వైకుంఠపాళీ – ఐదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: తాను గర్భవతి అన్న విషయాన్ని అనంత్ కు చెప్పకపోవడంపై అతని క్షమాపణని కోరుతుంది రంజని. ఇద్దరూ సంతోషంగా ఉండడం ప్రారంభిస్తారు. అబార్షన్ అయిన పదిహేనురోజుల తర్వాత గుడికి వెళ్తుంది రంజని. అక్కడ అనుకోనివిధంగా సుమతితో పరిచయం ఏర్పడుతుంది. సుమతి, రంజనిలు పిల్లలులేనితనాన్ని గురించి మాట్లాడుకుంటారు. సుమతి తన భర్త చెప్పిన పురాణకథల్ని, సుభాషితాల్ని రంజనికి చెబుతుంది. ఆ మాటల్తో రంజనిలో ఏదో తెలియని మార్పు కలుగుతుంది. సుమతిలోని అమాయకత్వానికి, నిశ్చలమైన భక్తికి, భర్త పట్ల ఆమెకు గల అనురాగానికి ఆశ్చర్యచకితురాలౌతుంది రంజని. ఆమె పరిచయంతో రంజనిలో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అనంత్ కు కొత్త ఉద్యోగం దొరుకుతుంది.

 

“సుమతీ! మొన్న గుడిలో మాట్లాడావే, ఆ అమ్మాయి ఎవరు?” పూజ మధ్యలో అడిగాడు కేశవశర్మ.

“ఏమో పూర్తీ వివరాలు తెలీదండి. దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకుని మెట్లు దిగుతుంటే ఒక్కతే కూర్చుని కనబడింది. ఎందుకో చూడగానే మాట్లాడాలనిపించింది. వెళ్ళాను. పేరు రంజని అని చెప్పింది.” అంది సుమతి.

పూజ మధ్యలో లౌకిక విషయాల్ని మాట్లాడని భర్త హటాత్తుగా అలా అడగడంతో కొద్దిగా ఆశ్చర్యపోయింది. ’ఎందుకలా అడిగారు?” అంది మళ్ళీ.

“ఆ అమ్మాయి నాకు నమస్కారం చేసాక నా సమస్యను అమ్మతో చెప్పుకున్నాను అందిగదా!” అన్నాడు శర్మ.

నిజానికి సుమతి ఆ విషయమే మర్చిపోయింది. “ఆ…అవును…” అంది గుర్తుచేసుకుంటూ.

“ఏమిటా సమస్య?” అన్నాడు శర్మ ఓ తుళసీదళంను కుడిచెయ్యి చూపుడు-ఉంగరపు వేలి మధ్య పట్టుకుని.

“నెల క్రితం ఆ అమ్మాయికి గర్భస్రావమయిందంట! అదే తొలి గర్భం కూడా! పాపం!” అంది సుమతి.

శర్మ కళ్ళు మూసుకుని “శ్రీహరి!” అన్నాడు.

సుమతి నైవేద్యాల్ని వెండిపళ్లెంలో సర్దుకుని వచ్చి, శర్మ నీటితో చేసిన మండలంపై ఉంచి అక్కడే కూర్చుంది.

శర్మ ఒక్కో తుళసీదళాన్నీ సాలగ్రామాల పై మంత్రోచ్ఛారణయుక్తంగా పెడుతున్నాడు.

భోజనమయ్యాక సుమతి శర్మ ఎదురుగా కూర్చుని “ఆ అమ్మాయి పేరు మీద దేవునికి తుళసీ దళాన్ని సమర్పించారు కదూ!” అంది.

అవునన్నట్టు చిన్నగా నవ్వాడు శర్మ.

“వాళ్ళెవరో మనకు పూర్తిగా తెలియదు కదా! అలాంటి వారి పేరు మీద కూడా భగవంతుణ్ణి వేడుకోవచ్చా?” అంది సుమతి.

“అవశ్యంగా ప్రార్థించవచ్చు. మా గురువుగారు పూజలో భాగంగా, సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిల్చున్న అపరిచిత సైనికులందరి తరఫునా ఓ తుళసీదళాన్ని సమర్పించేవారు. మొదట్లో నాకు చాలా విచిత్రమనిపించేది. ఒకరోజు ఇప్పుడు నీవు అడిగినట్లే, ఇంకా ఘాటుగానే అడిగాను…”

“ఏమని?” ఉత్సాహంగా అడిగింది సుమతి.

“గురువుగారూ! సైనికులందరూ తాగుబోతులు, అనాచారపరులు కదా! వారి కోసం మీరు తుళసీ సమర్పణ చేయడమేంటని.” – సుమతిలో ఉత్సుకత రేపే నిమిత్తం నాటకీయమైన మౌనం వహించాడు శర్మ.

“ఊ….తర్వాత?” అంది సుమతి.

“ఆయన నవ్వి ’ఒరే! పిచ్చోడా! ఆ సైనికులే లేకపోతే నువ్వూ, నేనూ ఇలా హాయిగా పూజలు చేసుకుంటూ, పురాణాలు చెప్పుకుంటూ బ్రతకగలిగేవాళ్ళమా? దేవుడు నిర్దయుడై, యుద్ధమే జరిగితే, వాళ్ళు కాక ఎవర్రా ప్రాణాల్ని బలి ఇచ్చేది? దేవుడి పేరు చెప్పి ఇప్పటికిప్పుడు నిన్ను నుయ్యిలోకి దూకమంటే దూకగలవా? అంత నమ్మకం, ధైర్యముందా? అదే వాళ్ళు – యుద్ధానికి వెళితే ప్రాణాలు నిలుస్తాయో, లేవో తెలియదు. ఐనా దేశం కోసం ఆ ప్రాణాల్ని పణంగా పెడతారు. అంతేకాదు, యుద్ధంలో వాళ్లు చనిపోతే నేరుగా స్వర్గానికి పోతారు. “వీరస్వర్గం” అన్నది వారి కోసం సృష్టించబడింది. నువ్వు, నేను ఛస్తే మొదట వెళ్ళేది నరకానికే. అక్కడ పాప, పుణ్య విచారణ జరిగాకే ఏదైనా పుణ్యం మిగిలివుంటే స్వర్గానికి వెళ్ళేది. కాబట్టి, దేశ పౌరులుగా మనం వారి క్షేమాన్ని కాంక్షించాలి. పురోహితులుగా వారి హితాన్ని తప్పకుండా కోరాలి. దీన్నే చాణుక్యుడి మాటల్లో చెప్పాలంటే ‘జనపదార్థం గ్రామం త్యజేత్ – గ్రామార్థం కుటుంబస్తజ్యతే’. దేశం కోసం గ్రామాన్ని వదులుకో. గ్రామం కోసం కుటుంబాన్ని వదులుకో అన్నాడు చాణక్యుడు. అంత త్యాగం మనకు చేతకాదు. అందువల్ల ఉపకారాన్నైనా స్మరించుకోవాలిరా’ అని అన్నా రాయన.”

శర్మ చెప్పింది విని రెండు చేతుల్నీ జోడించింది సుమతి – “నిజంగా చాలా గొప్ప ఆలోచన.” అంది.

“కనుక ఆ అమ్మాయి సమస్యను తీర్చమని దేవుణ్ణి కోరుకోవడంలో అర్థముందిగా?” అన్నాడు శర్మ.

“అయ్యో! ఖచ్చితంగా కోరుకోవచ్చు. మన సంప్రదాయంలో ఇంత లోతుందని నాకు తెలీదుకదండీ! అందుకే అలా అడిగాను.” అంది సుమతి.

“సంప్రదాయం మనలోని లోతుల్ని తెలుసుకోవడానికే ఉండేది. పైపై మెరుగులకు భ్రమ పడక మన మనస్సును సంపూర్ణంగా అదుపులో ఉంచుకుని మన దుఃఖాన్నే కాకుండా పరుల దుఃఖాన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పేందుకే శాస్త్రం పుట్టింది. దీన్నే ’పరదుఃఖ దుఃఖిత్వం’ అని పిలుస్తారు పెద్దలు. అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్న రాక్షస బాలలకు ప్రహ్లాదుడు చేసిన హితోపదేశమే ఉదాహరణ. విదురుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తూ ’భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం, అనవసరంగా వాదించుకోవడం, బంధువులను భేదభావంతో చూడడం మొదలైనవన్నీ దుష్టకార్యాలని చెప్పాడు.”

“ఓహో! పురాణాలంటే ఏవో కథలు, మహిమలూ ఉండేవేననుకున్నాను కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలి, పరాయవాళ్లకు ఎలా సహాయం చేయాలి అనే విషయాల్ని కూడా ఇంత వివరంగా చెబుతాయని నాకు తెలీదండీ!” అంది సుమతి ఆశ్చర్యంగా.

“పురాణాలు ఎప్పుడో జరిగిపోయిన ఘటనల్ని చెబుతున్నట్టుగానే అనిపిస్తాయి. కానీ అవి చెప్పిన విషయాలు నేటికీ నడుస్తూ ఉండడమే విశేషం. కాబట్టి ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పటి సంఘటనలతో అనుసంధానం చేసేదాన్నే పురాణమంటారు. అందుకనే మన కష్టాలకు పరిష్కారాలను సూచించడంలో అవి ప్రధానపాత్ర పోషిస్తాయి. పురాణాలు చెప్పే వాటిల్ని సరిగ్గా అర్థం చేసుకోగల బుద్ధి, మనసు ఉంటే చాలు, మన కష్టాల నుంచి సులభంగా గట్టెక్కవచ్చు.” అన్నాడు శర్మ.

“నిజమే!” అంది సుమతి. “ఇంకో విచిత్రం చెప్పనా – మన పెళ్ళిరోజున నేను మిమ్మల్ని అడిగానే – దేవుడెందుకు మంచివాళ్ళను శిక్షిస్తాడని! రంజని కూడా అదే మాట అన్నది!” నవ్వుతూ చెప్పింది సుమతి.

“నువ్వేమన్నావ్?” నవ్వుతూ అడిగాడు శర్మ.

“మీ మాటలే చెప్పాను. ఆ అమ్మాయి తెగ మెచ్చుకుంది. ఇంకా చాలా విషయాలను చెప్పమని అడిగింది కూడా. మీరు చెప్పిన కొన్ని సుభాషితాలు వగైరా చెప్పాను. మిమ్మల్ని గ్రేట్ పర్సన్ అని పొగిడింది.” అంది సుమతి.

“ఎవరు గ్రేట్! ఆ విషయాలను వ్రాసినవాళ్ళా? కాపీ కొట్టిన నాలాంటి వాళ్ళా?” అన్నాడు శర్మ.

“అబ్బా! ఒక్క పొగడ్తను కూడా ఒప్పుకోరు కదా మీరు.” అంది సుమతి కావాలని మూతిని వంకర్లు తిప్పి.

కొద్దిసేపు మౌనం తర్వాత “ఏమండీ! ఓ ప్రశ్న అడగనా?” అంది.

“ప్రశ్నానురూపమ్ ప్రతివచనమ్ – ప్రశ్నను అడిగే విధానంపై సమాధానం వస్తుంది. అడుగు!” అన్నాడు శర్మ.

“దేవుణ్ణి నమ్మిన మనకు ఒక్క నలుసు కూడా కలగలేదు. దేవుణ్ణి నమ్మిన రంజనికి కడుపు పండి నిలవలేదు. దేవుణ్ణి నమ్మని ఎందరికో పిల్లలు ఉన్నారు. ఈ విచిత్రమంతా ఎందుకు?” అంది సుమతి. ఆమెలో అంతర్లీనంగా జరుగుతున్న సంఘర్షణ ఒక్కొక్క అక్షరంలోనూ ప్రతిధ్వనించింది.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

దీర్ఘంగా నిట్టూర్చాడు శర్మ. భార్య కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు –

“సుమతీ! నీ ప్రశ్నలో కొద్దిగా లోపముంది. భగవంతుణ్ణి నమ్మిన వారికి కూడా పిల్లలున్నారు. నీకూ ఈ విషయం తెలుసు. ఐనా ఈ ప్రశ్నను తయారుచేసుకోవడంలో నీ మనసు ఎంత కష్టపడిందో నాకు అర్థమౌతోంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నీకంటే రెండింతల కష్టాన్ని పడాలి నేను.” అని ఆగాడు శర్మ.

సుమతి తన రెండు చేతుల్ని ఒకదానిలో ఒకటి వేసి, ధ్యానముద్రలా చేసి ఒడిలో పెట్టుకుని నిటారుగా కూర్చుంది. ’గురువు ఉపదేశించేప్పుడు అతని ముఖాన్ని నేరుగా చూస్తూ, సరైన ఆసనంలో కూర్చోవా’లన్న మనుస్మృతి నియమం తన భార్యకు తెలియకపోయినా, తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు తెలియకుండానే కొన్ని ధర్మాలను చేయిస్తుందనడానికి ఆమే ఓ ఉదాహరణ అని అనుకున్నాడు శర్మ.

గొంతు సవరించుకుని – “విను! ఒక మామిడి చెట్టు ఈరోజు ఫలించిందంటే అది ఆ ఒక్కరోజులో జరిగిన ఇంద్రజాలం కాదు. తోటమాలి విత్తనాన్ని తెచ్చి, నాటి, ఎరువులు వేసి, చీడపీడలు తగులకుండా రక్షణ చేస్తాడు. ఆ ప్రయత్నమంతా ఒక్కరోజు మొక్కుబడి కాదు. ఆ చెట్టు ఫలించడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం చేయాలి. అలా చేయగా, ఒక్క చెట్టు ఫలించడానికి తయారౌతుంది. చెట్టుకు పూలు పూయడం మొదలవ్వగానే మళ్ళీ ఎన్నెన్నో చీడపురుగులు, వ్యాధులు దాడిచేస్తాయి. తోటమాలి కష్టపడుతూ వాటన్నిటి నుంచీ చెట్టును రక్షించాలి. అప్పుడు, కాలానికి తగ్గట్టు మామిడి కాయలు కాచి, మగ్గి, తియ్యదనాన్ని నింపుకుని దిగుబడికి వస్తాయి. పైన చెప్పుకున్న ప్రయత్నాల్లో ఏ ఒక్కటీ లోపించినా చెట్టు ఫలించదు. కనుక ఆ చెట్లను పెంచి పోషించే తోటమాలి ప్రతి రోజూ కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇదే. రుచికరమైన మామిడిపండు తోటమాలి కష్టానికి ఫలమైతే, ఆ పండు రావడానికి పడ్డ కష్టాన్ని సుకృతం అని చెప్పాలి. సుకృతమంటే చక్కగా చేయబడిన పని అని అర్థం. వాటిల్నే మంచి పనులని కూడా అంటారు.

ఆవిధంగా పిల్లలు పుట్టడమన్నది కూడా ఒక సుకృతం. పునర్జన్మల్ని నమ్మే మన మతం ప్రకారం ఈ సుకృతం ఒక్క జన్మలో సిద్ధించేది కాదు. ఎలాగైతే తోటమాలి ఎన్నెన్ని రోజులు శ్రమపడతాడో, అలానే జీవులు ఎన్నో జన్మలను ఎత్తి ఎన్నో కర్మలు చేస్తారు. ప్రతి జన్మలో చేసిన పుణ్యపాపాలను బట్టి వచ్చే జన్మలో సుఖదుఃఖాలు కలుగుతాయి. ’పూర్వజన్మ సుకృతం’ అనే పదం ఈ విషయాన్నే చెబుతోంది. పుట్టే ప్రతిబిడ్డ వెనుకా ఆయా తల్లిదండ్రుల పూర్వ సుకృతాలు ఉంటాయి. మామిడిపండు ఫలించడానికి తోటమాలి ఎన్నెన్ని చర్యలు తీసుకోవాలో, అలానే తల్లిదండ్రులిద్దరూ వారివారి సుకృతాలనే విత్తనాలుగా నాటాలి. అవి దైవసంకల్పంతో పెరిగి పెద్దవై ఫలిస్తాయి. ఈ ప్రయత్నాల్లో ఎవరైనా లోపం చేస్తే ఫలసాయం దక్కదు…” ఆగాడు శర్మ.

సుమతి శ్రద్ధగా వింటోంది.

మళ్ళీ కొనసాగించాడు శర్మ – “దేవుణ్ణి నమ్మని వాళ్ళకు పిల్లలు కలిగారు కదా? అని అడిగావు. ఒక్క విషయం గుర్తుంచుకో. మంచి పనులు చేయడానికి, దేవుణ్ణి నమ్మడానికి పెద్ద సంబంధం లేదు. దేవుడి పేరు చెప్పి చెడ్డ పనులు చేసే వారి కన్నా దేవుణ్ణి నమ్మకపోయినా నలుగురికి ఉపకారం చేసేవారే ఉత్తములు. కర్మలనేవి బస్సు లాంటివి! నడిపే వాడిని బట్టి అవి మంచి రోడ్డుపైనా నడుస్తాయి, ముళ్ళదారుల్లోనూ నడుస్తాయి. మెత్తని రోడ్డు పై వెళ్ళినా, ముళ్ళపై నడిచినా బస్సుకు బాధ కలుగదు. కానీ బస్సు వెళ్ళే దారిని బట్టి మన ప్రయాణం సుఖంగా సాగుతుంది లేదా కుంటుపడుతుంది. అలాగే చేసే కర్మల్లో మంచి పనులు అందరికీ మంచిని చేస్తాయి. చెడ్డపనులనేవి చేసివాళ్ళతో బాటు మిగతావారిని కూడా నాశనం చేస్తాయి. కాబట్టి దేవుణ్ణి నమ్మకపోయినా, అందరికీ మంచి చేసేవాళ్ళు సుకృతాల్ని చేసినవాళ్ళై మంచి ఫలితాలను పొందుతారు. నాస్తికులకి మంచి పిల్లలు పుట్టడమంటే ఇదే. అలానే దేవుణ్ణి నమ్ముతున్నామని చెబుతూనే చెడ్డ పనులు చేసేవారు తామే నష్టపోతారు. అర్థమైందా?”

సుమతి మెల్లగా తల ఊపింది.

శర్మ మళ్ళీ కొనసాగించాడు – “మనం దేవుణ్ణి నమ్మాం కానీ పిల్లల్లేరు. రంజనికి కడుపు పండి కూడా నిలువలేదు. వీటికి మనమే బాధ్యులం. అద్దం ముందు నిలబడిన వ్యక్తి చర్యల్నే అద్దంలోని ప్రతిబింబం చూపుతుంది. అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్న సుఖదుఃఖాలన్నీ క్రితం జన్మలలో మనం చేసినవాటికి ప్రతిబింబాలే!”

“అంటే…మనకు పిల్లలు లేకపోవడానికి కారణం క్రితం జన్మల్లో పిల్లలుగలవాళ్ళని మనం హింసించడం కారణమైవుండొచ్చు. అలాగే రంజనికి గర్భస్రావం కావడానికీ పూర్వజన్మల్లో ఆ దంపతులిద్దరో లేక ఒక్కరో చేసిన చెడ్డపనే కారణమైవుంటుంది. నేను అర్థం చేసుకున్నది సరిగా ఉందా?” అంది సుమతి.

ఔనన్నట్టుగా తల నూపాడు శర్మ.

సుమతి కళ్ళు మూసుకుని గోడకు ఆనుకుంది. “క్రితంలో చేసుకున్న పాపాలను పోగొట్టుకోవడమెలా?” తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు పైకి అన్నది.

“పశ్చాత్తపంతో…ఆ తప్పులు మళ్ళీ చేయను అన్న ప్రాయశ్చిత్త సంకల్పంతో…” అన్నాడు శర్మ.

“నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఏమిటి?”

“చుట్టుపక్కలున్న ఐదేళ్ళ లోపు పిల్లలను పిలిచి, వాళ్ళు సంతోషపడేలా ఏదైనా తీపి, కారం పదార్థాలను పంచు.”

ఆ భార్యాభర్తల సంభాషణ, ధ్యానంలో ఉన్న ఇద్దరు మునులు మనస్సులతో మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది.

*****

“మీ రెండో ఆటకాయ అప్రతిహతంగా సాగిపోతోంది. డెబ్బైమూడు గడుల్ని అవలీలగా దాటి, డెబ్బైనాల్గో గడి ఐన ’గురుబోధ’ను చేరింది!” అంది వేదవ్యాస పదార్పిత హృదయ.

“అవును. ఈ కాయకు అంతఃశుద్ధి బాగున్నట్టుంది!” అన్నాడు సత్యవతీ సుతుడు.

“యోగంతో మనస్సును నిగ్రహించి జ్ఞానానందమనే స్వర్గాన్ని అధిరోహించి, భక్తిలో చిత్తశుద్ధిని మేళవించిన జీవికి స్వరూపోద్ధారకుడైన గురువు యొక్క బోధ అవశ్యం లభిస్తుందని తెలియజెప్పిన మీ రెండవ ఆటకాయ నిజంగా పుణ్యతమమైనదే. కానీ ముందు గడిలో కర్కోటకుడున్నాడు. వాడిని దాటే ధీశక్తి ఈ కాయకున్నదా స్వామీ?” ఆతృతగా అడిగింది అవనిజ.

“తప్పొప్పుల ఎరుక ఉన్నవాని మనసును కర్కోటకుడు ఆవహించలేడు. అంతేకాదు ఈ కాయ నిచ్చెన నెక్కి తొంభైనాలుగో గడికి చేరబోతోంది. కాబట్టి కర్కోటకుడి పొడైనా తగలదు. ఐనా పావుల నడక పాచికల అధీనం దేవీ! నీ మొదటి కాయను నడుపు. చూద్దాం” అన్నాడు ఖగరాజ గమనుడు.

“చిత్తం” అంది దుర్గ.

దైత్యసంహారక్రీడోద్యుక్త దుర్గా హస్తాలంకృత శూల త్రిదలన ఖేలనలా శబ్దం చేసాయి పాచికలు

*****

మీటింగ్ ముగియడంతో అందరూ లేచి వెళ్తున్నారు. రంజని కూడా లేచింది.

“రంజనీ! కూర్చో. నీతో పర్సనల్గా మాట్లాడాలి.” అన్నాడు అరవింద్. అతను రంజని పనిచేస్తున్న టీమ్ కు ప్రాజెక్ట్ మేనేజర్.

కూర్చుంది రంజని. “ఏం చెప్పబోతాడో?” అని ఆలోచించసాగింది. ఇప్పటిదాకా తన మాడ్యూల్లో ఎలాంటి లోపాలూ లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకువస్తోంది. తనతో బాటు ఉన్న మరో ఇద్దరు జూనియర్స్ కూడా చక్కగా పనిచేస్తున్నారు. అరవింద్ తనతో ఇంత ప్రైవేటుగా మాట్లాడవలసి వచ్చిన విషయమేంటి?

ల్యాప్ టాప్ ను, తనముందున్న కొన్ని పేపర్లను మార్చి మార్చి చూసుకుని, వాటన్నింటిని మూసేసి రంజని వైపు చూసి నవ్వాడు అరవింద్. రంజని కూడా చిన్నగా నవ్వింది.

“రంజని! రెండు నెల్ల క్రితం నువ్వెలా ఉన్నావో చూసాను. ఏదో దిగులు, భయం. నీ మొహంలో సంథింగ్ వెరీ గ్రేవ్ కనబడేది. ఆ తర్వాత నీకు కలిగిన లాస్ గురించి విని ఎంతో బాధపడ్డాను. అక్చువలీ, ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ యూ. ఏం చేసుకుంటావో అని భయం వేసింది. అలా ఉండింది నీ బిహేవియర్. బట్, సిక్ లీవునుంచి వచ్చిన నిన్ను చూసి, ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. నీ మొహంలో ఏదో సంతోషం. అసలేమీ జరగనట్టుగా ఉన్న నిన్ను చూస్తే, అన్ బిలీవబుల్. అంతేకాదు, నీ టీమ్ మెంబర్స్ కూడా నీ క్వాలిటీస్ ను చాలా పొగిడేస్తున్నారు. నీ మంచితనం, నీ నెమ్మది, వాళ్ళు తప్పులు చేసినా కోప్పడకపోవడం. చిన్న చిన్న మీటింగులు పెట్టి, బోర్డుపై సొల్యూషన్స్ రాసి చూపించి….యూ ఆర్ సాల్వింగ్ దెయిర్ ప్రాబ్లమ్స్ విత్ లాటాఫ్ ఈజ్.

ఇంత ఎందుకు చెబుతున్నానంటే….పావని…జూనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ యువర్ టీమ్…నువ్వు సిక్ లీవులో ఉన్నప్పుడు నా దగ్గరకొచ్చి వేరే టీమ్ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యమని అడిగింది. ఎందుకని అడిగాను. షీ వాజ్ ఫైండింగ్ సమ్ ఫాల్ట్స్ విత్ యూ. నువ్వు సరిగ్గా గైడ్ చెయ్యడం లేదని చెప్పింది. డౌట్స్ ను సరిగ్గా క్లారిఫై చెయ్యడం లేదనీ అంది. అసలు నువ్వు చాలా మూడీగా ఉంటున్నట్టు చెప్పింది. దానికి నేను నువ్వొచ్చాక చూద్దామని చెప్పాను. ఇప్పుడేమో తనే వచ్చి ఐ వాంటు కంటిన్యూ ఇన్ రంజనీస్ టీమ్ అని చెప్పింది. కారణం అడిగా. అప్పుడు పావని చెప్పిన మాటల్నే ఇంతకుముందు నేను చెప్పింది.” – ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు అరవింద్.

ఆశ్చర్యంగా చూసింది రంజని. “డిడ్ ఐ ఛేంజ్ సో మచ్! పక్కవాళ్ళు ఇంత ఫీలయ్యేలా మారిపోయానా?” – తనను తానే ప్రశ్నించుకుంది.

“యూ నో రంజనీ! పావని నీ గురించి చెబుతూ ’షీ ట్రీట్స్ అజ్ లైక్ హర్ ఛిల్డ్రన్. అచ్చు అమ్మలా చూసుకుంటుంది.’ అంది. నాకు భలే నవ్వు వచ్చింది.” అన్నాడు అరవింద్. అలా నవ్వుతుంటే భూతద్దల్లాంటి కళ్ళద్దాల వెనుక అతని కళ్ళు మెరుస్తూవున్నాయి. అలాంటి మెరుపు అరవింద్ లో కనబడ్డం అరుదు.

“నేను….అమ్మనా!” అంది రంజని.

“ఏం కోపమొచ్చిందా?” అన్నాడు అరవింద్.

“కోపమా! ఆంటీ కంటే అమ్మనే బెస్ట్!” అంది రంజని గట్టిగా నవ్వుతూ.

పళ్ళన్నీ కనబడేలా నవ్వుతూ “దట్సాల్! ఇది చెబుదామనే ఆపాను. రంజనీ! కీపప్ దిస్ లవ్లీ, స్మైలింగ్ ఫేస్ ఆల్ ద టైమ్. జరిగిన నష్టాన్ని మర్చిపో. దేర్ ఆర్ గుడ్ టైమ్స్ అహెడ్. టు కోట్ మై ఫేవరేట్ లైన్స్ – మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్! మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్!” అని లేచాడు అరవింద్.

రంజని కూడా లేచింది.

“వచ్చే నెల మనకు డెడ్ లైన్. యూ నో ఇట్. చక్కటి ప్రాజెక్ట్ డెలివరీ చేద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ అజ్!” అంటూ చేయి చాచాడు. రంజనీ షేక్ హ్యాండ్ చేసింది.

“ఇంత ఏసీలోనూ నీ చెయ్యి ఇంత వార్మ్ గా ఉందే! ఆర్ యూ ఫైన్?” అన్నాడు అరవింద్.

“ఓహ్! ఈజిట్! ఐ యామ్ క్వైట్ హెల్దీ సర్!” అంది రంజని.

ల్యాప్ టాప్ ను ఎత్తుకుని నడిచాడు అరవింద్.

రంజని అతని వెనకే నడిచింది.

తన వర్క్ స్టేషన్ కొచ్చి కూర్చున్న రంజనికి అంతా మాయలా అనిపిస్తోంది. పావని తనను అమ్మతో పోల్చడమేంటి? కొన్ని నిముషాల క్రితం అరవింద్ తన చేతులు వెచ్చగా ఉన్నాయని చెప్పడమేంటి? ఏమిటిదంతా?

సుమతిని కలిసివచ్చాక మరో పన్నెండు రోజులు తను లీవులో ఉండింది. అఫ్ కోర్స్! లాస్ ఆఫ్ పే లోనే లీవిచ్చారు. అరవింద్ గట్టిగా రెకమెండ్ చేయడంతో పదిహైదురోజుల జీతాన్ని సాంక్షన్ చేసారు. ఆ విషయంలోనే కాక అనేక విషయాల్లో అరవింద్ చాలా సపోర్ట్ చేసాడు. అంతేకాదు, అతను ఒక పక్కా జంటిల్మన్. తన టీమ్ లో ఉన్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చాలా అభిమానంతో చూసుకుంటాడు. చక్కగా పనిచేసినవాళ్ళకు గుర్తింపునివ్వడంలోనూ ఎప్పుడూ ముందుంటాడు. తప్పులు చేస్తున్నవాళ్ళని దిద్దడం కోసం కష్టపడతాడు. హద్దుదాటి మాట్లాడడు, ప్రవర్తించడు. తమకు తాముగా చెప్పుకుంటే తప్ప ఎవరినీ వాళ్ల పర్సనల్ విషయాలపై గుచ్చిగుచ్చి అడగడు. ఎవరినీ అనవసరంగా తిట్టడు, పొగడడు కూడా. అలాంటిది ఈరోజు పావని మాటల్ని తనతో ప్రైవేటుగా చెప్పాడంటే, ఆ అమ్మాయి మాటలు అతనికి అంత నచ్చివుండాలి. ఇదంతా ఒక ఎత్తు. కానీ “అమ్మ, వెచ్చదనం” ఒక ఎత్తు.

సుమతి చేతుల్ని పట్టుకున్నప్పుడు కలిగిన అనుభూతి గుర్తుకువచ్చింది. ఎందుకో సుమతి రూపాన్ని గుర్తుచేసుకోగానే రంజని ఒళ్ళు చిన్నగా జలదరించింది. తన చేతుల్ని చూసుకుంటూ ఆ రెండింటిని చెంపలకు ఆన్చుకుంది. చల్లగా తగిలాయి. “ఇదేమిటి? తన చేతులు వెచ్చగా ఉన్నాయని ఐదు నిముషాల క్రితమేగా అరవింద్ అంది. ఇంతలో ఇంత చల్లబడ్డాయా?”

ఏదో పేపర్ను చదువుకుంటూ రంజని దగ్గరకు వచ్చిన పావని చెంపలకు చేతుల్ని ఆనించి కూర్చున్న రంజనిని చూసి – “సారీ! తర్వాత రానా?” అంది. “అబ్బే! చలిగా అనిపిస్తే అలా ఉంచుకున్నాను. అంతే. రా కూర్చో!” అంది రంజని.

కుర్చీని లాక్కుని కూర్చుంది పావని.

ఆ అమ్మాయి నుదుటిపై కదులుతున్న ముంగురుల్ని చూస్తున్న రంజనిలో ఏదో సంతోషం కలిగింది.

యమునా నదీ తరంగాలను తాకి పరవశిస్తున్న గడ్డిపోచలు, అనుకోకుండా తమను సోకిన చిన్ని కృష్ణుని పాదాల స్పర్శకు ఉన్మత్తాలై అటూ ఇటూ ఊగినట్టు…ఆ ముంగురులు.

“మైగాడ్! ఇలా అనుకొంటున్నది తనేనా?” – ఆశ్చర్యపోయింది రంజని.

గుడిలో సుమతి మాట్లాడుతూ “కృష్ణుడు యశోద వద్దకు తనంత తానుగా వచ్చాడు. తన బాలలీలలన్నీ చూపాడు” అన్న మాటలు రంజని మనసులోకి బాగా నాటుకున్నాయి. ఇంటికి వచ్చాక ఇంటర్నెట్లో కృష్ణలీలలన్నింటినీ వెదికి తనకు వచ్చిన అన్ని భాషల్లో వ్రాసిన కథల్ని, వ్యాసాల్నీ, నాటకాల్నీ చదివింది. సెలవురోజుల్లోనే కృష్ణశతకంలో తనకు నచ్చిన పద్యాలను బట్టీ పట్టేసి, రోజులో ఒక్కసారన్నా గుర్తుచేసుకునేది. అప్పటినుంచీ చిన్నికృష్ణుడంటే అదోరకమైన అబ్సెషన్. గూగుల్లో సెర్చ్ చేసి ముద్దుముద్దుగుండే చిన్నికృష్ణుని చిత్రాలను ఎన్నింటినో డౌన్లోడ్ చేసుకుంది.

ఇప్పుడు పావని ముంగురుల్ని చూసి అలా అనిపించిందంటే…..ఎందుకలా?

రంజని తన మాటల్ని వినడంలేదని గ్రహించి “మేడమ్!” అంటూ ’నేను ఇక్కడే ఉన్నాను సుమా” అని హెచ్చరిస్తున్నట్టు పిలిచింది పావని.

“సారీ పావని! ఎందుకో కాన్సంట్రేట్ చెయ్యలేకపోతున్నా. ఓ టెన్ మినిట్స్ పార్క్ లో కూర్చొని వద్దామా?” అంది రంజని.

“ఓ ష్యూర్!” అని హుషారుగా లేచింది పావని.

ఇద్దరూ ఆఫీస్ ఎదురుగా ఉండే తోటలోకి వచ్చారు. సాయంత్రం నాలుగున్నర అవుతుండడంతో, స్కూల్ నుండి ఇంటికెళ్తూ కొద్దిమంది పిల్లలు ఆ పార్క్ లో ఆడుకుంటున్నారు. వారికి దగ్గరగా, ఓ బెంచ్ మీద కూర్చున్నారు రంజని, పావని.

“సో! పావని! ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎలా వుంది? ఆర్యూ ఎంజాయింగ్ దిస్?” చాలా హుందాగా, అధికారికంగా అడిగింది రంజని.

“మేడమ్! నౌ ఐయామ్ ఎంజాయింగ్. టు బీ ఫ్రాంక్ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు మీరు బాగానే ఉండేవారు. తర్వాత చాలా మూడీగా ఉండేవారు. ఆ తర్వాత మీకు అబార్షన్ అయ్యిందని తెలిసి నేను, రీటా చాలా బాధపడ్డాం. సిక్ లీవ్ నుంచి వచ్చాక మీ బిహేవియర్ ఎలావుంటుందోనని భయపడ్డాం కూడా!”.

“ఓహ్! ఇప్పుడు రీటా ఏమనుకొంటోంది?” అంది రంజని.

“షీ ఈజ్ ఆల్సో హ్యాపీ. అసలు మీరు ఎంతో మూడీగా ఉంటారనుకొన్నాం. బట్ మీరు చాలా డిఫరెంట్ గా ఉంటున్నారు. అంటే మీ లాస్ ను మేము ఎంజాయ్ చేస్తున్నామని కాదు మేడమ్. అంత పెద్ద లాస్ ను ఎలా తట్టుకున్నారు!” అంది పావని.

రంజని నవ్వి, ఆడుకొంటున్న పిల్లలవైపు చూపించింది.

“ఆ పిల్లల్ని చూడు! జారుడుబండపై నుంచి పడ్తారు. కాలో చెయ్యో డోక్కుపోతుంది. కానీ ఆడుకోవడం మానరు. అదే ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచీమ కుడితే చాలు అరిచి అల్లరి చేస్తారు. అమ్మానాన్నకు వణుకు తెప్పిస్తారు. 2012 మూవీలోని సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ వాళ్ళ ఏడుపులో ఉంటాయి.”

పావని గలగలా నవ్వింది.

“నొప్పి ఒక్కటే ఐనా ఆ పిల్లలు ఎందుకలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు?” అని పావని వైపు చూసింది రంజని.

“మే బీ…ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. ఆటలో ఓడిపోతామేమోనన్న భయం ఉంటుంది కాబట్టి….” అని అనుమానంగా అంది పావని.

“ఎగ్జాట్లీ! అంతేకాదు, ఆ క్షణంలో వాళ్ళ మనసు ఆడుకోవడంలో దొరికే ఆనందంతో నిండిపోయివుంటుంది. ఆక్షణంలో దెబ్బలు, రక్తం అనేవి చాలా చిన్న విషయాలు. ఫర్ దెమ్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ టోటలీ మీనింగ్ లెస్ థింగ్స్ వెన్ దే ఆర్ విత్ ద ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నప్పుడు మనకుండే ధైర్యం ఒంటరిగా ఉన్నప్పుడు ఉండదు. లీవ్ తర్వాత ఆఫీసుకు వచ్చాక ఆ పిల్లల మెంటల్ స్ట్రెంగ్త్ ను ఇమిటేట్ చేస్తున్నాను. దట్సాల్ పావని. ఐ లైక్ యూ బోత్ అండ్ అరవింద్. ఇంత మంచి ఫ్రెండ్స్ నా చుట్టూ ఉన్నప్పుడు నేనెందుకు ఏడ్వాలి? నాకు వచ్చిన కష్టం నావరకూ పెద్దదే, భయంకరమైనదే. దాని కోసమని నా కొలీగ్స్ ను ఇబ్బంది పెట్టడం సరికాదు కదా?” అంది రంజని.

“వెల్ సెడ్ మేడమ్.” అంది పావని మెచ్చుకోలుగా. “లీవులో ఉన్నప్పుడు మీరేదైనా పర్సనాలిటీ డెవెలప్మెంట్ బుక్స్ చదివారా?” అని నెమ్మదిగా అడిగింది.

రంజని పెద్దగా నవ్వి – “అన్నీ బుక్సులో దొరుకుతాయా?” అంది.

లేదన్నట్టుగా తలను అడ్డంగా వూపింది పావని.

“నీకు కృష్ణశతకం తెలుసా?” అడిగింది రంజని.

“కృష్ణ శతకం….నో మేడమ్!”

“బలమెవ్వడు కరి బ్రోవను – బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ – బలమెవ్వడు రవిసుతునకు – బలమెవ్వడు నాకు నీవె బలమౌ గృష్ణా! – అర్థమైందా?” అంది రంజని.

రంజని అంత పొడుగు పద్యాన్ని చెప్పడం విని నివ్వెరపోయిన పావని “కొంచెం కొంచెం అర్థమయింది మేడమ్!” అంది.

“కొంచెమే అర్థమైతే ఎట్లా? మన భాష మనకు పూర్తిగా అర్థం కావాలిగా. కృష్ణశతకాన్ని ఇప్పుడే నీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ మండే కనీసం పది పద్యాలైనా చూడకుండా చెప్పాలి. దిసీజ్ ఆల్సో వన్ అస్సైన్మెంట్ ఫర్ యూ! ఓకే!” అంది రంజని బెంచ్ పైనుంచి లేస్తూ.

“ఐ విల్ ట్రై మేడమ్. కానీ పది పద్యాలంటే కష్టమేనేమో?” అంది పావని.

“నథింగ్ డూయింగ్. పదంటే పదే!” అంది రంజని, పావని భుజంపై చెయ్యి వేసి.

“ఓకే!” అని నసిగినట్టుగా అంది పావని.

అంతలో వాళ్ళ వెనుక పిల్లల గోల ఎక్కువైంది. ఇద్దరూ వెనక్కు తిరిగారు.

నాలుగు కుక్కపిల్లలు ఒకదానిపై ఒకటి పడి కొరుక్కుంటూ దొర్లుతుంటే, పిల్లలు గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలేస్తున్నారు.

“వాళ్లకు ప్రతి ఒక్కటీ ఎంటర్టైన్మెంటే కదూ!” అంది రంజని.

“ఎస్” అంది పావని.

“సో! నీ ప్రోగ్రాంలోని బగ్ ను సాల్వ్ చేసి నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తా. నువ్వు పది పద్యాల్ని అప్పజెప్పి నన్ను ఎంటర్టైన్ చెయ్!” అంది రంజని.

“వోవ్! దిస్ ఈజ్ రియల్లీ ఎంటర్టైనింగ్” అంది పావని.

*****

“నీ మొదటి కాయ సూర్యుణ్ణి చేరింది. దీని అర్థమేమిటి ప్రియా?” అన్నాడు యోగిహృత్కమలవాసుడు.

“సర్వప్రేరకా! సూర్యుడున్న ఈ డెబ్బైఎనిమిదవ గడికి ముందు చిరుత, తర్వాత జ్ఞానము అనే గడులున్నాయి. క్రూరమైన ఆలోచనలతో సతమతమయ్యే మనసును నియంత్రిస్తే, ఆత్మ సూర్యునిలా మెరవడం మొదలుపెడుతుందని ఆ గడులు చెబుతున్నాయి. ఎలాగైతే మానవులకు సూర్యుని వెలుగువల్లనే వస్తువుల పరిచయం కలుగుతుందో ఆవిధంగానే ఆత్మ యొక్క వెలుగులో తప్పొప్పులు తెలిసివస్తాయి. తప్పుల్ని తెలుసుకోవడం, ఒప్పుల్ని ఆచరించడమే కదా జ్ఞానమంటే! ఇప్పుడు నా మొదటికాయలో జ్ఞానసూర్యుడు ఉదయించాడు స్వామీ!” అంది వికసితశతదళసమానానన.

“బాగు బాగు! ఐనా, చిరుతపులి పోలికలోని స్వారస్యమేమిటో కాస్త వివరించు!” అన్నాడు భానుకోటితేజుడు.

“మీరిలా అడుగుతున్నారంటే రహస్యమైన పరమోద్దేశ్యమేదో ఉన్నది. తప్పక వివరిస్తాను శ్రీమాన్! చిరుతలోగానీ, పెద్దపులి, సింహం వంటి జంతువుల్లోగానీ క్రౌర్యమే ప్రధానగుణం. కానీ అప్పుడే పుట్టిన వాటి కూనల్లో అంతటి క్రౌర్యం కనబడదు. పైగా అవి చాలా పిరికిగా, ఆశ్రయం కోసం, ఆహారం కోసం అలమటిస్తూ ఉంటాయి. పెరిగి పెద్దవై, అవయవాలు, ఇంద్రియాలూ బలం పుంజుకోగానే వాటిల్లో క్రౌర్యం అమాంతంగా పెరుగుతుంది. చిన్నప్పటి మార్దవం మాయమౌతుంది. కానీ ఈ క్రూరజంతువుల్లో ఒక్క సింహం మాత్రమే అనవసరమైన హింసను చెయ్యదు. ఆకలైనప్పుడు మాత్రమే అది వేటాడుతుంది. చిరుత, పెద్దపులి అలా కాదు. ఆకలితోనే కాదు, వినోదం కోసం కూడా అవి వేటాడుతాయి. కాబట్టి ఈ రెండూ చాలా క్రూరమైనవి. అలానే మనుష్యులు చిన్నతనంలో అమాయకత్వంతో, స్వచ్ఛతతో ఉంటారు. పెద్దవారౌతూ ఒక్కో దుర్గుణాన్నీ అలవాటు చేసుకుంటారు. లోకకంటకులై ప్రవర్తిస్తారు.” అంది కమలగంధి.

“అందుకే కాబోలు వైకుంఠపాళిలో సింహం పద్ధెనిమిదో గడిలో ఉంది. చిరుత డెబ్బైఏడో గడిలో ఉంటే పెద్దపులి ఎనభైతొమ్మిదో గడిలో ఉంది. సంఖ్య పెరిగే కొద్దీ క్రౌర్యం కూడా పెరుగుతుందన్నమాట! అద్భుతం!” అన్నాడు అచింత్యాద్బుతమహిమోపేతుడు.

“నన్ను పరీక్షించి, ఉద్ధరించడానికే గానీ ఈ ప్రమేయాలు మీకు తెలియనివా మహానుభావా!” అని చేతులు జోడించింది ఆ లలితచారుశీల.

చిరుమందహాసం చేసాడు మహావిష్ణువు.

“మీ మొదటికాయ స్వర్గలోకంలో ఉంది. దాని తదుపరి ప్రస్థానం ఎక్కడికో?” అంది హాటకగర్భుజనని.

“పాచికలే చెబుతాయి!” అంటూ వాటిల్ని విసిరాడు నరహరి.

కృష్ణుని చేతనున్న లేతపచ్చికను తినడానికై ముందుకు కదిలిన కోడెదూడ మెడలోని చిరుగంటల్లా ధ్వనించాయి పాచికలు.

*****

(సశేషం…)

 

Your views are valuable to us!