వైకుంఠపాళీ – తొమ్మిదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

గత భాగం: ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ నిరుత్సాహంగా ఉండడం చూసిన రంజని అతన్ని గుడికి పిల్చుకు వెళ్తుంది. అక్కడ అనంత్ తన భార్యలో అప్పటిదాకా తెలియని కోణాన్ని చూస్తాడు. అనంత్ తల్లికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడుతుంది రంజని. క్షణికమైన కోపానికి, అహంకారానికి ప్రతినిధిలా ఉండే అనంత్ ఆ క్షణం రంజనిలో తన తల్లిని చూసుకుంటాడు.

ఇక్కడ కేశవశర్మ సుబ్రహ్మణ్యం చేత అతనికి ఇష్టంలేని పనిని చేయించడానికి పట్టుబట్టడం చూసి సుమతి ఆందోళనకు గురౌతుంది.

 

“కిమ్ కుర్వన్ ఆసీః (ఏం చేస్తున్నావు)? భవాన్ భీరుః కిమ్? (నీవు భయపడుతున్నావా)” సంస్కృతంలో అడిగాడు శర్మ, సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ.

వైదిక విధులతో బాటూ వాడికి సంస్కృతాన్ని కూడా నేర్పుతున్నాడు శర్మ. వాళ్లిద్దరు రోజూ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. శర్మ నేర్పించినవాటిల్లో సుబ్రహ్మణ్యానికి త్వరగా వంటబట్టింది సంస్కృత సంభాషణమే!

సుబ్రహ్మణ్యం జవాబునివ్వలేదు. ఆ మౌనానికి చిరాకు పడుతూ “ఏతత్ న సాధుః (ఇది బావోలేదు)” అన్నాడు శర్మ.

అక్కడే నిలబడివున్న సుమతి లోనికి వెళ్లబోయింది. “నువ్విక్కడే ఉండు సుమతీ! వెళ్ళకు.” అన్నాడు శర్మ. ఆమె ఆగిపోయింది.

సుబ్రహ్మణ్యం సుమతి వైపు చూసి తలదించుకున్నాడు.

“ఏమండి! తెలుగులో అడగండి….అంటే…నాకు అర్థం కావాలని!” అని నెమ్మదిగా అంది సుమతి.

అలాగేనన్నట్టు తలనూపుతూ “ఏం అబ్బాయ్! ఎందుకలా మాట్లడకుండా ఉన్నావ్? నేనడిగిన దాని గురించి మాట్లాడు.” అన్నాడు. శర్మ.

సుబ్రహ్మణ్యం మౌనంగానే ఉండిపోయాడు. శర్మ ఓపిగ్గా నాలుగైదుసార్లు అడిగిందే అడిగాడు. కానీ సుబ్రహ్మణ్యంలో ఎలాంటి స్పందనా రాలేదు.

’ఛళ్’మని పేలింది సుబ్రహ్మణ్యం దవడ. మరో రెండుసార్లు చెంపలు వాయించాడు శర్మ.

సుమతి నిశ్చేష్టురాలైపోయింది. “అనుకున్నంతా జరిగింది! ఆయన సహనం పోగొట్టుకున్నారు. పుణ్యానికి పోతే పాపమెదురైనట్టుగా అయ్యింది. ఎందుకిలా గుడ్డి మోహాన్ని అంటువేసుకున్నారీయన?” అని పరిపరివిధాలా ఆలోచించసాగింది సుమతి.

నొప్పిని పంటిబిగువులో నొక్కిపెట్టి, సుమతి వైపు చూసాడు సుబ్రహ్మణ్యం. ఆమె ’మాట్లాడ’మన్నట్టు సైగ చేసింది. అంతేకాదు తన రెండు చేతుల్నీ జోడించింది.

సుమతి ముఖంలోని బేలతనం సుబ్రహ్మణ్యంలోని కాష్టమౌనాన్ని దహించింది.

“ఆచార్యా!…” అంటూ ఆగిపోయాడు సుబ్రహ్మణ్యం.

నోరువిప్పి, ఆగిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ – “సంకోచః మాస్తు! ఆవశ్యకం చేత్ పృచ్ఛతు!” అని ఆగి, “సంకోచ పడకు, చెప్పదల్చుకున్నదేదో చెప్పు” అన్నాడు శర్మ. మాటలు కరుకుగా లేకపోయినా అతని గొంతులో మెత్తదనం లేదన్నది తెలుస్తోంది.

“ఆచార్యా! అహమ్..దశవారమ్ పఠితవాన్..తథాపి…నస్మరతి.”

“తెలుగులో చెప్పు.” అన్నాడు శర్మ.

“మీరు చెప్పినదాన్ని ఒకటికి పదిమార్లు చదువుతున్నాను. కానీ గుర్తుండటం లేదు. ఎందుకలా గుర్తుండటం లేదని నాలో నేనే చాలాసార్లు అనుకున్నాను. బహుశా ఈ శాస్త్రం, సాంప్రదాయ పద్ధతుల్లో నాకు ఆసక్తి లేకపోవడం వల్లనేమో అని అనిపించింది.”

అప్పుడు, సుమతి వైపు చూసాడు శర్మ. ఆమె కూడా అతని వైపు చూసింది.

“నువ్వు ఊహించింది నిజమే సుమా!” అన్నట్టుంది శర్మ చూపు.

“దయచేసి, పసివాడిని అర్థం చేసుకోండి!” అని అంటున్నాయి ఆమె కన్నులు.

సుబ్రహ్మణ్యం చెప్పుకు పోతున్నాడు “మా తాతగారు గొప్ప వేదపండితులు. మా నాన్నగారు పెద్ద యూనియన్ లీడర్. వర్కర్స్ కోసం ఎంతో పోరాడారు. పోలీస్ ఫైరింగ్ లో చచ్చిపోయారు. ఆయన చనిపోవడంతో గవర్నమెంటు కూడా దిగిరావాల్సివచ్చింది. ఇప్పుడు ఆయన ఫోటో కొన్ని వందల వర్కర్స్ ఇళ్ళలో ఉంది. వాళ్ళల్లో ఎంతమంది తమ తల్లిదండ్రుల ఫోటోలను పెట్టుకున్నారో తెలీదు. కానీ మా నాన్నగారి ఫోటోని పెట్టుకొన్నారు. అంతేకాదు, రోజూ దండం పెడతారు. ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు నిలబడి, ఇంత అన్నం తింటున్నారంటే మా నాన్నగారు, ఆయనతో పాటూ ఫైరింగ్ లో చనిపోయిన ఇంకొంతమంది లీడర్సే కారణం. మా తాతగారు చనిపోతే బంధువులు తప్పించి ఇంకెవ్వళ్ళూ రాలేదు. అదే నాన్నగారు పోయిన రోజున బైట వూళ్ళ నుండి కూడా జనాలు వచ్చారు. కంటి నిండా నీళ్ళు పెట్టుకొన్నారు. శవాన్ని మోయడానికి పోటీలు పడ్డారు. ఇప్పటికీ యూనియన్ వాళ్ళు నాన్న వర్ధంతి రోజున బీదలకు అన్నదానం చేస్తారు.” – తను చెప్పుకుంటూ పోతున్నది ఎదుటివాళ్ళు వింటున్నారో లేదోనన్న అనుమానం వచ్చి ఆగాడు.

ఎదురుగా, ఆ దంపతులిద్దరూ సుబ్రహ్మణ్యం వైపు తదేకంగా చూస్తున్నారు. ఎవరి ముఖంలో ఏ భావం మెదుల్తుందో కనుక్కోలేకపోయాడు సుబ్రహ్మణ్యం. మళ్ళీ కొనసాగించాడు.

“నాకు నాన్నలా బ్రతకాలనివుంది. వీలైనన్ని మంచిపనులు చేసి మంచివాడినని అనిపించుకుని చచ్చిపోవాలని ఉంది. ఈ విషయాలు అమ్మకీ, మామకీ అర్థం కాదు. కాలేదు కూడా. వాళ్ళ తీరే వేరు. ఇలాంటి మంచి ఆలోచనలు కలలో కూడా రానివ్వరు వాళ్ళు.” – తను ఇప్పుడన్న మాటలు చాలా ముఖ్యమైనవని, అవి వింటున్నవాళ్ళ మనసుల్లోకి ఇంకాలన్నట్టుగా మళ్ళీ ఆగాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళేదైనా చెబుతారేమోనని మౌనం వహించాడు.

ఆ దంపతులనుండి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు.

సుబ్రహ్మణ్యం మళ్ళీ మాట్లాడుతూ “ఆచార్యా! నేను వైదిక విద్యను తప్పుపట్టడం లేదు. పనికిరానిదని అనుకోవడం లేదు. నాకు ఆసక్తి లేదని మాత్రమే చెబుతున్నాను. కనుక నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నిజానికి మీకు నేనేమీ కాను. ఐనా మీరు నాపై చాలా అభిమానాన్ని పెంచుకొన్నారు. ముఖ్యంగా…’ అంటూ సుమతి వైపు చూపిస్తూ “ఆ అమ్మ! మా అమ్మ నన్ను కూలివాడిని చేసింది. ఏరోజుకారోజు నా అన్నాన్ని నన్నే వెదుక్కోమంది. కానీ ఈ అమ్మ నాలాంటి పనికిమాలినవాడిలో వామనమూర్తిని చూసి, కడుపు నిండా అన్నం పెట్టింది.” ఈ మాటల దగ్గర సుబ్రహ్మణ్యం గొంతు వణికింది. నాలుక తడబడింది.

“ఆచార్యా! మీలాంటి మంచివాళ్ళని మోసం చెయ్యడం మహాపాపం. నా మనసులోని మాటల్ని మీకు చెప్పి, మీ ఆశీర్వాదాన్ని పొందితేనే నాకు శుభం జరుగుతుంది. నాకు నచ్చినదాన్ని సాధించే అర్హత కలగాలని మనస్పూర్తిగా ఆశీర్వదించండి.” అని నేల మీద సాష్టాంగపడి శర్మ కాళ్ళను పట్టుకుని “తత్రహమ్ కిమపి న వదామి (ఇక నేనేమీ మాట్లాడను)” అన్నాడు సుబ్రహ్మణ్యం.

శర్మ ఉన్నచోటు నుండి కదల్లేదు. కళ్ళు గట్టిగా మూసుకుని నిలబడిపోయాడు.

సుమతికి ఆందోళనగా ఉంది. శర్మ భుజాల్ని పట్టుకుని కుదిపింది.

“ఏమండీ! అబ్బాయి చెప్పింది విన్నారుగా. దయచేసి వాణ్ణి కోప్పడకండీ!” అని వణుకుతున్న స్వరంతో మాట్లాడింది సుమతి.

కళ్ళు తెరచిన శర్మ “సుమతీ! వీడే నా కొడుకు అనుకుని తీసుకొచ్చాను. అది వీడు గ్రహించినట్టు లేదు. నా మనసును తెలుసుకునివుంటే ’నేను మీకేమీ కాకపోయినా అభిమానం చూపించా’రని చెప్పేవాడు కాడు. నిజమే! నా పిచ్చి వ్యామోహంలో పడిపోయి వీడిపై అనవసరంగా కోప్పడి కొట్టాను.” అంటూ సుబ్రహ్మణ్యంను లేవనెత్తాడు శర్మ.

“చూడు సుబ్రహ్మణ్యం! మీ తాతగారి నిష్క్రమణానికీ, మీ నాన్నగారి దుర్మరణానికీ ఏవో పోలికలు పెట్టి చెప్పావు. అది సరికాదురా! బంగారాన్నీ, వెండినీ విడివిడిగానే చూడాలి గానీ ఒకదానితో ఒకటి పోల్చకూడదు. ఐనా ఇది నీ తప్పు కాదు. నీకింకా అంత ఎదుగుదల రాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టను. నీకిష్టమైనదాన్నే చెయ్యి. నీకంతా మంచే జరగాలని కోరుకుంటాను.” అన్నాడు శర్మ.

సుబ్రహ్మణ్యం సుమతి కాళ్ళను తాకి నమస్కరించాడు. ఆమె వాడి రెండు భుజాలనూ పట్టుకుని “వెళ్ళిపోతావా?” అని అడిగింది.

శర్మ కొట్టినప్పుడు రాని కన్నీళ్ళు అప్పుడు వచ్చాయి.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

మళ్ళీ అడిగింది సుమతి “వెళ్ళిపోతావా?”.

సుబ్రహ్మణ్యం ఏదో చెప్పబోతుండగా శర్మ అడ్డుపడి “వాడు చెయ్యాలనుకొన్న పనులేమిటో? ఎలాంటివో? మనలాంటి ఛాదస్తులకు అవి నచ్చుతాయో లేదో! వాడిక్కడే ఉంటూ ఇబ్బంది పడేదాని కంటే నచ్చిన చోటుకెళ్ళి నచ్చినపని చేసుకోనీ సుమతీ!” అన్నాడు.

ఔనన్నట్టు తలవూపాడు సుబ్రహ్మణ్యం.

“అంతేనా సుబ్రహ్మణ్యం?” అంది సుమతి. తలవంచాడా అబ్బాయి.

అతని భుజాల్ని వదిలేసింది సుమతి.

మళ్ళీ రెండు చేతుల్నీ జోడించి ఆ ఇద్దరికీ దండం పెట్టాడు సుబ్రహ్మణ్యం.

“నీ సామాన్లు సర్దుకో. మీ మామ ఇంటి దాకా నేనూ వస్తాను.” అన్నాడు శర్మ.

* * * * *

సుబ్రహ్మణ్యాన్ని అతని మేనమామ ఇంటి వద్ద విడిచి వెనక్కు వచ్చిన శర్మలో ఉక్రోషం తగ్గలేదని గ్రహించింది సుమతి.

ఆ సాయంత్రం సంధ్యవార్చిన తర్వాత మామూలుగా చేసుకునే పారాయణాన్ని చెయ్యకుండా లేచివెళ్ళిపోయిన భర్తను చూసి కంగారు పడింది సుమతి. రాత్రి భోజనాలయ్యాక అతన్ని కదిపింది.

“వాడిపై మీకింకా కోపం తగ్గలేదా?”

“కోపమా? ఆ ఇంటి దగ్గర దింపేసి వెనక్కి తిరగ్గానే వాణ్ణి మర్చిపోయాను!” అన్నాడు శర్మ.

“సాయంత్రం పారాయణం చెయ్యలేదెందుకు?”

“అంటే? ఏమిటి నీ ఉద్దేశ్యం? ఎవడో పనికిమాలిన వెధవ కోసం ఇలా చేస్తున్నాననా?” కరుకుగా అన్నాడు శర్మ.

“మీ మనసు ఎంత బాధపడివుంటే పారాయణం చెయ్యకుండా ఉండగలరు చెప్పండి?” అంది సుమతి.

ఏదో అనబోయి తమాయించుకున్నాడు శర్మ.

ఏవైనా ఆధ్యాత్మిక విషయాలను అడిగితే భర్త ధ్యాస మరలవచ్చునన్న నమ్మకంతో “సుబ్రహ్మణ్యం తాతగారు నిష్క్రమించారని అన్నారు. అంటే అది మామూలు మరణం కాదా?” అని అడిగింది సుమతి.

“అవును. వాడి మట్టిబుర్రకు అవేం తెలుస్తాయి?” అన్నాడు శర్మ.

“వాడి సంగతి వదిలేయండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.”

“సుమతీ! సుబ్రహ్మణ్యం తాతగారు గొప్ప పండితులే కాదు గొప్ప యోగి కూడా. ఆయన బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పోయారు. అంతేగానీ సామాన్యుల్లాగా నవరంధ్రాలనుండి ప్రాణం పొగొట్టుకొని చనిపోలేదు.”

“అంటే చావన్నది అందిరికీ ఒకేరకంగా రాదా?”

“పిచ్చిదానా! పంచ భేదయుతం ప్రపంచం. ప్రపంచం అన్న పదానికి ఐదు భేదాలతో కూడిందని అర్థం. ప్రపంచంలోనివన్నీ వైవిధ్యమయాలే. ప్రతి ఒక్కటీ తనకు తానుగా ప్రత్యేకమైనదే. చూడ్డానికి ఒకే విధంగా కనబడే వస్తువుల్లో కూడా తేడాలుంటాయి. ఒక వ్యక్తి చేతిలోని వేళ్ళే ఒకదానికొకటి పోలిక లేకుండా ఉన్నప్పుడు, ఒక మనిషికీ మరో మనిషికీ తేడా ఉండదా? ఆ వేలి ముద్రల్లో అంతటి ప్రత్యేకత లేకపోతే ఈనాటి పోలీసులు నేరస్తుల్ని సులువుగా పట్టుకునేవారా?” అన్నాడు శర్మ.

భర్త నెమ్మదిగా తన సహజధోరణిలోకి వస్తుండడం చూసిన సుమతి చర్చను కొనసాగించాలని అనుకుని “మీరు చెప్పింది అర్థమైంది. కానీ సులభమైన ఉదాహారణ ఇస్తే ఇంకా బాగా అర్థమౌతుందండి!” అని అంది.

“ఇంకా సులభమైన ఉదాహరణంటే…..ఆ(…నువ్వు తిరగమాత వేసేప్పుడు వేడినూనెలో ఆవాలు వేస్తే ఏమౌతుంది?”

“అవి చిటపటమంటాయి!”

“ఆవాలు చూసేందుకు ఒకేలా ఉన్నా, నూనెలో వేసిన తర్వాత ఒకేసారి ’చిట్’ మని వేగవు. ఎందుకు?”

“అమ్మయోయ్! తాళింపు వెయ్యడమేగానీ తత్వం వెలికితీయడం తెలీదు నాకు!” అంది సుమతి, కళ్ళను పెద్దవిగా చేసి.

ఫక్కున నవ్వాడు శర్మ. “చేసే ప్రతి పనిలోనూ భగవంతుని సృష్టి విచిత్రాలను చూడాలి. అప్పుడే తత్వం తెలిసివస్తుంది.”

“ఇక నుండి అలానే ప్రయత్నిస్తాను. కానీ ఈ ఆవాల చిక్కుప్రశ్నకు జవాబు త్వరగా చెప్పేయండీ. చూసేందుకు ఒక్కలానే ఉన్న ఆవాలు ఒక్కొక్కటి ఒక్కోసారి చిటపటమని వేగుతాయెందుకు?” అంది సుమతి.

“మరేం లేదు. సైన్స్ ప్రకారమైతే ఆవాల్లోని ఒక్కో కణం యొక్క సాంద్రత అంటే డెన్సిటీ ఒక్కోరకంగా ఉండడం వల్ల అవి వేరువేరు సమయాల్లో వేగుతాయి. అంటే కంటికి ఒకేరకంగా కనబడుతున్న పదార్థాల్లో, కంటికి కనబడని సూక్ష్మమైన తేడాలుంటాయన్న మాట. ఆ తేడాల వల్ల ఒకే పదార్థంలోని వివిధ కణాలు లేక భాగాలు ఒక్కోరకంగా ప్రవర్తిస్తాయి. ఇదే వైవిధ్యమంటే. ఈవిధంగానే ప్రతి మనిషిలోనూ అవయవాలు ఒకేరకంగా ఉంటాయి. కానీ ఈ అవయవాల్ని నడిపే ’బుద్ధి’ ఒకేరకంగా ఉండదు. అందువల్ల ఆయా వ్యక్తులు చేసే చర్యలు వేరు వేరుగా ఉంటాయి. ఆ చర్యల వల్ల కలిగే ఫలాలు కూడా వేరుగా ఉంటాయి.” అన్నాడు శర్మ.

“ఆవాల్లో ఇంత ఆంతర్యముందన్న మాట. చాలా బావుంది. ’బుద్ధి’లో తేడాలుంటాయన్నారు. అది ఎందుకు? ఆ తేడాలు ఎలా వస్తాయి?” అంది సుమతి.

“నీకు నిద్ర రావడం లేదా?” అన్నాడు శర్మ. లేదన్నట్టు తల తిప్పింది సుమతి.

“సరే! విను! ’లోకే యథాన్నం భుంజతే తథా బుద్ధి ప్రజాయతే’. లోకంలో ఎలాంటి పదార్థాల్ని తింటారో అలాంటి బుద్ధి పుడుతుందని శాస్త్రవచనం. మనం తినే పదార్థాలు కడుపులోకి వెళ్ళాక నాలుగు రకాలుగా జీర్ణం కాబడతాయి. అందులో ఒకభాగం మాంసవృద్ధికి, ఒకభాగం రక్తవృద్ధికి, ఒకభాగం ఎముకలు బలపడ్డానికీ వాడబడతాయి. నాలుగోభాగం మనసుగా మారుతుంది. మనసులోని ఏ భాగంలో ’నిర్ణయ శక్తి’ అంటే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుందో దాన్ని బుద్ధి అంటారు. అందుకనే మనమేదైనా వెర్రి పనులు చేస్తే ’బుద్ధి లేదా’ అని పెద్దలు తిడతారు. ’మనసు లేదా’ అని తిట్టరు!”

“ఓహో…బుద్ధిలేదా అని అనడంలోని అసలు సంగతి ఇదా?” అంది సుమతి.

“ఈ బుద్ధిశక్తి వల్లనే మానవుడు ఇతర జంతువుల కంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఈ శక్తి తినే ఆహారం వల్ల వస్తోంది. అందుకనే శుద్ధమైన ఆహారాన్ని తినమని పెద్దలు చెబుతారు. రుచిని కలిగిన పదార్థాలన్నీ మన బుద్ధికి మేలు చేసేవిగా ఉండవు. అందుకనే హితంగానూ, మితంగానూ తినమని పెద్దలు చెప్పారు. ఎప్పుడైతే బుద్ధికి ఉపయోగపడే ఆహారాన్ని తీసుకోక, కేవలం నాలుకను తృప్తి పరిచే ఆహారాన్ని తీసుకుంటారో అప్పుడు ఆ వ్యక్తుల్లోని బుద్ధిశక్తి మందగిస్తుంది. అది అర్థంలేని పనులను చేయడానికి కారణమౌతుంది. దాని వల్ల వ్యక్తి నష్టపోవడమే కాకుండా సమాజం కూడా దెబ్బతింటుంది.” అన్నాడు శర్మ.

“తెలుసుకుంటే ఎన్ని సూక్ష్మ విషయాలున్నాయో!” అంది సుమతి.

“అవును. ఓ యాభై ఏళ్ల క్రితం కూడా వడ్లు మొదలైనవి దంచేప్పుడు సువ్వి పాటలో, ఆహూఊహూ పదాలో పాడుకుంటూ పని చేసేవారు. ఆ పాటల్లో భగవంతుని లీలల్ని పొందుపరిచి పాడుకునేవారు.”

“ఎందుకు?” అంది సుమతి.

“ఎందుకంటే ఆ ఆహారాన్ని తినడంలోనే కాదు వండడంలో కూడా బుద్ధి యొక్క ప్రభావముంటుంది. చెడ్డ ఆలోచనలను చేస్తూ వండితే, ఆ ఆహారం కూడా దోషమయంగా ఉంటుంది.” అన్నాడు శర్మ.

“ఐతే నాలోనే ఏదో దోషం జరిగింది.” అంది సుమతి.

అర్థంకానట్టు ఆగాడు శర్మ. “ఏమన్నావ్?”

“నా లోనే ఏదో పెద్ద తప్పు జరిగివుండాలి! నా బుద్ధిలో ఏదో చెడు ఆలోచన జరిగివుంటుంది! లేకపోతే ఎప్పుడూ శాంతంగా ఉండే మీరు సుబ్రహ్మణ్యాన్ని కొడతారా? ఈరోజు పారాయణం కూడా చెయ్యకుండా ఉంటారా?” – తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా అంది సుమతి.

సుమతి చెప్పినదాన్ని పూర్తిగా అర్థం చేసుకోగానే తొట్రుబాటుకు లోనయ్యాడు శర్మ.

తను చేసిన అవివేకపు పనికి ఆమె జవాబ్దారీ వహిస్తున్నట్టుగా మాట్లాడ్డం చూసిన శర్మకు తాను చాలా అల్పుడైపోయినట్టుగా అనిపించింది. అలా అనిపించడంలో అతనికి అవమానమనిపించలేదు.

సుమతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు శర్మ.

“అంతేకదండీ! లేకపోతే మీరు అకారణంగా అలా కోప్పడేవారా? సుబ్రహ్మణ్యాన్ని కొట్టేవారా?” అంది.

ఆమె గొంతులోని సహజమైన ఆర్ద్రతకు, సౌశీల్యానికి విచలతిమైపోయింది శర్మ మనసు.

“ఎప్పుడూ పక్కవారిలో తప్పుల్నే వెదికే ఈలోకంలో ఇలా లేని తప్పుల్ని తమ మీద వేసుకునే సచ్ఛీలురుంటారన్న నమ్మకం…ఇదిగో…ఈక్షణంలో పుట్టింది. ఈ పాఠం నేర్పడానికేనా భగవంతుడు నాకా వెర్రి ఆవేశాన్ని ఇచ్చింది? నన్ను దిద్దడానికేనా ఆ అమాయకుణ్ణి కొట్టించింది? భగవాన్! ఈ పాఠం చాలయ్యా! మరో వేయి జన్మలకైన మర్చిపోలేని విధంగా చెప్పించావు.” –అహం బుద్ధిలో లయమై, ఆ బుద్ధి చిత్తంతో చేరితే, శర్మ మనసు నిర్మలమై, నిరహంకారభూషితమైంది.

జ్ఞానోపార్జన కేవలం కర్మల వల్లనే లభించదు. స్థిరమైన మనసు ఉన్ననాడు ఎలాంటి అధ్యయనం లేకుండగానే ఆత్మతత్వం బోధపడుతుంది. ఇప్పుడు తన ఎదురుగా కూర్చున్నది కేవలం ఒక భార్య కాదు. అన్ని రంగుల్నీ తనలో ఐక్యం చేసుకున్నా తన స్వచ్ఛతను కోల్పోని తెలుపు రంగులా వెలుగుతున్న ఒకానొక ఆత్మసౌందర్యం. ఈమె అధ్యయనం చెయ్యలేదు! యాగయజ్ఞాలూ చెయ్యలేదు! జటాధ్యాయి కాదు! ఘనాపాఠీ కాదు! పురాణాలను ఔపోసన పట్టలేదు! ఉపనిషత్తులెన్నున్నాయో తెలీదు! కానీ త్రిమూర్తుల్ని పసిపాపలను చేసిన అనసూయలా అహమ్, విద్యామదం, కేవల కర్మనిష్ఠత్వమనే మూడు అవగుణాలతో బాధపడుతున్న తనను పసిపాపను చేసి అసూయారహితమైన మనసును సాధించిన ఒక యోగి!

“ఏమండీ! అంతే కదూ! చెప్పండి?” అన్న సుమతి మాటలతో ఈలోకానికి వచ్చాడు శర్మ.

“కాదు సుమతీ! తప్పు నీది కాదు. విద్యాగార్ధభః అన్నట్టు అన్నీ తెలుసునన్న అహంకారంతో అవివేకంగా మాట్లాడిన నాదీ తప్పు. నీలో స్వచ్ఛత లేకపోతే నేను ఏమైపోయేవాణ్ణో? నాలోని అవివేకానికి నేనే కారణం. ఇక ఈ విషయమై ఏమీ మాట్లాడకు.” అన్నాడు శర్మ.

“నా తప్పేమీ….” ఇంకా ఏదో అనబోతున్న సుమతి నోటిని తన చేత్తో మూసాడు శర్మ.

* * * * *

“అద్భుతం మహాభాగా! మీ మొదటికాయ నరకాసురుడిని దాటి మయూరమైంది.” అంది మహిషాసురమర్దిని.

నవ్వాడు నారాయణుడు.

“మీ మొదటి కాయ చేరిన నూటఎనిమిదవ గడిలో నెమలి ఉంది. దాని తాత్పర్యమేమిటి స్వామీ?” అని అడిగింది సౌశీల్యగుణమణి.

“నీ మనసులోని మాటను చెప్పు దేవీ. ఆపై నేను చెబుతాను.” అన్నాడు అవ్యయుడు.

“చిత్తం స్వామీ! నా బుద్ధికి గోచరమైనంత వరకూ వివరిస్తాను. కార్తికేయుని వాహనం నెమలి. కార్తికేయుడు మన్మథుని మరో అవతారం. మన్మథుని వాహనం చిలుక. అంటే మానవుల మనస్సులలో కామాన్ని ప్రేరేపించి, మనస్సును మధించే మన్మథుడు తన రెండు రూపాలలోనూ వర్ణప్రధానమైన జంతువుల్ని వాహనాలుగా చేసుకున్నాడు. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే, మానవుల మనస్సు రంగుల యొక్క హంగులకు త్వరగా బానిసైపోతుంది. ఏ వస్తువైనా కంటికింపైన వర్ణాల్లో వెలుగుతుంటే చాలు, మానవులు ఇట్టే ఆకర్షింపబడతారు. ఎలాగైతే దీపపు వెలుగుకు ఆకర్షితమైన శలభం ఆ రంగుకు భ్రమపడి, వెళ్ళి కాలిపోతుందో అదే విధంగానే మానవులు కూడా రంగుల ఆకర్షణలకు లోబడి తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. జీవితమనే నాణ్యానికి ఇది ఒక వైపు.

మరోవైపు చూస్తే, కార్తికేయుడు దేవతలకు సైన్యాధిపతి. తారకాసురుడు వంటి బలిష్టుడైన రాక్షసుణ్ణి చంపినవాడు. తారకం అన్న పదానికి అర్థం దాటించేది అని. కొన్ని కొన్ని విషయాలు మనల్ని తీరాన్ని దాటించేవిగా కనబడుతుంటాయి కానీ వాటిల్లో అంతర్లీనంగా చెడ్డతనం దాగివుంటుంది. అలాంటి అసురభావంతో కూడిన విషయాలను చంపేవాడు సుబ్రహ్మణ్యుడు. అలాంటి కార్తికేయుడు, ఆకర్షణకు నిదర్శనమైన నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. ఆవిధంగా మానవులు కూడా ఆకర్షణలను త్రొక్కివేసి, ఆధ్యాత్మికానందానికి అడ్డుతగిలే తారకాసురుల్ని వధించి, భూలోకంలో భగవంతుని సైన్యాధిపత్యాన్ని వహించాలి.” అంది జ్ఞానసుగంధ సుందరి.

“బాగు బాగు!” అన్నాడు భాగవతజనప్రియుడు.

“మీ తత్త్వ విమర్శన కోసం ఎదురుచూస్తున్నాను ఆర్యా!” అంది జనకప్రియనందన.

“దేవీ! విను! నెమలిలోని ప్రధాన ఆకర్షణ దాని నృత్యం. ఆ నృత్యానికి వన్నె తెచ్చేది దాని పింఛం. ఎక్కడో అడవిలో వాన కురవబోతున్న సమయంలోనో లేక ఆడ నెమలిని ఆకర్షించే నిమిత్తంగానో మగ నెమలి తన పింఛాన్ని విరబూయిస్తుంది.  ఆడ నెమలితో జరగబోయే సంయోగాన్ని తలచుకుని తలచుకుని నర్తిస్తుంది. ఈ నాట్యం మగ నెమలి ఇష్టానుసారమే జరుగుతుంది గానీ మానవులు కోరినప్పుడు జరుగదు. అలానే ఒకానొక ’కామా’నికి లోబడిన మానవుని మనసు ఆ కామఫలాన్ని తలచుకుని తలచుకుని అందులోనే తల్లీనతని పొందుతుంది. మరులుగొన్న మనసులో విపరీతమైన ఆశలు పురులు విప్పుతాయి. ఆ సంరంభంలో మానవుని మనసు చాలాసార్లు విచక్షణను కోల్పోతుంది.” అన్నాడు నారాయణుడు.

“అందమైన నెమలిపింఛం వెనుక ఇంత నిర్వేదమున్నదా స్వామీ?” అంది శతపత్రజాత.

“నీ మాటలను వింటుంటే ఆ పక్షిపై నీకు అమితమైన ప్రేమ ఏర్పడినట్టుంది!” అన్నాడు మురళీగానలోలుడు.

“మీకు మాత్రం ప్రేమ లేదంటారా శిఖిపింఛమౌళీ?” అంది రుక్మిణి.

హాయిగా నవ్వాడు హయముఖుడు.

“నిజమే దేవీ! నెమలిపింఛంలో మరో వింత దాగుంది. నెమలి తన పురిని ముడుచుకున్నప్పుడు అందులోని అందం ఎవరికీ తెలిసిరాదు. వర్షాకాలంలోనో, ఆడ నెమలి సాంగత్య సంభ్రమతోనో లేక తనకు తాను రక్షణను కల్పించుకోవడానికో నెమలి పురిని విప్పినపుడు ఆ అందం అందరికీ అవగతమౌతుంది. అలానే, మానవులు మంచివారిని రోజూ చూస్తూనేవుంటారు. కానీ మంచితనాన్ని వెంటనే తెలుసుకోలేకపోతారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు, ఐనవారందరూ ఒంటరిగా వదిలి వెళ్ళినపుడు, ఆ మంచివారి దయాగుణాన్ని చవిచూస్తారు. అప్పటిదాకా చాలా సాధారణంగా కనబడిన ఆ వ్యక్తుల్లోని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. పురివిప్పిన నెమలి, పొరలు తొలగిన మనసు ఒకేవిధంగా ఆకర్షిస్తాయి. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.”

“ఆహా! చక్కటి ఉపదేశం స్వామీ.”

“మరి నీ మొదటి ఆటకాయను నడుపు!” అన్నాడు భక్తవశ్యుడు.

“ఆజ్ఞ” అంది ఆశ్రితజనపావని.

అమ్మ పాచికల్ని వేస్తే చిన్నికృష్ణుని సిరిమువ్వల్లా ఘల్లుమన్నాయి.

* * * * *

(సశేషం…)

 

Your views are valuable to us!