గతభాగం: సుబ్రహ్మణ్యాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలన్న ఆతృతతో ఆ అబ్బాయితో వాగ్వివాదానికి దిగుతాడు శర్మ. కానీ సుబ్రహ్మణ్యం తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. దాంతో సహనం కోల్పోయిన కేశవశర్మ అతన్ని కొడతాడు. సుబ్రహ్మణ్యం తరఫున సుమతి వేడుకోవడంతో శర్మ శాంతిస్తాడు. అంతేగాక సుబ్రహ్మణ్యాన్ని అతని మేనమామ ఇంటికి పంపించివేస్తాడు. సుబ్రహ్మణ్యం ఉదంతంతో కోపంగా ఉన్న శర్మను వేదాంత చర్చలోకి దించుతుంది సుమతి. ఆ చర్చలో చెడు ఆలోచనల్తో వండే పదార్థాల వల్ల బుద్ధిశక్తి చెడుతుందని తెలుసుకున్న సుమతి తన భర్త అకారణంగా సుబ్రహ్మణ్యాన్ని కొట్టడాన్ని తన తప్పుగా స్వీకరిస్తుంది. ఆమె సౌశీల్యాన్ని చూసిన శర్మ చలించిపోతాడు. తన భార్య తనకంటే ఓ మెట్టు పైన ఉన్నట్టు అర్థం చేసుకుని ఆనందిస్తాడు. |
ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ జోరుగా సాగుతోంది.
అరవింద్, రంజని తమ టీమ్ సభ్యులతో హడావుడిగా తిరుగుతూ, మాట్లాడుతున్నారు.
పెద్ద హోటల్లోని ఆ బాంక్వెట్ హాల్లో పదిహైదుమంది దాకా యువతీయువకులు తమ పిచ్చాపాటితో హోరెత్తిస్తున్నారు. సన్నగా వినబడుతున్న పాశ్చాత్య సంగీతం ఆ మాటల జోరుకు దరువు వేస్తోంది.
“గైస్ అండ్ గాళ్స్! లిజన్ టు మీ ప్లీజ్…” మైక్ లో గట్టిగా అరిచాడు అరవింద్.
మాటలు సద్దుమణిగి గుసగుసలుగా మారాయి.
అంతా నిశ్శబ్దంగా ఉందనుకున్న తర్వాత మళ్ళీ మైక్ చేతిలోకి తీసుకున్నాడు అరవింద్ “డియర్ కొలీగ్స్! ఈరోజు మనమెంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొంటున్న ఈ అకేషన్ మన బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ చెప్పిందాని ప్రకారం మనకు వచ్చేది కాదు. బట్, మన బి.డి. టీమ్ ఎఫర్ట్స్ వల్ల అది మనకు వచ్చింది. వుయ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డు దిస్ అట్ ఏ వెరీ లో కాస్ట్. మీకందరికీ తెలుసు టైమ్ ఈజ్ మనీ! సో, ప్రాజెక్ట్ డెలివరి తక్కువ టైమ్ లో చెయ్యగలిగితేనే మన బి.డి టీమ్ కోట్ చేసిన కాస్ట్ తో మ్యాచ్ అవుతుంది. దట్స్ హౌ అవర్ రేస్ అగేన్స్ట్ టైమ్ హాజ్ స్టార్టెడ్. ఇది చెయ్యగలమా లేదా అన్న నా డౌట్స్ ను క్లీన్ బౌల్డ్ చేస్తూ మీరంతా పని చేసారు. ఐ యామ్ థాంక్ఫుల్ టు యూ ఆల్! ఇక్కడ మనం కొంతమంది టీమ్ మెంబర్స్ ని స్పెషల్గా అప్రీషియేట్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేసిన మాడ్యుల్స్ అంత క్రిటికల్ కాబట్టి. ఐ ఫస్ట్ ఇన్వైట్ రంజని టు షేర్ హర్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియెన్సెస్. రంజనీ…ప్లీజ్…” అంటూ మైక్ ను ముందుకు చాచాడు అరవింద్.
రంజని లేచి మైక్ ను అందుకుంది. అక్కడ కూర్చున్నవాళ్ళందరినీ ఒకసారి కలయజూసి మాట్లాడ్డం మొదలుపెట్టింది.
“ఫ్రెండ్స్! ఈ అప్రీషియేషన్ ఎట్సెట్రా ఆర్ ద కైండ్ జస్చర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఆక్చువలీ, నేను నా డ్యూటీని చేసాను. కాబట్టి నాకిచ్చిన మాడ్యూల్లో నేనేదో మిరాకల్స్ చేసానని చెప్పను. బట్, ఐ మస్ట్ షేర్ అ రేర్ ఎక్స్పీరియన్స్, ఎ డివైన్ ఎక్స్పోషర్. ఈ ప్రాజెక్ట్ లో నేనేమైనా మంచిపని చెయ్యగలిగానంటే, అది నావల్ల జరిగింది కాదు. దేర్ ఈజ్ ఏ హిడెన్ మోటివేషన్! ఇట్ ఈజ్ యాన్ అన్ డిసైఫరబుల్ డివైన్ స్క్రిప్ట్ విచ్ మేడ్ మీ టు డు మై డ్యూటీ.” అని ఆగింది రంజని.
ఆమె మాట్లాడ్డానికి లేచినిలబడినప్పుడు ఉన్న చిన్నాచితకా శబ్దాలు కూడా తమ అస్తిత్వాన్ని మర్చిపోయాయేమో!
అందరిలోనూ ఏదో తెలియని ఉత్సుకత చెలరేగిందేమో!
ఓ గురుకులంలో ఓ గొప్ప గురువుగారు ఇవ్వబోతున్న మహత్తర ఉపదేశాన్ని వినడానికి కూర్చున్న శిష్యుల్లా అక్కడున్న వాళ్ళందరూ…
“నా జీవితంలో ఇప్పటిదాకా నాలుగైదు ట్రాజెడీలు జరిగాయి. ఆరు నెలల వెనక జరిగిన అబార్షన్ వాటిలో అన్నిటికంటే గొప్ప విషాదం. అబార్షన్ ఐన రోజు నేనున్న పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని తల్చుకొంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఆరోజు నాలో చచ్చిపోవాలన్న కోరిక ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఈరోజు ఏదో సాధించాలని, దానికోసం బ్రతికి తీరాలనే కోరిక బలంగా ఉంది. నాలోని ఈ గొప్ప మార్పుకు కారణం మీరెవరైనా ఊహించగలరా?” అని అందరినీ అడిగింది రంజని.
మధ్యవరుసలోని ఓ అబ్బాయి చెయ్యి పైకెత్తాడు.
“ఎస్ ప్లీజ్” అని అంది రంజని.
“శివ్ ఖేరా ఆర్ యండమూరి రాసిన పర్సనాలిటీ డెవెలప్మెంట్ బుక్స్ చదివుంటారు.” అన్నాడు.
“నో!” నవ్వుతూ అంది రంజని.
మరో అమ్మాయి లేచి “మేడమ్! మే బీ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సమ్ కైండాఫ్ కౌన్సిలింగ్?” అంది.
కాదన్నట్టు అడ్డంగా తలనూపింది రంజని.
ఇంకో అమ్మాయి లేచి “ఐ థింక్ యూ వుడ్ హావ్ జాన్డ్ సుదర్శన్ క్రియా కోర్స్ ఆర్ రాజయోగ కోర్స్!” అంది.
“నో” అంది రంజని.
“ఐ గెస్.…నీ భర్త, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ వగైరా వగైరాలు ఎంతో సపోర్ట్ చేసుంటారు?” అన్నాడు అరవింద్.
నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుతూ కాదన్నట్టు తలూపింది రంజని.
దాంతో అరవింద్ చేతుల్ని పైకెత్తి “వుయ్ హావ్ లాస్ట్…” అన్నాడు. మిగిలినవారందరూ “యా…” అని కోరస్ గా అరిచారు.
“ఓకే! ఓకే! నా మార్పుకు అసలు కారణం ఓ అపరిచిత వ్యక్తి. వన్ కంప్లీజ్ స్ట్రేంజర్! ఏ లేడీ.” అని ఆగింది రంజని.
“ఓ”…“ఓహ్”…”ఊప్స్”…”ఓ గాడ్” అనే రకరకాల ఆశ్చర్యార్థక పదాలు ఒక్కసారిగా గొల్లుమన్నాయి ఆ గదిలో.
అరవింద్ లేచి “ష్…ష్…సైలెన్స్ ప్లీజ్” అని రంజని వైపుకు తిరిగి “ఇది చాలా ఇంట్రెస్టింగ్గా వుంది. కంటిన్యూ ప్లీజ్” అని చెప్పి కూర్చున్నాడు.
“హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాక దాదాపు ఇరవైరోజులు ఇంట్లోనే ఉండిపోయాను. నా భర్త నాతోనే ఉన్నా కూడా ఇద్దరి మధ్యా ఏదో గ్యాప్. ఏదో ఒంటరితనం. సో, ఆ ఫీలింగ్ ను పోగొట్టుకోవాలని నేను గుడికెళ్ళాను. అదీ తెల్లవారుజామునే వెళ్ళాను. దర్శనం చేసుకొనివచ్చి అక్కడున్న లాన్ లో కూర్చున్నప్పుడు….ఐ మెట్ దట్ లేడి. ఆమెను ఒక్క వర్డ్ లో వర్ణించాలంటే…ఇన్నోసెన్స్ పెర్సానిఫైడ్. అలాంటి అందమైన అమాయకత్వాన్ని మనం చాలా అరుదుగా చూడగలం. ఆమెతో నేను దాదాపు గంటకు పైగానే స్పెండ్ చేసాను. నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి పూర్తిగా సరెండరైపోయి, నోరు మూసుకొన్నది ఆ టైమ్ లోనే. ఆమె సింప్లిసిటీలో అంత పవర్ ఉంది. ఆమె ఎన్నో కొత్త విషయాల్ని చెప్పింది….”
“వోవ్! వాటార్ దోస్ న్యూ థింగ్స్?” అంటూ అడ్డు తగిలాడు అరవింద్.
“ఆమె కొన్ని పురాణ కథల్ని, సంస్కృత సుభాషితాల్ని, ఇంకెన్నో మంచి మంచి మాటల్నీ చెప్పింది.” అంది రంజని.
గొల్లుమని నవ్వాడు అరవింద్. అంతటితో ఆగక గట్టిగా చప్పట్లు కూడా కొట్టసాగాడు. చాలామంది అతనితో శ్రుతి కలిపారు. రంజని వాళ్ళ నవ్వులు సాగినంతసేపూ మౌనంగా ఉండిపోయింది. ఆమె పెదవులపై కూడా చిన్ని నవ్వు మెరుస్తూ ఉండింది.
“వెల్….నీకు పెళ్ళై ఎన్నేళ్లైంది అరవింద్?” అని అడిగి, వెంటనే “ఫర్గివ్ మీ ఫర్ ఆస్కింగ్ ఎబౌటే పర్సనల్ మ్యాటర్” అని సన్నాయి నొక్కులా చెప్పింది రంజని.
“వెల్….ఫోర్టీన్ యియర్స్.” అన్నాడు అరవింద్, రంజనిని అనుకరిస్తూ.
“ఐతే నీ భార్యకు నువ్విప్పుడు పాత చింతకాయపచ్చడే ఐవుండాలి!” అంది రంజని. అలా అంటూ అంటూనే కన్ను కూడా గీటింది.
కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు అరవింద్. “ఐ గెస్ నాట్” అన్నాడు గట్టిగా.
విశాలంగా నవ్వింది రంజని. “గెస్సింగ్ ఎందుకు అరవింద్. సే కాన్ఫిండెంట్లీ!” అంది రంజని.
కొద్దిగా ఇబ్బందిపడినట్టు మొహం పెట్టి “ఇంతకీ నువ్వు అనదల్చుకున్నదేమిటి రంజని?” అన్నాడు అరవింద్.
“భర్తకు భార్య, భార్యకు భర్త పాత చింతకాయపచ్చడైపోయామో లేదోనన్న విషయాన్నే కనిపెట్టలేనప్పుడు మనకు అర్థం కానివాటిల్ని, మనకు పూర్తిగా తెలియని వాటిల్ని పాత చింతకాయపచ్చడి కింద కొట్టిపారేయడం సరైన పనా? అరవింద్, ఐ యామ్ వెరీ సారీ ఫర్ వాటెవర్ ఐ హావ్ ఆస్క్డ్ యూ. ఈ పాయింట్ ను ప్రూవ్ చెయ్యడానికే అలా అడిగాను. నో అదర్ మాలిషియస్ ఇంటెన్షన్ ఇన్ ఆస్కింగ్ సో.” అంది రంజని.
“పాయింట్ వెల్ టేకెన్.” అని కుడి బొటనవేలిని పైకెత్తి చూపాడు అరవింద్.
“ఫ్రెండ్స్! నేను నా మదర్ హుడ్ ను పోగొట్టుకున్న రోజుల్లో దాన్ని తిరిగి పొందుతానో లేదోనన్న టెన్షన్ తో పిచ్చిపట్టేది. బట్ థాంక్స్ టు పావని అండ్ స్టెల్లా. వాళ్ళు నాలో ఓ అమ్మని చూసారట. మొన్నో రోజున నా హబ్బీ చాలా విచారంగా ఉంటే ఓ అన్నమాచార్య కీర్తన పాడాను. దాంతో ఆయన కూడా నాలో వాళ్ళ అమ్మని చూసారట! ఇవన్నీ నా వరకూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. పొగొట్టుకొన్నదాన్ని, వితౌట్ ఎనీ ఎఫర్ట్, పొందడం ఎవరికైనా వండర్ఫుల్లేననుకొంటాను. ఇలాంటి వండర్ ను నాకు మొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఆ అన్నోన్ ఇన్నొసెంట్ లేడీ. షీ ఈజ్ మై రోల్ మోడెల్. ఈరోజు నేనేమైనా సాధించివుంటే ఆ క్రెడిట్టంతా ఆమెకే చెందుతుంది. ఐ డోంట్ వాంటు బోర్ యూ విత్ మై స్టోరీస్. బట్…ఒక్క విషయం. మీరందరూ జీవితంలో ప్రొగ్రెస్ కావాలంటే యూ మస్ట్ స్టడీ అవర్ ఏన్షియంట్ లిటరేచర్. మన శతకాలు, వేమన పద్యాలు, కీర్తనలు అండ్ జానపద గీతాలు…అదే ఫోక్ సాంగ్స్. వీటిల్లోని ఒక్కో అక్షరంలో మీ తలరాతను మార్చగలిగే పవర్ఫుల్ ఆల్గొరిధమ్స్ దాగున్నాయి. సో, ప్లీజ్ రీడ్ దెమ్ అండ్ డిజైన్ యువర్ లైఫ్. థాంక్స్!” అంటూ మైక్ ను టేబుల్ పైపెట్టి తన కుర్చీ వైపుకు వెళ్లబోయింది రంజని.
“ఎక్స్ క్యూజ్ మీ మేమ్! ఇంతకీ ఆ లేడీ ఎవరో, ఎక్కడుంటారో చెప్పండి.” అంటూ అడిగాడో కుర్రవాడు.
“ఆమె ఎవరో, ఎక్కడుంటారో, ఏం చదివారో నాకు తెలీదు.” అంది రంజని.
“ఓహ్…దెన్…మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన ఆమె గురించి యూ డోంట్ నో ఎనీ థింగ్?” అన్నాడా కుర్రవాడు.
“వెల్…ఆమె పర్సనల్ డీటైల్స్ ఏవీ తెలియకపోవడం నాకు బాధ కలిగించే విషయమే. కనీసం ఫోన్ నెంబరైనా తీసుకోవల్సింది. బట్, ఆ టైమ్ లో నాకు ఇవేవీ తట్టలేదు. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే ఓరోజు నాకు నేనే వేసుకొన్నా. నాకు దొరికిన్ ఆన్సర్ ఏమిటంటే, జనరల్గా పేషంట్లు తమకు రోగం ఎక్కువైనప్పుడు అది తగ్గేందుకు అవసరమైన మెడిసిన్స్ వాడ్తారు. అంతేగానీ, ఆ మెడిసెన్లో ఉండే కెమికల్ కాంబినేషన్ను చదువుతూ కూర్చోరు. అలానే, నేను కూడా నా జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి అవసరమైన ఇన్స్పిరేషన్ను ఆమె నుండి తీసుకొన్నాను. దట్సాల్!” అంది రంజని.
నెమ్మదిగా మొదలైన చప్పట్లు ఒక్క అరనిముషంలో జోరందుకున్నాయి.
రంజని కుర్చీలో కూర్చోగానే స్టెల్లా, పావనిలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఆ ఇద్దరి మధ్యా….రంజని…అమ్మదనపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ…
* * * * *
“అమోఘం! నీ మొదటి కాయ భక్తితో కూడి బ్రహ్మలోకాన్ని చేరింది దేవీ!” అన్నాడు చేతనాచేతనవిలక్షణుడు.
“అవును స్వామీ! భ అంటే ప్రకాశం. వెలుగు ఉన్న చోట వస్తువులన్నీ చక్కగా పరిచయమౌతాయి. భజ అంటే పంచుకోవడం, పూజించడం, చేరడం అన్న అర్థాలున్నాయి. వెలుగులోకి వెళ్ళిన మానవులు తమకు ఉపయోగకరమైన వస్తువుల్ని ఎన్నుకుని సుఖపడతారు. ఈ వివరణ అటు లౌకిక సుఖానికి, ఇటు ఆధ్యాత్మిక సుఖానికీ కూడా అన్వయమౌతుంది. అంతేనా మౌనిహృదయావాసా?” అని అంది సకలలోకశరణ్యురాలైన అంబ.
“చక్కగా చెప్పావు దేవీ! తొమ్మిది ద్వారాలతో కూడిన దేహమనే పట్టణంలో తొమ్మిది విధాలైన భక్తిని ఐశ్వర్యరూపేణా నింపుకున్న జీవులలో జ్ఞానమనే వెలుగు ఎప్పుడూ అస్తమించదు. భక్తి లేని నాడు ఆ పట్టణం చీకటిలో మునిగిపోతుంది. లౌకిక సుఖాలకు ఆశ పడకుండా ఉండడమే నిజమైన భక్తుల లక్షణం. ఎక్కడ నిజమైన భక్తి ఉంటుందో అక్కడ జ్ఞానజ్యోతి వెలుగుతూవుంటుంది. ఆ జ్యోతిని ధరించిన భక్తులు చేరేది బ్రహ్మలోకాన్నే! భక్తి, జ్ఞానం, అనుష్ఠానం మరియు వినయం – ఇవే జీవికి ఉండాల్సిన నాలుగు ముఖాలు. ఎవరిలోనైతే ఈ నాలుగూ స్థిరంగా నిలబడివుంటాయో వారి హృదయమే బ్రహ్మలోకమౌతుంది. ఎలాగైతే బ్రహ్మదేవుడి సభయైన సత్యలోకంలో భగవంతుని గుణగానం నిరంతరాయంగా సాగుతుంటుందో, నిజభక్తుల హృదయాల్లో నా స్మరణ, పై నాలుగు మార్గాలలో జరుగుతూనేవుంటుంది. అదే మోక్షహేతువు.” అన్నాడు సత్యపరాయణుడు.
“దివ్యోపదేశాన్ని చేసారు స్వామీ! మాత్సర్యగ్రస్తమైన మీ రెండో ఆటకాయ డెబ్బైమూడో గది నుండి ముందుకు సాగి ఎనభై ఐదో గడిలో చేరింది. దీని తదుపరి నడక ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠత కలుగుతోంది. మరి….” అని నర్మగర్భంగా ఆగింది సానందసాంద్రగుణమయియైన లక్ష్మి.
చిరునవ్వు నవ్వుతూ నారాయణుడు పాచికలను కదిపితే అవి కూర్మరూపధారి వీపుపైని మందరపర్వతం ’గర్ గర్’ మని కదులుతున్న సవ్వడిని నినదించాయి.
* * * * *
“సుమతీ!” అని గట్టిగా పిలుస్తూ లోనికొచ్చాడు శర్మ.
భర్త గొంతులోని ఆందోళనని గ్రహించిన సుమతి పరుగుపెడ్తున్నట్టు మధ్యగదిలోకి వచ్చింది.
అక్కడేవున్న కుర్చీలోకి కూలబడ్డాడు శర్మ. అతని ముఖంపై చెమట ధారగా కారుతోంది. కంట్లో నీళ్ళు కనబడీ కనబడక కదులుతున్నాయి.
ఈ దృశ్యాన్ని చూసి హతాశురాలైపోయింది సుమతి. “ఏమైందండీ?” అంది ఆదుర్దాగా.
“వాడు…వాడు…” అని చెప్పడానికి రొప్పుతున్నాడు శర్మ.
“ఎవరు? సుబ్రహ్మణ్యమేనా? వాడేనా?” అని అడిగింది సుమతి.
ఔనన్నట్టుగా తలూపాడు శర్మ.
“వాడికేమైందండీ?” అంటూ శర్మ చేతుల్ని గట్టిగా పట్టుకుని అడిగింది సుమతి.
“వాడు ఆత్మహత్య చేసుకున్నాడు.” అన్నాడు శర్మ.
అతని చేతుల్ని వదిలిపెట్టేసింది సుమతి. “నిజంగా? చెప్పండీ? ఇది నిజమా!” అని అడిగింది.
మాటల్లో చెప్పలేనట్టు, ’ఔను’ అన్నట్టుగా తలూపాడు శర్మ.
సుమతి రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకుని నేలమీద కూలబడింది.
“నిన్న రాత్రి జరిగిందీ ఘోరం. ఈ ఉత్తరాన్ని మనకు వ్రాసిపెట్టాడని పోలీసు ఇన్స్ పెక్టర్ ఇచ్చారు.” అంటూ ఓ కాగితాన్ని ఆమె ముందుకు చాచాడు.
“నేను చదవను. నాకేమీ వద్దు!” అంది సుమతి, తన ముఖాన్ని చేతుల్లో దాచిపెట్టుకుంటూనే.
“ఇది నీకే వ్రాసాడు సుమతీ! నువ్వు తప్పక చదవాలని కూడా వ్రాసాడు.”
“వాడు చెయ్యకూడని పని చేసేసాక ఇది చదివీ ఏం లాభం చెప్పండి. నేను చదవలేను. ఈ కాగితాన్ని పొయ్యిలో పడేయండీ!” అంది సుమతి.
ఆమెలోని దుఃఖం వికృతమైన రోదనగా మారబోతోందని భావించాడు శర్మ.
శర్మ కుర్చీ నుండి లేచి పక్కనే కూర్చుని ముఖాన్ని కప్పిన ఆమె చేతుల్ని తీసాడు.
“నిజమే! వాడు చెయ్యకూడని పనే చేసాడు. దానికి కారణం – నీ భర్త. ఈ ఉత్తరాన్ని నువ్వు చదివితేనే నాకు ప్రాయశ్చిత్తం జరిగేది. నీ భర్త పాపభారంతో జీవితాంతం ఉండిపోవల్సిందేనా?” అన్నాడు శర్మ.
చప్పున అతని ముఖంలోకి చూసింది సుమతి. “వాడి చావుకు మీరు కారణమా? నేను నమ్మలేను!” అంది.
“ఈ ఉత్తరాన్ని చదువు.” అన్నాడు శర్మ ముక్తసరిగా. అందుకుంది సుమతి.
ఆమె కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెట్టాయి.
“సుమతి అమ్మకు…
నాకు ఆట్టే సమయం లేదు. మీ అందరికీ నేను చేస్తున్నది తప్పుడు పనిలా అనిపించవచ్చు. కానీ నావాళ్ళు నన్ను హింసిస్తున్నదానికంటే నేను చేస్తున్నది నీచమైనది కాదని నా నమ్మకం. ఆ ఏడ్పుగొట్టు వివరాలన్నీ ఇప్పుడు రాయలేను.
ఈ ఉత్తరంలో నేను మీతో చెప్పదల్చుకొన్నది నా సంతోషం గురించి. అందువల్ల ఈ ఉత్తరాన్ని మీరు తప్పక చదవాలి.
పంతులుగారు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చిన రోజున నాలో ఉన్న భయం అంతాయింతా కాదు. ఆ భయం పంతులు గారి గురించి కాదు, మీ గురించి. ఆయనేమో మంచితనంతో తీసుకువచ్చారు కానీ మీలో అంత మంచితనం ఉంటుందా అని నా అనుమానం. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆ అనుమానం తీరలేదు. కానీ ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ నా అనుమానం తీరిపోయింది. పంతులుగారు నన్ను కొట్టి తిడుతుంటే మీరు నా తరఫున నిలబడి మాట్లాడినప్పుడు నాలో కలిగిన సంతోషం ఎంతో చెప్పలేను. అమ్మ అంటే మీరేనని అనుకొన్నానని మాత్రం చెప్పగలను. నిజానికి నాకు మీ ఇంట్లో ఉండి చదువుకోవాలని అనిపించింది. ఆ విషయాన్ని చెప్పబోతుండగా పంతులుగారు అడ్డుపడి మా మేనమామ ఇంట్లో దించుతాను పదమన్నారు. ఆయన చెప్పిన ఏ పనినీ సరిగ్గా చెయ్యని నేను కనీసం ఇదైన చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. అప్పుడే నాకు తెలిసిపోయింది – నేను ఇలా వెళ్ళడం తప్పించి ఇంకో మార్గం లేదని.”
తలెత్తి శర్మ ముఖంలోకి చూసింది సుమతి. ఆమె ఎందుకు చూస్తోందో అర్థమైనట్టుగా తల పంకించాడు శర్మ.
ఆమె మళ్ళీ చదవసాగింది.
“మీ దగ్గరకొచ్చి ధైర్యాన్ని పొందాలని చాలాసార్లు అనిపించింది. కానీ పంతులుగారికి కోపమొస్తుందేమోనని, నా వల్ల మీ ఇద్దరి మధ్యా గొడవలొస్తాయేమోనని భయపడి ఆగిపోయాను. ఈ నాలుగు నెలల్లో మిమ్మల్ని రోజూ తల్చుకునేవాణ్ణి. కానీ ఇలా బతకడం నా చేత కావడంలేదు. నన్ను కన్న రాక్షసి, దాని అన్నా నన్ను నాన్న దగ్గరకు వెళ్ళేట్టుగా చేసేసారు. నేనెలాగూ చచ్చిపోతాను కాబట్టి మీ బిడ్డగా పుట్టించమని చెరువుకట్ట మీదున్న విశ్వనాథునికి ముడుపు కట్టి వచ్చాను. ఆ భక్తవశంకరుడు నా కోర్కె తప్పక తీరుస్తాడు. ఎందుకంటే మీరనుకొనేట్టుగా నేను ఆత్మహత్య చేసుకోవడంలేదు. ఆ రాక్షసి ఇచ్చిన దేహాన్ని వదిలేసుకొని, మీరు ఇవ్వబోయే కొత్త రూపం కోసం ముస్తాబవుతున్నాను. నాలాంటి వాడు కొడుకుగా పుట్టడం పంతులు గారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ మీలాంటి తల్లి తోడుంటే నాలాంటి వెధవ కూడా విద్వాంసుడవగలడు. మతిత్వాత్ మాత అని పంతులుగారే వోసారి చెప్పారు. పరాయివాడైన సుబ్రహ్మణాన్ని మనసారా ఆదరించిన మీరు, ఈ మందమతి సౌమతిగా పుట్టినప్పుడు కనికరించకపోతారా! తప్పక కనికరిస్తారని నా నమ్మకం చెబుతోంది. విశ్వనాథుడి పాదాల దగ్గర పెట్టిన ముడుపు కూడా అదే నమ్మకాన్ని పుట్టిస్తోంది. కాబట్టి అయ్యగారు వరమివ్వకపోయినా అమ్మగారు అస్తు అంటారని భావిస్తూ ముగిస్తున్నాను.
ఇట్లు
మీ
దేవదేవ రమ్ము – కావుమయ్య మమ్ము”
ఒక్కసారిగా శర్మ మీదకు వాలిపోయింది సుమతి. శర్మకు ఏం చెప్పాలో తోచని పరిస్థితి ఏర్పడింది.
మనసు వికలమైన చోట మాటలు పనిచెయ్యవు. మాటలు పూరించలేని అగాధాన్ని మౌనం దాటిస్తుంది.
కొద్దిసేపు గడిచాక “సుమతీ!” అని పిలిచాడు శర్మ.
ఆమె నుండి సమాధానం లేదు. ఐనా మాట్లాడసాగాడు శర్మ. “నాపైన నీకు గౌరవం పొయింది కదూ?” అన్నాడు.
లేదన్నట్టు ఆమె తలూపింది.
“లేదా? నిజంగా?” అన్నాడు శర్మ. “ఎందుకు? వాడి చావుకు నేనే కారణం కదా! నేను చేసింది తప్పు కాదా?”
సుమతి అతని బాహువుల్లో ఒదిగిపోతూ అంది – “మీరు వాడికి ఉత్తమ జన్మ మీద ఆశను కల్పించారనే అనుకుంటున్నాను.”
“ఆత్మహత్య చేసుకోవడం పాపమైతే, దానికి ప్రోత్సాహమివ్వడం కూడా పాపమే. నా వల్లనే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు.” అన్నాడు శర్మ. అతను పలికిన ప్రతి అక్షరంలోనూ గాయపడిన అతని మనసు నిండివుంది.
“నిజమైన వైరాగ్యం కలిగినవాళ్ళు, జీవించాల్సిన విధంగా జీవించలేకపోతే శరీరత్యాగం చేయవచ్చని, అది ఆత్మహత్య కాదని మీరే చెప్పారుగా?” అంది సుమతి.
ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు శర్మ. “అది యోగుల విషయంలో మాత్రమే చెల్లుతుంది.” అన్నాడు.
“నా వరకూ సుబ్రహ్మణ్యం ఒక యోగినే” అంది సుమతి.
మాటల్ని కొనసాగించలేనట్టుగా ఆగిపోయాడు శర్మ.
వాళ్ళిద్దరి మధ్యా మౌనం ఇంకొద్దిసేపు తచ్చాడింది.
“ఏమండీ! త్వరలోనే మనకు బిడ్డ పుడతాడు.” అంది సుమతి.
“అవును!” అన్నాడు శర్మ.
నిర్వికల్పసమాధి అంటే ఏమిటో కొద్ది కొద్దిగా అనుభవంలోకి వస్తోంది శర్మకు. సుమతి నుండి అతను అమితమైన దుఃఖాన్నీ, నిష్టూరమైన మాటల్ని ఊహించాడు. కానీ ఆమె ఇలా సాత్వికమైన మౌనాన్ని ఆశ్రయిస్తుందని ఉహించలేకపోయాడు.
“చక్కగా వండిన అన్నాన్ని, యవ్వనవతియైన భార్యని, విజేత ఐన శూరుణ్ణి, సంసార సాగరాన్ని దాటిన తపస్వినీ ధీరులు గ్రహిస్తారని” విదుర నీతి చెబుతోంది. తన భార్య పూర్ణయవ్వనంతో ఉండి కూడా ఆ యవ్వనానికి, దాని హంగులకీ బానిస కాకుండా నిశ్చలంగా ఉండగలుగుతోంది. దానికి కారణం, ఆమెలోని ధీశక్తి. మంచి విచక్షణతో కూడిన బుద్ధి చక్కటి పనులను చెయ్యడానికే ప్రేరేపిస్తుంది. ఈమె అనవసరంగా దుఃఖపడదు. ఇంకొకర్ని హింసించదు. కానీ ఇతరులలోని దుఃఖాలను చక్కగా అర్థం చేసుకుంటుంది. ఆ దుఃఖాన్ని నివారించేందుకు పూనుకుంటుంది. ఇదేకదా నిర్వికల్పమంటే!
శర్మకు దత్తాత్రేయ-సాత్య దేవతల సంవాదం గుర్తుకువచ్చింది.
“మనోనిగ్రహం, సత్యపరాయణత్వం, ధర్మనిరతి జీవితానికి అవశ్యమైనవి. హృదయాన్ని తెరచి ప్రియ-అప్రియాల్ని సమదృష్టితో చూడగలగాలి. ఇతరులు నిందించినా తిరిగి నిందించకూడదు. పరులను అవమానించరాదు. మనల్ని ఎవరైనా అకారణంగా దూషిస్తుంటే, వారు మన పుణ్యాన్ని వృద్ధి చేస్తున్నారని తలచాలి. ఏ రంగులో అద్దితే ఆ రంగును పొందే వస్త్రంలా మంచివాణ్ణి సేవించే చెడ్డవాడు కూడా క్రమేణా మంచివాడుగా మారుతాడు. మౌనం మాటలకంటే ఉత్తమమైనది. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మౌనం కంటే గొప్పది.”
పైవాటిల్ని తను ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పాడు కానీ తన భార్య ఆచరించి చూపింది.
ఇంతటి పరిపక్వమైన మనసు గలిగిన భార్యను తనే ఎన్నుకున్నాడా? లేక అనుకోకుండా పొందాడా? లేక ఆ భగవంతుడే దయ తలచి ఇచ్చాడా?
మనసులోనే మ్రొక్కాడు శర్మ – “భగవాన్! పుస్తక జ్ఞానమే గానీ నేను ఆచరణశీలుణ్ణి కాను. కానీ నా భార్య నిగర్వియైన నిర్మల చిత్తురాలు. ఆ నిష్కల్మషమైన మనసు కోరుతున్న ఆ ఒక్క కోర్కెను తీర్చు!”
మండపంలో దేవునికి అలంకరించిన పువ్వుల్లో ఒకటి క్రింద పడింది.
* * * * *
“ప్రభూ! మీ రెండో కాయ వైరాగ్యమూర్తియై ’వైకుంఠా’న్ని చేరింది. వైరాగ్యానికీ – వైకుంఠానికీ గల సంబంధమేమిటో వివరించండి!” అంది అంభ్రణీదేవి.
“దేవీ! ప్రాపంచిక భోగరాహిత్యమే వైరాగ్యం. అంటే మనసును కవ్వించే వస్తువులు ఎదురుగా ఉన్నా కూడా చలించకపొవడాన్నే ప్రాపంచిక భోగరాహిత్యమంటారు. కామ, క్రోధాలనే రాగాలను చక్కగా విడిచిపెట్టడమే వైరాగ్యం. అదే నిజమైన సన్యాసమంటే. కావిరంగు గుడ్డల్ని ధరించినంత మాత్రాన ఈ వైరాగ్యం పుట్టదు. తన భార్యను తప్ప ఇతర స్త్రీలను కాముక దృష్టితో చూడని సంసారి కూడా సన్యాసిలా ధృడమైన బ్రహ్మచర్యం కలిగినవాడే. ఒకరి సొత్తు నాది కాదనడం, దానమిచ్చిన వస్తువును తనదిగా చెప్పుకోకపోవడం, కర్కశ స్వభావం లేకపోవడం మొదలైనవన్నీ వైరాగ్యంలోని ఉపలక్షణాలు. వీటికి వ్యతిరేకమైన అవిజ్ఞ లక్షణాలను “కుంఠ” అని పిలుస్తారు. వైకుంఠమంటే ఈ కుంఠితాలన్నీ వికటమై పోవడమే. దోషముక్తులైన మానవులు పొందగోరేది ఈ లోకాన్నే. ఇక్కడికి వచ్చిన వారికి పునరావృత్తి లేదు.” అన్నాడు వైకుంఠజుడు.
“స్వామీ! ఇక్కడికి వచ్చే దాకా మానవులకు దోషరాహిత్యం తో కూడిన సుఖం లభించదా?” అని అడిగింది సుమనసపూజిత.
“ప్రియా! నాహమ్ వసామి వైకుంఠే – నేను ఒక్క వైకుంఠంలోనే లేను. భూలోకంలో నేను వెలసిన ఒక పర్వతం కూడా భూవైకుంఠమని పిలువబడుతోంది. పర్వతాన్ని అచలం అంటారు. అలా ఎవరైతే తమ మనసును అచలం చేస్తారో అక్కడా నేనే ఉంటాను. నేనున్న చోటు వైకుంఠమౌతుంది. అందువల్ల కాలమృత్యువు సంభవించే వరకూ చంచలమైన మనస్సును అదుపులో పెట్టిన ధృడమతికి ఇహలోక వైకుంఠం సులభసాధ్యం!” అన్నాడు ధృవవరదుడు.
“ప్రభూ! కాల మృత్యువు సంభవించేదాకా అన్నారు. అంటే అకాల మృత్యువనేది ఉందా?” అని సంశయాన్ని వ్యక్తం చేసింది కరవీరపురవాసిని.
“సజ్జనుల సౌకర్యార్థమే అడుగుతున్నావు గానీ, ప్రకృతి నియామకురాలవు నీకు తెలియని మృత్యువా దేవీ! పూర్వ జన్మల పాప ఫలితంగా యమధర్మరాజు విధించే అకాల మృత్యువును జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుసుకుని పరిహరించుకోవచ్చు. కానీ కాలంచే విధింపబడే నా సంహార రూపమైన మహామృత్యువును ఎవ్వరూ జయించలేరు.”
“మరి ఆత్మహత్య ఏవిధమైన మరణం స్వామీ?” అని పునః ప్రశ్నించింది జగన్మాయ.
“మానవుల శరీరం సాధనకై ఇవ్వబడింది. ఒక స్థాయి సాధన పూర్తి కాగానే ఉత్తమ గతుల్ని ఇచ్చే నిమిత్తం ఆ శరీరాన్ని మహామృత్యువు కబళిస్తుంది. ఇది సృష్టిబధ్ధమైనది. అలాంటి సాధనా శరీరాన్ని మహామృత్యువుతో గాక స్వయంఇచ్ఛతో ముగింపచూడడం సృష్టినియమానికి వ్యతిరేకమైనది. అందుకే ఆత్మహత్య మహాపాపమని విజ్ఞులు బోధించారు. ఆత్మహత్య చేసుకోబోయే వారి దేహం నుండి వారు చావడానికి మొదలే మానవ మనస్సులను నియంత్రించే లయకారకుడైన శివుడు జీవాత్మను దేహం నుండి వేరుచేస్తాడు. ఆవిధంగా వారికి కాలీనమైన మృత్యువు సంభవిస్తుంది. తెలిసి తెలిసీ సాధనా శరీరాన్ని క్షణిక కోపానికి బలిచేసిన వారికి ప్రేతదేహం నుండి విముక్తి లేదు. కానీ నా అనుగ్రహబల సంపన్నులైన వారి వల్ల కొన్ని సందర్భాల్లో అది తొలగుతుంది.” అన్నాడు నరకాంతకుడు.
“మీ కారుణ్యానికి ఎల్లలు లేవు.” అని మ్రొక్కింది వేదవేదాంతాభిమానిని.
“మరి నీ రెండో కాయ ఏమౌతుందో చూద్దాం!” అన్నాడు ముచికుంద వరదుడు.
జగదంబ పాచికలను విసిరింది. అవి ఋత్వికుల మంత్రోచ్ఛారణల్లా శబ్దించాయి.
* * * * *
(సశేషం…)