ర, ఒక రాజద్రోహం. ఏదో ఒక విధంగా తిమ్మరసు మరియు  అతని తమ్ముడి పేర్లను ఇందులోకి తీసుకువచ్చి వారినే ప్రధాన నిందితులుగా చిత్రించారు. దుఃఖంలో ఉన్న  కృష్ణదేవరాయలు తిమ్మరసును ప్రధాన మంత్రి పదవి నుండి తొలగించాడు.

రాజకుమారుడిపై విషప్రయోగం చేసినందుకు తిమ్మరసు యొక్క కళ్ళను పొడిపించి పెనుగొండ కారాగృహంలో బంధించారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కథల కారణంగా తిమ్మరసు పెనుగొండ కారాగృహంలో మరణించి ఉంటాడనే అభిప్రాయం ప్రజలలో  ఏర్పడింది.

కృష్ణదేవరాయల కంటే ఆయన వయసులో పెద్దవాడవడంతో  1529లో మరణించిన మహారాజు కంటే ముందే ఆయన చనిపోయి ఉండవచ్చనే అభిప్రాయం ఉండేది. కానీ, తిరుమల మరియు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని రెండు శాసనాలు తిమ్మరసు జీవితం యొక్క చివరి దశను వెల్లడిసున్నాయి.

కొన్ని దశాబ్దాల క్రితం తిమ్మరసు మరియు అతని సోదరుడు ఇచ్చిన విరాళాలకు వారి వంతుగా వచ్చిన ప్రసాదాలను విక్రయించడం గురించి ఈ శాసనాలు తెలియజేస్తునాయి. ఈ శాసనాల గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి , ముందుగా అసలు ఈ దాతల వంతుకు లభించే ప్రసాదాలు, వాటి వినియోగాన్ని గురించి తెలుసుకుందాం.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

తిమ్మరుసు శాసనాలు

తిరుమల తిరుపతి శాసనాలను లోతుగా పరిశీలిస్తే, తిరుపతి శాసనాల ద్వారా తెలిసేదేమిటంటే – దాతల కోరిక మేరకు దేవుడికి నివేదించిన ప్రసాదాలలో పావు వంతు ఆ దాతలకు చెందుతుంది. సామాన్యంగా దాతలు తిరుమల, తిరుపతులలో నివసించక పోవటం వలన వారి వంతు ప్రసాదాలను వేరొకరికి బదిలీ చేస్తారు. ఈ బదిలీలు పూర్తిగా ఉచితం, ఇక్కడ ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్ళకు తావు లేదు. కాని ఆశ్చర్యమేమిటంటే, దాతల ప్రసాద బదలాయింపు విషయంలో తిమ్మరసుకు సంబంధించిన ఆ మూడు శాసనాలు అప్పటి సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి.

దీని గురించి తెలుసుకోవాలంటే మనం తిమ్మరసు మహామంత్రిగా ఉన్న 1512వ సంవత్సరానికి వెళ్ళాలి.

విజయనగరపు మహామంత్రిగా తిమ్మరసు తిరుమలను సందర్శించి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. జనవరి 13, 1512 కు సరిపోయే 1433 శక సంవత్సరపు పుష్య మాసంలో తిమ్మరసు తన సతీమణి అయిన లక్ష్మీ అమ్మన్ తో సహ తిరుమలకు విచ్చేసి పెద్ద మొత్తంలో విరాళాలను ఇచ్చారు. ఆయన పొత్తపినాడు పొట్టాపినాడు లోని ఒక గ్రామాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామికి దానం చేశారు. అలాగే కొన్ని విశేష దినాలలో అనగా తనది మరియు తన భార్య యొక్క జన్మ నక్షత్ర దినములలో నిర్దిష్ట పరిమాణాలలో నైవేద్యాలను స్వామి వారికి సమర్పించాలని కోరాడు. అదేవిధంగా అతని సోదరుడైన గోవిందరాజు కూడా దానం చేశాడు.

ఇలా ఒక దాతగా తన వంతుకు లభించే ప్రసాదాన్నే తరువాతి కాలంలో తిమ్మరసు విక్రయించాడు. దాతల రోజూవారీ వాటాల విక్రయం అనేది ఆ రోజుల్లో ఎవరూ ఊహించలేని విషయం. ఈ శాసనాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

మొదటి శాసనం ఫిబ్రవరి 26, 1536 నాటిది. ఈ శాసనం తిరుమల ఆలయం యొక్క రెండవ ప్రాకారపు పడమటి గోడపై ఉంది. ఈ విక్రయంలో తిమ్మరసు తన తమ్ముడు గోవిందరాజుకి సంబంధించిన దాతల వాటాను 4600 పణాలకు వేరొకరికి బదలాయించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలుదారు వేరెవరో కాదు – తెలుగు కవి తాళ్ళపాక అన్నమాచార్యుల జ్యేష్ఠ పుత్రుడైన తాళ్ళపాక తిరుమలయ్యంగార్.

రెండవ శాసనం తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలోనిది. ఇది గోవింద రాజస్వామి ఆలయపు మొదటి గోపురం యొక్క లోపలి భాగంలోని తూర్పు గోడపై చెక్కబడి ఉంది. ఈ శాసనం ద్వారా తాళ్ళపాక తిరుమలాచార్యులు తిమ్మరసుకు 5203 పణాలు చెల్లించినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో శాసనం స్పష్టతను కోల్పోవడం వలన ఈ వ్యవహారం జరిగిన తేదీలు తెలియరాలేదు.

28 డిసెంబర్, 1536 నాటి మూడవ శాసనం లో 1900 పణాలు విలువ చేసే విక్రయాన్ని గురించిన వివరాలను తెలియజేస్తోంది. తిరుమల ఆలయం యొక్క రెండవ ప్రాకారంలోని పడమటి గోడపై ఈ శాసనాన్ని చూడవచ్చు.

టి.కె.టి రాఘవాచార్యుల విశ్లేషణ

దాతల వాటాలను విక్రయించిన ఈ విచిత్రమైన వ్యవహారాలను విశ్లేషిస్తూ, తిరుపతి చరిత్రను రచించిన టి.కె.టి. రాఘవాచార్యులు ఇలా వ్యాఖ్యానించారు:




“దాతల శాశ్వత వాటాను బహిరంగంగా విక్రయించడమనేది 1536 AD వరకు ఎక్కడా విని ఉండరు. అటువంటి మూడు విక్రయాలను దేవాలయ గణకాధికారి నమోదు చేసినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. దాతలు, స్థితిమంతులై ఉండటం వలన, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో , తమ వాటాను యాత్రికులకు పంచిపెట్టడాన్ని పుణ్యంగా భావించేవారు. కనుక అనేక కారణాల దృష్ట్యా ఈ మూడు విక్రయాలను ప్రత్యేకంగా పరిగణించవలసి ఉంది. ఆలయ చరిత్రలో ఇటువంటి విక్రయం జరిగిన ఆనవాళ్ళు లేవు. విక్రయదారులు – మాన్యులు, మాజీ మహాప్రధాని అయిన తిమ్మరసు మరియు వారి సోదరుడైన గోవిందరాజ. ఆయన కృష్ణదేవరాయుల యొక్క నమ్మకస్తుడైన ప్రఖ్యాత మహామంత్రి . 1525ADలో  కృష్ణరాయుల ఏకైక పుత్రుడైన  తిరుమలరాయ  హఠాన్మరణం చెందడంతో  తిమ్మరసు  కుయుక్తితో రాజకుమారునిపై విషప్రయోగం చేశాడనే అపవాదు అతనిపై పడింది. ఆ కారణంగా తిమ్మరసుని కొలువులో నుండి  తొలగించారు. ఆ తరువాత ఆయన అఙ్ఞాతంలో జీవించారు.

ఇప్పుడు మనం చూస్తున్న ఈ విక్రయాలు ఆ ప్రఖ్యాత ప్రధాని యొక్క ఆర్థిక పతనాన్ని తెలియజేస్తున్నాయి.1525 నుండి 1535 A.D మధ్యలో ఆయన ఒంటరిగా మిగిలినట్లు తెలుస్తోంది . కానీ  అప్పటివరకు  ఎన్నో ఏళ్ళుగా పూలతోటల సంరక్షణకు, ఆకలితో ఉన్న యాత్రికుల పోషణకు వినియోగించిన అతని  పావు వంతు ప్రసాదాలను అతనే విక్రయించే స్థితికి తీసుకువచ్చింది అతని పేదరికమే. అతని పేదరికం ఎంత గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకానొక రోజున తన శాశ్వత దాతల వాటాను కొనగల ఏకైక వ్యక్తి అయిన తాళ్ళపాక తిరుమలయ్యంగారి ఎదుట బయటపడవలసి వచ్చింది.”

 

టి.కె.టి. రాఘవాచార్యులు తరువాతి పరిశీలనలో తెలిసుకున్నది ఏమిటంటే మాజీ ప్రధాని ఆర్థిక ఇబ్బందులు చక్రవర్తి అచ్యుతదేవరాయులకు చెవిన పడడంతో ఆయన మనసు చలించిపోయింది. తిమ్మరసు దుఃస్థితిని గురించిన హృదయవిదారకమైన సమాచారాన్ని విన్నపుడు ఆయన  ప్రతిస్పందనలను ఒక శాసనం తెలియజేస్తోంది. జనవరి 12, 1537 నాటి ప్రసాద వితరణకు సంబంధించిన  అచ్యుతరాయల శాసనం ప్రకారం ఒక పావు వంతు ప్రసాదాన్ని అప్పయ్యన్ అనే వ్యక్తికి పంపవలసినదిగా పేర్కొనబడింది. స్వీకర్త పేరు అప్పయ్యన్ అయినప్పటికీ, ఆ నిజమైన లబ్ధిదారుడు సాళువ తిమ్మరసేనని రాఘవాచార్యుల ఉద్దేశం.

ప్రసాదంలో ఒక భాగాన్ని తిరుమలలోని ఒక తోటమాలికి అందించవలసినదిగా అచ్యుతరాయలు ఆలయ అధికారులను అఙ్ఞాపించారు.అతని పేరు అప్పయ్యన్. అతను వేరెవరో కాదు తిమ్మరసు యొక్క అల్లుడే. అచ్యుతరాయలు తాను చేస్తున్న సహాయం వల్ల తిమ్మరసు నొచ్చుకోకూడదని ఇలా ఆయనకు  పరోక్షంగా సహాయం చేశారు.

 

ఆ తిమ్మరుసు, ఈ తిమ్మరుసు ఒక్కరేనా?

తన వంతు దాతల వాటాను విక్రయించిన తిమ్మరసు , అలాగే మాన్యుడైన  సాళువ తిమ్మరసు ఇద్దరూ ఒక్కరేనా అనే సందేహం ఎవరికైనా కలిగినట్లయితే, ఆ సందేహాలను నివారించే ప్రధాన సాక్ష్యాలు ఇక్కడున్నాయి.

తిమ్మరసు యొక్క జనవరి 13, 1512 నాటి శాసనంలో అతడిని రాచరాజు పుత్రుడిగానే పరిచయం చేయబడ్డారు. అదేవిధంగా 1536  నాటి మూడు శాసనాల్లోనూ విక్రయదారుడు రాచరాజు పుత్రుడని తెలియజేస్తున్నాయి. అలాగే ఆ శాసనాలు గొవిందరాజుని విక్రయదారుడి సోదరుడిగానే తెలియజేస్తునాయి. ప్రధాని తిమ్మరసు జారీ చేసిన కొన్ని శాసనాలలో దాత పేరు గోవిందరాజ అని పేర్కొనబడి ఉంది. కనుక ప్రసాదాలను విక్రయించిన తిమ్మరసే ప్రధాని తిమ్మరసేనని స్పష్టం అవుతోంది.

*****

 

Your views are valuable to us!