ఈశోపనిషత్తు – My Interpretation

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

అపార జ్ఞానానికి ప్రధానమైన మూలాలు వేదాలు. ఈ వేదాల గమ్యాలు వేదాంతాలు, లేక ఉపనిషత్తులు. నాలుగు వేదాల్లో మొత్తం పదకొండు ఉపనిషత్తులున్నాయి. ఈ ఉపనిషత్తులలో అతి చిన్నదైన, అయినా అతి క్లిష్టమయిన ఉపనిషత్తు ఈశోపనిషత్తు. ఇది చాలా ముఖ్యమయినది కూడా. 

అతిపెద్ద ఉపనిషత్తయిన బృహదారణ్యకోపనిషత్తు ఈశోపనిషత్తుపై ఒక వ్యాఖ్యానమని పండిత్ సతల్వేకర్ లాంటి ప్రముఖుల ఉద్దేశ్యం. ఇందులో మొత్తం 18 మంత్రాలుంటాయి. ఈశోపనిషత్తు, దాని అనువాదం చదివే ప్రయత్నంలో నాకు అర్ధమయిన దానిని పంచుకోవడమే ఈ టపా ముఖ్యోద్దేశం. వేద పండితులారా, ఇది నాకు అర్ధమయిన రీతిలో వ్రాస్తున్నా. తప్పులుగానీ ఉంటే క్షమించేసి, దయచేసి సరిదిద్దండి. 


ఆవాహన/నాందీ శ్లోకం:

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే

భావము: మానావాతీత శక్తి సంపూర్ణమైనది. తనని తాను నడిపించుకోగలిగినది. దానినుండీ పుట్టినవి కూడా తమని తాము నడిపించుకునే శక్తులే. తన నుండి ఇన్ని సంపూర్ణ రాశులు పుట్టినా, వీటన్నిటికీ మూలమైనా ఆ శక్తి సంపూర్ణంగానే ఉంటుంది.

నా వ్యాఖ్య: అంటే మాతృక నిర్మూలింపబడకుండా దానినుండి పునరోత్పత్తి జరుగుతుందని ఇది తెలియజేస్తోంది. ఒక విధంగా ఇది శిశు జననాన్నికూడా తెలియజేస్తోంది.


ఇక ఉపనిషత్తులోకొస్తే,


మొదటి మంత్రం:

ఈశావాస్యమిదగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథా మా గృధ: కస్యస్విద్ధనం

భావము: ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటీ మానవాతీత శక్తి లేక భగవంతునిచే నియంత్రింపబడుతుంది. అది భగవంతునికే చెందుతుంది. అందులో మనకి అవసరమైనవే మనం గ్రహించి తక్కినవాటిని వదిలివేయవలెను.

నా వ్యాఖ్య: అంటే, మనకి కావసినదానినే మనము గ్రహించి, మనకి ఉద్దేశింపబడినదానినే మనము తీసుకొని తక్కినవాటిని ఇతరులకి వదిలివెయ్యాలని, మరో విధంగా చెప్పాలంటే ఈ విశ్వం అనే ఆస్తిని విశ్వంలో ఉన్న రాశులన్నీ పంచుకోవాలని దీనర్ధం. వేదాలని వెక్కిరించే కమ్యూనిష్టులు చెప్పేది కూడా ఇదే కదా!

రెండవ మంత్రం:

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమా:
ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే

భావము: నిర్దేశించిన విధంగా కర్మ నాచరించేవారు నూరేళ్ళపాటు బ్రతకాలనుకోవచ్చు. ఆ తరవాత శరీరాన్ని మార్చి పని కొనసాగించవచ్చు. మానవ జన్మలో ఉన్న గొప్పతనం జనన-మరణ చక్రాన్ని తప్పించుకోవడం. సత్కర్మ నాచరించేవారు మోక్షం పొందితే, ఆచరించనివారు జనన మరణ చట్రాల్లో చిక్కుకుని ఉంటారు.

నా వ్యాఖ్య: ఇది వినడానికేదో పునర్జన్మ సిధ్ధాంతంలా ఉన్నా, లోతుగా ఆలోచిస్తే దీనర్ధం – పని (కాల చక్రం) అనేది ఆగదు. జరుగుతూనే ఉంటుంది / ఉండాలి. కానీ అందులో పాత్రధారులే మారతారు. తన కప్పగించిన పనిని సమర్ధవంతంగా చేసినవారు వేరే పనిలోకి వెడితే, చెయ్యనివారూ దానినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే దీనర్ధం – ఒక పనిలో పరిపూర్ణత సాధించేవరకూ దానిని అభ్యసిస్తూనే ఉండాలి అని.

మూడవ మంత్రం:

అసుర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనా:

భావము: తన బాధ్యతలని నెరవేర్చలేని వారు, ఆత్మను చంపుకునే వారు, బాధ్యతలేని అసురలోకములకు పోవుదురు.

నా వ్యాఖ్య: చెడ్డ పనులు చేస్తే నరకానికిపోతారు అని. అయితే ఇక్కడ గమనించాల్సినది, జంతువులకన్నా మనుషులకి అదనపు బాధ్యతలుంటాయని, వాటిని పాటించినవాడే నిజమైన మనిషి, లేనివాడు మృగములతో సమానమని.

నాలుగవ మంత్రం:

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తధ్ధావతోన్యానత్యేతి తిష్ఠాత్ తస్మినపో మాతరిశ్వా దధాతి

భావము: భగవంతుడు, సర్వోన్నత శక్తి మిగతా శక్తులకన్నా శక్తివంతమయినది. అగ్ని, గాలి, వర్షము లాంటి శక్తులు ఈ సర్వోత్తమ శక్తి కన్నా బలహీనమయినవే.

నా వ్యాఖ్య: మనకి కనిపించే, మనం దైవ స్వరూపాలుగా భావించే గాలి, నీరు, అగ్ని కన్నా శక్తివంతమైనది వీటిని నిగ్రహించే సర్వాంతర్యామి. అంటే, మంట, వాన, గాలి లాంటి దృగ్విషయాలు వేరే వ్యవస్థ ఫలితంగా ఉద్భవిస్తాయని దీనర్ధం (ఉదా: మెక్సికోలో తన రెక్కలు రెపరెపలాడించే ఓ సీతాకోకచిలుక, ఫ్లోరిడాలో ఒక పెను తుఫాను సృష్టించవచ్చు – తూనిగ న్యాయం అనే పోహ – “అపోహ” కాదు – కోసం శాస్త్ర విజ్ఞానం బ్లాగు చదవండి)

అయిదవ మంత్రం:

తదేజతి తన్నేజతి తద్దూరే తద్ద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత:

భావము: మానవాతీత శక్తి కదిలేది, కదలనిది కూడ – దగ్గర ఉండేది, దూరంగా ఉండేది కూడా, లోపలా, బయట కూడా ఉంటుంది

నా వ్యాఖ్య: వినడానికిదేదో సీతారామయ్యగారి మనవరాలు సినీమాలో పొడుపుకధలా ఉంది కదా? కానీ దీనర్ధం, మనం దేవుడిగా కొలిచే ఆ శక్తి సర్వాంతర్యామి. స్థిరమైనది – స్టేటిక్, చలనముకలది – డైనమిక్. దగ్గరైనా, దూరమైనా, మొత్తం వ్యాపించి ఉంది. లోపల ఉంటుంది – ఇంటర్నల్, బయట ఉంటుంది ఎక్స్ టర్నల్. ఇవన్నీ భౌతికశాస్త్రంలో వర్ణింపబడే శక్తిస్వరూపాలే.

ఆరవ మంత్రం:

యన్మిన్ సర్వణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి
సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే

భావము: ఈ విశ్వంలో ప్రతీదానినీ దైవస్వరూపంగా చూశేవారు దేనినీ ద్వేషించరు.

నా వ్యాఖ్య: ద్వేషానికి తావివ్వకుండా ప్రతీదానిలో ఆ సర్వోన్నత శక్తిని చూడమని అర్ధం.

ఏడవ మంత్రం:

యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానత:
తత్ర కో మోహ: కశ్యోక ఏకత్వమనుపశ్యత:

భావము: ప్రతీ జీవినీ ఆధ్యాత్మిక దృష్టితో, దైవ స్వరూపంగా చూసేవారికి నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఇక అపోహలకి తావేదీ?

నా వ్యాఖ్య: ప్రతీ జీవినీ గౌరవించే వారి జ్ఞానము దినదినాభివృధ్ధి చెందుతుంది. ఏలా అంటారా? జ్ఞానానికి అంతులేదు. ఎంత నేర్చుకున్నా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఒక జీవి ఎక్కువగా నేర్చుకోగలిగినది మరొక జీవి నుండే. అలా నేర్చుకోవాలంటే వేరే జీవి పట్ల గౌరవభావముండాలి కదా?

ఎనిమిదవ మంత్రము:

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిరగ్ం శుద్ధమపాపవిద్ధమ్
కవిర్మనిషీ పరిభూ: స్వయంభూర్యాథాతథ్యతోర్ధాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య: సమాభ్య:

భావము: శక్తి/దేవుడి రూపానికి దేహం, కాయం లాంటివి ఉండవు. అది నిర్గుణ బ్రహ్మ. జ్ఞానము పొందినవారు దేవుడి ఇటువంటి రూపాన్ని తెలుసుకొనగలరు.

నా వ్యాఖ్య: సర్వోన్నతుడైన భగవంతుడు అంటే నాలుగు తలలు, ఎనిమిది చేతులు, చేతిలో ఆయుధం ఉన్నవాడు కాదు, అది మన విశ్వాన్ని నియంత్రించే శక్తి అని ఎంత చక్కగా చెప్తోందో ఈ మంత్రం.

తొమ్మిదవ మంత్రం:

అంధం తమ: ప్రవిశంతి యే౭విద్యముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ం రతా:

భావము: అవిద్యలో చిక్కుకున్నవారు అజ్ఞానాంధకారములో చిక్కుకుంటారు. అంతకన్నా హేయమైన పరిస్థితిలో చిక్కుకునేవారు విద్యను తప్పుగా అర్ధం చేసుకునేవారు.

నా వ్యాఖ్య: నేర్చుకున్న విద్యను తప్పుడు కార్యాలకి ప్రయోగించరాదని సూటిగా చెప్తోందీ మంత్రం. తప్పుడు దోవలో నడిచే విద్యావంతులకన్నా అజ్ఞానులే కాస్త నయమని కూడా చెప్తోంది.

పదవ అమంత్రం:

అన్యదేవాహుర్విద్యయాన్యాదాహురవిద్యయా
ఇతి శుశ్రుమధీరాణాం యే నస్తద్విచచక్షిరే

భావము: జ్ఞానములోంచి పుట్టిన ఫలితాలు, అజ్ఞానములోంచి పుట్టిన ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి

నా వ్యాఖ్య: జ్ఞానులు సాధించే ఫలితాలని అజ్ఞానులు సాధింపలేరు. కావున ఫలితాలు సాధించాలంటే జ్ఞానం ముఖ్యం. కనుక ప్రతి ఒక్కరు జ్ఞాన సముపార్జనపై దృష్టి కేంద్రీకరించాలి

పదకొండవ మంత్రము:

విద్యం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్ం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా౭మృతమశ్నుతే

భావము: జ్ఞానాన్నీ, అజ్ఞానాన్నీ నేర్చుకునేవారు మోక్షం పొందగలరు

నా వ్యాఖ్య: ఇదేదో గందరగోళంగా ఉందనుకుంటున్నారు కదూ? ఆగండాగండి. ఇక్కడ అజ్ఞానం నేర్చుకోవడమంటే, అజ్ఞామేదో తెలుసుకోవడం – ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడమన్నమాట. దీని వల్ల ఏ దారిలో ఏ ఇబ్బందులు ఉంటాయో తెలుస్తుంది.
ఏది తప్పో తెలియని వారికి ఆ తప్పు చెయ్యకూడదు అని కూడ తెలియదు కదా. (హేమద్పంత్ తను వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత అనే పుస్తకంలో – సాయిబాబా, నానా సాహెబ్ చదోర్కర్ల మధ్య భగవద్గీత కి సంబంధించిన ఒక శ్లోకం మీద జరిగిన వాగ్వివాదాన్ని చెప్తూ, ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తారు)

పన్నెండవ మంత్రము:

అంధం తమ: ప్రవిశంతి యే౭సంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతా:

భావము: చిన్న చిన్న దేవతలకి, అలాగే నిస్తరమైన విశ్వానికి దాసులయ్యేవారు అజ్ఞానమునుండి బయటకు రాలేరు.

నా వ్యాఖ్య: ఇప్పటిదాకా చెప్పిన దానికి ఇది వ్యతిరేకంగా ఉందనిపిస్తోంది కదూ? అయితే ఇక్కడ ఉద్దేశ్యం వేరు. అర్హత లేని వారిని దేవుళ్ళని చేసి దాసులయ్యి, ఏది ఏమిటో తెలియకుండా నిస్తరాన్ని పూజ చేస్తే సరియయిన జ్ఞానం లభించదు. ఇందులో సూక్ష్మం ఏమిటంటే “సంభ్యుక్తం” అనగా నిస్తరం అనగా “ఏబ్సల్యూట్” ని నమ్మేవాడూ జ్ఞాని కాలేడు, ప్రపంచంలో అన్ని స్తరాలే అంటే “రిలేటివ్” అని ఈ మంత్రం ఉట్టంకిస్తోంది. కానీ మనం ఇది ఐన్ స్టీన్ చెప్తే కానీ నమ్మము కదా? :))

పదమూడవ మంత్రము:

అన్యదేవాహు: సంభవాదన్యదాహురసంభవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం ఏ నస్తద్విచచక్షిరే

భావము: సర్వోన్నత శక్తి ఆరాధనలో వచ్చే ఫలితాలు, అటువంటి శక్తి కాని వాటిని (జ్ఞానం లేని గురువుల దగ్గరనుండి నేర్చుకొన్న దానితో) ఆరాధించాగా వచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి.

నా వ్యాఖ్య: మీరేమనుకుంటున్నారో నాకు తెలిసిపోయిందోచ్. భగవంతుడు / ఏసు / అల్లాహ్ ఒక్కడే భగవంతుడు, మిగిలినవారు కారు అని ఈ మంత్రం చెప్తోందనుకుంటున్నారు కదూ? నేననుకుంటొంది ఇదీ: సద్గురువులుకాని వారు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించలేరు. సర్వోన్నత శక్తి ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించడం ఒక్క సద్గురువుకే సాధ్యం. తక్కిన గురువులు ప్రసాదించేది మిడిమిడి జ్ఞానమే. అలాగే అంతర్లీనంగా కనిపిస్తున్న భావం: వేర్వేరు వ్యక్తులు వేర్వేరు దారులలో బ్రహ్మ జ్ఞానం పొందగలరని. అందులో కొందరు భగవంతుని ఆరాధించేవారయితే మరికొందరు ఆరాధించని నాస్తికులు.

పధ్నాలుగవ మంత్రము:

సంభూతి చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా౭మృతమశ్నుతే

భావము: భగవంతుడి / శక్తి నిజ స్వరూపం తెలిసిన వాడు, తాత్కాలికమైన, ఐహికమైన వస్తువుల, దేవతలకతీతుడై జ్ఞానము సంపాదించును.

నా వ్యాఖ్య: తాత్కాలిక, స్వల్పకాలిక విషయాల మీద దృష్టిపెట్టేవారికన్నా దీర్ఘకాలిక ప్రణాళికల మీద, సర్వోన్నత శక్తి ఆధారంగా దక్కిన జ్ఞానమునుపయోగించి దృష్టిని పెట్టేవారికి మోక్షము తప్పక దక్కుతుంది. (ఇక్కడ మోక్షమంటే అజ్ఞానము నుండి విముక్తి అని గ్రహించాలి)

పదిహేనవ మంత్రము:

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

భావము: ఓ దేవా! నీ ముఖమును కప్పుతున్న ఆ దివ్యకాంతిని తొలగించి నీ భక్తునికి ఆ ముఖమును దర్శించు భాగ్యం కల్పించుము.

నా వ్యాఖ్య: ఇక్కడ ప్రార్ధన మొదలవుతుంది. ఈ శ్లోకానికి సంబంధించి నేననుకుంటోంది మాత్రం, భగవంతుని చుట్టూ లేక ఒక జ్ఞాని చుట్టూ ఒక దివ్యమైన వర్చస్సు ఉంటుందని.

పదహారవ మంత్రము:

పూసన్నకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి యో౭సావసౌ పురుష: సో౭హమస్మి

భావము: ఓ సర్వోత్తమా, నీ బలమైన కాంతి పుంజాలని తొలగించి నీ దర్శన భాగ్యం ప్రసాదించు. సూర్యునికి కిరణము వలే నన్ను నీలో భాగం చేసుకో.

నా వ్యాఖ్య: భగవంతునికీ భక్తునికీ, లేక శక్తికీ, ఆ శక్తి నియంత్రించే జీవికీ గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుందీ మంత్రము.

పదిహేడవ మంత్రము:

వాయురనిలమమృతథేదం భస్మాంతగ్ం శరీరమ్
ఓం ౩ క్రతో స్మర కృతగ్ం స్మర కృతో స్మర కృతగ్ం స్మర

భావము: నా శరీరము బూడిదవ్వనీ, నా ప్రాణములు గాలిలో కలిసిపోనీ, కానీ నేను చేసిన పనులను గుర్తించుము.

నా వ్యాఖ్య: మన పూర్వీకులు ఇప్పుడు మన కళ్ళెదుట లేకపోయినా వారు మనకు చేసిన మేలు ఎప్పటికీ మరువకూడదని ఈ మంత్రం అంతర్లీనంగా చెప్తోందని నా ఉద్దేశ్యం.

పధ్ధెనిమిదవ మంత్రము:

అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమఉక్తిం విధేమ

భావము: ఓ భగవంతుడా, నీకు నా నమస్సులు. నా తరువాతి ప్రయాణానికి సరియైన దారి చూపుము. నేను చేసిన కర్మలు నీకు విదితమేగాన, నా తప్పులను క్షమించి వాటి ద్వారా వచ్చు అవాంతరములను తొలగించి నీవు చూపిన దారిలో నేణు నడిచేలా చేయుము

నా వ్యాఖ్య: దేవుడిని/శక్తిని, లేక గురువుని దారి చూపమనే అభ్యర్ధన ఈ శ్లోకపు తాత్పర్యం. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం కల్పించమనే అభ్యర్ధన కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది.

…… The End ……

 

Your views are valuable to us!