వైకుంఠపాళీ – పన్నెండవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: ఉద్యోగం పోగొట్టుకుని దిగాలుగా ఉన్న అనంత్ లో ఉత్సాహం నింపుతుంది రంజని. ఒక టెక్నికల్ బ్లాగ్ తెరవమని సలహా ఇస్తుంది. ఆమె చెప్పినట్టుగా చేస్తాడు అనంత్. బ్లాగ్ తెరచిన మొదటిరోజే మంచి స్పందన రావడంతో ఉత్సుకతకు లోనౌతాడు అనంత్. పార్కులో ఓ పసిపాపను చూసిన తన అబార్షన్ గుర్తుతెచ్చుకున్న దిగులుపడుతుంది రంజని. తన వింత చేష్టలు, మాటలతో ఆమెను నవ్విస్తాడు అనంత్. చీకటి అంటే ఏమిటని మాట్లాడుకుంటారు సుమతి, శర్మలు.

 

ముంబైలోని ఓ ప్రముఖ ఐదు నక్షత్రాల హోటెల్ గదిలో హడావిడి పడిపోతున్నాడు అనంత్. ఆ హడావిడిని కళ్ళప్పగించి చూస్తోంది రంజని.

ప్రతి సంవత్సరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి, బహుమతులిచ్చే సంస్థ ఒకటి “ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ వెంచ్యూర్స్”లో భాగంగా అనంత్ ను ఎంపిక చేసింది. రానుపోను ఖర్చులు, బస, అన్నీ ఆ సంస్థే చూసుకోవడంతో రంజని సహా వచ్చాడు అనంత్.

ఆనాటి సభలో ఐదు నిముషాల పాటు మాట్లాడే అవకాశం దక్కింది అనంతుకు. దాంతో ఒకదాని తర్వాత ఒకటిగా డ్రస్సుల్ని మార్చి చూసుకుంటున్నాడు. చివరగా టై కట్టడంతో అద్దంలోని ప్రతిబింబం తన కోర్కెకు తగ్గట్టుగా కనబడ్డంతో వెనక్కు తిరిగాడు.

కళ్ళప్పగించి చూస్తున్న రంజని చూసి ఈల వేస్తూ “ఎలా ఉన్నాను?” అన్నట్టు కనుబొమలెగరేసాడు.

బొటనవేలిని చూపుడువేలితో కలిపి ’సూపర్’ అన్నట్టుగా సైగ చేసింది రంజని.

అప్పుడు ఆమెను పరీక్షగా చూసాడు అనంత్.

గులాబీరంగు చీరకట్టుతో బాటు కొప్పు వేసుకుని దానికి నిండుగా మల్లెపూలు చుట్టుకుని తయారైన రంజనిని చూసి చిన్నగా కేకపెట్టాడు. “ఏయ్! అమ్మమ్మా! ఏమిటీ వేషం?” అన్నాడు.

“అమ్మమ్మనో, బామ్మనో…ఈరోజుకు నా డ్రెస్ ఇదే. పద లేటైపోయింది.” అంటూ లేచింది రంజని.

“నథింగ్ డూయింగ్…నువ్విలా రావడానికి వీల్లేదు.” అన్నాడు పక్కనేవున్న చైర్లో కూలబడుతూ.

రంజని ముందుకువచ్చి అనంత్ చెయ్యిని పట్టుకుని “ప్లీజ్…నాకు ఈ డ్రెస్సే కంఫర్టబుల్గా ఉంది. ఫోర్స్ చెయ్యొద్దు.” అంది.

ఓసారి రంజని ముఖంలోకి చూసి చేసేదేమిలేనట్టుగా లేచాడు అనంత్.

– – – – –

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

బాంక్వెట్ హాల్ రకరకాల పెర్ఫ్యూమ్ వాసనలతో ఘుమాయిస్తోంది.

ఎర్రటి లిప్ స్టిక్ ను పులిమేసిన పెదవుల్తో అదే పనిగా నవ్వుతున్న ఓ మణిపురీ అమ్మాయికి తన చేతిలోని ఇన్విటేషన్ కార్డ్ ను చూపాడు అనంత్. అంతేకాక, ’అవార్డీ’ అని వ్రాసున్న గుర్తింపు కార్డ్ ను తన కోటులో నుండి బైటకు వేళ్ళాడదీసుకున్నాడు. ఆ అమ్మాయి మరింత నవ్వుతూ, తల కొద్దిగా వంచి “దిస్ సైడ్ ప్లీజ్…” అని అవార్డు గ్రహీతలకు అని వ్రాసున్న డోర్ వైపుకు చెయ్యి చూపింది. హుందాగా లోనికి నడిచాడు అనంత్.

రంజని-అనంత్ తమకు కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఓ వెయిట్రస్ వచ్చి వాళ్ళకేం కావాలో వ్రాసుకుని వెళ్ళింది. కొన్ని నిముషాలు గడవగానే, ఫుల్ సూట్ వేసుకున్న ఓ బట్టతల పెద్దాయన, స్కర్ట్ లో ఫుల్ షర్ట్ ను టక్ చేసుకున్న ఓ యువతి అక్కడకు వచ్చారు.

“హల్లో అనంత్! ఐ యామ్ వినోద్ దూబే…” అని అనంత్ చేతిని బలంగా లాక్కున్నాడు.

“హల్లో సర్…” అంటూ చైర్లో నుంచి లేచాడు అనంత్. రంజనిని కూడా లేవమన్నట్టు కంటితో సైగ చేసాడు.

“మీట్ షైనా విలియమ్స్…విపి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్.” అంటూ ఆ స్కర్ట్ అమ్మాయిని పరిచయం చేసాడు దూబే.

“నైస్ మీటింగ్ యూ షైనా….బై ద వే షీ ఈజ్ మై వైఫ్ రంజని.” అని ఆమె వైపు చేయి చూపించాడు అనంత్. రంజని వైపుకు తిరిగి “ఐ టోల్డ్ యూ నా…మిస్టర్ దూబే…నాకు కన్సల్టెంట్ ఆఫర్ ఇచ్చిన మొదటి వ్యక్తి!” అన్నాడు.

దూబే అనంత్ చెయ్యిని వదిలి రంజని వైపుకు చాచాడు. మళ్ళీ అనంత్ సైగ చెయ్యడంతో తన చేయిని ముందుకు చాచించి రంజని.

ఆమె భయపడినట్టుగా కాక చేతిని మెల్లగా తన కుడిచెయ్యిలోకి పైన తన ఎడమ చెయ్యివేసి మృదువుగా పట్టుకుని “నైస్ టు మీట్ యూ….మై ఛైల్డ్!” అన్నాడు దూబే. ఊహించని ఆ సంబోధనకు ఆశ్చర్యపోయింది రంజని.

“యూ నో అనంత్…షీ జస్ట్ లుక్స్ లైక్ మై డాటర్!” అన్నాడు దూబే.

“ఓహ్…ఈజిట్…దట్స్ అ రేర్ కోయిన్సిడెన్స్!” అన్నాడు అనంత్, అవసరానికి మించి ఆశ్చర్యాన్ని నటిస్తూ.

“షైనా! యూ మస్ట్ ట్రై సారీస్….” అన్నాడు దూబే, షైనా వైపుకు చూసి కన్ను కొడుతూ.

ఆ అమ్మాయి ఇబ్బందిగా నవ్వింది.

నలుగురూ మళ్ళీ ఆ రౌండ్ టేబుల్ చుట్టూవున్న నాలుగు కుర్చీల్లోనూ కూర్చున్నారు.

కార్యక్రమం మొదలైంది.

తనకు ఆసక్తి కలిగించే విషయాలేవీ లేకపోవడంతో విసుగొచ్చిన రంజని మాటిమాటికీ అటుయిటూ తల తిప్పుతూ చుట్టూ చూస్తోంది. మళ్ళీ తన వైపే చూస్తూ దొరికిపోయాడా వ్యక్తి. ఇప్పటికి ఓ ఐదార్లు సార్లు జరిగింది. కోపాన్ని ప్రకటిస్తున్నట్టుగా కనుబొమల్ని ముడివేసి, కళ్ళు పెద్దవి చేసింది రంజని. ఆ పాతికేళ్ళ కుర్రవాడు టక్కున తలదించుకున్నాడు.

అదే సమయంలో రంజని వైపుకు చూసిన అనంత్ రంజని చేస్తున్న ముఖ విన్యాసాల్ని చూసి తన మోచేత్తో ఆమెను పొడిచాడు. ఉలిక్కిపడిన రంజని అనంత్ వైపుకు చూసింది. అనంత్ వంగి “ఏమిటా పిచ్చి చేష్టలు?” అన్నాడు చిరాగ్గా.

“వాడెవడో అదే పనిగా నా వైపు చూస్తున్నాడు!” అంది రంజని.

“ఎవరు?”

“అదో…మనకు ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న బ్లాక్ కోట్ వాడు.”

“అక్కడున్న అందరూ ఆల్మొస్ట్ బ్లాక్ కోట్సే వేసుకున్నారు!” అన్నాడు అనంత్.

“ఎనీ ప్రాబ్లం?” అంటూ వంగాడు దూబే.

“నో…నో…నథింగ్!” అని సర్దుకుని కూర్చున్నాడు అనంత్. “నీ వెర్రివేషాలు స్టాప్ చెయ్!” అని రంజనికి హుకుమ్ జారీచేసాడు.

“హు..” అని తల తిప్పుకుంది రంజని.

– – – – – –

భోజనాల సమయంలో అటూయిటూ చూస్తూనే వుంది రంజని.

ఆ నల్లకోటు కుర్రవాడు కనబడలేదు.

కాన్పరెన్స్ హాల్లోకి వచ్చాక ఆ టేబుల్ వైపుకు చూసింది. ఆ ఒక్క కుర్చీ తప్ప మిగిలిన మూడూ నిండిపోయివున్నాయి.

“ఏమయ్యాడబ్బా?” అని అనుకుంది రంజని.

ఇంతలో అనంత్ మాట్లాడాల్సిన సమయం వచ్చింది.

హుందాగా లేచి, చకచకా వేదిక మెట్లెక్కి, మొహం పై నవ్వు వెలిగిపోతుండగా మైక్ ముందు నిలబడ్డాడు అనంత్. ఫ్లడ్ లైట్స్ వెలుగులో అతను రంజనికి కొత్తగా కనబడసాగాడు.

“లేడీస్ అండ్ జంటిల్మెన్…” అంటూ మొదలెట్టిన అనంత్ ఐదు నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడాడు. కొన్ని ఉన్నవి, మరికొన్ని లేనివి, కొన్ని దాచిపెడుతూ కొనసాగింది అతని ఉపన్యాసం. ఏదియేమైనా, అనంత్ వాడిన ఇంగ్లీష్, నగిషీ చెక్కినట్లున్న అతని హావభావాలు, ఖంగుమనే అతని గొంతు శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. వీటికి తోడు టెక్నికల్ అంశాలపై అతనికున్న పట్టు కూడా తోడై, ప్రసంగం ముగియగానే జోరుగా చప్పట్లు వినబడ్డాయి.

కావాలనే వేగంగా నడుస్తూ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు అనంత్.

దూబే, షైనా ఇద్దరూ అతన్ని అమితంగా పొగిడారు. చుట్టుప్రక్కల కూర్చున్నవాళ్ళల్లో కొద్దిమంది లేచివచ్చి అతన్ని అభినందించారు.

ఇంతమంది మధ్యలో రంజని మర్చిపోబడినట్టుగా కూర్చునుంది.

– – – – – –

హోటల్ గదిలో సామాన్లు సర్దుకుంటున్నారు రంజని, అనంత్.

కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన తర్వాత కూడా అనంత్ అక్కడే ఉన్నట్టు మాట్లాడుతున్నాడు.  తన ప్రసంగం ముగియగానే వేదికపైనున్న గొప్పవాళ్ళు ఎలా పొగిడిందీ, అక్కడ్నుంచి టేబుల్ దాకా వస్తున్నప్పుడు ఆ మధ్యలో కూర్చున్నవాళ్ళు తనతో చేతులు కలపడానికి ఎలా పోటీపడింది, వినోద్ దూబే ఎంతగా మెచ్చుకున్నదీ, మరీ ముఖ్యంగా ఆ షైనా విలియమ్స్ తన కమ్యూనికేషన్స్ స్కిల్స్ చూసి ఎలా డంగైపోయిందీ…..సాగిపోతూనే ఉన్నాడు అనంత్.

అప్పుడప్పుడూ ఊ కొడుతూ, ఒక్కోసార్ ’ఆహా’, ’ఓహో’ అనడం తప్ప రంజనిలో ఇంకేరకమైన ప్రతిస్పందనా లేదు. అనంత్ అవేవీ పట్టించుకునే స్థితిలో లేడు.

ఎయిర్ పోర్టుకు వచ్చి, విమాన మెక్కాక కానీ అనంత్ నోరు మూతపడలేదు. విమానం గాల్లోకెగరగానే అతను నిద్రలోకి జారుకున్నాడు. రెండు గంటల ప్రయాణంలో రంజని మరోమారు ఒంటరిదైంది.

– – – – – –

ముంబై కాన్ఫరెన్స్ కు బయల్దేరే ముందు కంటే అక్కడి నుంచి వచ్చాక అనంత్ లో మరుగునపడిపోయిన పాత అహంకారం మళ్ళీ తలెత్తినట్టుగా అనిపించసాగింది రంజనికి.

అనంత్ ప్రసంగంలో మాటవరసకైనా తన పేరును ప్రస్తావించకపోవడం రంజనికి బాధగా అనిపించసాగింది.

“నిజానికి భర్త తన భార్యను పొగిడి తీరాలా? – అవసరం లేదు! – మరైతే ఎందుకలా డీలా పడిపోతున్నాను? – ఇది డీలా కాదు డైలెమా! – డైలెమానా? – అవును. ఉద్యోగం పోయాక ఏం చెయ్యాలో ఏమీ తోచని అనంత్ కు ఈ బ్లాగ్ ఐడియా ఇచ్చింది తనే. అందువల్ల తన భార్యపైన ఏ మాత్రం ప్రేమవున్నా తన పేరును చెప్పేవాడు, లేదూ ఇద్దరూ కలిసే ఈ ఐడియాను కనిపెట్టామని చెప్పేవాడు. కానీ అనంత్ ఐడియా అంతా తనదిగా చెప్పుకున్నాడు. అంటే తన భార్య మీద ప్రేమ లేనట్టేగా! అంతేకాదు కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు. ఇది చాలదూ అనంత్ మహాస్వార్థపరుడని చెప్పడానికి!”

తను చేస్తున్న ఆలోచన సరైనదో కాదో అర్థం కాని రంజని విసురుగా తల విదిలించింది. కానీ ఆలోచనలు వేటాడ్డం మానలేదు.

“కాసేపు బైటి తోటలో కూర్చునివస్తే బెటర్!” అనుకుంటూ సీట్లో నుంచి లేచి బైటకొచ్చింది రంజని.

ఆఫీస్ కు ఎదురుగావున్న మున్సిపల్ పార్క్ కు వెళ్ళాలంటే రోడ్డు దాటాలి. వాహనాల ప్రవాహం ఆగకుండా రెండువైపులా సాగుతూనే ఉంది.

వాహనాల రద్దీ కొద్దిగా తగ్గగానే రోడ్ దాటేందుకు గబాగబా అడుగులు వేయసాగింది రంజని. అంతలో వెనుక సడెన్ బ్రేక్ వేసిన చప్పుడు, టైర్లు నేలను రాచుకుంటూ ఆగిన చప్పుడు వినబడింది. వెనక్కు తిరిగింది రంజని.

నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, చేతిలో ఎరుపు, తెలుపు చారలున్న కర్రతో ఓ మధ్యవయస్కుడు నిలబడివున్నాడు. అతనికి అర ఇంచు దూరంలో కారు ఆగివుంది. ఆ మధ్యవయస్కుడు కర్రను అటూయిటూ ఊపుతున్నాడు. రంజని గబగబా వెనక్కువచ్చి అతని చెయ్యి పట్టుకుని “నాతో రండి!” అని రెండడుగులు ముందుకు నడిపించి, ఆగి, వెనక్కు తిరిగి ఆ కార్ నడుపుతున్న వ్యక్తికి బొటనవేలెత్తి ’థమ్స్ అప్’ అన్నట్టుగా చూపింది. దూకుడుగా వచ్చిన రంజని తనపై అరచి గోలచేస్తుందేమోనని భయపడ్డ ఆ డ్రైవర్ నమస్కారం చేస్తున్నట్టు రెండు చేతులూ జోడించి కారును ముందుకు నడిపాడు. ఆ వెనకాలే అదేపనిగా హారన్లు కొడుతున్న వాళ్ళు వీళ్ళిద్దరినీ తిట్టుకుంటూ ముందుకు ఉరికారు.

“ఒక్క సెకండులో ఎస్కేపయ్యారు!” అంది రంజని ఆ అంధుణ్ణి నడిపిస్తూ.

అతను ఏమీ మాట్లాడక నవ్వాడు.

రోడ్డు పూర్తిగా దాటాక “మీరెక్కడికెళ్ళాలి?” అంది రంజని.

చొక్కా జేబులో తడిమి తడిమి ఓ కాగితపు ముక్కను తీసాడతను.

రంజని ఆ ముక్కను తీసుకుని చూసింది.

“ఫ్లాట్ నెం. 1016, నెం. 73, డైమండ్ స్వేర్ అపార్ట్మెంట్స్, వివేకానంద నగర్” అని వ్రాసుంది.

“ఓహ్! ఈ అడ్రెసున్న ఏరియా ఇక్కడికి చాలా దూరమండీ!” అంది రంజని ఆ కాగితం ముక్కని అతని చేతిలో పెడుతూ.

“దూరమైనా తప్పక వెళ్ళాలండీ. దగ్గర్లో సిటీ బస్టాప్ ఉందా?” అన్నాడు ఆ ముక్కని జాగ్రత్తగా జేబులో పెట్టుకుంటూ.

“బస్టాప్ ఉంది. కానీ కనీసం రెండు మూడు బస్సులైనా మారాలి.” అంది రంజని.

“తప్పక వెళ్ళాలి.” అన్నాడతను.

అతని కర్రను పైకెత్తి నేరుగా పెట్టి “ఇక్కడ్నుంచి నేరుగా ఓ హండ్రెడ్ ఫీట్ వెళ్తే బస్టాప్ వస్తుంది. నెంబర్ 276E బస్సు ఎక్కాలి.” అంది రంజని.

“థాంక్సండి. ఫర్ హెల్పింగ్ మీ టు క్రాస్ ది రోడ్ అండ్ ఫర్ గైడింగ్ టూవర్డ్స్ బస్టాప్.” అని రెండు చేతుల్నీ కలిపి నమస్కారం చేసి నెమ్మదిగా ముందుకు నడిచాడా వ్యక్తి.

అతను ఓ నాలుగడుగులు నడిచే దాకా అక్కడే నిలబడి చూస్తున్న రంజనికి అతను వెళ్ళాల్సిన దూరాన్ని తల్చుకోగానే బాధేసింది. చూస్తుంటే ఊరికి కొత్తవాడిలా ఉన్నాడు, ఆపై కంటిచూపు లేదు. ఎందుకో రంజనిలో అమితమైన జాలి పుట్టుకొచ్చింది. పరుగులాంటి నడకతో అతని దగ్గరకెళ్ళింది.

“ఏమండీ! నేనే!” అంది అతని చెయ్యి పట్టుకుని.

“ఓహ్! మీరా! చెప్పండి. వేరే నెంబర్ బస్సు ఎక్కాలా?” అని అడిగాడు.

“కాదు..కాదు. మీరిక్కడే ఉండండి. నా కార్ తీసుకొస్తాను. మిమ్మల్ని డ్రాప్ చేసివస్తాను.” అంది.

“అయ్యొయ్యో! నా కోసం అంత దూరం వస్తారా? వద్దండీ. కళ్ళు కనబడని వాడికి చీకటి భయం లేదులేండి.” అని నవ్వాడు.

“పర్లేదు. మీరిక్కడే ఉండండి. కదలకండి. బస్సెక్కకండి.” అని చెప్పి అతను వద్దంటున్నా మళ్ళీ రోడ్డు దాటే ప్రయత్నంలో పడింది రంజని.

– – – – – –

విశ్వేశ్వర్ అన్న పేరుగల ఆ నడివయసు అంధుణ్ణి ఆ అడ్రెస్ వద్ద రంజని దింపేసరికి ఆరుగంటలైంది.

అతను అనేకమార్లు రంజనికి కృతజ్ఞతలు చెప్పి కాంప్లెక్స్ మైన్ గేట్ దాటి లోనికెళ్ళాడు.

ఓ పెద్ద నిట్టూర్పు విడిచి కార్ ను స్టార్ట్ చేసింది రంజని.

– – – – – –

రంజని ఫ్లాట్ కు వచ్చేసరికి WELCOME డోర్ మాట్ రివర్స్ లోనే ఉంది. “అంటే, అనంత్ ఇంట్లో లేడు. ఎక్కడికెళ్ళాడు? ఫోన్ చెయ్యలేదు కనీసం మెసేజ్ కూడా పంపలేదు!” అనుకుంటూ డోర్ తెరిచింది.

ఆరాత్రి దాదాపు పన్నెండున్నరకు ఇంటికొచ్చాడు అనంత్.

బాగా నిద్రలోనున్న రంజని నిద్రమత్తులో జోగుతూ వాకిలి తెరిచింది.

ఏమీ మాట్లాడకుండా లోనికొచ్చిన అనంత్ చకచకా బట్టలు మార్చుకుని పడుకునేసాడు.

ఏదో కారణం చెబుతాడని అనుకున్న రంజని మారుమాట్లాడకుండా పడుకునిపోయిన అనంత్ ను ఆశ్చర్యంగా చూసింది.

“ఎక్కడికెళ్ళావ్?” అని అడిగింది రంజని.

“అదా…అదీ…ముంబై నుంచి షైనా వచ్చింది. ఓ మార్కెటింగ్ మీటింగ్ వుంటేను నన్నూ జాయినవమని సాయంత్రం ఫోన్ చేసింది. వెళ్ళాను. క్లైంట్స్ డిన్నర్ కు వెళ్దామనడంతో కాదనలేక వెళ్ళాను.”

“అంతేగా! నాకు కనీసం మెసేజైనా ఇవ్వొచ్చుగా? పదకొండు దాకా చూసి అప్పుడు తిన్నాను.” అంది రంజని అతని పక్కనే పడుకుంటూ.

అటువైపే తిరిగి పడుకునివున్న అనంత్ “సారీ!” అన్నాడు.

ఇంకేం మాట్లాడాలో తోచని రంజని అతని భుజం మీద చేయి వేయబోయి వెనక్కి తీసేసుకుని పడుకుంది.

కంటికి కనబడని గోడ ఒకటి తమ మధ్య మళ్ళీ మొలుస్తున్నట్టుగా కలవపడసాగింది రంజని.

ఆ రాత్రి కలలో….మసక చీకటి నిండిన గదిలో ఓ నల్లటి ఆకారం ఒడిలో అనంత్ పడుకున్నట్టు, అతని చేతులు కాళ్ళని ఆ నల్లటి ఆకారం విరిచిపట్టుకున్నట్టు, ఆ గది బైట వెలుగులో తను “అనంత్..అనంత్” అని పిలుస్తున్నట్టు, ఆమె పిలుపు విని ఆ ఆకారం భయంకరంగా నవ్వింది. అనంత్ భయంతో కేకలు పెట్టసాగినట్టు కల గనింది రంజని.

– – – – – –

“క్షణం క్రితమే కర్కోటకుడి గురించి మాట్లాడుకున్నాము. ఈలోపు నీ రెండో ఆటకాయ వాడి నోటిలో చిక్కి వరాహమైపోయిందేమి దేవీ?” అన్నాడు సురమునిహృదయ పాలకుడు.

“కామాతురాణాం న భయం న లజ్జ స్వామీ!” అంది హరిప్రియ. “క్రితంలో మీరు వివరించినట్టుగా తన భార్యను విడిచి వేరొకరి స్త్రీ పట్ల ఆసక్తి చూపేవాడికి, ఆ వరాహానికీ తేడా లేదు!” అంది నిరత కన్య.

“మరి ఆ వరాహం వరహాల మూట అయ్యేదెలా?” అన్నాడు అగణితగుణగణమండితుడు.

“తన భార్య పట్ల మక్కువ చూపడంతోనే!”

“అది జరిగే పనేనా?”

“మీ అనుగ్రహం ఉంటేనే! మరి, సుఖభోగవిలాసంలో మునిగివున్న మీ రెండో పావు తదుపరి పయనం?” అంది శుభ్రశోభనగాత్రి.

“నీ ఉత్సుకతను ఆపడం భావ్యం కాదులే! ఏమౌతుందో నువ్వే చూడు.” అంటూ పాచికల్ని వేసాడు సర్వోత్తముడు.

ఆయన కరకమలాల నుండి విడివడిన పాచికలు కృష్ణ గాఢాలింగనా వర్జితులైన గొల్లభామల నిట్టూర్పుల్లా శబ్దించాయి.

* * * * *

(సశేషం…)

Your views are valuable to us!