గత భాగం: భర్త చెప్పిన విధంగా చుట్టుపక్కల వున్న చిన్నపిల్లల్ని పిలిచి తినుబండారాలను పంచుతుంది సుమతి. తన భార్యలోని ప్రాయశ్చిత్తభావనకు, తన మాటల పట్ల ఆమెకు వున్న విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు శర్మ. కొత్త కంపెనీలో చేరిన అనంత్ తన అహంభావ పోకడల్తో కంపెనీ యజమానితో గొడవలు నిర్లక్ష్యం చేస్తాడు. అవకాశం కోసం వేచిచూస్తున్న ఆ యజమాని కొన్ని చిన్న కారణాల ఆధారంగా అనంత్ ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు. |
పదిహైదు, పదహారేళ్ళ అబ్బాయిని వెంటబెట్టుకు వస్తున్న భర్తను చూసి, వరండాలోకి వచ్చింది సుమతి.
“సుమతీ! ఈ అబ్బాయి తాతగారి దగ్గర మా నాన్నగారు వేదాధ్యయనం చేసారు.” లోనికి వస్తూనే సూటిగా విషయంలోకి వచ్చాడు శర్మ.
“ఓ! అవునా! ఏం పేరు బాబూ?” అని అడిగింది సుమతి, శర్మ చేతిలోని సంచీని తీసుకుంటూ.
“సుబ్రహ్మణ్యం” అన్నాడా అబ్బాయి.
“లోపలికి రా!” అంది సుమతి, గుమ్మం దగ్గరే నిలబడిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూసి.
“ఏరా అబ్బాయ్! ఆచార్య పదాన్ని వదిలేసావెందుకు?” అన్నాడు శర్మ, మందలిస్తున్నట్టుగా.
“ఓహో! సుబ్రహ్మణ్య ఆచార్యనా!” అంది సుమతి నవ్వుతూ.
అవునన్నట్టు తలూపాడా అబ్బాయి.
సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ “పెరట్లో కెళ్ళు. స్నానాలగది అక్కడే ఉంది. కాళ్ళుచేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళు.” అన్నాడు శర్మ.
అలాగేనన్నట్టు తలూపాడు సుబ్రహ్మణ్యం.
“సుమతీ! వీడికి సంధ్యావందనం పాత్రలివ్వు. సాయంసంధ్య నేర్పించాలి.” అన్నాడు శర్మ.
——
రాత్రి భోజనాలయ్యాక, సుబ్రహ్మణ్యం మేడ మీద పడుకోవడానికి వెళ్ళాడు.
పడకగదిలోకి వచ్చిన సుమతిని చూసి “వాడు కొద్ది నెలలు మనతోనే ఉంటాడు సుమతీ!” అన్నాడు శర్మ.
“అలాగేనండీ!” అంది సుమతి. ఆమె ఇంకేమైనా అడుగుతుందేమోనని ఎదురుచూసాడు శర్మ. సుమతి నుండి ఎలాంటి ప్రశ్నా రాకపోవడంతో తనే మాట్లాడం మొదలుపెట్టాడు.
“సుబ్రహ్మణ్యం తాతగారు రాజగోపాలాచార్యులని గొప్ప ఋగ్వేద పండితులు. ఆయన దగ్గరే మా నాన్నగారు అధ్యయనం చేసారు. వీడి నాన్నగారైన పార్థసారథిగారు వైదికవృత్తిలో ఆసక్తి లేకపోవడంతో ఇంగ్లీషు చదువు చదువుకున్నారు. బి.ఏ. చేసి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. యూనియన్ లీడర్ గా పనిచేసారు కూడా. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన ధర్నాలో పాల్గోడానికి ఆయన వెళ్ళారు. ఆ ధర్నా ఉన్నట్టుండి హింసగా మారడంతో పోలీస్ ఫైరింగ్ జరిగింది. అందులో పార్థసారథిగారూ చనిపోయారు.”
“అయ్యొయ్యో!” అంది సుమతి, రెండు చెవుల్నీ మూసుకుంటూ.
“సుబ్రహ్మణ్యం తల్లిగారు హైస్కూల్ చదువు కూడా పూర్తిచేయలేదు. అందుకని ఆవిడకు స్వీపర్ ఉద్యోగమే ఇస్తామంది గవర్నమెంటు. ఆ పని చెయ్యలేక ఆవిడ తన అన్న ఇంటికి చేరింది. అతను ఈ ఊర్లోనే ఉంటాడు. మనవాళ్ళ కార్యక్రమాలకి వంటలూ అవీ చేస్తుంటాడు. ఈరోజు నేను వెళ్ళిన పెళ్ళిలో సుబ్రహ్మణ్యంగారి తల్లిగారిని చూసాను. ఆవిడ అన్నతో బాటూ వంటలు చెయ్యడానికి వచ్చింది. నాన్నగారితో బాటూ నేనూ రాజగోపాలాచార్యుల వారి ఇంటికి వెళ్ళేవాణ్ణి కాబట్టి ఈవిడ నాకు బాగా గుర్తు. అందువల్ల నేనే గుర్తుపట్టి మాట్లాడించాను. ఇన్ని విషయాలు తెలిసాయి. వీణ్ణి చూపించి చదువు మాన్పించేసి వంటల్లోకి దించినట్టు చెప్పింది. అంత గొప్ప ఘనాపాఠీ మనవడు ఇలా బ్రతకడం నాకు బాధ కలిగించింది. నాన్నగారి గురువుగారికి నావంతు శుశ్రూషగా వీణ్ణి వేదపారాయణంలో కాకపోయినా కనీసం పౌరోహిత్యంలోనైనా తర్ఫీదునిద్దామని తీసుకొచ్చాను. వీడికి సంధ్యావందనం కూడా సరిగ్గ రాదు. అందువల్ల కనీస ధర్మాలు పట్టుబడేదాకా మన ఇంట్లోనే పెట్టుకుందామని తీసుకొచ్చాను…” అని ఆగాడు శర్మ. “నీకూ ఇష్టమేనా” అన్నది ఆ ఆగడంలోని ధ్వనితార్థం.
భర్త భావాన్ని ఇట్టే అర్థం చేసుకున్న సుమతి – “తప్పకుండా పెట్టుకుందామండీ!” అంది సుమతి.
ఎంతో నిశ్చింతగా అనిపించింది శర్మకు.
—–
ఒక నెలరోజులుగా సుబ్రహ్మణ్యానికి కనీస విధివిధానాలను చెప్పించడంతో బాటు అనేక వైదిక కార్యక్రమాలకు కూడా తీసుకెళ్తున్నాడు శర్మ. ప్రతి మంత్రం, తంత్రం వెనుకవున్న ఆధ్యాత్మిక విశేషాల్ని, విజ్ఞానశాస్త్ర విషయాల్నీ వివరిస్తున్నాడు. ఎన్నిసార్లు ఆవృత్తి చేయించినా ఏ విషయమూ సుబ్రహ్మణ్యం బుర్రలోకి పూర్తిగా ఎక్కడంలేదని గ్రహించాడు శర్మ. అదే విషయాన్ని సుమతితో ప్రస్తావించాడు.
“మీరు ఒకేసారి ఎక్కువ విషయాల్ని చెప్పడం లేదు కదా?” అంది సుమతి.
“లేదు సుమతి! మామూలుగా సంధ్యావందనం ఎనిమిదేండ్ల పిల్లలకు కూడా నెలరోజుల్లో పూర్తిగా కంఠతా వచ్చేస్తుంది. వీడికి ఉపనయనం జరిగే ఏడేళ్ళు కావొస్తోంది. నెల క్రితం ఏ తప్పులు చెప్పేవాడో ఇప్పుడూ అవే తప్పులు చేస్తున్నాడు. ఊర్ద్వాయ దిశే అనడానికి బదులు ఉరుదై దిసే అంటున్నాడు. వల్లె వేయిస్తే సరిగ్గా చెబుతాడు కానీ మరుసటి రోజు మళ్ళీ మొదటికొస్తున్నాడు.” – శర్మ గొంతులో నిరాశ, నిస్సహాయత కలగలిసి పోతున్నాయి.
“పోనీ ఈ పని చేస్తేనో?” అంది సుమతి ఉత్సాహం నిండిన గొంతుతో.
“ఏమిటది?”
“బహుశా సుబ్రహ్మణ్యానికి ఉచ్ఛారణలో సమస్య ఉన్నట్టుంది. అందుకని కొన్ని సులభపదాలు, కొన్ని కష్టమైన పదాలున్న తెలుగు పద్యాలు వల్లె వేయించండి. ఆ పదాలకు నోరు తిరగడం మొదలైతే సంస్కృత పదాలు తొందరగా వంటబడతాయి. ఏమంటారు?” అంది సుమతి.
సుమతి మాటలతో శర్మ మనసులో కూడా రవ్వంత ఆశ చిగురించింది.
“ఆ ప్రయత్నమేదో నువ్వు చెయ్యరాదూ? వాడికి నేనంటే భయమెక్కువ. నీతోనే కాస్త చనువుగా ఉంటాడు.” అన్నాడు శర్మ.
“నేనా! సరే. ప్రయత్నిస్తాను.” అంది సుమతి.
“ఓ వారం రోజులు వాడిని ఎక్కడికీ తీసుకెళ్ళను. నువ్వు చెప్పిన ప్రయత్నాన్నీ చేసి చూద్దాం.” అన్నాడు శర్మ.
అప్పటికే ఏ పద్యాలు చెప్పాలా అన్న ఆలోచనలో పడిపోయింది సుమతి.
—–
వంట చేస్తూ సుమతి చెప్పిన కొన్ని ప్రాసవాక్యాలను కొద్ది దూరంలో కూర్చున్న సుబ్రహ్మణ్యం అప్పచెప్పుతున్నాడు.
“దేవదేవ రమ్ము – కావుమయ్య మమ్ము
రూక లేనివాడు – పోక చేయలేడు
అలుక పూన రాదు – అతివ గొట్ట రాదు
ఊర గలిసి మనుము – ఊని పనుల గనుము
ఏక మగుట యొప్పు – ఏడ్చు టెపుడు ముప్పు”
చెబుతున్నాడే గానీ సుబ్రహ్మణ్యం మనసులో ఏకాగ్రత లేదు.
“ఐక్య మిచ్చు వద్దు – ఐనదెల్ల దిద్దు”
సుమతి తిరిగి చూసింది.
ఎక్కడో చూస్తూ చెప్పుకుపోతున్నాడు సుబ్రహ్మణ్యం.
“ఓటు మాట విడువు – ఓర్పు…ఓర్పు…ఓ…” ఆగిపోయి తల తిప్పి చూసాడు. సుమతి తనవైపే చూస్తుండటంతో తప్పు చేసినవాడిలా తలదించుకున్నాడు.
“ఐక్య మిచ్చు బలము అని చెప్పాలి. కానీ నువ్వు ఐక్య మిచ్చు వద్దు అన్నావు. ఆ వాక్యాని కేమైనా అర్థముందా?” అని అడిగింది సుమతి. ఆమె గొంతులోని మార్దవాన్ని సుబ్రహ్మణ్యం తట్టుకోలేకపోయాడు.
“తప్పైపోయిందమ్మా!” అన్నాడు.
“నీకే తప్పు తెలిసిపోయిందిగా! మళ్ళీ మొదట్నుంచి చెప్పు. ఈసారి చక్కగా చెప్పగలవ్.” అంది సుమతి చిరునవ్వుతో.
సుబ్రహ్మణ్యం మళ్ళీ మొదలుపెట్టాడు
“దేవ దేవ రమ్ము …
సఖుల కీడు బాపు – సాటి వాని మేపు
హాని పనికి దడువు – హాస్య మెపుడు విడువు”
“సెబ్బాష్! చూసావా! మనసు పెట్టి చెబితే ఏదైనా చక్కగా వచ్చేస్తుంది!” అంది సుమతి చప్పట్లు కొడుతూ.
గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు సుబ్రహ్మణ్యం.
ఆ రాత్రి భర్తతో మాట్లాడుతూ “ఏమండీ! సుబ్రహ్మణ్యానిది ఉచ్ఛారణ సమస్య కాదు. మనసుకు సంబంధించిన సమస్య. బహుశా ఇవన్నీ నేర్చుకోవడం వాడి కిష్టం లేదేమో!” అంది సుమతి.
ఆశ్చర్యపోయాడు శర్మ. “వాడికి ఆసక్తి లేదని ఎలా తెలుసుకున్నావ్?” అన్నాడు.
“ఈరోజు కొన్ని ప్రాసవాక్యాలు చెప్పమన్నాను. ఐక్య మిచ్చు బలము అనడానికి బదులు ఐక్య మిచ్చు వద్దు అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల్ని చాలా చేస్తాడు. దీని వల్ల ఆ అబ్బాయి తనేం చెబుతున్నాడో, ఆ చెప్పేదానిలో అర్థముందా లేదా అని ఆలోచించడం లేదని తెలుస్తోంది. నేర్చుకుంటున్నవాటి పట్ల ఆసక్తి లేకపోవడమే ఈ తప్పులకు కారణమని నా ఊహ.” అంది సుమతి.
“ఒకట్రెండు తప్పులతో అలా నిర్ణయానికి రావచ్చా?” అన్నాడు శర్మ. సుమతి చెబుతున్నదాన్ని నమ్మడానికి అతని మనసు ఒప్పడం లేదు.
“ఆనందతీర్థులు యమకాలంకారంలో వ్రాసిన సుభద్రా పరిణయ ఘట్టాన్ని వర్ణించే శ్లోకాన్ని ఒకసారి చెబుతారా?” అంది సుమతి.
ఆవిడెందుకు అడిగిందో అర్థమైంది శర్మకు. ఐనా తెలియనట్టు మొదలుపెట్టాడు.
“పురమభియారిదరీ దత్త్వా భద్రాం పృథాసుతాయారిదరీ|
శక్రపురీమభియాతః ప్రాదాద్వహ్నేర్వనం సతామభియాతః||”
“ఇందులో అరిదరి కి అర్థం చెబుతారా?” అంది సుమతి.
“ఆ పదానికి ఒకటి కాదు రెండర్థాలున్నాయి.” అన్నాడు శర్మ.
“అవునవును. రెండర్థాలున్నాయి. అవేంటో చెప్పరూ!” అంది.
“అరి అంటే చక్రం. దరి అంటే శంఖం. అరిదరి అంటే చక్ర-శంఖాలను ధరించినవాడనేది ఒక అర్థం. అరి అంటే శత్రువులు. దరీ నంటే నాశనం చేసేవాడు. కాబట్టి అరిదరి అంటే శత్రుసంహారకుడని రెండో అర్థం. ఇప్పుడిదంతా ఎందుకు?” అన్నాడు శర్మ.
“నేనడిగిన వెంటనే ఒక్క అక్షరం పొల్లుపొకుండా శ్లోకాన్ని చెప్పారు. ఒక పదానికి వుండే నానార్థాలనీ చెప్పారు. మీలో శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞాపకశక్తి ఉండేదా? సుబ్రహ్మణ్యంలో ఇలాంటి శ్రద్ధలేదన్నది అతను చేస్తున్న చిన్నా చితకా తప్పుల్లో తెలుస్తోంది. ఇది నా ఊహ మాత్రమే. మీరూ ఇంకోసారి పరీక్షించి చూడండి!” అంది సుమతి.
శర్మ మౌనం వహించాడు. సుమతి చెప్పినదానిలో ఒక్క అక్షరం కూడా తీసివేయడానికి లేదని అనిపించింది.
“ఓ పని చెయ్. రేపు ఏ పాఠాలూ వద్దు. వాణ్ణి కబుర్లలో పెట్టు. అలా కదిలిస్తే తన మనసులోని మాటను బైటపెడతాడేమో చూద్దాం. మనసును నిలుపందే సాధన సిద్ధించదు.” అన్నాడు శర్మ.
అతని గొంతులో గూడు కట్టుకున్న నిర్వేదానికి సుమతి మనసు విచలితమైంది.
—–
మరుసటి రోజు వంట చేస్తున్నంత సేపూ సుబ్రహ్మణ్యంతో పోచికోలు కబుర్లాడుతూనే ఉండింది సుమతి. తన స్కూల్లో జరిగిన తమాషా ఘటనలు, టీచర్లు – స్టూడెంట్ల దాగుడుమూతలు, పక్కింటివాళ్ళతో వచ్చిపడిన పేచీలు, పెళ్ళిళ్ళు మొదలైన సందర్భాల్లో ఎదురైన వింత అనుభవాలూ మొదలైనవి ఎన్నో చెప్పింది సుమతి. వాటన్నింటినీ నవ్వుతూ విన్నాడు సుబ్రహ్మణ్యం. ఇలాంటివేవైనా చెప్పమని అతన్ని అడిగినపుడు నోరు మెదపలేదు ఆ అబ్బాయి.
తన చిన్ననాటి విషయాలను ఎక్కువగా చెప్పడానికి సుబ్రహ్మణ్యం ఇష్టపడడం లేదని గ్రహించింది సుమతి. అంటే, ఆ అబ్బాయి బాల్యం కష్టాల మధ్య గడిచివుండాలి. అలా కాకపోతే, చిన్ననాటి విషయాల్ని చెప్పడానికి ఎవరు ఉత్సాహపడరు?
మాట మార్చి – “నీ కిష్టమైన సినిమా ఏది?” అని అడిగింది.
“ప్చ్!” అని ఏదీ లేదన్నట్టు అడ్డంగా తలూపాడు సుబ్రహ్మణ్యం.
ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు సుమతికి.
వాళ్ళిద్దరూ పెరట్లో కూర్చునువున్నారు. ఆ చిన్న స్థలాన్ని తోటలా మార్చుకున్నారా దంపతులు. అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం వారికి చాలా ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి.
సుబ్రహ్మణ్యం ఏమీ మాట్లాడకపోవడంతో సుమతి కూడా మౌనంగా ఉండిపోయింది.
నిమ్మచెట్టు మీద ఒంటరి పిచ్చుక కొమ్మ నుండి కొమ్మకు ఎగురుతూ కిచకిచమని అరుస్తోంది. బీరపాదులో నల్ల చీమలు దండు కట్టి వస్తూ, పోతు ఉన్నాయి. మధ్యాహ్నపు ఎండ ఆకులపై పడి మెరుస్తూవుంది. మనుష్యులు మాటలే మర్చిపోయారేమో అన్నంత నిశ్శబ్దంగా ఉంది వీధి.
తన కంటే ఒక మెట్టు దిగువన, ఎడం చెయ్యిని గడ్డం క్రింద పెట్టుకుని పాదుల వైపు చూస్తున్న సుమతిని కన్నార్పకుండా చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం.
“అమ్మ కంటే చాలా చిన్నది. కానీ అమ్మలో లేని మనసూ, ఓర్పు ఈమెలో ఉన్నాయి. అమ్మ ఈమెలా ఉండుంటే నాన్నగారలా ఇంటికి రాకుండా ఎప్పుడూ బైటే ఉండేవారా? నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేది! చక్కగా నాతో ఆడుకొనేవారు. ఎప్పుడూ ఎవరిపైనా విసుక్కునేవారే కాదు. అమ్మ చీటీలు, వడ్డీ వ్యాపారమంటూ ఎవరెవర్నో ఇంట్లోకి రానిస్తున్నా ఊరుకున్నారు. ఇంట్లో జరిగిన ఏ గొడవా నాన్నతో మొదలు కాలేదు. అని నేను చెబితే ఈమె నమ్ముతుందా? నాన్న దక్కకపోవడానికి అమ్మే కారణమని చెబితే నన్ను పిచ్చివాడిలా చూడదూ? నాన్నను అమ్మ ఎలా హింసించేదో చెప్పాలంటే మాటలు సరిపోతాయా? నేను స్కూలుకు వెళ్లలేదని చెబితే ఈమె ఏమనుకొంటుంది? పక్కింట్లో ఉండే కరీమ్ మాష్టారు దయ తలచి తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే వాళ్ళతో చేర్చి నాకూ నేర్పిస్తేనే ఈమాత్రం చదువు వచ్చిందని ఎలా చెప్పేది? ఈ విషయాలన్నీ ఈమెతో చెబితే ఏమనుకొంటుంది? అమ్మకు కష్టపడడం ఇష్టంలేకనే కదా మామయ్యతో పాటూ వంటలు చెయ్యడానికని ఆ పెళ్ళికి నన్ను తీసుకొచ్చింది! నాన్న చచ్చిపోవడం తప్పించి పంతులుగారితో అమ్మ చెప్పినవన్నీ కట్టు కథలని తెలిస్తే నన్ను ఈ క్షణం బైటకి తోసెయ్యరూ! ఇలాంటి లేకి కుటుంబాలు కూడా ఉంటాయా అని వీళ్ళిద్దరూ అనుకోరూ! వీళ్ళిలా అనుకుంటే అమ్మ కంటే నాన్నకే ఎక్కువ అవమానం జరుగుతుంది. నాన్నా…నాన్నా..నాన్నా…”
“సుబ్రహ్మణ్యం! భోజనం చేద్దామా?” అని అడిగింది సుమతి. సరేనన్నట్టు తలూపాడు.
మొదట సుబ్రహ్మణ్యానికి వడ్డించి తను భోజనానికి కూర్చుంది సుమతి. రాత్రి భోజనానికి అన్ని పదార్థాలను విడిగా తీసిపెట్టి తనకు ఎంత కావాలో అంతే తెచ్చి ముందుపెట్టుకుంది సుమతి.
సుబ్రహ్మణ్యం ఈ పద్ధతికి ఆశ్చర్యపోయాడు. మామూలుగైతే శర్మ ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ వడ్డించి కూర్చునేదని అనుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రానని చెప్పాడు శర్మ. అందువల్ల ఇద్దరూ ఒకేసారి కూర్చోవచ్చుననుకున్నాడు.
సుమతి భోజనం చేస్తుంటే ఆమెకు దగ్గరగా, గోడకు చేరగిలబడి కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం.
“మిమ్మల్ని ఓ విషయం అడగనా?” అన్నాడు.
చాలాసేపైన తర్వాత నోరు విప్పిన సుబ్రహ్మణ్యం వైపు నవ్వుతూ చూసింది సుమతి. “ఒక్కటేనా అడిగేది?” అంది.
“ఆహా…రెండు మూడు విషయాలున్నాయి.” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“మొదటిదేమిటి?” అంది సుమతి.
“మీరు, పంతులుగారు నన్ను పూర్తి పేరుతో పిలుస్తారెందుకు? అందరూ పిల్చినట్టు సుబ్బూ అనో, మణీ అనో పిలవరెందుకు?” అన్నాడు.
“సుబ్రహ్మణ్యం ఒక దేవత పేరు కదా! దేవతల పేర్లను తలిస్తే పుణ్యమొస్తుంది! పూర్తిగా పిలవకుండా ముక్కలు ముక్కలు చేస్తే పుణ్యం రాదుగా! అందుకని…” అంది సుమతి. “ఐనా పూర్తి పేరుతో నిన్ను ఎవ్వరూ పిలవలేదా?”
“మా తాతయ్య ఒక్కరే అలా పిల్చేవారు.” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“రెండో విషయమేమిటి?”
“పంతులుగారంటే పెద్దవారు. మీరు వారికి వడ్డించి కూర్చోడం బాగుంది. కానీ ఈరోజు నాకు వడ్డించి కూర్చున్నారే? నేను చాలా చిన్నవాణ్ణి కదా!”
“నీకు వామనుడి కథ తెలుసా?” అంది సుమతి.
“తెలుసు. బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని అడిగి అతన్నే పాతాళానికి తొక్కేస్తాడు.” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“మరి ఆ బలి చక్రవర్తి ఎంతో పెద్ద రాజు కదా! ఐనా కూడా చిన్ని వామనుడి కాళ్ళు కడిగాడు. అవునా?” అంది సుమతి.
విషయం అర్థమైనట్టుగా “అంటే నేను వామనుడిలాంటి వాణ్ణని మీరు నాకు వడ్డిస్తారా!” అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుమతి నవ్వింది.
“ఇంత మంచితనం అవసరమా?” అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుమతి ముఖంలో నవ్వు మాయమయింది. “ఎందుకలా అన్నావ్?” అంది.
“ఏమో! అలా అనిపించింది!” అన్నాడు సుబ్రహ్మణ్యం.
మిగతా భోజనాన్ని మౌనంగా ముగించింది సుమతి. సుబ్రహ్మణ్యం గోడకలా ఆనుకునే కూర్చున్నాడు.
శుద్ధిపెట్టడాన్ని ముగించి హాల్లోకి వచ్చింది సుమతి. సుబ్రహ్మణ్యం లోపల గదిలోనే ఉండిపోయాడు.
ఓ పుస్తకాన్ని తీసుకుని హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుమతి. కొద్దిసేపటి తర్వాత సుబ్రహ్మణ్యం హాల్లోకి వచ్చాడు.
సుమతికి ఎదురుగా కూర్చుని “ఏం చదువుతున్నారండీ?” అన్నాడు.
“మీ పంతులుగారు నా కోసమని రామాయణంలోని సుందరకాండకు తెలుగులో అర్థం వ్రాసిచ్చారు. దాన్ని చదువుకుంటున్నా!” అంది సుమతి.
“ఇప్పుడేం చదువుతున్నారు?” అన్నాడు.
“ఇప్పుడే మొదలుపెట్టాను. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. గట్టిగా చదువుతాను, నువ్వూ వింటావా?”
“ఊ…”
“హనుమంతుడు ఎగరగానే అతని వేగానికి లాగబడినట్టుగా సముద్రం ఉప్పొంగింది. అందులో ఉన్న జలచరాలన్నీ కూడా పైకి ఎగిరి అతని వెనకనే అనుసరించాయి. హనుమ బలానికి ఆ జలచరాలే కాక సముద్రంలో మునిగివున్న మైనాక పర్వతం కూడా పైకి వచ్చింది.”
గట్టిగా నవ్వాడు సుబ్రహ్మణ్యం. చదవడం ఆపి అతని వైపు చూసింది సుమతి.
“ఒక కోతి గాల్లోకి ఎగిరితే సముద్రంలోని చేపలు, కొండలూ లాగబడతాయా?” అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుమతికి ఏం చెప్పాలో తోచలేదు. ఆమె కెప్పుడూ ఇలాంటి సందేహం రాలేదు. ఏదో ఒకటి చెప్పాలని – “ఆయన వాయుదేవుడి కొడుకుగా! గాలి గట్టిగా వీస్తే ఏదైనా కొట్టుకొనిపోవాల్సిందే కదా? తుఫానుగాలి వస్తే ఇళ్ళు, చెట్లూ, అన్నీ ఎగిరిపోవడాన్ని మనం చూస్తున్నాంగా? ” అంది సుమతి.
ఈసారి మౌనం వహించడం సుబ్రహ్మణ్యం వంతైంది.
సుమతి చదవడం కొనసాగించింది – “పైకి వచ్చిన మైనాకుడు హనుమంతుడికి నమస్కరించి తనపై కూర్చుని విశ్రాంతి తీసుకోమని ప్రార్థించాడు. అందుకు హనుమంతుడు చిరునవ్వు నవ్వి, మైనాకుణ్ణి తన చేత్తో స్పృశించి వెంటనే బయల్దేరాడు…”
“హనుమంతుడు ఎందుకు ఆగలేదు?” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“రాముడి పనిని నెరవేర్చేవరకు ఆగకూడదని!” అంది సుమతి.
“అంటే?” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“అంటే, పెద్దవారు చెప్పిన పనిని వెంటనే చేసెయ్యాలి. ఆలస్యం చెయ్యకూడదని అర్థం.” అంది సుమతి.
సుబ్రహ్మణ్యం మాట్లాడలేదు. సుమతి మళ్ళీ చదవడం మొదలుపెట్టింది.
ఆ అబ్బాయి మనసు “పెద్దవారు చెప్పిన పనిని వెంటనే చేసెయ్యాలి.” అన్న సుమతి మాటల చుట్టూ తిరుగుతోంది.
వాడికి నాన్న చెప్పింది గుర్తుకొస్తోంది – “సుబ్బూ! మగాడికి చదువు ముఖ్యం. ఉద్యోగం ముఖ్యం. చదువు పూర్తయ్యాక ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. జీతమెంతని ఆలోచించకూడదు. వెయ్యిరూపాల జీతమొచ్చినా చేరిపోవాలి. పెద్ద జీతమిచ్చే పెద్ద ఉద్యోగమే చేస్తానని ఇంట్లో కూర్చొంటే అవమానం. మీ అమ్మ చీటీలు, వడ్డీవ్యాపారంలాంటి కొన్ని చెడ్డ పనులు చేస్తోంది. అవి తెచ్చే డబ్బు మనకు అరగదు. కష్టపడి సంపాదించేదే మనది. ఒకర్ని మోసం చేసి సంపాదించిన డబ్బు ఏదో ఒకనాడు మనల్నే ముంచేస్తుంది. మనకు చేతనైనంతలో మంచితనంతో బ్రతకాలి. మనశ్శాంతితో బ్రతకాలి. దీన్ని డబ్బుతో కొనలేం. నీ మనసులో శాంతి ఉన్నప్పుడు గౌరవం అదే వస్తుంది. నేను నా జీవితంలో నేర్చుకున్నదిదే. నువ్వు కూడా ఓ డిగ్రీ ముగించి ఉద్యోగం చెయ్యాలి.”
సుబ్రహ్మణ్యంకు నాన్న మాటల్లో ఎంతో నిజమున్నట్టు అనిపించింది. ఆయన మాటల్ని పాటించడంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేసినట్టుగా అనిపించింది. నాన్న మాటల్ని జవదాటి తను ఘొరమైన తప్పు చేస్తున్నాడు. ఈ పౌరోహిత్యాలు, వంటలూ చేసుకోవడం కంటే డిగ్రీ పూర్తిచేసి, ఏదైనా ఆఫీసులో గౌరవమైన ఉద్యోగం చెయ్యాలన్న కోరిక బలంగా కలిగింది. అమ్మకు, మేనమామకు తనను చదివించే ఉద్దేశాలు లేవని తేలిపోయింది. ఇంటి నుంచి పారిపోవాలని ఎప్పుడో అనుకొన్నాడు కానీ ఎందుకో ధైర్యం చెయ్యలేకపోయాడు. పారిపోతే, చదువుకు ఇబ్బంది ఎదురవుతుందని భయపడ్డాడు. ఇప్పుడు ఈ దంపతుల్ని చూసాక, వాళ్ళ మంచితనాన్ని చూసాక తన ఇష్టాయిష్టాలని చెప్పడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు.
“అమ్మా!” అన్నాడు.
చదవడాన్ని ఆపింది సుమతి.
“నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకొంటున్నాను. మీరేమీ అనుకోనంటే చెబుతాను.” అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుమతి ఈ క్షణం కోసమే ఎదురుచూస్తోంది. “అయ్యో! ఏమీ అనుకోను. తప్పకుండా చెప్పు!” అంది.
“అమ్మా! నాకు ఈ పౌరోహిత్యం పై ఇంట్రస్ట్ లేదు. డిగ్రీ చదివి, మంచి ఉద్యోగం చెయ్యాలని ఉంది.” అన్నాడు. ఇంతకాలం తన గుండెలోనే తారట్లాడుతూ, కంగారు పెడుతున్న విషయాన్ని రెండు ముక్కల్లో చెప్పేసాక, సుబ్రహ్మణ్యంకు నెమ్మదిగా అనిపించింది.
సుమతి వెంటనే ఏమీ మాట్లాడలేదు.
సుబ్రహ్మణ్యం ఆమె మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకుని – “అమ్మా! ’పెద్దవాళ్ళు చెప్పినదాన్ని వెంటనే చేసెయ్యాలని’ ఇంతకుముందే మీరన్నారు. మా నాన్న నాకు చెప్పిందాన్నే చేద్దామనుకుంటున్నాను.” అన్నాడు. అతని గొంతులోని వేడుకోలు లాంటి బాధను పసిగట్టింది సుమతి.
“అయ్యో! దానికేం భాగ్యం సుబ్రహ్మణ్యం. ఆయన వచ్చాక నేనే ఈ విషయం చెబుతాను. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. నిన్నేమీ అనర్లే!” అంది సుమతి, ధైర్యం చెబుతున్నట్టు.
సుబ్రహ్మణ్యం రెండు చేతులూ జోడించాడు.
—–
శర్మ క్రితం రాత్రి చాలా ఆలస్యంగా రావడంతో సుబ్రహ్మణ్యం విషయాన్ని తీసుకురాలేదు సుమతి.
మరుసటిరోజు ఆ అబ్బాయి బైటకెళ్ళినపుడు సుబ్రహ్మణ్యం తనతో చెప్పినదాన్ని శర్మకు వివరించింది సుమతి. శర్మ చాలా ఆశ్చర్యపోయాడు. ఆపై బాధపడ్డాడు.
“ఓ ఘనాపాఠీ మనవడికి శాస్త్రం, సాంప్రదాయం పట్ల అభిరుచి కలిగిద్దామంటే ఆ అవకాశం లేకుండా పోతోంది. నేను దీన్ని ఒప్పుకోలేకపోతున్నాను. వాడొచ్చాక మాట్లాడ్తాను. ఎలాగైనా వాణ్ణి ఒప్పిస్తాను.” అన్నాడు శర్మ.
“అబ్బాయికి ఇష్టంలేనిదాన్ని బలవంతంగా రుద్దడ మెందుకండీ?” అంది సుమతి.
“ఇది రుద్దడమెలా అవుతుంది?మన సంప్రదాయాన్ని మనమే కదా నిలబెట్టాలి? వీడి తాతగారు, ముత్తాత గారు ఎంతటి పండితులో నీకు తెలీదు. వీడి ముత్తాతగారు కాశీలోని వ్యాకరణ పండితులతో వాదించి బంగారు గండపెండారాన్ని సాధించారు తెలుసా! సుమతీ, ఏ విషయం మీదా అందరికీ ఉన్నట్టుండి ఆసక్తి పుట్టదు. అర్థమయ్యేట్టు వివరిస్తే, అందులోవున్న గొప్పదనం అర్థమౌతుంది. అప్పుడు అనుమానాలన్నీ పోయి ఆసక్తి అదే వస్తుంది. అందుకనే వాడితో నేనూ మాట్లాడ్తాను. ఆ తర్వాత కూడా వాడి అభిప్రాయం మారకపోతే…..” కొనసాగించడం ఇష్టం లేదన్నట్టుగా ఆగిపోయాడు శర్మ.
తీవ్రంగా కుదిపే భావోద్వేగాలకు మనసులో ఎన్నడూ స్థానమివ్వని భర్త, ఈ ఒక్క విషయంలో ఇలా ప్రవర్తించడం సుమతికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ నాన్నగారు పోయాక అన్నలు ఆస్తి కోసం కొట్లాడుకుంటుంటే, అమ్మతో బాటూ వాళ్ళ నాన్నగారి దేవతార్చన పెట్టెను మాత్రమే చేతిలో పట్టుకుని ఈ ఊరు వచ్చేసారు. అప్పటికి ఆయన వయసు సరిగ్గా సుబ్రహ్మణ్యంలానే పదహారేళ్ళు. ఆ వయసులోనే అంత సహనం, సమ్యమనం చూపించిన వ్యక్తి ఈ కుర్రవాడి విషయంలో అనవసరంగా బాధపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ ఆశ్చర్యంతో బాటే కొద్దిగా భయం కూడా కలిగింది. దేనిపట్లా హద్దుమీరి అభిమానం చూపని వ్యక్తి, సుబ్రహ్మణ్యానికి ఆసక్తి లేదని తెలిసీ ఏదో నేర్పాలన్న తపన పడుతున్నారు. అలా పుట్టక పుట్టక పుట్టిన తపన తీరకపోతే ఏమౌతుంది? కోపం, చిరాకు, విరక్తి లాంటి వాటిల్ని ఆయన చూపిస్తే తను తట్టుకోగలదా? ఒకరికి మంచి చేయబోతే మనకు చెడు ఎదురౌతుందా? ముందేం జరగబోతోంది?
* * * * *
“షడ్గుణైశ్వర్యసంపన్నా! ఇదేమి చిత్రం? అంతఃశుద్ధితో అలరారే మీ రెండో ఆటకాయ మాత్సర్యమనే పాము నోట చిక్కి, గుంటనక్క పాలైందా?” –జగత్తునే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే జగన్మాయ విచారంగా అడిగింది.
“ఏం దేవీ? ఎందుకా విచారం?” అన్నాడు భూతభవ్యభవత్ప్రభువు.
“విచక్షణ కలిగిన వారే విచలితులైతే మిగిలేది విచారమేగా ప్రభూ!” అంది బహుసుందరీగణాతీత సుందరి.
“పరుల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా తనకు నచ్చినిదాన్నే వారి చేతా చేయించాలని పట్టుబట్టడం మాత్సర్యమేగా! మాత్సర్యం ఉన్నచోట మూర్ఖత్వం పుట్టుకొస్తుంది! ఒక్కోసారి ఆ మూర్ఖత్వం వంచనకు దారితీస్తుంది.” అన్నాడు పూతాత్ముడు.
“ఒకరిని మంచిపని చేయడానికి పురిగొల్పడం మాత్సర్య మెలా అవుతుంది భగవాన్?” అంది వటపత్రశాయి శయ్యారూపిణి.
“అంబుజసదనా! ఇనుములో ఆకర్షింపబడే గుణముంది. అయస్కాంతంలో ఆకర్షించే గుణముంది. ఆ రెండు ఒకదాని గుణాన్ని మరొకటి గ్రహించడం ద్వార పరస్పరం దగ్గరవుతాయి. చెక్కలో అలా ఆకర్షింపబడే గుణం లేదు. కనుక దానిపై ఎంత పెద్ద అయస్కాంతాన్ని ఉపయోగించినా అది ఆకర్షింపబడదు. ఈవిధంగానే మంచి చెయ్యాలన్నా, మంచిని స్వీకరించాలన్నా రెండు ప్రక్కలా గుణగ్రాహిత్వం ఉండాలి. చెక్కకు గొడ్డలి దెబ్బ మాత్రమే అర్థమౌతుంది. లేదూ ఉలి స్పర్శకు స్పందిస్తుంది. కట్టెలు కొట్టేవాడికి దొరికిన చెక్క, పొయ్యిలో మండి బూడిదౌతుంది. శిల్పి చేతిలో పడ్డ చెక్క అందమైన బొమ్మౌతుంది. అలాగే బుద్ధి కర్మకు వశమై నడుస్తుంది. ఆ కర్మపై విధి పెత్తనం చలాయిస్తుంది. ఆ విధి భగవంతుని అధీనం. ఈ ఆటలో పాచికలు ప్రవృత్తి అంటే క్రియకు నిదర్శనం. వాటిపైనున్న సంఖ్యలు కర్మలను అంటే క్రియాఫలితాలను సూచిస్తాయి. క్రియలకు వాటి ఫలాలకూ మధ్య జరిగే జగన్నాటకమే విధిబధ్ధమైన మానవజీవనం.” అన్నాడు ఇనకులతిలకుడు.
“ఆ పాచికలు మీ సుతిమెత్తని చేతులలో, మీ సత్యసంకల్పానికి ఆదరవులై వెలుగుతున్నాయి. వెలుగు-చీకటి, సుఖం-దుఃఖం, లాభం-నష్టం, పెరుగుట-తరుగుట అన్నీ మీ సంకల్పానుసారమే జరుగుతున్నాయి. ఈ ద్వంద్వభావాలలో మునిగిన సమస్త జీవులకూ, అనంత జగాలకూ మీరే దిక్కు. మీకు దాసోహం అన్న రోజున భయకారకాలైన ద్వంద్వాలు పోయి ఈశ-దాస మనోభావం ధృడమై, జీవులూ-జగాలూ అన్నీ ముక్తిని పొందుతాయి.” అంటూ చంద్రవంశప్రదీపకుణ్ణి చూసి చేతులు జోడించింది చంద్రానన.
“నీ మొదటి కాయ కూడా అంతరంగ శుద్ధిని చూపిస్తోందిగా…అదేం చెయ్యబోతోందో?” అన్నాడు ధృవవరదుడు.
“మీ కృపారసప్లావిత దృష్టిని ఆకర్షించిన ఆ కాయ గతి తప్పుందా స్వామీ! నడిపిస్తాను. అనుగ్రహించండి!” అని పాచికలను విసిరింది భీష్మక నందన.
కుచేలుని ఇంటిలో నర్తించిన ధనలక్ష్మీ పదాశ్రిత నూపురాల నినాదాల్లా శబ్దించాయి పాచికలు.
* * * * *
(సశేషం…)