వైకుంఠపాళీ – పదహైదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చిన విశ్వజ్ఞతో అతి చనువుగా మాట్లాడుతున్న అనంత్ ను చూసి నిర్ఘాంతపోతుంది రంజని. విశ్వజ్ఞ వెళ్ళిపోయాక అనంత్ తో గొడవపడుతుంది. శ్రుతిమించిన ఆ గొడవలో రంజని అనంత్ ను విసురుగా తోసేయడంతో కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఒంటరిగా కూర్చున్న రంజని ఆయుధాలు పట్టుకున్న కనకదుర్గ చిత్రాన్ని చూస్తూ అనేక ప్రశ్నలతో సతమతమౌతుంది. అనుకోకుండా ఫోన్ చేసిన విశ్వేశ్వర్ ఆమె అనుమానాల్ని తీరుస్తాడు. ఇటువైపు, బిడ్డలు కలగకుండా ఉండడానికి పూర్వజన్మల పాపాలే కారణమని నమ్మిన కేశవశర్మ నివృత్తి కోసం హోమం చేస్తాడు. ఓ మారుమూల పల్లెలో ఉన్న ఓ నిష్టాగరిష్టుడైన ఆద్వ్హరితో ఆ హోమాన్ని నిర్వహిస్తాడు. అక్కడ సుమతికి చిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి. తంబూరలు మీటుతూ నిలబడివుండే ఇద్దరు భక్తుల విగ్రహాల్ని చూసిన ఆమె మైమర్చిపోతుంది. తంబూర అంటే ఏమిటన్న సుమతికి ఆ పదం యొక్క ఆధ్యాత్మికార్థాలను వివరిస్తాడు శర్మ.

 

ఇప్పటికి వారం రోజుల పై మాటే అయింది అనంత్ ఇంటికెళ్ళి.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న స్నేహితుడికి చెందిన ఖాళీ అపార్ట్మెంట్ లో ఉంటూ అతని కంప్యూటర్ ద్వారా తన పనులు కొనసాగించుకోసాగాడు. రంజనిని అలా వదిలివచ్చేసినందుకు అతనిలో కించిత్తూ బాధ లేదు. పైగా తను లేకుండా ఒంటరిగా ఆమె ఉండడానికి పడే కష్టాల్ని ఊహించుకుని తృప్తి పడసాగాడు. ఆ తృప్తే అతన్ని రంజని పై సహానుభూతితో ఆలోచించే గుణాన్ని చంపేసింది.

మోగుతున్న మొబైల్ను తీసాడు అనంత్. గుర్తు తెలియని నెంబర్ కనిపిస్తోంది. “కొత్త నెంబరుతో రంజనీ ట్రై చేస్తోందా?” అన్న అనుమానం రావడంతో తీయబోయి ఆగాడు. చివరి క్షణంలో మనసు మార్చుకుని తీసుకున్నాడు.

ఆశ్చర్యం!

అవతల ఉన్నది విశ్వజ్ఞ.

“నా నెంబర్ ఎలా తెలిసింది నీకు?” అన్నాడు అనంత్, ఆ హటాత్పరిణామానికి తికమకపడుతూ.

“లాస్ట్ టైమ్ మీ ఇంటికొచ్చినపుడు మీ బిజినెస్ కార్డ్ మీరే ఇచ్చారు. గుర్తులేదా?” అంది విశ్వజ్ఞ.

అప్పుడు గుర్తుకొచ్చింది అనంత్ కు. “ఓ! యా! గుర్తుకొచ్చింది.” అన్నాడు, ఆశ్చర్యం తొలగిపోయిన గొంతుతో.

“మీరు, మేడమ్ కలిసివుండడం లేదనుకుంటా?” అంది విశ్వజ్ఞ.

అసలు విషయాన్ని ఆమె నుండి దాచిపెట్టాలన్న ఆలోచనరాని అనంత్ ఉన్న విషయాలకు మరికొన్ని చేర్చి చెప్పాడు. ముఖ్యంగా ఈ గొడవ విశ్వజ్ఞ తమ ఇంటికి రావడం వల్లే జరిగిందన్నదాన్నే పెద్దది చేసి చెప్పాడు.

అనంత్ చెప్పిందంతా విన్న తర్వాత “ఇప్పుడు మీరెక్కడుంటున్నారు?” అంది విశ్వజ్ఞ.

ఆ ప్రశ్నతో అతనిలో ఒకానొక విశృంఖలభావం తలెత్తింది. సంకోచించకుండా చిరునామా, రావల్సిన దారి మొదలైన వివరాలన్నీ చెప్పేసాడు.

“రేపు సాయంత్రం ఆరుగంటలకు మనం అక్కడే కలుద్దాం!” అంది విశ్వజ్ఞ.

థ్రిల్ ఫీలయ్యాడు అనంత్. “ష్యూర్!” అని పైకి అని లోలోపల “వోవ్!” అని అనుకున్నాడు.

మరుసటి సాయంత్రం ఆరుగంటలకై ఆ క్షణం నుండే గడియారం వైపు చూసుకొసాగాడు.

– – – – – –

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

కాలింగ్ బెల్ మోగడంతో హుషారుగా వాకిలి తీసాడు అనంత్.

ఎదురుగా కనబడ్డ వ్యక్తిని చూసి అవాక్కయ్యాడు. ఆ వెనకనే నిలబడివున్న మరో వ్యక్తిని చూసి కనుబొమలు ముడేసాడు.

“అన్నయ్యా! అనంత్ గారు…” అంది విశ్వజ్ఞ.

“నమస్కారమండి. నా పేరు విశ్వేశ్వర్. విశ్వజ్ఞ అన్నను.” అని ఎదురుగా వున్న వ్యక్తి అనడంతో తేరుకున్న అనంత్ “ప్లీజ్ కమ్…లోపలికి రండి!” అని వాకిలిని పూర్తిగా తీసాడు.

లోనికొచ్చి సోఫాలో వాళ్ళు కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో తోచని అనంత్ యథాలాపంగా “కాఫీ తీసుకుంటారా?” అని అడిగాడు. వద్దన్నాడు విశ్వేశ్వర్. వెంటనే “మీరు తాగాలేమో! కిచెన్ ఎక్కడుందో చెల్లికి చెప్పండి. తను చేసిస్తుంది.” అన్నాడు.

అనంత్ వంటగదిని చూపించగానే అటుకేసి వెళ్ళింది విశ్వజ్ఞ.

అనంత్ కు అంతా తికమకగానూ, గందరగోళంగానూ ఉంది. ఇక్కడకొచ్చి కలుస్తానని చెప్పిన విశ్వజ్ఞ ఇలా అన్నను పిలుచుకు రావడంలోని ఉద్దేశ్యమేమిటి? నిన్న మాట్లాడిన మాటల్లో తను తప్పుగా ఏం మాట్లాడలేదే! హద్దులు దాటలేదే! ఐనా ఇతణ్ణి పిల్చుకురావడమెందుకు? ఒకవేళ రంజని ఈ విశ్వేశ్వర్ కు ఏమన్నా కథలు చెప్పి రెచ్చగొట్టి పంపిందా?

ముందేం జరగబోతోందన్న దాని పట్ల లోలోపలే జంకుగా ఉంది అనంత్ కు.

“డాటాబేస్ ఆర్కిటెక్చర్లో మీరు చాలా ఎక్స్పర్ట్ అని విన్నాను.” అని అన్నాడు విశ్వేశ్వర్ ఉపోద్ఘాతంగా.

పిరికిగా నవ్వాడు అనంత్.

ఆలోపు కాఫీలు పట్టుకొచ్చింది విశ్వజ్ఞ.

తాగినంతసేపూ మౌనంగా ఉన్నారందరూ.

కప్పులు తీసుకుని విశ్వజ్ఞ లోనికెళ్లగానే మొదలెట్టాడు విశ్వేశ్వర్ – “సర్! మీరు, మేడమ్ మళ్ళీ కలవాలి. ప్లీజ్!” అన్నాడు.

“రాయబారానికి ఆమే పంపిందా లేక పెద్దరికం మీదేసుకుని మీరే వచ్చారా?” అన్నాడు అనంత్.

“మేడమ్ పంపలేదు. మీకు బుద్ధి చెప్పేంత పెద్దరికం నాకు లేదు సర్. కానీ నా చెల్లెలి జీవితానికి ఒక దారి చూపిన మేడమ్ గారి జీవితం ఇలా కాకూడదన్న బాధతో మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను.” అంటూ చేతులు జోడించాడు విశ్వేశ్వర్.

అతని వినయాన్ని, మెత్తని పలుకుల్ని చూస్తున్న అనంత్ కు కోపం రమ్మన్నా రావడంలేదు.

“చూడండి…..” పేరు గుర్తురాక ఆగాడు అనంత్.

“విశ్వేశ్వర్…” అన్నాడు విశ్వేశ్వర్.

“యా…విశ్వేశ్వర్…మీ చెల్లెలు నిన్న నాకు ఫోన్ చెయ్యడం. ఈరోజు మీరిలా నాకు లెక్చరివ్వడానికి రావడం, ఐ జస్ట్ కాంట్ మేక్ హెడ్ అండ్ టైల్ ఆఫ్ దిస్ రకుస్!” అన్నాడు అనంత్ కోపాన్ని బలవంతంగా తెచ్చిపెట్టుకుంటూ.

“సారీ సర్! మీకు ఇబ్బంది కలిగించడం నా ఉద్దేశ్యం కాదు. నా చెల్లెలి వల్ల మీరిద్దరూ దూరం దూరంగా ఉండడం చూడలేక ఇలా వచ్చాను. నా చెల్లలికి ఫ్రీగా మాట్లాడే స్వభావం ఉంది. అలా మాట్లాడ్డంలో ఎలాంటి చెడు ఉద్దేశ్యముండదు. కొద్దిమందికి ఇది నచ్చినా చాలామంది అపార్థం చేసుకుంటారు. మేడమ్ గారు కూడా అపార్థం చేసుకున్నారు.” అన్నాడు విశ్వేశ్వర్.

“ఐతే ఆమె దగ్గరికి పోకుండా నాకెందుకు సుత్తి కొట్టడం? నేను మీ చెల్లెల్ని గానీ, ఆమెనుగానీ అపార్థాలు చేసుకోలేదే!” అన్నాడు అనంత్.

“నిజమే సర్! మొదటగా మేడమ్ గారితోనే మాట్లాడాలి. నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. సారీ చెప్పాను. మేడమ్ గారు క్షమించారు. నా చెల్లెలు ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యకూడదని వార్నింగిచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొందామని వచ్చాను. ప్లీజ్ సర్! మీరు ఇంటికి వెళ్ళండి!” అన్నాడు విశ్వేశ్వర్, చేతులు జోడిస్తూ.

అతనికి ఏం జవాబివ్వాలో తోచలేదు అనంత్ కు.

“సర్లేండి. ఆలోచించుకోవడానికి నాకు టైమ్ కావాలి.” అన్నాడు పొడిగా.

“థాంక్స్ సర్. ప్లీజ్ కన్సిడర్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు జాయిన్ విత్ మేడమ్!” అన్నాడు విశ్వేశ్వర్, కుర్చీలో నుండి లేస్తూ.

“ఒక్క నిముషం కూర్చోండి!” అన్నాడు అనంత్.

కూర్చున్నాడు విశ్వేశ్వర్.

“మీకు, రంజనికి ఎలా పరిచయమైంది?” అన్నాడు అనంత్.

విశ్వేశ్వర్ అన్ని ఘటనల్నీ చెప్పాడు. ఆరోజు కారులో రంజనిని తనని తీసుకెళ్ళకుంటే విశ్వజ్ఞ జీవితం ఎలా అభాసు పాలయ్యేదో వివరించి వివరించి చెప్పాడు. అలానే తన చెల్లికి ఉద్యోగాన్ని ఇప్పించి రంజని తమ ఇంటిని ఎలా నిలిపిందన్న విషయాన్ని మరీమరీ నొక్కి చెప్పాడు.

అనంత్ కు ఆశ్చర్యమేసింది. “ఒక్కరోజు కూడా నాతో ఈ విషయాలేవీ చెప్పలేదే!” అన్నాడు.

“మేడమ్ గారికి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదనుకుంటాను సర్.” అన్నాడు విశ్వేశ్వర్.

“ఉన్న విషయాల్ని మొగుడితో చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడమా? భలే చెప్తున్నారే మీరు?” అని ఎకెసెక్కంగా అన్నాడు అనంత్.

“మీరన్నది నిజం. భార్యకు భర్తే ఆప్తుడు. కానీ ఒక్కోసారి వాస్తవాలను ఆప్తులతో చెప్పుకున్నా కూడా అవి గొప్పలుగా భావించే అవకాశం ఉంది. అందుకని ఆవిడ మీతో చెప్పివుండరు.” అన్నాడు విశ్వేశ్వర్.

“దిసీజ్ అబ్సర్డ్ బట్ ఇంటరెస్టింగ్…భార్యకు భర్త ఆప్తుడు. కానీ అలాంటి వాడితో కూడా ఆమె చెప్పుకోలేని విషయాలుంటాయా?” అన్నాడు అనంత్.

“ఉంటాయి సర్. అవి ఆ భార్యాభర్తల సంబంధాన్ని బట్టి ఉంటాయి. ఎండిపోయిన చెరువును కూడా చెరువనే పిలుస్తారు. కానీ అది దప్పికను తీర్చదు కదా? అలాగే, వివాహబంధాన్ని పూర్తిగా గౌరవించలేని భర్త, భార్య సామర్థ్యాన్ని గుర్తించలేని భర్త, తన గురించే ఎక్కువగా చెప్పుకొనే భర్త – ఇలాంటివాళ్ళ దగ్గర భార్యలు తమ గురించి ఏం చెప్పుకున్నా అపార్థాలకు దారి తీస్తుంది.” అన్నాడు విశ్వేశ్వర్.

ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు అనంత్. ప్రతి మాటా తన గురించే అన్నట్టుగా అనిపించింది అతనికి.

“జీవితం కుండలాంటిది. కుండకు ఏవైపు రంధ్రం పడినా నీరు కారిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎవరి వైపునుండైనా దూరం పెరిగితే ఇద్దరి మధ్యా నమ్మకం జారిపోతుంది. నమ్మకం లేనప్పుడు వాస్తవాలు కూడా అబద్ధాల్లా అనిపిస్తాయి. మనకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది దొరకుతారు. కానీ మనకు మంచిని చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచిని కోరాలి. మంచినే చెయ్యాలి. అందుకే మన సంప్రదాయంలో ఈ బంధానికి అంతులేని ప్రాముఖ్యతనిచ్చారు. తనను, తన తల్లిదండ్రుల్ని అవమానిస్తూ తప్పు చేస్తున్న భార్యకు త్వరలోనే తప్పును దిద్దుకునే అవకాశం ఉందని తెలుసుకున్న భర్త ఆమెను మంచిదారిలో పెట్టడానికి గానూ తన తల్లిదండ్రులను కొద్దికాలం దూరంగా ఉంచవచ్చని, అది తప్పు కాదని పెద్దలు ఎప్పుడో చెప్పేసారు.” అన్నాడు విశ్వేశ్వర్.

“ఓహ్!” అని ఆశ్చర్యం మాత్రం ప్రకటించగలిగాడు అనంత్.

“సర్! ఇప్పటికే అతిగా మాట్లాడినట్లున్నాను. చివరగా ఒక్క మాట. ఉద్వేగంతో కూడిన జీవితం అంటే టెన్షన్ ఫిల్డ్ లైఫ్ లో మంచితనం తన చోటును కోల్పోతుంది. అన్ని సుఖాల్నీ ఒకేసారి సంపాదించలన్న అత్యాశ, నన్ను మించినవాళ్ళు లేరనే అహంకారం, పొరుగింటి పుల్లకూర రుచి అనే స్వభావం ఉద్వేగానికి కారణాలౌతాయి. వీటిల్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితేనే శాంతి దొరికేది. ప్రాణాలు పోయేటప్పుడు లేని ఔషధాలు ఆ తర్వాత సంచి నిండుగా ఉన్నా ఏం ఉపయోగం? అట్లానే అనవసరమైన పంతాలతో వయస్సుని వృధా చేసుకోకూడదు. ప్లీజ్ సర్! మేడమ్ గారితో మళ్ళీ చేరే విషయంలో తొందరగా ఓ డెసిషన్ తీసుకోండి.” అన్నాడు విశ్వేశ్వర్.

సరేనన్నట్టు తలూపాడు అనంత్.

“సార్ ఓకే అంటున్నారు!” అని అన్న చెవిలో చెప్పింది విశ్వజ్ఞ.

“చాలా సంతోషం సర్. ఉంటాము.” అని లేచి ముందుకు కదిలాడు విశ్వేశ్వర్.

వాళ్ళు వెళ్ళిపోయాక మొదటిసారిగా జీవితం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాడు అనంత్.

టక్కున లాప్ టాప్ తెరిచి, Pictures ఫోల్డర్లోని ఫోటోలను చూడసాగాడు. చూసినదాన్నే మళ్లీ చూసుకున్నాడు. రంజని ముఖంలోని నవ్వులో ఉన్న హాయి, ఆమె కళ్ళలో ఉన్న నిజాయితీ తనలో లేనట్టుగా అనిపించింది.

మొబైల్ తీసుకుని డయల్ చేసాడు.

రంజని ఫోన్ మోగుతోంది.

మోగి, మోగి, మోగి….ఆగిపోయింది.

సోఫాలో కూలబడ్డాడు అనంత్.

మామూలుగా ఐతే మొబైల్ తియ్యనందుకు రంజనిపై విరుచుకుపడేవాడే. కానీ ఈరోజు అతను మామూలు అనంత్ కాడు.

* * * * *

’సుగుణము’ అన్న పదహారవ గడిలోని నిచ్చెనను ఎక్కి ’సాలోక్యము’ అన్న ఇరవై ఎనిమిదవ గడిని చేరిన లక్ష్మీదేవి రెండవ ఆటకాయను చూసిన నారాయణుడు నవ్వాడు. అందుకు ప్రతిగా తనూ నవ్వింది త్రైలోక్యజనని.

“ఆట మొదటలో మీ రెండో ఆటకాయ కూడా ఇదే నిచ్చెననెక్కి మునుముందుకు దూసుకుపోయింది స్వామీ!” అంది విదేహరాజపుత్రి.

“అవునవును. నేను సృష్టి కథల్ని మళ్ళీ మళ్ళీ వ్రాసినట్టే, ఈ ఆటలోని పావులు అవే గడుల్ని మళ్ళీ మళ్ళీ ఎక్కి, దిగుతుంటాయి. అప్పుడేమో నా పావుల నడక గురించి చెబుతూ భార్యాభర్తలు ఒకే ఆలోచనాతరంగాలపై విహరించడాన్ని సాలోక్యమని వివరించావు. మరి ఇప్పుడు నీ ఆటకాయ నడక గురించి వివరించు ప్రియా!” అన్నాడు సత్యవ్రతోద్ధారకుడు.

చేతులు జోడించిన సత్యప్రియభామిని అంది – “ప్రభూ! జ్ఞానహీనులు దూషణలు చేస్తే, ఆ దూషణల్ని భూషణాలుగా గ్రహిస్తారు జ్ఞానులు. ఒకరిని అనవసరంగా దూషించడమనే దుర్గుణం పోయినప్పుడు మాత్రమే ఎదుటివారిలోని సుగుణాలు అర్థమవుతాయి. ఆ దుర్గణాలు పోవాలంటే సజ్జనుల స్నేహం కావాలి. చల్లటి, చక్కటి మాటలు పలికే స్నేహితుల వల్ల జ్ఞానహీనుల్లో జ్ఞానోదయం కలుగుతుంది. కర్కోటకుడి నోట నుండి జారి పందిగా మారిన నాటి నుండీ విశ్వేశ్వరులైన, విశ్వసౌఖ్యకాంక్షులైన, విశ్వజ్ఞులైన మీ హితోక్తుల్ని వింటున్న నా రెండో ఆటకాయ, నేడు సుగుణాన్ని సంపాదించి సాలోక్యాన్ని చేరింది. ఇక్కడ సాలోక్యమంటే ఎదుటివారిలోని మంచితనాన్ని తనలోకి ఆహ్వానించడమనే అర్థం. బ్రహ్మలోకం నుండి కదలి ముక్తసూర్యుణ్ణి చేరిన తన జోడీని చూసి, కొత్త నీతి పాఠాల్ని నేర్చుకున్నట్టుంది ఈ రెండో ఆటకాయ. అందుకనే సుగుణం ద్వారా సాలోక్యాన్ని అందుకుంది. ఇదంతా మీ కృపవల్లనే సాధ్యమైంది!”

అంగీకరిస్తున్నట్టుగా తలూపాడు లక్ష్మణాగ్రజుడు.

“మరి ’జన్మరాహిత్య’ సీమల్లో తచ్చాడుతున్న మీ రెండో ఆటకాయ చెప్పబోయే అతీత, అనాగతమైన తత్త్వోపదేశాన్ని మీ నోట వినడానికి నా మనసు ఉత్సుకమౌతోంది. అనుగ్రహించండి!” అంది సుగ్రీవసఖుని ప్రియసఖి.

అప్రమేయుడు పాచికలు వేస్తే కలినిగ్రహనార్థమై కల్కి అధిరోహించిన తురంగ ఖరపుట ఘట్టన స్ఫుట చటచట శబ్దాల్లా ఘోషించాయి.

* * * * *

 

 

Your views are valuable to us!