గత భాగం: అనంత్ తో మాట్లాడుతూ తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నట్టు చెబుతుంది రంజని. ఆమెకు సుమతిలా జీవించాలన్న కోర్కె బలంగా ఉందని గ్రహించిన అనంత్ సరేనంటాడు. అతి కష్టం మీద రంజని రాజీనామాను అంగీకరిస్తాడు అరవింది. |
మళ్ళీ ఆ పల్లెటూరులో…
సుమతి హాయిగా గాలి పీల్చింది.
ఆ తెల్లవారుజామునే అక్కడికి వచ్చారు శర్మ దంపతులు.
గర్భవతియైన భార్య కోరిన కోర్కెను తీర్చడానికి గాను పట్నం నుంచి పల్లెటూరుకు మకాం మార్చాడు శర్మ.
“మాతృజం హ్యస్య హృదయం మాతృశ్చ హృదయేన తత్
సంబద్ధం తేన గర్భిణ్యాః నేష్టం శ్రద్ధావిమాననమ్”
“గర్భంలో పెరిగే బిడ్డ యొక్క మనసు తల్లి వల్లనే తీర్చిదిద్దబడుతుంది. ఆవిధంగా బిడ్డ మనసుకు, తల్లి మనసుకు అవినాభావ సంబంధముంది. కాబట్టి గర్భిణికి ఏ విషయం పట్ల అనురక్తి కలుగుతుందో దాన్ని ఉపేక్ష చేయకుండా పూర్తి చేయా”లన్న శాస్త్రవాక్కులో శర్మకున్న అచంచల విశ్వాసం అతన్ని మళ్ళీ ఈ పల్లెటూరుకు మళ్ళించింది.
ఆ మారుమూల పల్లెలో, జనసంచారం లేని ఆ గుడికి దగ్గరగా, తంబూరల్ని మీటుతూ నిలబడివున్న భక్తుల విగ్రహాల సాన్నిధ్యంలో ఉండాలన్నది సుమతి కోరిక.
ఆమెకు వచ్చిన కలలకు, తన భావి జీవితానికీ మధ్య ఉన్న రహస్య సంబంధమేదో పూర్తిగా వ్యక్తమౌతుందన్న మరో నమ్మకం కూడా శర్మను అక్కడకు వెళ్ళేట్టు చేసింది.
హోమాన్ని చేసిన కొద్దికాలంలోనే సుమతి కడుపు పండడాన్ని తెలుసుకున్న త్ర్యంబక ఉపాధ్యాయ, అతని భార్య అపర్ణాదేవి చాలా సంతోషించి, అత్యంత ఆదరంతో ఆ దంపతుల్ని ఆహ్వానించారు. వారింటికి వెనక భాగంలో ఉన్న ఓ చిన్న ఇల్లును శుభ్రం చేయించి, అందులో శర్మ-సుమతుల విడిదికి ఏర్పాట్లు చేసారు.
భర్త పూజా ఏర్పాట్లకు ఎంత శ్రమ వహించాలో అంతేవరకే సుమతిని పరిమితం చేస్తోంది అపర్ణ. “అబ్బే! రోజువారి పనులన్నీ నేను చేసుకోగల”నని చెప్పినా వినకుండా వారించింది అపర్ణ. పెద్ద పట్నంలో భర్త నుండి తప్ప మరొకరి అనురాగం చవిచూడని సుమతికి అపర్ణ చూపిస్తున్న ఆదరువుకు కళ్ళు చెమర్చాయి. అదే మాట శర్మతో కూడా అంది. అందుకు శర్మ “బాంధవానాం విష్ణుభక్తాశ్చ!” అని మాత్రం చెప్పి మౌనం వహించాడు.
– – – – – – –
గుడిలో పారాయణం చేసుకువస్తానని చెప్పి వెళ్ళిపోయాడు శర్మ.
అసురసంధ్య వేళలో గర్భవతి బైట తిరగడం కూడదని అపర్ణ నొక్కి చెప్పడంతో వెళ్ళకుండా ఆగిపోయింది సుమతి.
కీర్తననేదో చిన్నగా కూనిరాగంలా పాడుతూ దేవుడి దగ్గర దీపం వెలిగించి, ముందు గదిలోకి వచ్చి అక్కడున్న చిన్ని గూట్లోని వినాయకుడి విగ్రహం ముందు మరో దీపాన్ని వెలిగించి, దండం పెట్టి వెనక్కు తిరిగిన సుమతి ఉలిక్కిపడింది.
తలవాకిలి గడపకు అవతల ఓ పది-పన్నెండేళ్ళ అమ్మాయి నిలబడివుంది.
“ఎవరు కావాలి?” అని అడిగింది సుమతి.
ఆ అమ్మాయి జవాబునివ్వలేదు సరికదా సుమతి వైపు రెప్పార్పకుండా చూడసాగింది.
“నిన్నే అమ్మాయ్! ఎవరు కావాలి?” అని మళ్ళీ అడిగింది సుమతి.
“కొత్తగా వచ్చారా?” – పొడిపొడిగా అడిగింది ఆ అమ్మాయి.
“అవును.”
“ఎప్పుడెళ్ళిపోతారు?”
ఆ ప్రశ్నకు నివ్వెరపోయింది సుమతి. ఏం చెప్పాలో తోచక మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి రెప్పార్పకుండా చూస్తూనేవుంది. ఆ చూపులకు తెగ ఇబ్బందిపడిపోసాగింది సుమతి.
అంతలో అటుకేసి వచ్చిన అపర్ణ వడివడిగా వచ్చి – “ఏయ్! సోమి! ఇక్కడేం చేస్తున్నావే? పో పో!” అని గద్దించినట్టుగా అరిచింది.
మారుమాట్లాడకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ, ఒక్కసారి వెనక్కు తిరిగి సుమతి వైపు గుచ్చి చూసింది సోమి అని పిలువబడిన ఆ అమ్మాయి. ఆ చూపుకు గతుక్కుమంది సుమతి మనసు.
“ఎవరక్కా ఆ అమ్మాయి?” – ప్రహరీగోడకున్న వాకిలిని దాటుకువెళ్తున్న సోమి వైపే చూస్తూ అడిగింది సుమతి.
“రెండు వీధులవతల ఉండే మోహన్రావు గారి మొదటి భార్య కూతురు. దాని పూర్తి పేరు సోమక్క. మోహన్రావు గారి అమ్మపేరునే దీనికి పెట్టారు. ఇది పుట్టిన ఆరునెల్లకే మీనాక్షి అంటే మోహన్రావు గారి మొదటి భార్య, హటాత్తుగా పోయింది. పెద్దలు బలవంతం చేయడంతో ఇంకో పెళ్ళి చేసుకున్నారాయన. సవతి తల్లి మంచిదే! కానీ ఆమె వచ్చే సమయానికి దీనికి పిచ్చి పట్టుకుంది…”
“అయ్యో! పిచ్చా? చూసేందుకు లక్షణంగా ఉంది.” అంటూ అపర్ణ మాటలకు అడ్డు తగిలింది సుమతి.
“పిచ్చంటే మరీ అంతకాదులే సుమతి! ఐనా మన ధ్యాస తక్కువ. పొద్దుకు సరిగ్గ తినదు. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. ఉన్నట్టుండి అరుపులు కేకల్తో గొడవ పెడ్తుంది. రామలక్ష్మి, అదే దీని సవతి తల్లి, మొదట్లో బాగా చూసుకునేది. కానీ ఇప్పుడు ఆమెకే ముగ్గురు పిల్లలు. ఇహ ఈ సగం పిచ్చిదాన్ని చూసుకునే ఓపిక తగ్గిపోయింది. భోజనానికి, తిండికి ఇది ఇంట్లో లేకపోతే తన పిల్లల్లో ఎవర్నో ఒకర్ని వెదకడానికని పంపుతుంది. పాపం!” అని ఆగింది అపర్ణ.
“అయ్యో!” అంది సుమతి బాధగా.
“అదేం పైత్యమోగానీ ఊళ్ళోకి కొత్తవాళ్ళెవరైనా వస్తే, మీరెప్పుడేళ్ళిపోతారు అని అడుగుతుందీ పిచ్చిది. దాంతో అవతలివారికీ పిచ్చెక్కడం, దీన్ని తరిమేయడం జరుగుతుంది. ఐనా అదొస్తే నువ్వేం భయపడకు. కొద్దిగా జోరు చేసి మాట్లాడు. వెళ్ళిపోతుంది. సరే! కాస్త పనుంది వెళ్ళొస్తాను.” అని సుమతి జవాబుకు ఎదురుచూడకుండా వెళ్ళిపోయింది అపర్ణ.
భర్త రాగానే సోమి విషయం చెప్పాలకున్న సుమతి మర్చిపోయింది.
– – – – – – –
సోమి వచ్చి వెళ్ళిన రెండు రోజులకు కేశవశర్మ, ఉపాధ్యాయ అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న మరో పల్లెటూరిలో ఎవరో వేదపండితుడిని కలవడానికని వెళ్ళారు. ఎంత రాత్రైనా తాము వెనక్కు వచ్చేస్తామని చెప్పి వెళ్ళాడు శర్మ.
మధ్యాహ్నం భోజనమైన తర్వాత ముందు గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది సుమతి.
గడప దగ్గర నీడ పడ్డంతో చప్పున తలెత్తి చూసింది. ఎదురుగా సోమక్క. రేగిన జుట్టుతో, ఎర్రబడ్డ కళ్ళతో సుమతిని గుచ్చి గుచ్చి చూస్తూ నిలబడివుంది. సోమి అవతారాన్ని చూసిన సుమతి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. వెంటనే సర్దుకుని, అపర్ణ చెప్పినట్టు వెళ్ళిపొమ్మని గద్దించింది. రెండు మూడుసార్లు సుమతి అరవడంతో వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగింది సోమి. అప్పుడు చూసింది సుమతి.
ఆ అమ్మాయి మెడ నుండి కింది దాకా ఎర్రటి చార!
“సోమక్కా! ఇలారా!” అని సౌమ్యంగా పిలిచింది సుమతి.
గడప దాకా వచ్చి ఆగింది సోమి.
“లోపలికి రా!”
రానన్నట్టు అడ్డంగా తలూపింది సోమి.
దాంతో తనే లేచి గుమ్మం దాకా వచ్చింది సుమతి. “ఏదీ! వెనక్కు తిరుగు!” అంది.
సోమి వెనక్కు తిరిగింది. సందేహం లేదు. ఏదో పదునైన వస్తువు తగిలి కోసుకుపోయింది. జాకెట్టుకు అంటుకున్న రక్తపు చారలు. సుమతి హతాశురాలైంది.
సోమి రెండు భుజాల్ని సుతిమెత్తగా పట్టుకుని తన వైపుకు తిప్పుకుని – “ఏమైంది సోమక్కా! ఇంత దెబ్బ ఎలా తగిలింది?” అని అడిగింది.
“చంద్రశేఖరు కొట్టాడు….ఇంత పెద్ద కర్రతో” అని రెండు చేతుల్ని బారచాపుతూ చెప్పింది. అంతలో దెబ్బ తగిలిన చోట కలుక్కుమనడంతో “స్..స్…అబ్బా….నొప్పి” అని కళ్లు మూసుకుంది. కొన్ని కన్నీటి చుక్కలు ఆ లేత బుగ్గల్ని తాకుతూ దూకాయి. ఆ అమ్మాయి స్థితిని చూసి విచలితురాలైపోయింది సుమతి.
“లోపలికి రా! మందు రాస్తాను.” అంది.
రానన్నట్టు తల అడ్డంగా ఊపి అక్కడే కూర్చుండిపోయింది సోమి.
చేసేదిలేక సుమతి లోనికెళ్లి తడిగుడ్డ, ఆయింట్మెంటుతో వెనక్కు వచ్చి ఆ గాయాన్ని మెల్లగా తుడిచి, మందు పూసింది.
సుమతి సపర్యలు చేస్తున్నంతసేపూ చెట్ల వైపు చూస్తూ కూర్చుంది సోమి. జాకెట్ హుక్కుల్ని పెట్టి “కొద్దిసేపట్లో నొప్పి తగ్గిపోతుందిలే!” ఊరటగా అంది సుమతి.
“ఊ(….” – ముక్తసరిగా అనింది సోమి తలను బరబరమని గోక్కుంటూ.
“జుట్టంతా ఎలా చిక్కుపడిందో చూడు!” ఏదో ఒకటి పలకరించాలన్నట్టు అడిగింది సుమతి.
సోమి నుండి మౌనమే సమాధానంగా వచ్చింది.
నెమ్మదిగా లేచి, లోని కెళ్ళి ఆయింట్మెంటును పెట్టేసి అద్దం, దువ్వెనా తీసుకువచ్చి సోమి తల దువ్వడం మొదలెట్టింది సుమతి. దాని చిక్కు తీసి జడవేసేందుకు పదిహేను నిముషాలపైనే పట్టింది సుమతికి. అంతసేపూ ఉలుకుపలుకు లేకుండా కూర్చునే ఉంది సోమి. సుమతి కూడా ఏమీ మాట్లాడలేదు. జడ వేయడం పూర్తయ్యాక సోమి చేతికి అద్దం ఇచ్చి “ఎలా ఉన్నావో చూసుకో!” అంది సుమతి.
అద్దాన్ని మొహం దగ్గరగా పెట్టుకుంది సోమి. “ఆహా! అంత దగ్గరగా పెట్టుకుంటే ఎలా……ఇలా…..ఇప్పుడు చూసుకో!” అంది సుమతి.
చూసుకుంది సోమి.
అమ్మాయి మొహంలో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని ఊహించింది సుమతి. కానీ అవేవీ కనబడని మొహంతో అద్దాన్ని వెనక్కు ఇచ్చేసి, చటక్కున లేచి పరుగెడ్తున్నట్టుగా వెళ్ళిపోయింది సోమి. తనలో తానే నవ్వుకుంది సుమతి.
సోమి వెళ్లిపోయిన పది నిముషాల్లో వచ్చాడు శర్మ.
అతని చేతిలోని సంచిని తీసుకుంటూ “శాస్త్రులుగారు కలిసారా?” అని అడిగింది సుమతి.
“అసలు ఆయన్ను వదిలి రావాలంటే మనసు రాలేదనుకో! మహావిద్యావంతులు. గొప్ప వాక్చాతుర్యం. ఇంకా గొప్ప సమన్వయ శక్తి…. ఆహా! ఈ కాలంలో అలాంటి వ్యక్తిని కలుస్తానని అనుకోనేలేదు సుమా! ఉపాధ్యాయ పుణ్యమాని, నీ పుణ్యామాని కలవగలిగాను. ఈ జన్మ ధన్యం!” – పొగడ్తలతో తేలిపోసాగాడు శర్మ.
“అబ్బో! చాలా కొత్త విషయాల్నే తెలుసుకొచ్చినట్టున్నారు. ఈమధ్యకాలంలో ఇంత అత్యుత్సాహంగా మీరెప్పుడూ కనబడలేదు సుమండీ!” అంది సుమతి.
విశాలంగా నవ్వాడు శర్మ.
“అయినా మన పుణ్యం తప్పించి నా పుణ్యమన్నది విడిగా ఎక్కడుంది?” అంది సుమతి చటక్కున.
ఆ మాటకు ఆశ్చర్యపడినట్టు చూసాడు శర్మ – “దేని గురించి చెబుతున్నావ్?”
“మీరింతకు మునుపే అన్నారుగా! ఉపాధ్యాయగారి పుణ్యమాని, నా పుణ్యమాని శాస్త్రిగారిని కలిసారని!”
సుమతి వైపు సంతృప్తిగా చూస్తూ – “బిందువు బిందువు కూడితే సింధువు. అంటే ఒక్కో చుక్క నీరు చేరితేనే సముద్రమయ్యేది. అలానే నీ పుణ్యం, నా పుణ్యం, మన పూర్వీకుల పుణ్యం – ఇలా అన్నీ చేరితేనే మంచి పనులు జరిగేవి!” అన్నాడు శర్మ.
“మరి రాబోయే వాడి పుణ్యమో? అది లెక్కలోకి రాదా?” అందు సుమతి చిన్నగా నవ్వుతూ.
సుమతి దగ్గరకు వచ్చాడు శర్మ – “ఇప్పుడు నువ్వు దౌహృదినీ” అన్నాడు.
“అంటే?” కన్నులు పెద్దవి చేసి అడిగింది సుమతి.
“ఇలా కూర్చో!” అంటూ మెత్తటి దుప్పటి పరిచివున్న కుర్చీ మీద ఆమెను కూర్చోబెట్టి ఎదురుగావున్న మరో కుర్చీలో తనూ కూర్చున్నాడు శర్మ.
“దౌహృదినీ అంటే రెండు మనసులున్న స్త్రీ. ఈ పదం గర్భవతులకు మాత్రమే వాడబడుతుంది. ఎందుకంటే వారిలో వాళ్ళ మనసుతో బాటు పుట్టబోయే బిడ్డ మనసు కూడా పనిజేస్తుంటుంది!” అన్నాడు శర్మ.
“ఓహో!” అంది సుమతి.
“హృదయం చేతనస్థానం అని శాస్త్రం చెబుతోంది. ఈ శరీరంలో అత్యంత చైతన్యవంతమైన భాగం మనసు. ఆ మనసులోనే కోర్కెలు పుడతాయి. ఆ కోర్కెలను తీర్చుకోవడానికి మిగతా శరీర భాగాల్ని ఉపయోగిస్తారు జీవులు. కాబట్టి జీవులు చేసే సమస్త చేష్టలకూ మూలం హృదయం. గర్భంలో ఉండే బిడ్డకు స్వతంత్య్రంగా వ్యవహరించే శరీరం పూర్తిగా ఏర్పడివుండదు. కానీ మనసు పూర్ణశక్తితో పనిచేస్తూవుంటుంది. అందువల్ల తల్లి ద్వారా తన కోర్కెల్ని వెల్లడి చేస్తుంది. ఈ కారణంగానే గర్భవతులు అప్పటి వరకూ వ్యక్తం చెయ్యని కోర్కెల్ని కోరుతుంటారు. అప్పటి వరకూ తినని పదార్థాల్ని తింటుంటారు. శాంతంగా ఉన్నవాళ్ళు అకారణంగా కోపగిస్తుంటారు. నిర్లక్ష్యంగా తిరిగే స్త్రీలు ఒద్దికగా ఉంటుంటారు. ఇలా తన వారి ఎరుకలో లేని ఎన్నెన్నో కోర్కెల్ని, పనుల్ని వ్యక్తం చేస్తారు గర్భవతులు.” అన్నాడు శర్మ.
“ఓహో!” అని మళ్ళీ అంది సుమతి – “అలాగైతే నాలో అలాంటి వింత కోర్కెలేవైనా మీరు గమనించారా?”
“హాహాహా…” కాస్త గట్టిగానే నవ్వాడు శర్మ. అతనలా గట్టిగా నవ్వడం చాలా అరుదు. “ఎన్నెన్నో వింత చేష్టలున్నాయ్!” అన్నాడు కాస్త చిలిపిగా.
సుమతి మొహంలో దిగులు కారుమబ్బులా కమ్మింది – “అవునా! అన్నేసి వెర్రిమొర్రి కోర్కెల్ని కోరానా?” అంది.
ఆమెను కొద్దిగా ఆటపట్టించాలని – “కోరావు సుమా! ఎన్నో సౌకర్యాలున్న పట్నాన్ని వదిలేసి ఈ పల్లెలోకి నన్ను తరుముకొచ్చావుగా? పైగా అక్కడ గిట్టుబాటైనట్టు ఇక్కడ కాదు కూడానూ! మనకే చాలకపోతే, పిల్లలకేమిస్తాం? హుమ్…ఏం చేద్దాం….విన్నపాలు వినవలె వింత వింతలు!” అన్నాడు శర్మ.
సుమతి ముఖంలో అసందిగ్ధత కొట్టొచ్చినట్టు కనబడసాగింది. భర్త ఉపదేశాల్ని వినేటప్పుడు నిర్మలంగా ఉండే ఆ కన్నులు చంచలాలై, నిశ్చలత్వవంచితాలై, దుఃఖభారాకుంచితాలై రెపరెపమన్నాయి. “పెద్ద తప్పే చేసేసాను!” అని ఆమె అన్నది.
ఆమె భావాలు, వాటి తీవ్రత అతని మనసును తాకాయి.
ఐనా మరికాస్త చొరవ చేసి – “ఉత్తి తప్పు కాదేమో! తప్పున్నరేమో?” అన్నాడు.
ఆ మాటలతో సుమతి కళ్ళలో గూడుకట్టున్న దైన్యం రెక్కలు చాచుకుని రివ్వున లేచింది. కన్నీరు గలగలా పారింది.
కంగారు పడ్డాడు శర్మ. “ఏయ్! తమాషాకంటే ఇలా ఏడ్చేస్తావా?” అన్నాడు.
“హృదయం చేతనస్థానమ్…..తమాషానే అనుకోండి. కానీ ఈ భావాలు మీ మనసులో లేకపోతే తమాషాకైనా అంటారా? మీ ఇష్టానికి తెలుసుకోకుండా నా వింత కోర్కెల్ని రుద్దడం తప్పే…..కదూ!” అంది సుమతి. దుఃఖం ఆమె మాటల్ని సంపూర్తిగా ముంచెత్తలేదు. తాను మరో తమాషా మాట అంటే అంత పనీ జరుగుతుందని అనిపించిందికి శర్మకు. అంతేకాదు, మనసు గురించి తాను చెప్పినది ఆమె మనసులో ఎంత త్వరగా, ఎంత లోతుగా నాటుకొన్నదో గ్రహించాడు.
వెంటనే పరిస్థితిని, ఆమె మనఃస్థితిని సరిదిద్దడానికి పూనుకున్నాడు శర్మ.
“అరే పిచ్చిదానా! అన్ని చేష్టలకూ మూలం మనసే. ఇప్పుడు నేనన్న మాటలూ మనసులోనివే. కానీ దొర్లే ప్రతి మాట వెనుకా ఓ లక్ష్యముంటుంది. ఒక భావముంటుంది. నేనన్న మాటల్లోని భావం నిన్ను ఆటపట్టించడం మాత్రమే. ఆ మాటల్లోని లక్ష్యం నవ్వించడం మాత్రమే. కానీ, నాకు హాస్యం చేతకాదు. అందుకే ఇలా రసాభాస అయింది.” అన్నాడు.
“అంతేగా? నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టానని మీరు అనుకోవడం లేదు కదా?” అంది సుమతి.
“పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు – పంకజభవాదులు నీ పాదాల చేరి – అంకెలనున్నారు లేచి అలమేలుమంగను – వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా – విన్నపాలు వినవలె వింత వింతలు. తంబూరలు మీటుతున్న ఆ భక్తుల కోసం నువ్విక్కడికి రావాలనుకున్నావు. బ్రహ్మాదులు కలలో సైతం కలవరించే ఆ వేంకటేశుడు నా జీవితాన్ని ఎలా చూడబోతున్నాడోనన్న ఆత్రుతతో నేను వచ్చాను. ఇద్దరమూ వింత కోర్కెలతో సతమతమౌతున్నవాళ్ళమే.” నెమ్మదిగా, విస్పష్టంగా పలికాడు శర్మ.
“ఎక్కడి సురపుర మెక్కడి వైభవ – మెక్కడి విన్నియునేమిటికి – యిక్కడనే పరహితమును పుణ్యము – గక్కున జేయగ గలదిహ పరము…” – శర్మ చెప్పిన అన్నమయ్య కీర్తనకు మరో కీర్తనలోని మాటల్ని చేర్చింది సుమతి.
“ఆ నిజసురపురమెక్కడుందో గానీ ఈ పల్లెటూరే మనకు సురపురం.” అన్నాడు శర్మ.
* * * * *
“పడడం కష్టమనుకున్న ఒంటి కన్ను పడి మీ మొదటి ఆటకాయ ముందుకు నడిచేసింది.” అని మెచ్చుకోలుగా అంది శ్రీలక్ష్మి.
నవ్వాడు నవావరణ ధారకుడు.
“ప్రభూ! పరమపద సోపానపటంలోని ఈ చిట్టచివరి వరుసలో ఒకటి సంఖ్య పడితేనే పావును నడపాలన్న నియమమెందుకో? ఆ నియమంలోని మర్మమేమిటో బోధించండి.” అని చేతులు జోడించింది ఆనందాబ్జసదన.
“సోమసమానాననా! ఏకమ్ అంటే ఒక్కటి అనే అర్థమే కాదు అద్వితీయమనే మరో అర్థం కూడా ఉంది. అద్వితీయమైనదెప్పుడూ సత్యమైనదే. కాబట్టి ఏక శబ్దానికి సత్యమని కూడా అర్థం. సత్యమైనదానికి అగ్రస్థానం అవశ్యం లభిస్తుంది. కాబట్టి ఏకమంటే అగ్రగణ్యమైనది అర్థం. అగ్రస్థానాన్ని సంపాదించడం ఉత్తమత్వానికి నిదర్శనం. ఆవిధంగా ఏకమ్ అంటే ఉత్తమమైనదని అర్థం. ఇన్ని విశేషణాల్ని ఒకే జన్మలో పొందగలగడమే జీవుల లక్ష్యమైవుండాలి. ఆవిధంగా సాధన చేయాలంటే ’మనస్యేకం – వచస్యేకం – కర్మణ్యేక’మై నడవాలి. అంటే ఆలోచించే మనసు, ఆలోచల్ని వ్యక్తి చేసే మాటలు, ఆ మాటల్ని నిజం చేసే ఆచరణ – ఈ మూడూ ఒకేవిధంగా ఉండాలి. అలాంటి వారిని ’మహాత్ము’లని పేర్కొంటోంది శాస్త్రం. ఇలాంటి వారికి ’ఏకమ్ సత్’ అనే వేదవిజ్ఞానం సహకరిస్తుంది. వెన్నంటి నడిపిస్తుంది. మహాత్ములు వేసే ఒక్క అడుగు కోటి కోటి తీర్థయాత్రల పుణ్యానికి సమానం. వారి ఒక్క అడుగు భూప్రదక్షిణకు సమానం. వారి అడుగులకు పురోగమించడమే గానీ తిరోగమనం తెలియదు. ఈ స్థితి గురించి మానవులకు తెలియజేయడానికనే ఈ ఆటలో, చివరి వరుసలోకి చేరిన పావుల్ని ఒకటి పడితేనే నడిపించాలన్న నియమాన్ని పెట్టారు విజ్ఞులు.” అన్నాడు ముఖజవరదుడైన హయముఖుడు.
వినమ్రభక్తిశీలయైన సౌభాగ్యదేవి అమందానందకందళితహృదయారవిందయై నమస్కరించింది.
“నీ మొదటి ఆటకాయ కూడా ఏకచిత్తతను సాధించేందుకు ఆయత్తమౌతోంది. ఆలస్యం అమృతం విషం దేవీ!” అన్నాడు అనిమిత్త సుజనోద్ధారకుడు.
“మీ ఆశీర్వాదబలంతో అసాధ్యాలు కూడా సుసాధ్యాలు స్వామీ. ఇదిగో మీ ప్రీతికై నడిపిస్తున్నాను.” అంటూ పాచికల్ని వేసింది వరమహాలక్ష్మి.
అంబ పాచికల్ని వేస్తే అవి వనవాస కాలంలో సీతమ్మ స్వరాన్ని అనుకరించబోయిన మత్తకోయిలల గళాల్లా ధ్వనించాయి.
* * * * *