వైకుంఠపాళీ – ఇరవై ఏడవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గతభాగం

 

“ఫ్రెండ్స్! గుడీవినింగ్ టు యూ ఆల్!” అంటూ మొదలుపెట్టింది రంజని. తన కంపెనీ ఉద్యోగుల కోసం పర్సనాలిటీ డెవెలప్మెంట్, మోటివేషన్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ మొదలైన వాటిపై శిక్షణనిప్పించడానికి రంజనిని ఒప్పించాడు అనంత్. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో రంజని నడిపిన తరగతుల్లో కొన్నింటికి హాజరైన అనంత్ కు విశ్వేశ్వర్ విశ్లేషణలు ఎంతగానో నచ్చాయి. అలానే రంజని యొక్క లోతైన పరిశీలనాశక్తికి ఆశ్చర్యపడ్డాడు. పని ఒత్తిడితో నలిగే తన ఉద్యోగులకు ప్రతి రెండో శుక్రవారం మధ్యాహ్నం ఓ గంట పాటు వీళ్ళిద్దరితో ఉపన్యాసాల్ని ఏర్పాటు చేసాడు.

“మనలో ప్రతి ఒక్కరి లక్ష్యం సంతోషంగా ఉండడం. అవునా?” – శ్రోతల్ని ప్రశ్నించింది రంజని.

“ఎస్” అని ఒక్కసారిగా బదులిచ్చారందరూ.

“ఏది సంతోషం అని అడిగితే ఫలానా అని ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి మనిషికీ ఎన్నెన్నో సంతోషాలు కావల్సి వస్తుంటాయి. అవునా?”

“ఎస్”

“అంటే మనమందరం మనకు కావాలని అనిపించిన అన్ని సంతోషాల్నీ పొందలేం.కొన్నిసార్లు సంతోషాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కష్టాలు ఎదురౌతుంటాయి. దాంతో దుఃఖమే కలుగుతుంటుంది గానీ సుఖం ఏమాత్రం దొరకదు. ఎవరో కావాలని మనల్ని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతోందని అడిగితే ఒక్కొక్కరు ఒక్కోవిధంగా బదులిస్తారు. ఎదురుపడ్డ అనుభవాల్ని మనస్పూర్తిగా స్వీకరించిన కొద్దిమంది మాత్రమే ఈ మాయాజాలాన్ని అర్థం చేసుకోగలిగారు.” అంటూ ఆగింది రంజని. కావాలనే వదిలిన ఆ విరామం వినేవాళ్ళలో కుతూహలాన్ని రేకెత్తించింది.

“మనలో చాలామందికి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే సుఖాన్ని సాధించేందుకు ఉపయోగపడేవిగా అనిపిస్తుంటాయి. దట్ మీన్స్ – కార్, బంగ్లో, ఫారిన్ ట్రవెల్, లావిష్ ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్, అలాంటివాళ్ళందరూ మిస్సయ్యే ముఖ్యమైన పాయింట్ దటీజ్ ‘సింప్లిసిటీ’. ఫర్ ఎంగ్జాంపుల్ – నదిలో నీళ్ళు మనం తయారుచేసుకొన్నది కాదు. కానీ దాన్ని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపి, పైన ఒక బ్రాండ్ వేసి పదహైదురూపాయలకు అమ్ముకొంటాం. మొదటిది న్యాచురల్ సింప్లిసిటీ ఐతే రెండోది ఆర్టిఫిషియల్ మెటీరియల్ ఎగ్జూబరెన్స్. ఒకసారి మనముంటున్న ఈ పరిసరాల్ని గమనించి చూడండి. మన చుట్టూవున్న గాలి అందులోని ఆక్సిజన్ మన సృష్టి కాదు. కొండల్ని మనం నిలబెట్టలేదు. అడవుల్ని మనం నాటి పెంచలేదు. కానీ వీటిల్ని నాశనం చేయడంలో ఎంతో ప్రోగ్రెస్ ను సాధించాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

బికాజ్, మనలో ఆత్మ ఉన్నట్టే, ప్రకృతిలో కూడా ఆత్మ ఉందని, అది మనలాగే సున్నితమైనదని మర్చిపోయాము. ఈ సృష్టిలోకి ఎలావచ్చామో తెలుసుకోకుండా, చుట్టూవున్న పరిసరాల్ని మన అదుపులోకి తెచ్చుకొని అన్నింటిపైనా పెత్తనం చలాయించాలన్న అత్యాశే మానవుల్ని ఇలా తయారుచేస్తోంది. ఎండ్లెస్ గ్రీడ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఆన్ ద అదర్ హ్యాండ్, కంటెంట్మెంట్ బ్రింగ్స్ సింప్లిసిటీ ఇన్ యూ. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ఇద్దరు సన్యాసులు తీర్థయాత్రకని కాలినడకన బయల్దేరారు. ఓ మట్టిదారిలో పోతున్నప్పుడు పెద్ద వర్షం వచ్చి దారంతా బురదమయమైంది. ఖరీదైన పట్టుబట్టల్లోవున్న చక్కనైన ఒక అమ్మాయి ఆ బురదను దాటడానికి ఇబ్బందిపడుతోంది. ఆ అమ్మాయిని చూసిన సన్యాసి ఒకడు టక్కున తలతిప్పుకొంటే మరో సన్యాసి ‘ఏమ్మా! దాటడానికి కష్టపడుతున్నావా?’ అంటూ అవలీలగా అమ్మాయిని ఎత్తుకుని రోడ్డు అవతలి వైపు తీసుకెళ్ళి దింపాడు. ఆపై ఇద్దరు సన్యాసులూ నడుస్తూ నడుస్తూ రాత్రికి ఓ దేవాలయాన్ని చేరుకొన్నారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మొదటి సన్యాసి రెండోవాణ్ని అడిగాడు – ‘స్వామీ! మనం సన్యాసులం. భవబంధాల నుండి మరీ ముఖ్యంగా అందమైన స్త్రీలనుండి దూరంగా ఉండాలి. కానీ మీరేమో యుక్తవయస్సులో వున్న ఆ అమ్మాయిని మాట్లాడించడమే కాక ఎత్తుకున్నారు కూడా!’. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ ‘స్వామీ! నేను ఆ అమ్మాయిని అక్కడే మర్చిపోయాను. మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారా?’ అని అన్నాడు రెండో సన్యాసి.”.

అందరూ జోరుగా నవ్వారు.

“ఈ కథలో మనకు కావల్సిందేమిటంటే ఆకర్షణ కానీ అవసరం కానీ మనకు ఉపయోగపడే వరకూ ఉండవచ్చు. కానీ అవి మితిమీరితేనే అత్యాశ మొదలౌతుంది. ఆశ పెరిగే కొద్దీ కోరినదాన్ని దక్కించుకోవాలన్న తపన మొదలౌతుంది. ఆ తొందరపాటు అసహయానికి దారి తీసి చివరకు మనచేత తప్పుడు పనుల్ని చేయిస్తుంది. కాబట్టి ఆ రెండో సన్యాసిలాగా అనవసర విషయాల్ని మర్చిపోయేలా మన మనసుల్ని కంట్రోల్ చెయ్యాలి. కొందరు దొంగలు సులభంగా సంపాదించాలని చిన్నపిల్లలకు చాక్లెట్ల ఆశ చూపి నగల్ని దొంగిలించినట్టుగా మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కలవరిస్తూ లాంగ్ టర్మ్ గోల్స్‍ను మర్చిపోతాం.” అంది రంజని.

“సో, వాటీజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?” అని విసుగ్గా అడిగాడో కుర్రవాడు.

నవ్వింది రంజని. కుతూహలంగా చూసాడు అనంత్.

“రైటియస్ లివింగ్. నిజాయితీగా బ్రతకడం. డార్విన్ సిద్ధాంతం ఎవల్యూషన్ గురించి సరిగ్గా చెప్పిందో లేదో గానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా చెప్పింది. అదే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిసిస్టెన్స్. బ్రతకడం కోసం పోరాటం! ఎప్పుడైతే పోరాటమే జీవితమైందో ఇక శాంతి ఎక్కడిది? కూడు కోసం, గుడ్డ కోసం, ఆస్తి, అంతస్తుల కోసం, పేరుప్రఖ్యాతుల కోసం పోరాటం చేస్తోంది మానవజాతి. పక్కవారి కంటే ఎక్కువగా ఉండాలన్న అత్యాశ ఈ పోరాటానికి ఆజ్యం పోస్తోంది. ఇండస్ట్రియలైజేషన్ వల్ల మోడ్రనిజం పెరిగింది. ఇది నిప్పుకు గాలి తోడైనట్టు తోడు కావడంతో మనుష్యుల మధ్య పోరాటం ఇంకా ఇంకా తీవ్రమైపోయింది. ఖరీదైన వస్తువుల్ని పుట్టించుకుని వాటిల్ని సంపాదించడమే ఏకైక లక్ష్యంగా, బ్రతకడానికి ఆ వస్తువులు తప్ప మరేమీ లేనట్టు, ప్రేమ-అభిమానం-స్నేహం మొదలైనవాటిల్ని కూడా బహుమతులతో, కానుకలతో, ఆడంబరాలతో కొల్చుకొంటూ బ్రతుకుతోంది మన జాతి. ఈ పోరాటంలో విచక్షణ లేదు. ఓపిక, సహనం లేదు. నెమ్మదిగా ఆలోచించే అవకాశం లేదు.” – రంజనిలో ఆవేశం వేగం పుంజుకోసాగింది.

“మీలో ఎవరికైనా గులాబ్ జామూన్ ఇష్టమైనా ఇరవైనాలుగ్గంటలూ, మూడువందల అరవైఐదు రోజులూ దాన్నే తినలేరు. ఏందుకు? తిన్నదే తింటుంటే కలిగేది సుఖం కాదు రోత. అలాగే సుఖం వెనుకనే దుఃఖం పుట్టే ఈ లౌకిక జీవితం ఎప్పుడోకప్పుడు రోత పుట్టిస్తుంది. కానీ మీ దగ్గర రెండు జామూన్లు ఉంటే, అందులో ఒకదాన్ని పక్కవారితో పంచుకుంటేనో! త్యాగం వల్ల సుఖం తగ్గదు సరికదా రెట్టింపౌతుంది. మనకున్న లైఫ్ స్పాన్‍లో మనకోసమే బ్రతక్కుండా మరొకరి కోసం బ్రతకడంలోనే మీనింగ్ఫుల్నెస్ ఉండేది.” అని ముగించింది రంజని.

ఆమె ఆవేశానికో లేక ఆమె మాటల్లోని గాఢతకో అక్కడున్నవారందరూ కొన్ని సెకన్ల పాటు మౌనం వహించారు. చివరి వరసలో ఎవరో ఒంటరిగా చప్పట్లు కొట్టారు. దానికి మరి కొన్ని చేతులు కలిసాయి. ఇంకొన్ని….ఇంకొన్ని….ఇంకొన్ని….కొద్దిక్షణాల్లో మొత్తం సభంతా చప్పట్లు కొట్టింది.

* * * * *

“మూడు శిఖరాల్ని దాటి, కైలాసాన్ని కూడా దాటి ’ప’ అక్షరమున్న నూటాఇరవైనాల్గవ గడికి చేరిన నీ మొదటి పావు చెప్పదల్చింది ఏమిటో?” అన్నాడు సాకారానందస్వరూపుడు.

“ప్రభూ! గీర్వాణ భాషలో ప – అంటే ధనాధిపతియైన కుబేరుడు. బహుశా తన జీవితంలో నిజమైన ధనమేదో తెలుసుకున్నందువల్ల నా మొదటి పావు కూడా కుబేరునితో సామ్యాన్ని పొందింది కాబోలు. నాకు తెలిసింది ఇంతే ఆపై మీరు దయజూపాలి!” అని చేతులు జోడించింది నిత్యకళ్యాణి.

“దేవీ! పాతీతి ప అని ధాతువు. పాతి అనగా రక్షణ అని అర్థం. మానవులకు నిజమైన రక్షణనిచ్చేది జ్ఞానం మాత్రమే. ఈ జన్మలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం జన్మజన్మలకూ వెన్నంటి వస్తుంది. ’న హి జ్ఞానేన సదృశం’ అని వక్కాణించింది ఇందువల్లనే. జ్ఞానాన్ని మించిన మిత్రులు లేరు. జ్ఞానాన్ని మించిన సంపత్తు లేదు. జ్ఞానాన్ని మించిన సుఖం లేదు. జీవించడానికి అవసరమైనదేది, కానిదేదని తెలుసుకోవడమే జ్ఞానం. ప అంటే పవనే అంటే గాలి అని కూడా అర్థముంది. గాలిలోని ప్రాణవాయువు మాత్రమే జీవుల అస్తిత్వానికి ఆధారమైనట్టు లౌకికమైన చర్యల్లో పరోపకారం, పరదుఃఖదుఃఖిత్వం, ఉపకారస్మరణ మొదలైనవన్నీ కూడా భగవత్సంబంధమైనవిగా పరిగణింపబడతాయి. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకున్న జీవులను నేను అనుగ్రహిస్తాను.” అన్నాడు శ్రీహరి.

“మీ అనుగ్రహమన్నా జ్ఞానప్రాప్తియన్నా ఒక్కటే స్వామీ!” అంది లక్ష్మి.

నవ్వాడు నారాయణుడు.

“మీ మొదటిపావుతో బాటూ రెండోపావుకూడా ముక్తికి చేరువైంది. మరో పందెం పడితే ఆ కాయ కూడా పరమపదాన్ని పొందుతుంది. ఆ కాయను ఎలా నడిపించబోతున్నారో చూడాలన్న కుతూహలం ఎక్కువౌతోంది!”

“చూద్దువులే ప్రియా!” అంటూ నారాయణుడు పాచికల్ని వేస్తే అవి మోహిని చేతిలోని కలశం నుండి జాల్వారిన అమృతపు గలగలల్ని ప్రతిధ్వనించాయి.

* * * * *

Your views are valuable to us!