ఇంట్లో సాహిత్య వాతావరణం ఉంటే మంచి కవులు పుట్టుకొస్తారడానికి ఉదాహరణ ఇక్బాల్ చంద్ గారు. “కోటి రతనాల వీణ” వినిపించిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ దాశరథి గారు ఇక్బాల్ గారి పెదనాన్న హనీఫ్ గారికి దగ్గరి మిత్రులు, సహాధ్యాయులు కూడా. అంతేకాక ప్రముఖ కవులు కౌముది, ప్రముఖ ఉర్దూ కవి హీరాలాల్ మోరియాగారు మొదలైన వారు ఇక్బాల్ చంద్ కుటుంబానికి సన్నితులు. ఇక్బాల్ గారి తాతగారైన శ్రీ చాంద్ గారు సంస్కృత పండితులు. గత మూడు తరాలుగా ఇక్బాల్ గారి ఇంట తెలుగు, సంస్కృతం, ఉర్దూ సాహిత్య సౌరభవాలు గుబాళిస్తూనే ఉన్నాయి. ఇటువంటివారి సాహచర్యంలో తన బాల్యాని గడిపిన ఇక్బాల్ చంద్ గారికి సమకాలీన కవుల్లో మంచి గుర్తింపు పొందిన అఫ్సర్ సోదరుని వరుస అవుతారు.
గత రెండు దశాబ్దాలుగా కవిత్వ క్షేత్రంలో కవితల పూలను పూయించడంతో బాటు “ఆరోవర్ణం”, “బంజారా” వంటి గుచ్ఛాలను కూడా తెలుగువారికి అందించిన శ్రీ ఇక్బాల్ చంద్ గారితో ముఖాముఖిని నిర్వహించేందుకు అవకాశమిచ్చి నందుకు ఆవకాయ.కామ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
Avakaaya.com:ఇక్బాల్ గారూ, మనిషి మొదటి అక్షరాన్ని వ్రాయడం మొదలుపెట్టినప్పటి నుండే అతనిలోని సాహిత్యకారుడు పుట్టాడు. గత కొన్ని సహస్రాబ్దులుగా సాహిత్య స్రవంతిలో అనేక పాయలు పుట్టి, విడిపోయి, కలసిపోయాయి. అనేక రకాల సిద్ధాంతాలు, వాదాలు జనించాయి. ఈ నేపథ్యంలో పుట్టుకు వచ్చిన ప్రశ్న “ఏది కవిత్వం?”
ఇక్బాల్ చంద్: వస్తు రూపాల మధ్య సమతౌల్యమం పాటించి కళాత్మకంగా వుండాలి. కవిత్వం యొక్క ధర్మాలు కాలాన్ని బట్టి కూడా మారుతున్నాయి. దేశ, కాలాల్ని బట్టి కూడా కవిత్వ రూపాలు మారుతున్నాయి. ఇదీ కవిత్వమని నిర్ధారించడం కష్టమే. పూర్వీకుల నిర్వచనాలు, ఆధునికుల నిర్వచనాలు వేర్వేరు. కళ కళ కోసమే అన్నట్టు కవిత్వం కవిత్వం కోసమేనని నా భావం. ఇంకా చెప్పాలంటే నిత్య నూతనమైనదే కవిత్వం.
కవిత్వం హృదయసంబంధి అన్నారు ఇస్మాయిల్ గారు. నేను దీన్నే నమ్ముతాను. కవిత్వంలో ఏ వాదవిదాలనీ నేను ఇష్టపడను. నా దృష్టిలో వాద వివాదాలూ శాశ్వతాలు కావు. ఇవి సీజనబుల్ క్రాప్స్ లా వస్తూ పోతూ ఉంటాయి. చివరకు వాదలూ, వివాదాలు కొట్టుకుపోయి సిసలైన కవిత్వమొక్కటే మిగులుతుంది. వాద వివాదాలు నినాద ప్రాయలు. నినాదం ఎప్పటికైనా కవిత్వంకాగలిగిందా?
Avakaaya.com:తరువాతి ప్రశ్న – ఇటీవలే ఆవకాయ.కామ్ సభ్యులు కవిత్వంలో క్లుప్తత గురించి మంచి చర్చ జరిపారు. కొద్దిమంది క్లుప్తతవల్ల అసలు భావం ఆచ్ఛాదితమైపోయి కవిత పొడుపు కథలా తయారౌతోందని పేర్కొన్నారు. కొద్దిమంది క్లుప్తత వల్ల కవిత్వంలో గాఢత వస్తుందని, ఆ గాఢతను అందుకోవడానికి పాఠకుడు కృషి చేయాలని చెప్పారు. ఇంతకూ “కవిత్వాన్ని చదవడం ఎలా?”
ఇక్బాల్ చంద్: సహజంగా ఏ కళనైనా అర్థం చేసుకోవడానికి సహృదయం కావాలి. సహృదయత లేకుండా ఏ కళ కూడా అర్థం కాదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. మరి క్లుప్తత అంటారా, ఈరోజు నేను కొత్తగా చెబుతున్నది కాదు. ఈ చర్చ కవిత్వం పుట్టినప్పటినుంచీ ఉంది. మన పూర్వకవుల్లోఎవర్ని చూసినా, వస్తు రూపాల మధ్య సమతౌల్యం పాటించిన వారే. అలాని క్లుప్తత సరిహద్దు దాటిపోలేదు. అలా దాటిన ఏ కవి కూడా కాలాన్ని ఎదురీది నిలబడింది లేదు. ఎందుకంటే క్లుప్తత అంటే ఇలా తప్ప మరోరకంగా చెప్పలేము అన్నంత భావ సాంద్రతను కలిగించే పనిముట్టు. ఒకవేళ క్లుప్తత వద్దూ అనుకుంటే సాహిత్యంలోని ఇతర ప్రక్రియల్ని ఆశ్రయించవచ్చు. కవిత్వానికి క్లుప్తతే ఆత్మ. లోకంలో కూడా చెరకు రసాన్ని ఆస్వాదిస్తామేగానీ కుప్పలుగా రాలే పిప్పిని కాదుగా!
Avakaaya.com: మనిషి సామాజిక జీవి. కవి మనిషిలోని ఒక అంతర్భాగం. అంటే కవికి కూడా సామాజిక బాధ్యత ఉండాలి కదా! అలా చూస్తే, ఇప్పుడు వస్తున్న “సామాజిక కవిత్వం” పై మీ అభిప్రాయం ఏమిటి?
ఇక్బాల్ చంద్: మనిషి సంఘజీవి. కవి కవి అవడానికి ముందు మంచి మనిషి కావాలి. నినాదాల్ని వ్రాసి తన బాధ్యత తీరిపోయిందని అనుకోకూడదు. సామాజిక సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో కవి కన్నా మనిషే గొప్పవాడు. కవిత్వం కేవలం ఒక ఈస్థటిక్ విషన్ మాత్రమే. కవిత్వం వల్ల సమాజం మొత్తం మారిపోతుందని నేను భావించను. నేను ఎక్కడో విన్నాను రామోజీ రావుగారు “సాహిత్యం వల్ల ఒక్క ఓటూ పడదు” అని చెప్పినట్లు. బహుశా ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో రీడబిలిటీ ఎంతంటారు? అందులోనూ కవిత్వానికి…?
ఈరోజు కవి కవిత్వం రాసాక అప్పులు సొప్పులు చేసి పుస్తకాన్ని పంచి పెట్టడం తప్ప మరింకేమైనా ఉన్నదంటారా? ఇటువంటి పరిస్థితుల్లో కవిత్వం ద్వారా ఎలాంటి పెను మార్పుల్ని మీరు ఆశిస్తున్నారు? ఉదాహరణకు ముస్లింల నేపధ్యంలోంచి రాస్తున్నామని కొందరు ఏవో అరుపులు అరుస్తున్నారు. అది అటు ముస్లింలకూ చేరడం లేదు ఇటు కవిత్వమూ కాలేకపోయింది. ఇది సరిపోదా!
Avakaaya.com: ఇక్బాల్ గారూ, ఒక కవిగా విమర్శపట్ల, విమర్శకుల పట్లా మీ అభిప్రాయాన్ని చెప్పగలరా?
ఇక్బాల్ చంద్: ఇప్పటి విమర్శకులనుండి నేనేమీ ఆశించడంలేదు. విమర్శ అంటే తిట్టడమో, పొగడ్డమో కాదు. సాహిత్యంలోని గుణ, దోషాల్ని వివరించడం. అలాగే, విమర్శకుడు సాహిత్య సృజనకు, పాఠకుడికి మధ్య వారధి కావాలేగాని అటు భట్రాజు పారగానీ, ఇటు వ్యక్తిగతమైన రాగ, ద్వేషాలను గానీ చూపించరాదు. కానీ వివరించడం. అలాగే, విమర్శకుడు సాహిత్య సృజనకు, పాఠకుడికి మధ్య వారధి కావాలేగాని అటు భట్రాజు పారగానీ, ఇటు వ్యక్తిగతమైన రాగ, ద్వేషాలను గానీ చూపించరాదు. కానీ మన తెలుగు సాహిత్యంలో కనుచూపు మేరలో మంచి విమర్శకులు గాని, అనువాదకులుగానీ కన్పించడంలేదు.
Avakaaya.com:చివరి ప్రశ్న – మీ దృష్టిలో తెలుగు కవిత భవిష్యత్తు ఏమిటి?
ఇక్బాల్ చంద్: మంచి కవులు కూడా చాలా తక్కువమందే ఉన్నారనుకోండి..అది వేరే సంగతి! మంచి కవిత్వం కూడ అప్పుడప్పుడూ వస్తోంది…ఇది ఊరటనిచ్చే విషయం. కవిత్వంలో చికాకు కలిగించే విషయమేమిటంటే అకవిత్వం ఎంతగా పేరుకుపోయిందంటే అసలు కవిత్వాన్ని గుర్తించడం కష్టమైపోయింది. ప్రపంచం మారిపోయింది. గ్లోబలైజేషన్ (దీని కీడు గురించి ఇప్పటికే చాలామంది చెప్పేసారు) పుణ్యమా అంటూ కవిత్వ వస్తు రుఫాలు కూడామారిపోతున్నాయి. ఇక ఊకదంపుడు రచనలకు కాలం చెల్లుతోంది. పాఠకులు కవికన్నా తెలివైన వారు. బహుశ రాబోయే కాలంలో మంచి కవిత్వం ఒక్కటే వస్తుందని. రావాలనీ ఆశిద్దాం.