వైకుంఠపాళీ – ఇరవై రెండో భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: ఆఫీసులో చివరిరోజున చిన్నికృష్ణుడి ఫోటోను రంజనికి బహుమతిగా ఇస్తారు పావని మొదలైనవాళ్ళు. ఆ ఫోటోను తన ఇంట్లో అలంకరించి మురిసిపోతుంది రంజని. కృష్ణుడు లాంటి పిల్లలు కలగాలని అనంత్ తో గారాలు పోతుంది.

 

తెల్లవారుజామున ఐదు గంటలౌతోంది.

కేశవశర్మ ప్రాతఃకాలపు దైవపూజలో లీనమైవున్నాడు. సుమతి అతనికి దగ్గర్లో కూర్చొని ఏవో శ్లోకాలు చెప్పుకుంటోంది.

ఇంతలో బైట హటాత్తుగా గలభా చెలరేగింది.

సుమతి శర్మ వైపుకు చూసింది. అతను చలనం లేకుండా మంత్రాలు చెప్పుకుపోతున్నాడు. ఆమె కూడా తన ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నం చేసింది.

కొద్దిక్షణాల్లో బైటి గొడవ మరింత అధికమైంది. ఈసారి సుమతికి అపర్ణ గొంతు గట్టిగా అరుస్తున్నట్టుగా వినబడింది.

అపర్ణ గొంతు వినబడ్డంతో మనసు నిలపలేకపోయింది సుమతి. నెమ్మదిగా లేచి ముందుగది తలవాకిలి దాకా వచ్చి చూసింది. గొంతులు తప్ప వ్యక్తులేవరూ కనబడలేదు. “బైటకెళ్ళడమా? ఇక్కడే ఆగడమా!” ఒక్క క్షణం ఆలోచనలో మునిగింది సుమతి. ఓసారి పూజాగది వైపుకు చూసింది.

ఉన్నట్టుండి ’దభీ’మని ఏదో పడ్డ చప్పుడైంది. ఆ వెంటనే అపర్ణ గట్టిగా అరవడం వినబడింది. ఆందోళన విపరీతంగా పెరగడంతో ఆగలేకపోయింది సుమతి. అపర్ణకేమైందోనన్న భయం ఆమెను బలంగా చుట్టుకుంది. జాగ్రత్తగా మెట్లు దిగి అపర్ణ ఇంటి వైపుకు అడుగులు వేయసాగింది. వేకువజాము మసక వెలుతురులో ఎగుడు దిగుడుగా ఉన్న ఆ నేలపై త్వరత్వరగా నడవడానికి భయపడుతూ అడుగులు వేస్తోంది సుమతి.

ఏదో పడినట్టు, ఆ వెంటనే వినబడ్డ అపర్ణ అరుపు తర్వాత మరే చప్పుడూ రాకపోవడంతో సుమతికి గాభరా పెరగసాగింది.

ఉపాధ్యాయ ఇంటి ముందున్న బయల్లోకి వచ్చిన సుమతి అక్కడి పరిస్థితిని చూసి “ఏమండీ!” అని గట్టిగా కేకవేసింది.

నేల మీద పడిపోయివున్న అపర్ణ తలపై బండరాయిని వేయబోతున్న ఆ ఆగంతకుడు సుమతి అరుపుకు వెనక్కు తిరిగాడు. వాడిని చూసి మరోసారి గట్టిగా కేకవేసింది సుమతి. ఈసారి ఆవిడ భర్తను పిలవలేదు – “భగవాన్!” అని అరిచింది.

అనుకోకుండా వచ్చిన సుమతిని చూసి పాలుపోని ఆగంతకుడు రాయిని పక్కన పడేసి పారిపోజూసాడు. కానీ మోకాళ్ళ మీద పడ్డ కర్ర దెబ్బకు నేల మీద బోర్లా పడ్డాడు. సుమతి విహ్వలంగా కళ్ళు చిట్లించి చూసింది.

చేతిలో కర్ర పట్టుకున్న ఆకారమొకటి సుమతికి ఎదురుగా వచ్చింది.

“ఎవరది? ఎవరది?” అని అరిచింది సుమతి. ఆ వెనువెంటనే “ఏమండీ!” అని మరోమారు కేకవేసింది.

కింద పడిన వ్యక్తి లేవబోయాడు. ఆ ఆకారం మరోమారు కర్రతో వాడి నెత్తిన ఒక దెబ్బ వేసింది. “అమ్మా!” అంటూ మళ్ళీ నేల మీద పడ్డాడు. ఆగకుండా వాడి వీపు మీద దెబ్బల వర్షాన్ని కురిపిస్తోంది ఆ ఆకారం. వాడి వీపు మీద కర్ర తాకిడికి పుట్టుకొస్తున్న చప్పుడుతో బాటూ “అమ్మా! అమ్మా! అమ్మా!” అంటున్న ఆగంతుడికి అరుపూ చేరి సుమతికి విపరీత భీతిని కలిగించాయి. నేల మీద నిశ్చలంగా పడివున్న అపర్ణను చూస్తుంటే సుమతిలో మరింత భయం చెలరేగింది.

విపరీతమైన ఒత్తిడికి గురైన ఆమెకు కళ్ళు తిరిగినట్టువుతోంది. దేహం అటునిటు తూలుతున్నట్టుగా అనిపించసాగింది. నేల మీదకి కూలబోతున్న సమయంలో కర్ర పట్టుకున్న ఆ అపరిచిత ఆకారంతో బాటూ మరో తెలిసిన మొహం చెరో వైపు పట్టుకోవడం చూసి– “సోమక్కా!” అని మాత్రం అనగలిగి కళ్ళు మూసింది సుమతి.

ఈలోపు చుట్టుపక్కలవాళ్ళు అక్కడికి పరుగెట్టుకొచ్చారు.

“సుమతీ!” అని పిలుస్తూ పరుగుపరుగున వచ్చాడు శర్మ.

– – – – – – –

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

సుమతి కళ్ళు తెరచి చూసింది.

పక్కనే శర్మ ఉన్నాడు. సోమక్క కూడా నిలబడుంది. ఆ అమ్మాయి పక్కన మరో వ్యక్తి నిలబడివున్నాడు.

ఒకసారి వాళ్ళందరినీ కలయజూసిన సుమతి, శర్మ వైపు చూసి “అక్క ఎక్కడ? ఎలావుంది?” అని హీన స్వరంతో అడిగింది.

“ఏం కంగారుపడకు సుమతీ! ఆమె క్షేమంగా ఉంది. ఈయన మోహన్రావు గారు! ఈ అమ్మాయి….” శర్మ పూర్తి చేసేలోగా “సోమక్క!” అని అంది సుమతి.

“ఈ అమ్మాయి నీకు తెలుసా?” అన్నాడు శర్మ.

ఔనన్నట్టుగా తలూపింది సుమతి.

“మోహన్రావు గారే ఆ దొంగను పట్టుకుంది. వీరు సోమక్క తండ్రిగారు!” అన్నాడు శర్మ.

నమస్కారం చేసింది సుమతి. ఆయన వారిస్తున్నట్టుగా రెండూ చేతుల్నీ చూపుతూ “నువ్వు బాగా టెన్షన్ పడినట్టున్నావమ్మా! రెస్టు తీసుకో. నేను సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక ఇటొస్తాను.” అని సుమతితో చెప్పి “శర్మగారూ! నేను ఆఫీసుకెళ్ళగానే డాక్టరుగారిని నా వెహికల్లో పంపిస్తాను…అమ్మాయిని చూడ్డానికి! అసలే ఒట్టి మనిషి కూడా కాదాయే! ఎలాంటి రిస్కూ తీసుకోకూడదు!” అని అన్నాడు మోహన్రావు.

కుర్చీలో నుండి లేచిన శర్మ రెండు చేతులూ జోడించి “అలాగేనండీ! సరైన సమయానికి వచ్చి వీళ్ళిద్దరినీ కాపాడారు. అందుకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు.” అన్నాడు,

“అంతా దేవుడి దయ! మరి ఉంటాను. పదవే పిచ్చిదానా!” అంటూ సరదాగా విసుక్కొంటూ సోమక్క చేయి పట్టుకున్నాడు మోహన్రావు. సోమక్క అతని చేయి విడిపించుకుని “నేన్రాను పో” అని సుమతి పడుకున్న మంచంపైకి ఎక్కింది.

“ఇక్కడే ఉండనివ్వండి!” అని అభ్యర్థించింది సుమతి.

నవ్వుతూ సోమక్క తలను నిమిరి, శర్మకు మరోమారు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు మోహన్రావు.

– – – – – – –

ఆరోజు వంటావార్పూ శర్మనే పూర్తి చేసాడు.

సుమతితో బాటు అపర్ణకు కూడా సపర్యలు చేసాడు. అతనికి సోమక్క సహాయపడింది.

ఒద్దికగా చెప్పిన పని చేసిన ఆ అమ్మాయిని కన్నతండ్రి కూడా పిచ్చిదానిగా జమకట్టి పిలుస్తున్నందుకు ఆశ్చర్యపడ్డాడు.

కార్యక్రమాలకని పొరుగూరు వెళ్ళిన ఉపాధ్యాయ సాయంత్రానికి ఇంటి కొచ్చి జరిగిన సంఘటన విని తల్లడిల్లిపోయాడు. ముందస్తుగానే శర్మ హెచ్చరించడంతో అపర్ణను గానీ, సుమతిని గానీ ఎక్కువ వివరాల్ని అడగకుండా ఆగాడు. రాత్రికి రెండిళ్ళ మధ్యనున్న ఆరుబయల్లో శర్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు ఉపాధ్యాయ.

“మీ ఇంటి బైటపెట్టిన ఇత్తడి గంగాళాన్ని ఎత్తుకుపోవాలని తెల్లవారుజామౌతున్నా తెగించి వచ్చాడా దొంగ. బహుశా మీరు ఇంట్లో లేరన్న సంగతి వాడికి తెలుసు కాబోలు. ప్రొద్దున్నే అపర్ణగారు తులసికోట ముందు ముగ్గెయ్యడానికి బైటికి రావడం, వాడూ అక్కడే ఉండడం అనుకోకుండా జరిగింది. నేను పూజలో ఉంటే, సుమతికి శబ్దాలు వినబడి ఇక్కడకొచ్చింది. అప్పుడా దొంగ అపర్ణ గారిని కిందకు తోసేసి తలపైన బండరాయితో కొట్టబోతున్నాడు….”

“శివ శివా!” అన్నాడు ఉపాధ్యాయ.

“అది చూసిన సుమతి గట్టిగా అరిచింది. అటుగా వెళ్తున్న మోహన్రావు గారు ఆడవాళ్ళ కేకలు విని చేతికందిన కర్రను పట్టుకుని ఆ దొంగను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన రావడంతో ఎన్నో ప్రమాదాలు తప్పాయి.” అన్నాడు శర్మ.

“నిజమే! కానీ మోహన్రావు ఇల్లు అవతలి వీధిలో ఉంది. అంత పొద్దున ఇక్కడికెందుకొచ్చాడో?” అన్నాడు ఉపాధ్యాయ.

“నిజానికి ఈరోజు పొద్దునదాకా ఆయనెవరో, ఇల్లక్కడో కూడా నాకు తెలీదు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళమ్మాయి సోమక్క తెల్లవారుజామునే లేచి పిచ్చి కేకలేస్తూ గొడవ గొడవ చేసిందట. రావుగారి భార్య కొట్టబోయేసరికి పరుగెట్టిందట. భార్య కేకలు విని నిద్రలేచిన రావుగారు అమ్మాయిని పట్టుకోవడానికి వీధిలోకి వచ్చారట. ఆ అమ్మాయి ఆగకుండా పరుగెట్టి సరిగ్గా మీ ఇంటి ముందు ఆగిందట. అమ్మాయిని పట్టుకుని ఆయన వెళ్ళబోతుండగా సుమతి అరుపులు విని లోనికొచ్చారు. అదీ సంగతి!” అన్నాడు శర్మ.

“ఆశ్చర్యం! బారెడు పొద్దెక్కే దాకా నిద్రలేవని ఆ పిచ్చిది పెందరాళే లేవడమేమిటి? మా ఇంటి దాకా పరుగెత్తి రావడమేమిటి? ఇన్నేళ్ళుగా లేని దొంగతనం ఈ ఇంట్లో జరగబోవడమేమిటి? భగవంతుని సంకల్పం కాకపోతే!” అని నిట్టూర్చాడు ఉపాధ్యాయ.

ఇక చెప్పడానికేమీలేనట్టుగా మౌనం వహించాడు శర్మ.

కాసేపటి తర్వాత వెళ్ళిపోయాడు ఉపాధ్యాయ.

– – – – – – –

లోనికొచ్చిన శర్మ నిద్రపోకుండా ఆలోచిస్తున్న సుమతిని చూసి, ఆమె వైపుకొచ్చాడు. మంచం చివరన కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నిమరసాగాడు.

కాసేపటి మౌనం తర్వాత –  “ఏమండీ! సోమక్క లేకపోయుంటే నేను, అపర్ణాక్క చచ్చిపోయేవాళ్ళమే!” అంది.

అంగీకరిస్తున్నట్టుగా నిట్టూర్చాడు శర్మ.

“సోమక్కకి నిజంగా పిచ్చేనంటారా? పాపం, చూడ్డానికి లక్షణంగా ఉంటుంది. కానీ….” అని ఆగింది సుమతి.

“ఆ పిల్లకి ’సోమక్క’ అన్న చిత్రమైన పేరెందుకు పెట్టారో?” ఆశ్చర్యంగా అన్నాడు శర్మ.

“నాకూ విచిత్రంగా అనిపించింది. ఆ పేరు ఆ పిల్ల నానమ్మ పేరట!” అంది సుమతి.

“ఆహా…” అన్నాడు శర్మ.

“పాపం ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడంటే చిన్నపిల్ల. పెరిగి పెద్దదైతే ఎంత కష్టం! ఇంతకీ అమ్మాయి అలా కావడానికి కారణమేమిటంటారు? ఇలాంటివారిని భగవంతుడు కాపాడడా?”

“అమ్మాయి అలా వెర్రిగా ప్రవర్తించడానికి వైద్యపరమైన కారణాలేవో ఉండుంటాయి. మంచి డాక్టర్ కు చూపిస్తే మేలేమో!”

“నేను శాస్త్రమేమి చెబుతోందో తెలుసుకోవాలనుకున్నాను.”

దీర్ఘంగా నిట్టూర్చాడు శర్మ. “తెలుసుకుని ఏం చేస్తావ్? ప్రారబ్ధ కర్మల్ని మనం మార్చలేం!”

“దేవుడు కరుణాసముద్రుడు కదా! మనం మరొకరికి మంచి జరగాలని కోరుకుంటూ ప్రార్థిస్తే ఆ కోరికను తీర్చడా? ఈరోజు సోమక్కే లేకపోతే నేనూ, అపర్ణక్కా చచ్చిపోయేవాళ్ళమేగా! ఆ అమ్మాయి చేత మనకు ఇంత మేలు చేయించిన భగవంతుడు మన వల్ల ఆమెకు మేలు చేయించడా? పరదుఃఖ దుఃఖిత్వం సజ్జనుల లక్షణమని మీరు ఎన్నోసార్లు చెప్పారు. సోమక్క పిచ్చిదే! ఈరోజు తను చేసిన సహయాన్ని మనమెంత పొగిడినా కూడా అర్థం చేసుకోలేని పిచ్చిది. పొగడ్తలే అర్థంకాని ఆ పిచ్చిది మన దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకుంది? మనల్ని ఎలా కాపాడింది? అలాంటి పిచ్చమ్మాయి మనల్ని కాపాడగాలేంది అన్నీ తెలిసుకున్నామన్న మనం ఏమీ చేయలేమా? శాస్త్రం ఇలాంటి వారి గురించి ఏమీ చెప్పదా? చెప్పండి!” – కొద్దిపాటి ఆవేశంతో గబగబా మాట్లాడింది సుమతి.

శర్మ నవ్వాడు.

ఆ నవ్వు ఎగతాళితో కూడింది కాదు. తాను బోధిస్తున్న విషయాల పట్ల తనకే ఎంత నమ్మకముందోనని పరీక్ష చేస్తున్న శిష్యుణ్ణి చూసి గురువు వాత్సల్యంతో నవ్వే నవ్వులాంటిదది.

సుమతి చేతుల్ని గట్టిగా పట్టుకుని “శాసనాత్ శంశనాత్ చైవ శాస్త్రం ఇత్యభిధీయతే! ఏదైతే కఠిన నియమాల్ని విధిస్తుందో కానీ సుఖాన్ని ఇస్తుందో దాన్నే శాస్త్రమని పిలిచారు పెద్దలు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సంతోష పెట్టడం వేరు. హితవు చెప్పడం వేరు. బిడ్డకు మిఠాయిని కొనివ్వడం సంతోషం పెట్టడం క్రిందకు వస్తుంది. ఆ మిఠాయిని మరోమారు తినడానికి బిడ్డ డబ్బులు దొంగిలిస్తే అప్పుడు శిక్షతో బాటూ చెప్పే మంచిమాటల్ని హితోపదేశం అంటారు. ఆ హితోపదేశాన్ని నమ్మి ఆచరించిన వాళ్ళు ఎన్నటికీ చెడరు. మన శాస్త్రం కూడా అంతే! అది మనల్ని సంతోషపెట్టదు. కానీ హితవు బోధిస్తుంది. ఆ హితవుని వంటబట్టించుకున్నవారు ఎన్నటికీ దారి తప్పరు. మంచి పనులకి శాస్త్రం ఎప్పుడూ అండగా ఉంటుంది.” అన్నాడు శర్మ.

“ఐతే చెప్పండి! సోమక్క బాగుపడాలంటే ఏం చెయ్యాలి?” – శర్మ మాటల్తో నమ్మకం పెరిగిన సుమతి చప్పున అడిగింది.

“ఆ పేరు మోహన్రావుగారి తల్లిగారిది కదూ!”

“అవును!”

“అమ్మాయి పేరు మారిస్తే మేలేమో!”

“పేరు మార్చాలా? సోమక్క పిచ్చికి, పేరుకీ సంబంధముందా?” – ఆశ్చర్యంగా అడిగింది సుమతి.

“ఇతమిత్థంగా చెప్పలేను గానీ, పేరు మారిస్తే ఫలితముండొచ్చు!”

“కాస్త వివరంగా చెప్పరూ!”

“సుమతీ! మన తల కాకుండా మరో మూడు తలల వెనుకనున్న వాళ్ళ పేర్లని మన పిల్లలకు పెట్టకపోవడం మంచిదన్న ఓ నమ్మకం వాడుకలో ఉంది. ఉదాహరణకు, మోహన్రావు గారు తమ తల్లి ఆబ్దీకం చేస్తున్నప్పుడు తన కూతురి పేరునే వాడాల్సి వస్తుంది. ఇందులో మనకు అభ్యంతరాలేవీ లేకపోయినా శాస్త్రరీత్యా అంత మంచిది కాదని కొద్దిమంది విద్వాంసులు చెప్పగా విన్నాను. అందులో సత్యముందని నేనూ నమ్మేవాణ్ణి. ఈ అమ్మాయిని చూసాక నా నమ్మకం బలపడింది. కాబట్టి అమ్మాయి పేరును మార్చడం ఉత్తమం!” అన్నాడు శర్మ.

ఆలోచనలో పడిన సుమతి – “చరిత్రలో తాత పేరో, ముత్తాత పేరో పెట్టుకున్న రాజులు చాలామంది దొరుకుతారు కదండీ! వెయ్యి, రెండువేల ఏళ్ళ క్రితం సాంప్రదాయాలు ఇప్పటి కంటే బలంగా ఉండేవి కదా! అప్పుడెలా సాధ్యమైంది?” అంది,

మళ్లీ నవ్వాడు శర్మ – “చరిత్రను వదిలి పురాణాల్ని చూడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నూటా అరవై మంది రాజులకూ ప్రత్యేకమైన పేర్లే ఉన్నాయి. తాత ముత్తాతలపై అభిమానంతో దశరథుడు తన నలుగురి కొడుకుల్లో ఒక్కరికీ ఆ పేర్లు పెట్టలేదు. అన్ని అక్షరాలకూ అధిదేవత ఐన నారాయణుడు కూడా రఘువంశోత్తముడిగానే ప్రఖ్యాతి చెందాడు గానీ రఘు మహారాజు పేరును పెట్టుకోలేదు. అలాగే రాక్షస వంశాల్నీ తీసుకో! ప్రహ్లాదుడి కొడుకు, మహా విష్ణుద్వేషీ ఐన  విరోచనుడు కూడా తన కొడుకుకు బలి అన్న పేరే పెట్టాడు గానీ తాతలూ, తనలాగే విష్ణుద్వేషులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల పేర్లు పెట్టలేదు. ఎందుకంటావ్?” అన్నాడు.

అంగీకరిస్తున్నట్టుగా తలనాడించింది సుమతి.

“ఇంత మంచి విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. మోహన్రావు గారు భార్యతో పాటూ వస్తానని చెప్పారుగా! వాళ్ళు వచ్చినప్పుడు మీరు తప్పక చెప్పండి!” అంది సుమతి.

“చూద్దాం!” అన్నాడు శర్మ.

చెబుతానని శర్మ ఖచ్చితంగా అనకపోవడంతో తాము చెబితే మోహన్రావు వాళ్ళు నమ్ముతారో, నమ్మరోనన్న శంక రేకెత్తి మౌనం వహించింది సుమతి.

– – – – – – –

అ సాయంత్రం భార్య రామలక్ష్మితో సహా వచ్చాడు మోహన్రావు.

మొదట అపర్ణ, ఉపాధ్యాయల్ని పరామర్శించి అటుపై శర్మ ఇంటికి వచ్చారా దంపతులు.

సుమతిని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది రామలక్ష్మి. లక్షణంగా, సాంప్రదాయంగా ఉండే యువతులు కరువైపోయిన ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయి కనబడ్డం అదృష్టమని పొగిడింది. ఔనౌనని తనూ గొంతు కలిపాడు మోహన్రావు.

“మా అమ్మాయికి జడేసి పంపావ్ చూడూ! అప్పటి నుండీ నిన్ను చూడాలని అనుకుంటూనే ఉన్నానమ్మాయ్! ఇప్పుడు, ఇలా కుదిరింది. నువ్వు నాకంటే చిన్నదానివి, పైగా నా రెండో చెల్లలికంటే కూడా చిన్నదానివి, అందుకనే ఇంత చనువూ తీసేసుకొని ఏకవచనంలో పిలిచేస్తున్నా. ఏమనుకోకు. పైగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు బహువచనంలో పిలిస్తే ఆయుక్షీణం కూడానూ! ఒక్కచోట కూడా కుదురుగా కూర్చోని ఈ పిచ్చిది నీ దగ్గర ఒద్దికగా ఉంటోదంటే విచిత్రమేనమ్మాయ్! నా చేత్తో ఒక్కపూట కూడా జడేయించుకోలేదీ వెర్రిఘటం. అట్లాంటిది నువ్వు రోజూ వేసి పంపిస్తున్నావాయే! జడ ఎవరేసారే అంటే పక్కవీధి అమ్మ వేసిందని చెబుతుంది. ఏ జన్మలోని ఋణానుబంధమో కాకపోతే ఈ పిచ్చిదేమిటీ, తనంత తానుగా నిన్ను అమ్మా అని పిలవడమేమిటీ!ఆ ఆ…” – అంటూ గలగలా మాట్లాడేస్తోంది రామలక్ష్మి.

ఆమె వాగ్ధాటికి మిగిలిన ముగ్గురూ మౌనప్రేక్షకులే అయ్యారు.

మధ్యమధ్యలో శర్మ వైపుకు చూస్తూ “వీలు చేసుకుని చెప్పేయండీ!” అన్నట్టు కనుసైగలు చేసింది సుమతి. “ఆగ”మన్నట్టుగా చూసాడు శర్మ.

“ఇక వస్తా”మంటూ రామలక్ష్మి లేవడంతో హతాశురాలైంది సుమతి. మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చినా శర్మ నోరు విప్పి చెప్పకపోవడంతో ఆమె దిగులు చెందింది.

మంచం మీది నుంచి లేచి గూట్లోని కుంకుమ భరిణె తీసుకుని రామలక్ష్మికి ఇస్తూ – “సోమక్క గురించి మావారేదో….” అని చెప్పబోతుండగా…

“అవునమ్మాయ్! మీ ఆయన మాకంతా చెప్పారు. మావారికి ఏదో జపం చెయ్యమని కూడా చెప్పారు. ఏమండోయ్! రేప్పొద్దున్నుండే మొదలెట్టాలి మీరు. మర్చిపోకండి! మీరు రోజూ చెప్పుకొనే సహస్రనామం పుస్తకంలోనే శర్మ రాసిన శ్లోకాన్నుంచాను. ఆ కాగితాన్ని పారేసుకోకండి. ముందువారంలో మా కులదైవం బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరకెళ్ళి దీని పేరును మారుస్తాం. అయ్యో మతిమరుపు మండా! ఆ పేరేదో నువ్వు చెబితేనే బాగుంటుందని అనుకొనే నేనూ వచ్చా. అసలు సంగతే మర్చిపోయా. సమయానికి గుర్తు చేసావ్. మంచిపేరొకటి నువ్వే చెప్పమ్మాయ్! పెట్టేస్తాం! నువ్వు చక్కటి కొడుకును కన్నాక నేనొచ్చి నామకరణం చేస్తా. చెల్లుకు చెల్లైపోతుంది. ఏమంటావ్?” అంటూ జోరుగా నవ్వేసింది రామలక్ష్మి.

ఆ జలపాతపు మాటలకు అవాక్కవడం సుమతి వంతైంది.

వాళ్ళు వెళ్ళిపోయాక శర్మ వైపుకు చూసింది సుమతి.

“మధ్యాహ్నం నువ్వు గుర్రుపెట్టి నిద్రపోతున్నప్పుడు వాళ్ళింటి కెళ్ళాను. అమ్మాయి జాతకం కూడా చూసాను.” సంక్షిప్తంగా అన్నాడు శర్మ.

చటక్కున వంగి అతని కాళ్ళకు దండం పెట్టబోయింది సుమతి.

ఆమెను మధ్యలోనే ఆపి పైకి లేపాడు శర్మ.

“ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే

ధ్యేయము కాదు, హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నా

రాయణు లేడ్చుచుండిరి, తదశ్రువులన్ దుడువంగపొమ్ము నీ

ప్రేయసితోడ, నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్!”

* * * * *

“స్వామీ! మాయాశక్తి నుండి ముందుకు కదలి పరాశక్తి అనబడే నూటా ఇరవైమూడవ గడిని చేరింది మీ రెండో పావు. తదుపరి వివరణ మీ చిత్తం!” అంది చిత్తజ జనని ముకుళిత హస్తాలతో.

జగదంబ అయినా కూడా సడలని వినయాభరణ భూషితురాలైన లక్ష్మిని చూసి హసన్ముఖుడయ్యాడు అనేకగుణసన్మణి ఐన నారాయణుడు.

“దేవీ! ఈ పరాశక్తి మాయాశక్తి నుండి భిన్నమైనది. నా మాయ బంధకశక్తి ఐతే నా పరాశక్తి మోచక శక్తి. అంటే బంధాల నుండి విడిపించే అమోఘశక్తి.”

“ప్రభూ! పరా అంటే అర్థమేమిటి?”

“సాధారణార్థంలో పరా నాశనం చేసేదని అర్థం. అశాశ్వత సుఖాలను కోరుకునే పాంచభౌతిక దేహాన్ని నాశనం చేయడమంటే మోక్షమనేగా అర్థం! “

“అవును స్వామీ!”

“పరా అనేది ఒకానొక నాదరూపమైన వర్ణం.”

“అంటే?”

“జీవులు తాము తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు చెప్పే క్రమంలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అలా శబ్దోచ్ఛారణ చేయడానికి చేతనులు (జీవులు) పూనుకున్నప్పుడు మొదటగా మనసు ప్రేరేపింపబడుతుంది. అలా ప్రేరేపితమైన మనసు నాభి (బొడ్డు) వద్ద ఉండే మూలాధారం లోని గాలిని కదిలిస్తుంది. అలా చలిస్తున్న గాలి అతి సూక్ష్మమైన నాదాన్ని ఉత్పత్తి చేస్తుంది. అత్యంత సూక్ష్మమైన ఈ నాదానికి ’పరా’ అని పేరు. ఈ నాదం హృదయం వరకూ చేరి ’వైఖరీ’ అన్న పేరుతో అర్థవంతమైన శబ్దంగా మారుతుంది.”

“నీ వైఖరి బాగోలేదని మానవులు పరస్పరం నిందించుకోవడం అర్థరహితమైన మాటలను పలకడం వల్లనేనా స్వామీ?”

’అవునం’టూ నిశ్శబ్దంగా నవ్వాడు నారాయణుడు.

“అమోఘమైన ఉపదేశం! ఈ ఉపదేశామృతానికి కారణమైన మీ రెండో ఆటకాయ ధన్య చరిత.” అంది రమణీమణి రుక్మిణి.

“నీ అమృత హస్తాలతో నడిపి నీ రెండో ఆటకాయను కూడా ధన్యతను పొందేట్టుగా చెయ్యి!” అన్నాడు తాపసజనప్రియుడు.

“నమోన్నమః” అంటూ పాచికల్ని వేసింది శ్రీపాదార్చకురాలు.

ఆమె నడిపిన పాచికలు హిరాణ్యాక్షుడి చెర వీడి, వరాహస్వామి భుజాన్ని చేరిన భూదేవి ఆనందభరిత నిట్టూర్పుల్లా ధ్వనించాయి.

* * * * * *

Your views are valuable to us!