వైకుంఠపాళీ – రెండవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది.

 

“ఏమిటి? ఉద్యోగం పోయిందా?” షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడింది రంజని.

“అవును. రాత్రికి రాత్రే కంపెనీని మూసేసారు.” నిస్తేజంగా కూలబడ్డాడు అనంత్.

“అదెలా మూస్తారు అనంత్! కంపెనీ స్టార్ట్ చేసి ఆరునెల్లేగా అయ్యింది?” అంది రంజని.

“ఇల్లాజికల్గా మాట్లాడ్తావే! కంపెనీ క్లోజ్ అవ్వడానికి, దాని ఒపెనింగ్ సెరెమనీకి సంబంధమేంటి?” అని తల అడ్డంగా ఊపుతూ విసుక్కున్నాడు అనంత్.

“ఎందుకు నా పై విసుక్కొంటావ్? నే మాట్లాడిందాంట్లో వాలిడ్ ఆర్గ్యుమెంట్ నీకర్థం కాలేదు. నీకంతా దూకుడే!” అంది రంజని.

“హుష్! నన్ను విసిగించొద్దు. ఇప్పటికే ఆలోచించి ఆలోచించి బుర్ర వేడేక్కెంది.” అన్నాడు అనంత్.

“ఈ కంపెనీ చేర్తానని నువ్వన్న రోజే చెప్పాను. ముక్కూమొహం తెలియనివాళ్ళెవరో స్టార్ట్ చేసినదాంట్లో చేరొద్దని! చెప్పానా లేదా? కంపెనీకి మన క్రెడేన్షియల్స్ ఎంత అవసరమో, మనకూ కంపెనీ క్రెడేన్షియల్స్ ముఖ్యమేగా! అసలా కంపెనీకి సొంత వెబ్ సైటు కూడా లేదు. ఐనా జీత మెక్కువిస్తున్నారని జంపయ్యావు.” అంది రంజని.

చేతిలో ఉన్న మొబైల్ను విసిరికొట్టాడు అనంత్. అది నేరుగా వెళ్ళి ఫ్లవర్ వేజ్ కు తగిలింది. ఆ పింగాణీ వేజ్ భళ్ళుమని పగిలింది.

ఆ రభసకు భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడ్డారు.

రంజని ఏడుస్తూ బెడ్రూంలోకి పరుగెత్తినట్లుగా వెళ్ళిపోయింది.

విరిగిన ఫ్లవర్ వేజ్ ముక్కలు, చెక్కలైన మొబైలును చూస్తూ రెండు చేతుల్తో జుట్టు పీక్కున్నాడు అనంత్.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

* * * * *

“నీ రెండు పావుల్లో మొదటి పావు వరాహమయింది.”

“అది మీ అవతారమే స్వామీ! మరి మీ పావేమౌతుందో? పాచిక విసరండి.” అన్నది లక్ష్మి.

నవ్వుతూ పాచికల్ను విసిరాడు నారాయణుడు.

 

* * * * *

వంటింటి పని ముగించుకొచ్చిన సుమతి, పరుపు మీద కూర్చొని కళ్ళుమూసుకున్న భర్తను చూసింది.

“ఏకాంతాసన జపమ్..జయజయ రామ్..” అని, తన ఛలోక్తికి తనే గలగలా నవ్వింది సుమతి.

చిరునవ్వుతో కళ్ళు తెరిచి “కువిదంగ్” అని గట్టిగా అంటూ ఆగిపోయాడు శర్మ.

“అదేమిటండీ? అదేమైనా రాక్షసి పేరా?” అని అడిగింది సుమతి.

ఫక్కున నవ్విన శర్మ “కువిత్ అంటే సంస్కృతంలో ఏకాంతమని అర్థం. ఏదో మంత్రాన్ని గుర్తుచేసుకొంటుంటే నీ చప్పుడైంది. దాంతో ఆ చివరి పదాన్ని గట్టిగా అనేసాను.”  సంజాయిషీలా అన్నాడు కేశవశర్మ.

అతని పక్కనే నడుంవాల్చిన సుమతి “ఈరోజుతో పెళ్ళై పన్నెండేళ్ళు నిండి పదమూడో ఏడు మొదలైందండీ!” అంది.

ఒక అరనిముషం ఆగి “అవును. ఎండ, వానా తప్పించి వసంతం రాలేదింకా” అన్నాడు.

భర్త మాటల్లోని అంతరార్థం తెలుసుకొన్న సుమతి మౌనంగా ఉండిపోయింది.

“పౌరోహిత్యం మొదలుపెట్టిన ఈ పదిహేనేళ్ళలో పెళ్ళిళ్ళు, గర్భాదానహోమాలు, నామకరణాలు ఎన్నెన్ని చేయించానో! చివరకు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న పెద్దల మాట నిజమైంది.” అన్నాడు శర్మ.

“ఇలాగంటున్నానని తప్పుగా అనుకోకండి. మీలాంటి మంచిమనిషికి భార్యనైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నాకు తెలిసీ ఎవ్వరికీ అపకారం చెయ్యలేదు నేను. మన అమ్మానాన్నాలు కూడా అంతే. మరెందుకు మనకీ శిక్ష? మంచివాళ్ళను ఏడిపించడమే దేవుడికి ఇష్టమైన పనా?” – సుమతి గొంతులోని దైన్యం శర్మను కదిలించింది.

“సుమతీ! దేవుడు ఎవ్వరినీ శిక్షించడు. పరీక్షిస్తాడంతే!”

“ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండీ! ఎవ్వరినీ శిక్షించకపోతే యమధర్మరాజు ఎందుకున్నాడు? ఆయన లోకంలో ఏవేవో నరకాలున్నాయని మీరే చెబుతారుగా! అందులో పున్నామ నరకం అనేది పిల్లలు లేనివారికోసమే ఉన్నట్టు పురాణాల్లో చెప్పారుగా! అపుత్రస్య గతిర్నాస్తి అని కూడా అంటారు కదా?”

ఆ ప్రశ్నలు విన్న శర్మ “పిచ్చిదానా!” అంటూ నవ్వాడు. తల తిప్పి తన వైపే చూస్తున్న భర్తను చూస్తూ లేచికూర్చుంది సుమతి. దానర్థం టక్కున సమాధానం చెప్పాలనే.

తనూ లేచి కూర్చున్నాడు శర్మ.

“సుమతీ! నరకంలో వేసేవన్నీ పరీక్షలే. ఆ పరీక్షలకు ఫలితం పశ్చాత్తాపం పుట్టడమే! ఏ జీవి తన చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం ప్రకటిస్తుందోనని ఆశగా చూస్తుంటారట యమభటులు. ఎందుకంటే అన్నన్ని కఠినమైన పరీక్షల్ని నిర్వహించడం వారికి శిక్షలాంటిదట. జీవులు పడే ఆ యాతనలను చూడలేని యముడు కూడా సంవత్సరానికొకసారి అన్ని యాతనలనూ రద్దు చేసి, జీవులందర్నీ తన సభలో కూర్చోబెడ్తాడట…”

“అవునా…ఎందుకు కూర్చోబెడ్తాడు?” ఉత్సాహం ఆపుకోలేక అడ్డు తగిలింది సుమతి.

“చెబుతానుగా…” నవ్వాడు శర్మ.

“అయ్యో…చెప్పండి చెప్పండి…” అంది సుమతి.

“యమలోకంలోని జీవులందర్నీ తన సభలో కూర్చోబెట్టిన యుముడు, తాను విధిస్తున్నఆ శిక్షలు జీవులలోని అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని పెంచడానికేనని చెబుతాడట. జీవులేమో ఆయన చెప్పే మాటల్ని శ్రద్ధగా వినవట. దానికి నిరాశ చెందక కనీసం హరినామస్మరణనైనా చేస్తాయేమో, ఆవిధంగానైనా తన లోకం నుంచి ఆ జీవుల్ని స్వర్గానికి పంపొచ్చని తలచిన యముడు “అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం వాసుదేవం భజే “ అని నామస్మరణ మొదలుపెడతాడట! ఆయనతో బాటు ఆయన కింకరులు కూడా భక్తితో గొంతు కలుపుతారట. కానీ ఏవో కొన్ని తప్పించి చాలా జీవులు మాత్రం యమునికి వీపు చేసి కూర్చుంటాయట. తనతో బాటు శ్రుతి కలిపిన జీవుల్ని నరకలోకం నుండి విముక్తుల్ని చేసిన యముడు, వీపు తిప్పి కూర్చున్న జీవుల్ని మళ్ళీ యాతనాగృహాల్లోకి తీసుకెళ్ళమని తన భటులను ఆజ్ఞాపిస్తాడట! ఇప్పుడు చెప్పు, యమలోకంలోనివి శిక్షలా? అలాగే, అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేనివారికి గతులు లేవనేది మాత్రమే అర్థం కాదు. పుత్రులు లేనివాళ్ళు నారాయణుణ్ణి నమ్ముకుంటే వారికి వాడే గతి అవుతాడన్నది అంతరార్థం!”

“ఈ విషయం నేను అస్సలు వినలేదండి. నిజమే! మీరన్నట్టు అవి శిక్షలు కావు. కానీ భూలోకంలో మనలాంటివారికి కలిగే కష్టాలు కూడా శిక్షలు కావా? వాటన్నింటినీ పరీక్షలేనని సర్దిచెప్పుకోవాలా? అలా సర్దుకోవడం నాలాంటి సామాన్యులకు చేతనౌతుందా?” – ప్రశ్నల పరంపరను సంధించింది సుమతి.

అమాయకత్వం నిండిన ఆమెలోని కోపం కూడా చాలా అమాయకంగా కోప్పడుతోంది.

“సుమతీ! పదినెలల పంట కోసం పన్నెండు సంవత్సరాలుగా నీలో ఎంత కోపం పేరుకుపోయిందో…” అన్నాడు శర్మ.

“కోపమా? నాది కోపమా?” అంది సుమతి ఆశ్చర్యంగా.

“కాదులే…కోరిక.” అన్నాడు శర్మ, మాట మారుస్తూ.

“నిజంగా చెప్పండి నాది కోపమా? మీ మీద ఎప్పుడైనా కోప్పడ్డానా?” మళ్ళీ అడిగింది సుమతి.

“లేదులే! నీది కోపం కాదన్నానుగా!” సర్దిచెప్పబోయాడు శర్మ.

సుమతి మౌనంగా పడుకుంది. అనునయంగా ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు శర్మ.

వెచ్చటి నీటి బొట్లు అతని ఛాతీకి తగిలాయి.

చల్లటి నీళ్ళను అదేపనిగా వేడి చేయాలి. చేసినా వెంటనే చల్లబడతాయి. వేడెక్కే ఉబుకుతున్న ఈ నీటిని చల్లార్చడం ఎలా?

“నేను నా మాటల్తో ఈమెను శిక్షించడం లేదు కదా?” – నిద్రను పోగొట్టుకొన్న శర్మ ఆలోచిస్తూనే ఉండిపోయాడు.

* * * * *

ఐదోగడిలో చిలుక బొమ్మ దగ్గరకొచ్చిన నారాయణుని పావును చూసి,  “మీ పావు, చిలుక పలుకులు పలుకుతోందే!” అన్నది లక్ష్మి.

“బాలాదపి…శుకాదపి” అన్నాడు నారాయణుడు.

“నిజమే! పిల్లలు చెప్పినా, చిలుక చెప్పినా నీతిని గ్రహించాల్సిందే! చాలా చక్కటి తత్వాన్నే చెబుతోంది మీ పావు.” అన్నది లక్ష్మి పాచికల్ని చేతిలోకి తీసుకొంటూ.

“నీ రెండో పావు చెప్పబోయే రహస్యమేంటో చూడాలి దేవీ!” అన్నాడు నారాయణుడు.

అమ్మ చేతి గాజుల చప్పుడుతో కలసిపోయింది పాచికల చప్పుడు.

* * * * *

బైట తిరిగి, తిరిగి వచ్చిన అనంత్ హాల్లో కూర్చున్న రంజనిని చూసి తలదించుకొని ఎదురుగా కూర్చున్నాడు.

రంజని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలోని కర్చీఫుతో మాటిమాటికీ ముక్కు తుడుచుకొంటోంది.

“అంటే ఎక్కువగానే ఏడ్చిందన్న మాట. ఐనా నా తప్పేముంది? చచ్చీ చెడి ఇంటికొస్తే అలానా మాట్లాడేది! ఇంతకూ సారీ చెప్పనా వద్దా? చూద్దాం. తన మూడ్ ను బట్టి మన మూవ్!” అని అనుకుంటూ ఇండియాటుడేను చేతిలోకి తీసుకున్నాడు.

“నాతో మాట్లాడవా? ఒక్క మాటతో అంత చెడ్డదాన్నైపోయానా?” అంది రంజని, గొంతులో ఉక్రోషాన్ని ప్రదర్శిస్తూ.

“మాట్లాడకుండా బిగుసుక్కూర్చుంది ఎవరు? నేనా?” అన్నాడు అనంత్, కావాలనే నిర్లక్ష్యాన్ని ధ్వనిస్తూ.

“అదే వద్దనేది! ఎందుకలా ఎప్పుడూ తగవులాడే ధోరణిలో మాట్లాడ్తావ్? ఇంత హార్ష్ గా మాట్లాడి, తప్పంతా నాదేనంటావా?” ఈసారి నిజంగానే ఏడుస్తూ అడిగింది రంజని.

“అబ్బా! ఏడవొద్దు తల్లీ! అలా మాట మాటకీ కన్నీళ్లు చిలకరిస్తే నాకు ఒళ్ళు మంట.”

“ఆహా! నీ ఒళ్ళు గురించే ఆలోచిస్తున్నావ్. నా మనసు గురించి కూడా ఆలోచించు.”

టక్కున లేచాడు అనంత్. వెర్రిగా చూసింది రంజని.

ముందుకువచ్చి రంజని నెత్తి మీద మొట్టికాయొకటి వేసి “మొద్దూ! కన్నీళ్లు ఎక్కువయ్యే కొద్దీ ముక్కు కూడా ఏడుస్తుంది. అలా ఏడ్చే ముక్కంటే నాకు చిరాకు. ప్లీజ్! ముక్కునలా ఏడ్పించొద్దు. ప్లీజ్!” అన్నాడు.

నవ్వలేక నవ్వింది రంజని. హమ్మయ్య అని అనుకొన్నాడు అనంత్.

“నీ ఈగో హర్ట్ కాకుండా ఎంత తెలివిగా మాట్లాడావ్!” అంది రంజని.

ఏమిటన్నట్టు కనుబొమలెగరేసాడు అనంత్.

“సారీకి బదులుగా ప్లీజ్ వాడావు చూడూ! ఆ తెలివిని మెచ్చుకుంటున్నాను. రా టీపార్టీ చేసుకుందాం” అంటూ వంటింట్లోకి నడిచింది రంజని.

“వార్నీ! చంద్రముఖిలోని రజనీకాంత్ స్టైల్లో నా మనసులోని మాట దీనికెలా తెలిసింది?” అని అనుకొంటూ రంజని వెనకే వెళ్లాడు అనంత్.

 

* * * * *

“నీ పావు అయింది మండూకం..” అన్నాడు నారాయణుడు.

నవ్వుతూ తన రెండో పావును నాలుగో గడిలోనికి తోసింది లక్ష్మీదేవి.

“ఈ మాండూకోపనిషత్ సారమేమిటో?” అన్నాడు పార్థసారథి.

“తన గురించి కూడా తెలుసుకోలేని అంధుడని అర్థం ప్రభూ! నూతిలోని కప్పకు బైటి లోకం మాత్రమే తెలీదు. అంతఃచక్షువులు తెరుచుకోని మానవునికి తన తప్పొప్పుల గురించి కూడా తెలుసుకోలేడు.” అన్న విద్యాలక్ష్మి “మీ రెండో పావుతో ఏ జ్ఞానోపదేశం చేయబోతున్నారో?” అని అడిగింది.

“పావులు కడుస్వతంత్ర్యులు!” అన్నాడు గీతాచార్యుడు.

“పాపులూ కడుంగడు స్వతంత్ర్యులే స్వామీ!” అన్నది శంకరపితామహి.

పాచిక కదిపాడు హరి.

కరకంకణ నినాదాన్ని అనుకరిస్తూ చప్పుడు చేసాయి పాచికలు.

* * * * *

(సశేషం…)

Your views are valuable to us!