వైకుంఠపాళీ – ఇరవై మూడో భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: త్ర్యంబక ఉపాధ్యాన ఇంట్లో తెల్లవారుజామున జరగబోయిన దొంగతనాన్ని, దొంగ చేతిలో దెబ్బలు తిన్న అపర్ణను గమనిస్తుంది సుమతి. సమయానికి సోమక్క, ఆమె తండ్రి మోహన్రావు అక్కడికి రావడంతో సుమతి, అపర్ణలకు అపాయం తప్పుతుంది. సోమక్క పేరును మార్చే విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాల్సిందిగా శర్మను ఒత్తిడి చేస్తుంది సుమతి. కానీ అతను అప్పటికి మౌనం వహిస్తాడు. ఆపై సోమక్క మారుటితల్లి రామలక్ష్మి నోటినుండి అమ్మాయి విషయంలో శర్మ చేసిన సూచనల్ని, ఉపకారాన్ని విని ఎంతగానో సంతోషిస్తుంది సుమతి.

 

తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వినోద్ దూబే సహాయంతో ఇంటికి దగ్గరలోనే ఓ చిన్న ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నాడు అనంత్. రోజువారీ పనుల్ని చేయడానికి ముగ్గురు ఉద్యోగుల్ని తీసుకుని, బిజినెస్ డెవెలప్మెంట్ ను అనంతే చూసుకోసాగాడు.

తన ఉద్యోగుల్ని అభిమానంగా చూసుకోవడంతో వాళ్ళు కూడా శక్తివంచన లేకుండా అతనికి సహాయం చేయసాగారు. నిజానికి ఇది రంజని ఇచ్చిన సలహా. సాంకేతిక నైపుణ్యం, చక్కటి మాటతీరుతో బాటు ఉద్యోగుల సంపూర్ణ సహకారం ఉండడంతో అనంత్ కంపెనీ పెద్ద పెద్ద అడుగుల్ని వేయసాగింది.

ఆరు నెలలు తిరిగేసరికి ముగ్గురు ఉద్యోగులు కాస్తా పదిహేనుమంది అయ్యారు. ఒక్క సర్వీస్ నుండి ఐదు విధాలైన సర్వీసుల్ని అందించే స్థాయికి చేరుకున్నాడు అనంత్. ఇప్పుడు అతని దృష్టి ముకుల్ కంపెనీ మీద ఉంది. ఒకప్పుడు తన నక్కజిత్తుల్తో అవమానం చేసి పంపిన ముకుల్ ను వ్యాపరపరంగా దెబ్బ కొట్టాలన్న తహతహ అనంత్ లో అంతులేకుండా పెరిగిపోతుంది. తన కంపెనీ దాటుతున్న ఒక్కో మైలురాయి అతనిలో పంతాన్ని పెంచుతోంది. ఓసారి యథాలాపంగా రంజనితో ఈ మాటనన్నప్పుడు “ఇలాంటి వెర్రిపనులేవీ చెయ్యకు. జస్ట్ నీ దారేదో నువ్వు చూసుకో!” అని అంది. మొదటికంటే ఇప్పుడు రంజని మాటలకు చాలా విలువనిస్తున్నా ఎందుకో అనంత్ కు ముకుల్ ను ఓ దెబ్బ కొట్టాలన్న పట్టుదల బలంగా ఉండిపోయింది.

నేరుగా దెబ్బకొట్టకుండా గెరిల్లా యుద్ధ పద్ధతిలో తన పథకాన్ని అమలుపెట్టాడు అనంత్. అందులో భాగంగా ముకుల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ముగ్గురు మేనేజర్లని అక్కడినుండి రాజీనామా చేయించి, మరో కంపెనీలో మూడు-నాలుగు నెలలు పనిచేసేలా ఏర్పాటు చేసాడు. ఆ తర్వాత మంచి జీతంతో తన కంపెనీలోకి తీసుకున్నాడు అనంత్. ఈవిషయం ముకుల్ కు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఉద్యోగులు నేరుగా అనంత్ కంపెనీలో చేరివుంటే ఎంతోకొంత న్యూసెన్స్ సృష్టించే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు.

మేనేజర్లు వెళ్ళిపోవడంతో వారితో సన్నిహితంగా ఉండే మరికొద్ది కిందిస్థాయి ఉద్యోగులు కూడా బైటికెళ్ళేందుకు తమ ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. వెళ్ళినవాళ్ళకి రీప్లేస్మెంట్లని, కొత్తగా వచ్చినవాళ్ళకి పూర్తిచేయాల్సిన ప్రాజెక్టల గురించి వివరించడం, వెళ్ళదల్చిన వాళ్లను బుజ్జగించే ప్రయత్నాల్లో మునిగిపోయిన ముకుల్, వ్యాపారంపై తక్కువ శ్రద్ధ చూపడంతో కొన్ని కొత్త అకౌంట్లని అనంత్ కంపెనీకి కోల్పోవలసి వచ్చింది.

ముకుల్ ను వదిలి తనతో చేరిన మేనేజర్ల దగ్గర ముకుల్ తనని ఎలా అవమానించిందీ తనదైన శైలిలో వర్ణించి వర్ణించి చెప్పాడు అనంత్. అతని హావభావాలకు, పొల్లుపోని మాటలకు లొంగిపోయిన ఆ మేనేజర్లు, ముకుల్ తో పనిజేస్తున్న తమవాళ్ళకు ఈ విషయాన్ని చేరవేసారు. ఆ చేరవేయడంలో తమ వంతు మసాలాను చేర్చి మరీ వేసారు. ఆవిధంగా మధ్యస్థాయి, క్రిందిస్థాయి ఉద్యోగుల్లో ముకుల్ ఓ పచ్చి అవకాశవాదిగాను, మానవ సంబంధాలను ఖాతరు చేయని కౄరుడన్న అభిప్రాయాన్ని బలంగా తయారుచేయగలిగాడు అనంత్.

ఓ పెద్ద బ్యాంక్ పిలిచిన టెండర్లలో మొదటిసారిగా ముకుల్ తో ముఖాముఖి నిలబడ్డాడు అనంత్. తక్కువ కోట్ చేసే అవకాశముండి కూడా ఎక్కువగానే కోట్ చేసాడు అనంత్. అంతేకాక తను ఎంత కోట్ చేయబోతున్నదీ ముకుల్ కు చూచాయగా తెలిసేటట్టు చేసాడు. ఆ వివరాలు తెలుసుకున్న ముకుల్ అంతకంటే అతి తక్కువ మొత్తంలో కోట్ చేసి ఆ కాంట్రాక్టును దక్కించుకున్నాడు. చాలా నెలల తర్వాత అనంత్ ను దెబ్బకొట్టగలిగానన్న సంతోషంతో ఉక్కిబిక్కిరయ్యాడు ముకుల్.

కావాలనే బ్యాంక్ టెండర్ను వదులుకున్న అనంత్ వేరే క్లయింట్లపై శ్రధ్ధ పెట్టి చక్కటి ప్రాజెక్టులు డెలివరీ చేసాడు. పాత క్లైంట్ల మాట సహాయం ద్వారా కొత్త క్లయింట్లు వెల్లువెత్తడంతో పుట్టుకొచ్చిన ఉద్యోగాల్లోకి ముకుల్ కంపెనీ నుండి కొంతమందిని ఔట్ సోర్స్ విధానంలో తీసుకున్నాడు అనంత్.

మూడు నెలల్లోనే ముఖ్యమైన ఉద్యోగుల్ని తన వైపుకు లాక్కోవడం ద్వారా ముకుల్ కంపెనీలో అనిశ్చిత పరిస్థితిని సృష్టించడంలో కృతకృత్యుడయ్యాడు. దీనితో ముకుల్ మరింత దిగాలుపడ్డాడు. తీవ్రమైన నిబంధనలతో తక్కువ సమయంలోనే పూర్తిచేయాల్సిన బ్యాంక్ ప్రాజెక్ట్ పూర్తిగా వెనుకబడిపోయింది.  ఆ గందరగోళంలోనే ముకుల్ ను మరో దెబ్బ కొట్టాడు అనంత్.

నిబంధనల్ని సడలించి మరికాస్త సమయం ఇవ్వాల్సిందిగా బ్యాంకువాళ్ళని కోరాడు ముకుల్. కానీ ముకుల్ బ్యాంకువాళ్ళని కలవడానికి ఒకరోజు ముందుగా ఆ అధికారులికి ఫైవ్ స్టార్ హోటల్లో విందునిప్పించి తనవైపుకు తిప్పుకున్నాడు అనంత్. అంతేగాక టెండర్ సమయంలో తన కోట్ వివరాల్ని ముకుల్ దొంగతనంగా రాబట్టినట్టుగా చెప్పాడు. నిజానికి ముకుల్ ఈ ప్రాజెక్టును తనను దెబ్బతీయడానికి మాత్రమే తీసుకున్నట్టుగా బల్లగుద్ది చెప్పాడు అనంత్. ముకుల్ తర్వాత బెస్ట్ కోటును ఇచ్చిన తనకు మూడునెలల సమయమిస్తే మొత్తం ప్రాజెక్టును డెలివరీ చేయగలనని నమ్మకంగా చెప్పాడు అనంత్.

ప్రాజెక్ట్ సరిగ్గా సాగడంలేదని అమెరికాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ నుంచి తాఖీదులు అందుకున్న ఇండియా అధికారులు ముకుల్ అభ్యర్థనని తోసిపుచ్చి, సెకండ్ బెస్ట్ ఐన అనంత్ కు ప్రాజెక్టును బదిలీ చేయాల్సిందిగా తమ పై అధికారుల్ని కోరారు. కొద్దిపాటి తర్జనభర్జనల తర్వాత అనంత్ తో కాన్ కాల్ తీసుకున్న అమెరికా అధికారులు అనంత్ స్థైర్యానికి, ప్రొఫెషనలిజానికి ఆకర్షితులై కాంట్రాక్ట్ ను అతనికిచ్చేందుకు ఒప్పుకున్నారు.

బ్యాంకువాళ్ళు ముకుల్ కు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి ఎక్కువశాతాన్ని అపరాధ రుసుం క్రింద ఉంచేసుకుని తక్కువ మొత్తాన్ని చెల్లించారు. ఇది అన్యాయమని వాదించబోయిన ముకుల్ నోటికి తను సరిగ్గా చూడకుండా సంతకం పెట్టిన అగ్రిమెంట్ అడ్డుపడింది. అనంత్ ను దెబ్బ తీయాలన్న తొందరలో టెండర్ డాక్యుమెంట్లను సరిగ్గా చదవకుండా సంతకాలు పెట్టేసిన ముకుల్, ఈ హటాత్పరిణామానికి మ్రాన్పడిపోయాడు.

చెప్పినవిధంగానే సరిగ్గా మూడునెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసిన అనంత్ బ్యాంకువాళ్ళ నుండి ప్రశంసాపత్రాన్ని పొందడమే కాకుండా వాళ్ళ నోటి ద్వారా మార్కెట్లో ముకుల్ కంపెనీ మీద వ్యతిరేకత ఏర్పడేటట్టు చూసుకున్నాడు.

ఒకదానిపైన ఒకటిగా తగిలిన ఎదురు దెబ్బల వల్ల కళ్ళెదుటే మాయమైనపోయిన గౌరవాన్ని, పరపతిని, ఆదాయాన్ని చూసుకున్న ముకుల్ తన ఫార్మ్ హౌస్ లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అనుకోని ఈ ఘటనకు ఉలిక్కిపడ్డాడు అనంత్. తెలిసి చేసిన నేరభావం అతనిలో గూడుకట్టుకోసాగింది.

_ _ _ _ _ _ _

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

 

“ముకుల్ ఆత్మహత్య చేసుకున్నాడు!” నిలదీస్తున్నట్టుగా అడిగింది రంజని.

నోటి దగ్గర పెట్టుకున్న కాఫీ కప్పును క్రిందపెట్టి భావరహితంగా ఆమె వైపు చూసాడు అనంత్.

“నేనూహించగలను అనంత్! అతన్ని ఎవరు చంపారో!” అంది రంజని.

“వాడ్డూ యూ మీన్?” స్వరం పెంచి అడిగాడు అనంత్.

“యూ నో వాట్ ఐ మీన్! ఇంతగా డర్టీ గేమ్స్ ఆడాల్సిన అవసరమేముంది? అతని మానాన అతన్ని వదిలేసి ఉండొచ్చుగా?” నెమ్మదిగా అంది రంజని.

“చూడు రంజనీ! వాడి తప్పులకి ఇంకెవరో రెస్పాన్సిబిల్ అని చెప్పొద్దు. తెలియని విషయాల గురించి అతిగా మాట్లాడ్డం ఫూలిష్…” అన్నాడు అనంత్.

ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది రంజని.

_ _ _ _ _ _ _

ఊరి పొలిమేరలోవున్న ఎస్.ఈ.జడ్ లోని కొత్త క్లైంట్ తో వ్యాపార చర్చలు ముగించి తిరిగి వస్తున్న అనంత్ కాఫీ తాగడానికని రోడ్డు ప్రక్కనున్న చిన్న హోటల్ దగ్గర ఆగాడు.

కాఫీకై ఆర్డర్ ఇచ్చి యథాలాపంగా బైటకి చూసాడు. అక్కడ కనబడ్డ దృశ్యాన్ని అలానే చూస్తూ ఉండిపోయాడు.

ఆ హోటెల్ కు ఎదురుగా కడుతున్న బిల్డింగ్ దగ్గరున్న చెట్టుకు ఓ ఉయ్యాల కట్టివుంది. ఆ ఉయ్యాలను ఊపుతూ ఓ మధ్యవయస్కురాలైన స్త్రీ. నిద్రపట్టని బిడ్డ గట్టిగా ఏడుస్తోంది. ఏడ్పు ఆగకపోవడంతో ఉయ్యాలను నిలిపి, లోపల పడుకున్న బిడ్డను ఎత్తుకుంది ఆవిడ. తన ముందు పరిచిన పొత్తిళ్ళలో బిడ్డను అతి జాగ్రత్తగా పడుకోబెట్టి మాట్లాడించసాగింది.

ఆమెకు మోచేతుల క్రింది నుండి రెండు చేతులూ లేవు. ఆ మొండి చేతుల్తో బిడ్డను అతి సులువుగా ఎత్తుకోవడమే కాకుండా ఆ పాపాయి మొలకి కట్టిన గుడ్డను తన కాళ్ళతో చాలా చాకచక్యంగా తీసేసి మరో తుండుగుడ్డను నడుం కట్టింది. ఆపై ఒక పాదాన్ని బిడ్డకు ఆసరాగావుంచి మరో పాదంతో సున్నితంగా తడుతూ పాడుతోంది.

ఆ జరుగుతున్నదాన్ని అనంత్ అత్యంతాశ్చర్యంతో చూడసాగాడు. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఆమె మొండిచేతులతోను, కాళ్ళ తోనూ చేసిన అసాధారణమైన ఫీట్లని తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించాడు అనంత్.

ఇంటికి వచ్చాక ఆ వీడియోను ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. ఓ గంట ఆగి చూడగా ఇరవై కామెంట్లు వచ్చాయి. అన్ని కామెంట్లని శ్రద్ధగా చదివాడు. పందొమ్మిది కామెంట్లు అనంత్ ను, ఆమెను పొగుడ్తూ వచ్చాయి. కానీ ఒక్క కామెంట్ మాత్రం అనంత్ ను కుదిపేసింది.

Mr. Anant, while I appreciate your effort to record and share with us a video about an exceptional woman who has emphatically exhibited what a dutiful mother can do. On the other hand, I wish to be candid with you on one aspect. Having blessed to witness such a spectacular moment, wherein, the true motherhood has been exhibited with all its glory, what do you want to do from here on? Do you want to be content with the number of hits that your video can receive? Will you be keep checking the analytical insight of this video more often than not? Or do you ever wish to meet her again and understand the torment that she had undergone to overcome her deformity and master such a dexterity which, otherwise, a normal mother can ever imagine in her wildest dreams? I sincerely request you to meet that mother and say “Maa, tujhe salaam” on my behalf. Thanks.

ఆ కామెంట్ పోస్ట్ చేసింది ఎవరాని ప్రొఫైల్ ను చూసాడు. “An Orphan, deceived by mother!” అన్న పేరుతోవున్న ఆ ప్రొఫైల్లో ఇంకే వివరాలూ లేవు. సిటీ అన్నచోటున మిషిగన్ అని మాత్రం వ్రాసుంది.

ఆ కామెంటును పదే పదే చదువుకున్నాడు అనంత్. చదివిన ప్రతిసారీ ’మా తుఝే సలామ్’ అన్న చోట తన ఒళ్ళు సన్నగా జలదరించడాన్ని గమనించాడు.

రంజనిని పిలిచి ఆ వీడియోను, ఆ కామెంటును చూపించాడు.

“యూ మస్ట్ గో, అనంత్!” అని క్లుప్తంగా, బలంగా చెప్పింది రంజని.

“వుయ్ మస్ట్ గో!” అన్నాడు అనంత్, రంజని చేయిని గట్టిగా పట్టుకుని. హృద్యంగా నవ్వింది రంజని.

_ _ _ _ _ _ _

ఖరీదైన కారు నుండి దిగుతున్న ఆ ఇద్దరిని కౌతుకంతో చూస్తోందామె.

ఖరీదు తక్కువైన కాటన్ చీరలో వున్నా కూడా అందంగా కనబడుతున్న రంజనిని కళ్ళార్పకుండా చూస్తోంది ఆమె.

పక్కనే విలువైన దుస్తుల్లో విలాసంగా వస్తున్న అనంత్ ను ఆమె చూడనే లేదు.

వస్తూనే ఉయ్యాల కట్టిన చెట్టు క్రింద కూర్చునివున్న ఆమె రెండు భుజాల మీదా చేతులు వేసి “బావున్నావామ్మా!” అని పలకరించింది రంజని.

బాగున్నట్టుగా తలాడించి – “మీరు?” అంది ఆమె. తన భుజాల మీదున్న రంజని మెత్తటి, తెల్లటి చేతులు ఎక్కడ ఖరాబౌతాయోనన్న ఆలోచన ఆమె కళ్ళల్లో తారట్లాడుతోంది.

ఆ ఆలోచనని గ్రహించినట్టు – “ఇలా నేను చేతులు వేయడం నీకు నచ్చినట్టు లేదు?” అంది రంజని.

“ఆహా….అట్లేమీ కాదండి! నా బట్టలు మురిగ్గావుంటాయని…” నసిగింది ఆమె.

“ఈయన మావారు!” అంది అనంత్ వైపు చూపిస్తూ.

మొండి చేతుల్తోనే నమస్కారం చేసిందావిడ.

అప్రయత్నంగా ప్రతి నమస్కారం చేసాడు అనంత్.

“నిన్న నువ్వు బిడ్డను ఈ చేతుల్తో ఆడించడాన్ని…” అంటూ ఆవిడ కాళ్ళను చూపించింది రంజని. “…చూసిన ఈయన వీడియో తీసారు. అది చూడగానే నిన్ను చూడాలని, మాట్లాడించాలనీ వచ్చాను.” అంది రంజని.

రంజని మాటలకు సమాధానం చెప్పని ఆమె కళ్ళలో విస్మయం మాట్లాడసాగింది.

“నీ పేరు?” అని అడిగింది రంజని.

“రత్నమ్మ.” లోగొంతుకతో చెప్పింది.

“రత్నమ్మ! నీకు సరిగ్గా సరిపోయే పేరు.” అని కొన్ని క్షణాలాగి “రత్నమ్మా! ఇది ఎలా జరిగింది?” అంటూ ఆమె మొండి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది రంజని.

పడవలాంటి కారులో వచ్చిన గొప్పింటి ఆడబిడ్డ తనలాంటి మసిబారిన మనిషిని అలా చనువుగా తాకడం రత్నమ్మకు ప్రపంచపు ఎనిమిదో వింతగా అనిపిస్తోంది.

రత్నమ్మ వెంటనే మాట్లాడకపోవడాన్ని మరోరకంగా అర్థం చేసుకుంది రంజని – “నీకు బాధ కలిగించేట్టైతే వద్దులే రత్నమ్మ!” అంది.

రత్నమ్మ మాట్లాడలేదు.

“నేను చెప్పనా అమ్మగారూ?” అన్న మగగొంతు వినబడ్డంతో అటుకేసి చూసింది రంజని. రత్నమ్మ, అనంత్ లు కూడా చూసారు.

ఎదురుగా నిలబడివున్న వ్యక్తిని చూసి – “మీరూ?” అంది రంజని.

“దీని పెనిమిటిని. వెంకటేసులు నా పేరు. తాపీమేస్త్రీని.” క్లుప్తంగా, సూటిగా తన పరిచయం చేసుకున్నాడా వ్యక్తి.

“ఆహా…” అంది రంజని. ఆమె అలా అనడాన్ని పచ్చజెండాగా భావించి జరిగిపోయిన కథను ఆగకుండా చెప్పుకుపోయాడు వెంకటేసులు.

ఓ పల్లెటూళ్ళో కడుతున్న బిల్డింగ్ లోని పన్నెండడుగుల ఎత్తున్న పచ్చిగోడ కూలిపోవడం, ఆ గోడ దగ్గరే పనిచేస్తున్న రత్నమ్మ తీవ్రంగా గాయపడడం, సరైన వైద్యం జరక్క చేతులకు గాంగ్రిన్ రావడం, ఆపై పెద్దాసుపత్రిలో రెండు చేతుల్నీ తీసేయడం గురించి వివరంగా చెప్పుకొచ్చాడు వెంకటేసులు. ఈ ఘటన జరిగినప్పుడు రత్నమ్మ రెండు నెలల గర్భవతని చెప్పాడు.

ఆపై పుట్టిన బిడ్డను చూసుకోవడానికి కొన్ని నెలల పాటు కూలీకి వెళ్ళకుండా తను ఆగిపోవాల్సిరావడం, దాంతో వచ్చిపడ్డ ఆర్థిక కష్టాల్ని చెప్పుకున్నాడు. తనను పనికి పంపి, ఆ మొండి చేతుల్తోనే ఇంటి పనుల్ని చేసుకోవడానికి, బిడ్డ లాలింపుని చూసుకోవడానికీ రత్నమ్మ పడ్డ అవస్థల్ని వివరించాడు. ఆపై స్వంత ప్రయత్నంతో కాళ్ళనే చేతులుగా చేసుకొన్న వైనాన్ని విశదీకరించాడు.

వెంకటేసులు చెబుతున్నంతసేపూ నిర్ఘాంతపోతూ విన్నారు రంజని, అనంత్ లు. మొగుడు అలా పొగుడుతున్నా రత్నమ్మ మొహంలో ఎలాంటి పొంగూ, అహమిక రవ్వంతైనా కనబడలేదు వాళ్ళకి.

“దీనికింత పట్టుదల రాకపోయింటే తినేందుకు రెండు మెతుకులు కూడా మాకు రాలేవా?” అన్నాడు వెంకటేసులు, నిండైన అభిమానంతో తన భార్యను పొదివిపట్టుకుని.

ఆ మాటల్ని విన్న రంజని కళ్ళు చెమరిస్తే, అనంత్ దీర్ఘమైన నిశ్వాసాన్ని వదిలాడు.

“వెంకటేసులు, నీకు బ్యాంకులో అకౌంట్ వుందా?” హటాత్తుగా అడిగింది రంజని.

“ఉందమ్మగారు! ఎందుకు?” అన్నాడు.

“నీ బ్యాంకు ఎక్కడుంది?” మళ్ళీ అడిగింది రంజని.

“ఈడే….కొంచెం ముందెళ్తె గ్రామీణ బ్యాంకొస్తుంది. అదే అమ్మగారు!” అన్నాడు వెంకటేసులు.

“మాతో వెంటనే రా వెంకటేసులు!” అని అతనితో అని, అనంత్ వైపుకు తిరిగి “ఐ వాంటు మేక్ ఏ ఎఫ్.డి ఫర్ ద కిడ్!” అని తన నిర్ణయాన్ని ప్రకటించింది రంజని.

“ష్యూర్!” అన్నాడు అనంత్, వెంకటేసులు కంటే రెండింతల ఆశ్చర్యంతో.

“డూ యూ హావ్ ఎనీ అబ్జెక్షన్?”  – అడిగింది రంజని.

“ఐ యామ్ థ్రిల్డ్ అండ్ లవింగ్ టు డు!” అని ’థమ్సప్’ చేసి చూపాడు అనంత్.

రంజని ముఖంలో సంతోషం సుడిగాలిలా వీచింది.

“రత్నమ్మా! వెంకటేసులు ఓ పదినిముషాలు మాతో వస్తే చాలు. ఒక్కతే ఉంటావుగా?” అని నవ్వుతూ అంది రంజని.

ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఏమీ అర్థంకాని రత్నమ్మ “ఉంటా!” అని మాత్రం అనగలిగింది.

లోలోపలే తికమకపడుతున్న వెంకటేసుల్ని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని వేగంగా కారును ముందుకు నడిపాడు అనంత్.

_ _ _ _ _ _ _

వెంకటేసులు పది నెలల కూతురి పేరున యాభైవేల రూపాయలతో ఎఫ్.డి. వేసాడు అనంత్. గార్డియన్గా వెంకటేసులు పేరును వ్రాయించింది రంజని. తాగుడుకు, జల్సాలకు, వృధా ఖర్చులకు ఈ డబ్బు వాడనని, అమ్మాయికి చక్కగా చదువు చెప్పించి ప్రయోజకురాల్ని చేసేందుకే వాడతానని వాళ్ళ కులదైవం మీద వెంకటేసులుతో ఒట్టేయించుకుంది రంజని. ఆ తర్వాతే ఎఫ్.డి. కాగితాల్ని అతని చేతిలో పెట్టాడు అనంత్.

బ్యాంక్ నుండి వెనక్కు వచ్చిన తర్వాత ’అమ్మగారు, అయ్యగారు’ చేసిన దానం గురించి గొప్పగా వర్ణించాడు వెంకటేసులు.

నిర్మలమైన నవ్వుతో దండం పెట్టింది రత్నమ్మ.

ఆ చేతుల్ని పట్టుకుని “మా! తుఝే సలామ్!” అని మెల్లగా గొణిగింది రంజని.

ఆమె అన్న మాటలను విన్నా అర్థం తెలియని రత్నమ్మ ముగ్ధంగా నవ్వింది.

ఆ నవ్వు, అమలిన మాతృప్రేమకు చిరునామాగా తోచింది రంజనికి.

 

ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర

మిరుసు లేకుండనే దిరుగుచుండు

ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు

నేల రాలక మింట నిలిచియుండు

ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ

కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును

ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల

గాలిదేవుడు సురటీలు విసరు

 

ఆ మహాప్రేమ – శాశ్వతమైన ప్రేమ –

అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ –

నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల

ప్రేయసీ! సృష్టి యంతయు ప్రేమమయము!!

_ _ _ _ _ _ _

రత్నమ్మ నుండి వెనక్కు వచ్చిన వెంటనే తన వీడియో పై కామెంట్ వ్రాసిన ఆ అజ్ఞాత వ్యక్తికి రిప్లై ఇచ్చాడు అనంత్.

Dear “Orphan” – I have met with Ratnamma, the wonder lady in my video and learnt as to how she toiled in learning the unique ways of cajoling her ten months old kid. All I can say is that – “I am humbled by her commitment.”. I own a $0.5 million company and I am convinced now that my learning capabilities and commitment levels are no match to this wife of a construction worker. With all this, I must sincerely thank you for making me to understand the true meaning of life. Keep in touch. I remain – Ananth.

“నువ్వు చాలా మారిపోయావ్ అనంత్!” – టైప్ చేయడం ముగించిన అనంత్ ను వెనకనుండి కౌగిలించుకుంటూ అంది రంజని.

“ఇప్పటికీ మార్పు రాకపోతే నేను మనిషినేనా?” అన్నాడు అనంత్.

అతని గొంతులోని నిజాయితీకి, మాటల్లోని నైర్మల్యానికి చలించిపోయింది రంజని.

“గాడ్ బ్లెస్ యూ!” అంటూ అంతులేని తమితో అతని బుగ్గ మీద ముద్దుపెట్టింది.

“నౌ ఐ నో హూ ఈజ్ యువర్ గాడ్!” అన్నాడు అనంత్ నవ్వుతూ.

“నిజంగా?” అంది రంజని

“ఐ ఆల్సో నో వేరీజ్ హీ!” అన్నాడు అనంత్ ధృఢంగా.

“ఓహ్! ఎక్కడుంటాడు?” అంది రంజని కళ్ళని పెద్దవి చేసి చూస్తూ.

“ఇక్కడే….ఈ కళ్ళలో!” అన్నాడు అనంత్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.

మరింత గాఢంగా అల్లుకుపోయింది రంజని.

* * * * *

“డెబ్బైవ గదిలోని పువ్వును చేరింది నీ రెండో పావు!” సాలోచనగా అన్నాడు సారస్వతసారుడు.

“పువ్వు జ్ఞానానికి నిదర్శనం కదా ప్రభూ!” అంది కమలగంధి.

“అదెలా?” అన్నాడు నిగమాగమగోచరుడు చిరునవ్వును వెలయిస్తూ.

“పూష్ణాతి జ్ఞానం ఇతి పుష్పం – అని కదా ఆర్యోక్తి……” అని అర్ధోక్తిలో ఆగింది సర్వార్థప్రదాయిని.

“గొల్లలతో తిరిగినవాణ్ణి, ఇలా కఠినమైన వేదాంతం వంటబట్టేనా!” అన్నాడు యోగిహృద్ధ్యానగమ్యుడు.

“గోపాలురంటే వేదరక్షకులైన దేవతలే గానీ అన్యులు కారుగా ప్రభూ!” అంది సకలలోకసంధాయిని.

“అలాగా! ఐనా కూడా అర్థం కాలేదు. వివరించు ప్రియా!” అన్నాడు ప్రీతివర్ధనుడు.

“చిత్తం స్వామీ! పుష్య అంటే వికసించేది అని అర్థం. చెట్టు నుండి మొగ్గ రూపంలో పుట్టి, అటుపై రేకుల్ని విప్పుకుని, సుగంధాన్ని వెదజల్లుతూ నెమ్మదిగా వికసిస్తుంది పువ్వు. జ్ఞానం కూడా దేహమనే చెట్టులో మొగ్గ తొడుగుతుంది. సజ్జనుల సాంగత్యమనే రసవర్ధకం దొరికినప్పుడు రేకుల్ని విప్పుకుని వికసిస్తుంది. సుజ్ఞానమెప్పుడూ సుగంధభరితమైనదే. ఆ జ్ఞానం, పొందినవారికే కాకుండా ఇతరులకు కూడా సుఖకారకమౌతుంది. అందుకనే అర్చనలో పుష్పసమర్పణ ఒక విడువలేని భాగం. అందువల్ల పుష్పం జ్ఞానానికి ప్రతీక. దీనికి సూచనగా మిమ్మల్ని తలచుకోని నా రెండో పావు ఇప్పుడిప్పుడే మీ స్మరణలో తరిస్తోంది. ఒక్కో రేకునే తెరచుకుంటూ వికసిస్తోంది. ఇది సృష్టిధర్మం. మానవుల తుది గమ్యం. అజ్ఞానాంధకార వినాశనం.” అంది క్షీరసముద్రరాజ తనయ.

“అద్భుతం!” అన్నాడు నారాయణుడు.

“తమద్భుతం బాలక మంబుజేక్షణం….” అంటూ నమస్కరించింది పన్నగశాయిప్రియ. “మరి మీ మొదటి పావు సంగతేమిటో!”

“పరమపదసోపానంలోని చివరి మెట్టు మీద వున్న ఈ కాయకు మిగిలింది మోక్షం మాత్రమే!” అన్నాడు చతుర్విధపురుషార్థ ప్రదాత.

“అనుగ్రహించండి!” అంది సర్వానుగ్రహప్రదాయిని.

స్వామి పాచికల్ని నడిపితే అవి గోవర్ధనోధ్దారియైన శ్రీకృష్ణునిపై దేవతలు పుష్పవృష్టిని కురిపించినప్పుడు ఆ పుష్పధారలు చేసిన చప్పుళ్ళను ప్రతిధ్వనించాయి.

* * * * *

Your views are valuable to us!