గత భాగం: సుబ్రహ్మణ్యం అనే పదహారేళ్ళ యువకుణ్ణి తీసుకువచ్చిన శర్మ ఆ అబ్బాయి తన తండ్రి గురువుగారి మనవడిగా సుమతికి పరిచయం చేస్తాడు. ఆ అబ్బాయికి పౌరోహిత్యం నేర్పించడానికి తీసుకువచ్చానని చెబుతాడు. సుబ్రహ్మణ్యం శర్మ ఆశించిన విధంగా ఆసక్తి చూపకపోవడంతో సుమతిని కారణాల్ని కనుక్కోమంటాడు. సుమతి ఎన్నోవిధయం ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అతనికి పౌరోహిత్యం నేర్పిస్తానని పట్టుబడతాడు కేశవశర్మ. దాంతో సుమతి ఆందోళనకు గురౌతుంది. మరోవైపు ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ దిగాలుగా కాలం గడుపుతుంటాడు. |
“నాలుగు నెలల క్రితం ఇలాంటి దృశ్యమే ఉండింది. అనంత్ పనిచేస్తున్న కంపెనీ మూతపడి పోయిందని తెలిసినప్పుడు జరిగిన రభస గుర్తుకొస్తోంది. అప్పట్లో ఉన్న అలజడి ఇప్పుడు తనలో లేదు. ఈ ఓరిమి ఎక్కడినుంచి వచ్చింది? నాలుగు నెలల్లో ఇంతలా మారడం ఓ మనిషికి సాధ్యమా? ఇప్పుడు అనంత్ ను చూస్తుంటే కోపం రావడం లేదు. ఓ నాన్న తన కష్టార్జితంతో కొనిచ్చిన ఖరీదైన కలాన్ని ఎక్కడో పారేసుకొచ్చిన కుర్రవాణ్ణి లాలించి, ధైర్యం చెప్పే తల్లిలా ఉంది తన మనసు.”
మళ్ళీ తల్లి పోలిక రావడంతో లోలోపలే ఉలిక్కిపడింది రంజని – “పావని తనను అమ్మతో పోల్చింది. ఇప్పుడు తన మనసు తనే తల్లితో పోల్చుకొంటోంది. ఏమిటీ తల్లిదనం? నాలుగు నెల్ల క్రితం పోగొట్టుకున్నానని బాధపడింది దీని కోసమేగా!” – రంజని మనసులో ఆలోచనల పరంపర సాగిపోతూనే ఉంది.
“నువ్వలా సైలెంటుగా ఉంటే నీకు కోపమొచ్చిందేమోనని నాకు భయం.” అన్నాడు అనంత్. తనని తాను ఇంకా ముణగదీసుకుని పడుకున్నాడు.
“నాకెలాంటి కోపం లేదుగా! నువ్వు పడుకొన్నావేమోనని ఊరకేవున్నా!” అంది రంజని.
“లేదు. నాకు నిద్ర రావడం లేదు. ఏదైనా మాట్లాడు. ప్లీజ్!” అన్నాడు అనంత్.
కంపెనీ నుండి బైటపడి ఇంటికి వచ్చినరోజు నుండీ రంజనితో మాట్లాడే ప్రతి వాక్యం చివరా “ప్లీజ్” చేర్చడం అలవాటైపోయింది అనంత్ కు. ఆ రెండక్షరాల్లో అతని మనసు, దేహంలో పేరుకుపోయిన నిస్సహాయత ప్రతిధ్వనిస్తోంది.
“కాలేజ్ లో నాకు సుత్తి రంజని అనే టైటిలుండేది. అదిప్పుడు పనికొస్తోంది.” అంది రంజని.
“ఊ…” అన్నాడు అనంత్.
గొంతు సవరించుకుని “ఆన్ ద పాపులర్ డిమాండ్ ఆఫ్ అవర్ లిజనర్స్…వుయ్ ఆర్ బ్రింగింగ్ టు యూ సమ్ బోన్ టికిలింగ్ జోక్స్…ఎంజాయ్ గైస్..” అని గట్టిగా అరిచింది రంజని. అనంత్ కూడా నవ్వాడు. “ఇంకా జోకే చెప్పలేదు అప్పుడే నవ్వితే ఎట్లా లిజనర్…సేవ్ యువర్ లాఫ్….హియర్ వుయ్ గో…” అని మళ్ళీ అరిచింది రంజని.
“ముగ్గురు ఫ్రెండ్స్ ఎడారిలో చిక్కుకుపోయారు. వాళ్ళకి ఓ మ్యాజిక్ లాంప్ దొరికింది. దాంట్లో నుండి ఓ భూతం బైటకొచ్చి ఆ ముగ్గుర్నీ ఒక్కో కోరిక కోరుకోమంది. మొదటివాడు ఇంటికెళ్ళిపోవాలన్నాడు. వూ..ఫ్…వెళ్ళిపోయాడు. రెండో వాడూ అదే కోరుకొన్నాడు. వాడూ వెళ్లిపోయాడు. అప్పుడు మూడో వాడూ ’భూతం! భూతం! ఒక్కణ్ణైపోయి బోర్ కొడ్తోంది. నా ఫ్రెండ్స్ ను ఇక్కడకు పిలిపించు’ అన్నాడు.”
“ఓల్డ్ జోక్!” అన్నాడు అనంత్.
“ఓ..రియల్లీ! ఓకే…హియర్ వుయ్ గో ఫర్ ద సెకండ్ జోక్…బిల్ గేట్స్ చచ్చి పైకిపోయాడు. అక్కడన్న దేవత ఒక పెద్ద స్క్రీన్ పై రెండు లోకాల్ని చూపించి నీకేది కావాలో కోరుకో అంది. గేట్స్ బాగా చూసాడు. రెండో లోకం బ్యూటిఫుల్గా కనబడింది. ’ఇదేం లోకం?’ అన్నాడు. ’నరకం’ అంది దేవత. ’రియల్లీ! నరకమంటే భయంకరంగా వుంటుందనుకొన్నానే ఇట్స్ లుకింగ్ ఫెంటాస్టిక్. నేనక్కడికే వెళ్తా’ అన్నాడు. బిల్ వెళ్ళి నరకంలో పడ్డాడు. అది నిజంగానే భయంకరంగా ఉంది. అక్కడున్న ఓ యమకింకరుణ్ణి పట్టుకొని ’బాస్! ఇటీజ్ రియల్లీ హారిబుల్ ఓవర్ హియర్. ఆ దేవత చూపించిన స్క్రీన్లో నరకం బ్యూటిఫుల్గా కనబడిందే!’ అన్నాడు. దానికి ఆ కింకరుడు నవ్వి ’బాస్! నువ్వు చూసింది మా స్క్రీన్ సేవర్ని’ అని కెవ్వుమని కేకలేస్తున్న గేట్స్ ను తోసుకొంటూ పోయాడు.”
“హాహాహా…బాగుంది. వన్ మోర్!” అన్నాడు అనంత్.
“కొన్ని రోజులు నరకంలో ఉన్న గేట్స్ స్వర్గాని కెళ్ళాడు. అక్కడున్న దేవదూత గేట్స్ ను పెద్ద తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడంతా పాలరాతి జారుడుబండలు ఉన్నాయి. బిల్ గేట్స్ కి జారుడుబండలంటే చాలా ఇష్టం. వెంటనే ఒక పేద్ద జారుడుబండ ఎక్కి జర్రున జారాడు. ఆ బండ చివరికి వస్తుండగా గేట్స్ పిర్రకు ఒక చిన్న రాతి ముక్క గీసుకుపోయింది. చాలా బాధతో గట్టిగా అరిచి ’వాట్ ఈజీదిస్ ఏంజెల్ గారూ!” అన్నాడు. ’ఓహ్! సారీ సర్! ఐ థింక్ ఇట్స్ ఏ స్మాల్ బగ్ ఆన్ ఎ బిగ్ ఫాల్. ఐ విల్ ఫిక్సిట్ మిస్టర్ గేట్స్’ అందా ఏంజెల్.”
అనంత్ గట్టిగా నవ్వాడు.
“నీకు అటల్ బిహారీ వాజపేయీ, జనరల్ ముషర్రాఫ్ జోక్ తెలుసా?” అంది.
“ఇట్స్ ప్రెట్టీ ఓల్డ్. ఐనా చెప్పనా?” అంది రంజని.
“ఓల్డ్ ఈజ్ గోల్డ్. చెప్పు. ప్లీజ్” అన్నాడు అనంత్.
“వాజపేయీ, ముషర్రాఫ్, మాధురీ దీక్షిత్, మార్గరేట్ థాచర్ – ఈ నలుగురూ ఒక ట్రైన్లో స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ మౌంటెన్లో ఉన్న టన్నెల్లో వెళ్తుంటారు. ఒక టన్నెల్ నుండి ఇంకో టన్నెల్లోకి వెళ్ళినపుడు బోగీ మొత్తం చీకటిగా ఐపోయేది. అలా ఒకసారి చీకటిగా ఐనప్పుడు గట్టిగా ముద్దు పెట్టుకొన్న చప్పుడూ, దాని వెనకే ఛళ్ళు, ఛళ్ళుమని చెంపల్ని వాయించి కొట్టిన సౌండూ వచ్చాయి. టన్నెల్ బైటకి రాగానే వెలుగొచ్చింది. ముషర్రాఫ్ తన రెండు చెంపల్నీ రెండు చేతుల్తో మూసుకొని కూర్చున్నాడు.”
“హాహాహా…” అన్నాడు అనంత్.
“హుష్…జోకింకా పూర్తి కాలేదు. అప్పుడే నవ్వొద్దు.” అంది రంజని.
“ఓకే…ఓకే” అన్నాడు అనంత్.
“అలా కూర్చొన్న ముషర్రాఫ్ ను చూసి ఒక్కొక్కరూ ఒక్కోరకంగా అనుకోవడం మొదలుపెట్టారు.
మార్గరేట్ థాచర్: “పాకిస్తానీలకి మాధురీ అంటే వల్లమాలిన పిచ్చి. బోగీలో చీకటి పడగానే ఆ ముష్ గాడు ఈ అమ్మాయికి ముద్దు పెట్టబోయుంటాడు. మాధురీ వీడి రెండు చెంపల్నీ వాయగొట్టి మంచిపని చేసింది.”
మాధురి: “ముషర్రాఫ్ నన్ను ముద్దుపెట్టుకోబోయి పాపం పెద్దామె థాచర్ను ముద్దు పెట్టుంటాడు. దాంతో ఆమె రెండు వాయించివుంటుంది. గుడ్ జాబ్ మేడమ్.’
ముషర్రాఫ్: “నా పక్కన కూర్చొన్న ఈ పెళ్ళికాని పెద్దమనిషి ఎదురుగా కూర్చొన్న లేడీస్లో ఎవర్నో ముద్దు పెట్టబోయుంటాడు. వాళ్ళేమో నేనే ఆ పని చేసుంటానని నన్ను వాయగొట్టారు.’
వాజపేయీ: “ఈ బోగీ మళ్ళీ ఎప్పుడు టన్నెల్లోకి పోతుంది? ఎప్పుడు చీకటి కమ్ముకొంటుంది? ఎప్పుడు నేను ముద్దు పెట్టిన సౌండ్ చేసి, ముషర్రాఫ్ చెంపలు వాయిస్తానో?”
దట్సాల్ ఫర్ ద డే గైస్!” అని అరిచింది రంజని.
“హాహాహా…హోహోహో…” అని గట్టిగా నవ్వసాగాడు అనంత్. “వాజ్పేయే ముద్దు సౌండ్ చేసి ముషర్రాఫ్ చెంపల్ని వాయగొట్టడం…హాహాహాహా… ఐ జస్ట్ కాంట్ బేర్ దిస్”.
నవ్వీ నవ్వీ ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అలా కొన్ని నిముషాల పాటు నవ్వుతూ ఉండిపోయారు.
“రంజూ! నా పైన నీకు కోపం లేదా?” ఉన్నట్టుండి అడిగాడు అనంత్.
“ఎందుకలా మళ్ళీ మళ్ళీ డౌట్ పడ్తావ్? ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ! ఇంకెప్పుడూ ఇలా అడక్కు!” అంది రంజని.
సరేనన్నట్టు తలూపాడు అనంత్.
“సాటర్ డే ఐపోవచ్చింది. రేపు ఏం చేద్దాం?” అంది రంజని.
“నీ ఇష్టం. యూ డిసైడ్.” అన్నాడు అనంత్. ఆమెను శాసించే అధికారం తనకిప్పుడు లేదని అతని మనసు చెబుతోంది.
“ఊ…గుడి కెళ్దామా?”
మాట్లాడలేదు అనంత్.
“ఏమ్మా! వొద్దా? ఇష్టం లేదా?” – అనంత్ గడ్డం పట్టుకుని అడిగింది రంజని. “పోనీ పార్కుకెళ్దామా?” అంది.
“నీ ఇష్టం రంజూ!” అన్నాడు అనంత్.
“హ్మ్..! ఇలా చేద్దాం. పొద్దున్నే స్నానం చేసేసి గుడికెళ్దాం. నో కాఫీ, టీ! ఉపవాసంగా వెళ్దాం ఓకే? అలా వెళ్తే మంచి జరుగుతుందంట. ఓయ్! ఇప్పుడే ఏడుపు మొహం పెట్టకు. డోంట్ వర్రీ, గుడి కెళ్లడానికి ముందే టిఫన్ రెడీ చేసి, ఫ్లాస్క్ లో కాఫీ వేసిపెడ్తాలే!” నవ్వుతూ అంది రంజని.
“ఓకే”
“గుడి నుంచి ఇంటికొచ్చాక టిఫన్ చేసేసి నువ్వు రెస్ట్ తీసుకో. నేను చకాచక్ వంట చేసేస్తా. మధ్యాన్నం భోంచేసి మ్యాట్నీ షో కెళ్దాం. అట్నుంచి పార్కుకెళ్దాం. వస్తూ వస్తూ నీకిష్టమైన కదంబమ్ హోటల్లో డిన్నర్ చేసేసి వద్దాం. ఏం! ప్రోగ్రాం బావుందా?” అంది రంజని.
“వండర్ఫుల్. అలా చేద్దాం!” అన్నాడు అనంత్.
– – – – –
అనంత్ కు ఆ వాతావరణం కొత్తగా అనిపించింది. గుడిలోకి వచ్చేముందు తలెత్తి రాజగోపురాన్ని చూసాడు.
ఆకాశంతో కబుర్లాడుతున్న ఇత్తడి కళశాన్ని ఏ మేఘం నవ్వించిందో గానీ, తెల్లవారి నీరెండలో ఫళ్ మని మెరిసింది. ఆ మెరవడాన్ని చూసి “ఓహ్!” అని అసంకల్పితంగా అనుకొన్నాడు అనంత్.
తలెత్తి నిలబడిపోయిన భర్తను చూసి – “వాట్ సర్! ఇదేమీ ఐఫిల్ టవర్ కాదు ఇలా డంగైపోవడానికి. ఏదో మాలాంటి పిచ్చోళ్ళు నమ్మే దేవుడి గోపురం. దట్సాల్!” అంది రంజని.
ఆమెతో బాటూ నవ్వుతూ లోనికి వెళ్లాడు అనంత్.
గర్భగుడి దగ్గర వాళ్ళిద్దరూ దండం పెడుతుంటే ఓవారగా స్థంభానికి ఆనుకొని కూర్చున్న ముసలాయన భక్తి కీర్తన నొకటి పాడుతున్నాడు.
’దాహామణగిన వెనుక తత్వా మెరిగెదనన్న – దాహమే లణగు, తా తత్వమే మెరుగు?
దేహంబు గల అన్ని దినములకును – పదార్థ మోహమే లణగు తా ముదమేల గలుగు?’
అనంత్ కు పాత జ్ఞాపకమేదో చటక్కున గుర్తుకొచ్చింది. ఎవరి కీర్తనో గుర్తుకు రావడం లేదు గానీ అమ్మ దీన్ని చీటికీ మాటికీ పాడేది. నాన్నగారేమో “ఒసేవ్! నువ్వస్తమానం ఆ పాట పాడుతూ వుండు నీ కొడుకు సన్యాసుల్లో కల్సిపోతాడు. అంతే!” అనడం కూడా గుర్తు.
“కడలుడిపి నీరాడగా తలచు వారలకు – కడలేని మనసుకు – కడమా ఎక్కడిదీ” అని తనూ అందుకుంది రంజని.
“నీకీ పాట వచ్చా?” ఆశ్చర్యంగా అడిగాడు అనంత్.
వస్తున్న పాటలో తన శ్రుతిని కలుపుతూనే “వచ్చు”నన్నట్టుగా తలూపింది రంజని.
“ఎప్పుడూ పాడలేదే?” అన్నాడు అనంత్.
పాడ్డం ఆపేసి – “ఇది నీకూ తెలుసా?” అంది.
“ఈ పాట తెలుసు. అంటే లిరిక్ మొత్తం తెలీదనుకో. అమ్మ పాడేది.” అన్నాడు అనంత్.
రంజని “దీన్ని పాట అనరు. కీర్తన అంటారు.” అని పైకని “అత్తయ్యకి కూడా ఈ కీర్తనంటే ఇష్టమా? నా ఎదుట ఆమె ఈ కీర్తన గురించి మాటవరసకైనా ఎప్పుడూ అనలేదే!” – మనసులోనే అనుకుంది రంజని.
“వాటే ట్రాజెడీ! ఈ పాట నీకు వచ్చని నాకు తెలీదు. అమ్మకీ తెలీదు. తెలిసివుంటే ఇద్దరం కూర్చొని వినేవాళ్ళం.” అన్నాడు అనంత్. “ఈ పాట…అదే…అమ్మ పాడే ఈ కీర్తన నాకో సెంటిమెంట్.”
“అత్తయ్యకు ఈ పాటంటే ఇష్టమని నాకూ తెలీదు. నువ్వూ ఎప్పుడూ చెప్పలేదు. ఎస్! ఇది ఒక రియల్ ట్రాజెడీ!” అంది రంజని. అనంత్ తల్లి పోయి సంవత్సరం కావొస్తోంది.
తోడు దొంగ దగ్గరే దొంగిలించి దొరికిపోయిన దొంగ పరిస్థితిలా ఉంది ఆ ఇద్దరిదీ.
– – – – –
అనుకున్న ప్రోగ్రాం ప్రకారం సినిమా, హోటెల్లో డిన్నర్ ముగించుకుని ఇల్లు చేరుకున్నారు రంజనీ, అనంత్ లు.
రంజని డ్రస్ మార్చుకుని వచ్చేసరికి, హాల్లో సోఫాలో కూర్చునివున్నాడు అనంత్.
రిమోట్ తో టీవీని ఆన్ చేసి, అతని ప్రక్కనే కూర్చుంది రంజని.
ఐటమ్ సాంగ్ ఏదో వస్తోంది. వెలిగి వెలిగి ఆరుతున్న దీపాలు, పొట్టి పొట్టి డ్రస్సుల్లో పూనకం పట్టినట్టు ఎగురుతున్న అమ్మాయిలు, వాళ్ల దేహాల్లోని వంపుల్ని చూపడమే తన ధర్మమన్నట్టు అటు ఇటూ తిరుగుతున్న కెమరా. వీటన్నింటినీ మించి చెవులను హోరెత్తెస్తున్న మ్యూజిక్.
“నీళ్లు కావాలి! తీసుకొస్తావా? ప్లీజ్” అన్నాడు అనంత్. లేచి వెళ్లింది రంజని.
రంజని నీళ్లు తెచ్చేలోగా టీవీని ఆఫ్ చేసాడు అనంత్.
“ఏం? టీవీ చూడవా?” అంది రంజని.
“ఆ పాట పాడవూ!” అన్నాడు అనంత్.
“కీ..ర్త..న” అని నొక్కి పలికింది రంజని.
“స్..సారీ…కీర్తన పాడవూ!”
అనంత్ చేతికి నీళ్ళ గ్లాస్ ఇచ్చి, క్రింద కూర్చుని అతని తొడపై చేతుల్ని వేసి, ఆ చేతులపై తన తలను పెట్టుకుని…
“కడలుడిపి నీరాడగ తలచు వారలకు – కడలేని మనసుకు కడమ యెక్కడిది”
పాడమన్నది ఎవరొ తెలియది-పాడుచున్నది ఏమో తెలియదు-రాగతాళపు రీతి తెలియదు-ఐననూ నే పాడుచుంటి అన్నట్టుగా పాడుతోంది రంజని.
దాహామణగిన వెనుక తత్వా మెరిగెదనన్న – దాహమే లణగు, తా తత్వమే మెరుగు?
దేహంబు గల అన్ని దినములకును – పదార్థ మోహమే లణగు తా ముదమేల గలుగు?
ముందరెరిగిన వెనుక మొదలు మరచెదన్న – ముందరేమెరుగు తా మొదలేల మరచు
అందముగ తిరువేంకటాద్రీశు మన్ననల – కందు వెరిగిన మేలు కలనైన లేదు”
నాలుగు గోడల నడుమ ఆమె పాడుతున్నది మిశ్రమోహన రాగమో కాదో తెలీదు! ఆకలేసినవాడికి అన్నం రుచి పట్టదు…గుండె లయ తప్పినవానికి ఏ రాగజ్ఞానమూ వద్దు…సమస్యల ఎడారిలో దిక్కుతెలియనివాడికి ఊరట నివ్వగలిగే గొంతులో పలికే అపశ్రుతి కూడా దేవగాంధారమే!
అక్కడున్న నాలుగు గోడలూ, దేవుడి గదిలోని రెండు దీపాలు, నలిగిన మనసొకటి ఆమె పాటలో సేద తీరాయి.
ఆ రేయి అతను, ఆమెలో “శయనేషు మాత”ను చూసాడు.
* * * * *
“నీ రెండో ఆటకాయ ’నిష్ఠ’తో కూడి ’తపోలోకా’న్ని చేరింది దేవీ. దీని అర్థమేమిటి?” అడిగాడు కంసచాణురాది దైత్యసంహరణాదక్షుడు.
“నిశ్చలమైన ఏకాగ్రతే నిష్ఠ. దీర్ఘమూ, నిరంతరమూ అయిన ఆలోచనకే ’తపం’ అని పేరు. సంసార దుఃఖాల వల్ల కలిగే ’సంతాపం’ భగవంతుని ధ్యానాన్ని కలిగిస్తుంది. అదే తపస్సు. ఈ తపస్సు వల్ల తమస్సు తొలగిపోతుంది కదా రఘువంశమౌళీ!” అంది రమాదేవి.
“చాలా బాగా చెప్పావు కమలముఖీ!” అన్నాడు కమలాసనవంద్యుడు.
“మీ రెండో కాయ మాత్సర్యగ్రస్తమైంది. మొదటికాయ తన చిత్తశుద్ధివల్ల మహాలోకాన్ని చేరింది. ఒక్కగడి ప్రక్కనే ’నరకాసురుడు’ అడ్డుగా నిలుచున్నాడు. మీ మొదటికాయ తదుపరి నడక ఎలావుండబోతున్నది కుతూహలకరమైన ఘటనగా మారింది.” అంది శార్జ్ఙపాణిహృదయరాణి.
“చూద్దాం!” అన్నాడు నిర్దోషగుణసాగరుడు.
నారాయణుడు పాచికలు వేస్తే, అవి ఫెళ్ళుమన్న శివుని విల్లుకు కట్టబడ్డ గంటల్లా ఘల్లుమన్నాయి.
* * * * *
(సశేషం…)