వైకుంఠపాళీ – ఇరవై నాల్గవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగంవ్యాపారం పెరగడంతో స్వంత ఆఫీస్ ను తెరుస్తాడు అనంత్. ఒకప్పుడు తనను ఘోరంగా అవమానించిన ముకుల్ పై ప్రతీకారం తీర్చుకోవడంలోభాగంగా అతని కంపెనీలో ఉన్న ముఖ్యమైన ఉద్యోగుల్ని తనవైపుకు లాక్కుంటాడు. అనంత్ ఎత్తులకు చిత్తైన ముకుల్ ఆత్మహత్య చేసుకుంటాడు. వికలాంగులారైన ఓ స్త్రీ తన బిడ్డను లాకించే దృశ్యాన్ని చూసిన అనంత్ లో గొప్ప మార్పులు వస్తాయి. ఆ వికలాంగురాలి పది నెలల కూతురి పేరిట యాభై వేల రూపాయల ఎఫ్.డి. చేస్తుంది రంజని.

 

“ఇంకో కథ చెప్పు!” అంది సుశీలగా పేరు మారిన సోమక్క.

“ఇంకో కథా?” అంది సుమతి.

“ఔను! తమాషా కథ చెప్పు!” అధికారయుక్తంగా అడిగింది సుశీల.

“ఊ…ఊ…ఆ( ఈ కథ విను! ఓ పేదవాడికి గారెలు తినాలనిపించింది. పాపం, అక్కడా ఇక్కడా బిచ్చెమెత్తి కొద్దిగా మినుములు, నూనె మొదలైన కావలసిన సామాన్లని సంపాదించాడు. ఇంటికొచ్చి భార్య చేతికిచ్చి ’చక్కటి గారెలు చెయ్యవే!’ అన్నాడు. ఆవిడ గారెల్ని కాలుస్తూ కాలుస్తూనే ఒక్కొక్కటి లెక్కన అన్నీ తినేసింది. భర్త కోసమని ఒక్క గారెను మిగిల్చింది. అరిటాకులో ఆ గారెను పెట్టుకొచ్చి భర్త ముందు పెట్టింది. ముందున్న ఒకే ఒక్క గారెను చూసి ఆశ్చర్యపోయిన మొగుడు ’ఏమే! పాతికో ముప్పయ్యో ఐవుంటాయని అనుకొన్నాను. ఈ ఒక్కటేనా చేసింది?’ అన్నాడు. భర్తకు అబద్ధం చెప్పలేని ఆ భార్య ’లేదండీ! మీరన్నట్టుగా పాతిక దాకా అయ్యాయి. ఇరవైనాలుగు నేనే తినేసాను!’ అంది. విస్తుపోయిన ఆ పేదభర్త ’ఇరవైనాలుగు తిన్నావా? ఎలా తిన్నావే?’ అంటుండంగా ’ఇదిగో, ఇలా!’ అంటూ ఆ ఒక్క గారెనూ నోట్లో వేసేసుకుంది ఆ పేదోడి పెళ్ళాం.”

“హాహాహా….హాహాహా…బాగుంది బాగుంది” అని చప్పట్లు కొడుతూ నవ్వింది సుశీల.

తానూ ఆ నవ్వుతో శ్రుతి కలిపింది సుమతి.

“ఇదెందుకిలావుంది?” అని టక్కున అడిగింది సుశీల, సుమతి గర్భం వైపు చూపిస్తూ.

ఆ ప్రశ్నకు గతుక్కుమంది సుమతి. ఒక నిముషం ఆలోచించి – “నీలాంటి పాప ఉంది!” అని అన్నది.

“అవునా? పాపాయి అక్కడికెలా వచ్చింది?” మళ్ళీ ప్రశ్నించింది సుశీల.

పునరాలోచనలో పడింది సుమతి. సుశీల వొలుచుకు తింటున్న వేరుశెనక్కాయల్ని చూడగానే మెరుపులా సమాధానం తట్టింది. చేతిలోకి ఓ వేరుశెనగను తీసుకుని, వొలిచి – “ఇందులోకి ఈ పప్పు ఎలా వచ్చిందో అలా అన్నమాట!” అని అంది.

ఏదో అర్థమైనట్టుగా “ఓహో!” అని తలను ఆడించింది సుశీల. “పాపాయిని అక్కడ ఎవరు పెట్టారు?” – తనలో తానే ఆలోచించుకున్నట్టుగా మెల్లిగా అంది సుశీల.

“ఈ వేరుశెనగలో పప్పును నువ్వు పెట్టావా?” అని అడిగిందు సుశీల.

లేదన్నట్టు తలను అడ్డంగా ఊపింది సుశీల.

“మరి ఎవరు పెట్టారబ్బా?” అని సుశీలని అనుకరిస్తూ అడిగింది సుమతి. “ఏమో!” అన్నట్టుగా భుజాల్ని కుదిపిన సుశీల – “దేవుడా!” అని అంది.

“అరే! భలే చెప్పావే!” అని అంటూ సుశీల భుజం తట్టింది సుమతి.

“ఐనా! పాపాయిల్ని ఎలా తయారుచేస్తారు?” అని అడిగింది సుశీల.

“చిన్ని పాపాయిల్ని నువ్వు చూసావా?” – అడిగింది సుమతి.

“చూసా!”

“ఎవర్ని చూసావ్?”

“ఊ…అదే…మా చంద్రశేఖరం, లావణ్య….”

వాళ్ళిద్దరూ సుశీల పిన్ని రామలక్ష్మి బిడ్డలు.

“పాపాయిలు ఎలా పడుకుంటారు చెప్పు?” అంది సుమతి.

“ఇల్లా……” అంటూ వెనకనున్న ఓ పెట్టె మీద వెల్లకిలా పడుకుంది సుశీల.

“అలా పడుకోవడంతో బాటూ పిడికిళ్ళు బిగించి ఇలా తలపైకి పెట్టుకుంటారు కూడా! నువ్వు చూసావా?”

“ఆ….అవును….లావణ్య అట్లాగే పెట్టుకొనేది. ఎందుకలా పెట్టుకుంటారు?” కుతూహలంగా అడిగింది సుశీల.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

“మనుషులు అనే బొమ్మల్ని బ్రహ్మదేవుడు మట్టితో తయారుచేస్తాడు. కొత్తగా పుట్టిన పాపాయిలు, పుట్టబోయే పాపల కోసం మట్టిని మోస్తారు. అందుకనే ఇలా చేతుల్ని నెత్తి మీద పెట్టుకొంటారు.” అంది సుమతి.

“ఆహా….” అని అంది సుశీల.

“ఒక్కోసారి పాపాయిలు సోమరిపోతులై మట్టిని మొయ్యకపోతే బ్రహ్మదేవుడు తిడతాడు. అందుకనే నిద్రలోనే ఉలిక్కిపడి ఏడుస్తారు పాపాయిలు….”

“ఆఆఅ…” అని దీర్ఘం తీసింది సుశీల.

“చక్కగా పనిచేస్తే ఇదిగో…ఇలా…భుజం తట్టి మెచ్చుకుంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు పాపాయిలు వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకొంటారు.” అంది సుమతి నవ్వుతూ.

“ఆ..ఆ..ఆ….” అని మళ్ళీ దీర్ఘం తీసింది సుశీల.

కొద్దిసేపటి మౌనం తర్వాత ఒక్క ఉదుటున లేచి బైటకు పరుగెట్టిన సుశీలను చూసి అవాక్కైన సుమతి చివాలున లేచి “సుశీల! ఎక్కడికి? ఆగు!” అంటూ బైటకెళ్ళబోయింది. రెండడుగులు వేసేలోగా కడుపులో సన్నటి నొప్పి రేగడంతో “అమ్మా!” అని చిన్నగా కేకపెట్టి వాకిలిని ఆసరాగా పట్టుకుంది సుమతి. నొప్పి ఇంకా ఉధ్ధృతం కావడంతో ఈసారి గట్టిగా అరిచింది సుమతి.

ముంగిటిలోకి గెంతులేస్తున్న లేగదూడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సుశీల, వాకిట్లో వున్న సుమతిని తేరపారి చూసింది. ఆ వెంటనే బాణంలా వీధిలోకి దూసుకుపోయింది.

_ _ _ _ _ _ _

“ఏం దిగులు పడకండి శర్మగారు! మీ పట్నం డాక్టరులానే చక్కగా చూడగలడు మా అరుణాచలం. చూడ్డానికి కాంపౌండర్లా కనబడుతున్నా వీడూ ఎంబిబిఎస్ డాక్టరేనండోయ్! అనుమానాలేవీ పెట్టుకోకండి!” అని ధైర్యం చెబుతున్నాడు మోహన్రావ్.

“అవును శర్మా! మంచి మార్కులతో పాసై, పట్నంలో కాకుండా ఇక్కడ ఆసుపత్రి పెట్టుకున్నాడు. చాలా మంచి కుర్రవాడు. అంతే మంచి హస్తివాసి కూడానూ. ధైర్యంగా ఉండు!” అని మోహన్రావుకు వత్తాసు పలికాడు త్య్రంబక ఉపాధ్యాయ.

“ఒక్క అరుణాచలమేనా? ఆ సంపూర్ణమ్మ కూడా ఎంత అనుభవం ఉన్నదంటారూ! ఇప్పటికి కనీసం వెయ్యి కాన్పులైనా చేసుంటుంది. ఒక్కటి కూడా పురిటిలో సంధి కొట్టింది లేదు! మంచి నేర్పున్న వ్యక్తి. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు!” అని అంది రామలక్ష్మి. ఆమె అన్న మాటలకు అంగీకారం తెలుపుతున్నట్టుగా తలను ఆడించింది అపర్ణ.

మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి వంకా చూస్తూ చిరునవ్వులో తన ధైర్యాన్ని ప్రకటించాడు శర్మ. కానీ అతని చూపంతా రామలక్ష్మి వెనకనే దాక్కుని అప్పుడప్పుడూ శర్మ వైపుకు తొంగిచూస్తున్న సుశీల మీదనే ఉంది.

ఒక తోడు, ఒక రక్షణ, ఒక సహాయం కావల్సివచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆ అమ్మాయి సుమతికి తోడుగా ఉండడాన్ని ఆలోచిస్తున్న కొద్దీ శర్మలో ఆశ్చర్యం అధికం కాసాగింది. ముఖ్యంగా తను ఊర్లో లేనప్పుడు, దొంగతో ప్రమాదం వచ్చిపడ్డప్పుడు, ఇప్పుడు – కొన్ని గంటల క్రితం సుమతికి నొప్పులు వచ్చినప్పుడూ సుశీల అక్కడేవుంది. ఊళ్ళో అందరి చేతా పిచ్చిదానిగా పిలవబడినా సుమతి దగ్గర మామూలుగా వ్యవరించే ఆ అమ్మాయి తీరును అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నించసాగాడు శర్మ.

తెలిసినవారెవరో కనబడ్డంతో వారితో మాట్లాడ్డానికని గది బైటకెళ్లాడు మోహన్రావు. రామలక్ష్మి, అపర్ణలు కొద్దిగా వారగా వెళ్ళి మాట్లాడుకోసాగారు. బల్ల మీద కూర్చున్న ఉపాధ్యాయ కళ్ళు మూసుకుని ఏవో శ్లోకాలు వల్లెవేసుకుంటున్నాడు. కొద్దిదూరంలో గోడకు ఆనుకుని దిక్కులు చూస్తున్న సుశీల దగ్గరకొచ్చాడు శర్మ. అతన్ని చూసిన ఆ అమ్మాయి దూరంగా వెళ్ళబోయింది. టక్కుమని అమ్మాయి చేతుల్ని పట్టుకుని – “సుశీలా! “సుమతికి నొప్పులొచ్చాయని నీకెలా తెలిసింది?” అని మార్దవంగా అన్నాడు అడిగాడు శర్మ.

అన్నిరోజులూ కేవలం చూడ్డమేతప్ప శర్మతో మాట్లాడని సుశీల ఏం పలకాలో తోచకుండా అతని వైపుకు గుడ్లప్పగించి చూస్తూ – “నొప్పులు…..నొప్పులంటే?” అని మెల్లగా అడిగింది.

“అదే! కడుపునొప్పి….సుమతి గట్టిగా అరిచింది కదా?” అన్నాడు శర్మ.

“లావణ్య పుట్టేటప్పుడు పిన్ని కూడా ఇలాగే వుండేది….ఓరోజు ఇలాగే అరిచింది! అందుకే పిన్నిని పిలుచుకొచ్చా!” అంది సుశీల.

ఆ మాటలకు అమ్మాయి బుగ్గల్ని పుణికాడు శర్మ.

“సుమతికి పాపాయిలు పుడ్తారని పిన్ని చెప్పింది.”

“పాపాయిలా? కాదు…కాదు…నీలాంటి పాపనో లేక బాబో పుడతారు!” అన్నాడు శర్మ.

“ఆహా….మీకు పాపాయిలొద్దా? ఒక్క పాపాయే కావాలా?” – ప్రశ్నించింది సుశీల. ఏం చెప్పాలో తోచని శర్మ ఓ నవ్వు నవ్వాడు.

“అయ్యో! ఆ పిచ్చిదాన్తో ఏం మాటలండీ శర్మగారూ?” అంటూ వడివడిగా వచ్చింది రామలక్ష్మి.

“ఆహా…సుశీలను పిచ్చిదని అనకండి. ఆ అమ్మాయిలో మనకు అర్థం కాని గొప్పదనముంది!” అన్నాడు శర్మ. అతని మాటల్లో ప్రతిధ్వనించిన గాంభీర్యాన్ని గ్రహించింది రామలక్ష్మి.

“అయ్యో! ఏదో దీన్నలా పిలిచి పిలిచీ అలవాటైపోయింది.” అని అంటూ “మీ పుణ్యమాని పేరు మార్చాక ఇప్పుడిప్పుడే మన లోకంలోకి వస్తోంది. తొందర్లోనే పూర్తిగా కుదురుకోవాలని ఆ దుర్గమ్మకు మొక్కుకొంటున్నాను. చూడండి! దీనికి పన్నెండు నిండబోతోంది. ఎదుగుతున్న బిడ్డ కదా! మునుపటిలానే ఉండివుంటే ఎన్ని కష్టాలు ఎదురుపడేవో? మా అక్క…అదేనండీ…మావారి మొదటి….అర్థమైంది కదా! అక్క చేసుకొన్న పూజలకి ఫలంగా మీరు ఈ ఊరొచ్చారు. లేకపోతే ఎక్కడో పట్నంలో ఉండేవాళ్ళు ఇలాంటి పల్లెటూరికొస్తారా? ఐనా అదేం చిత్రమో గానీండి మా పిచ్చిది…అదే సుశీల…మొదటిరోజు నుండీ సుమతితో భలే జోడీ కట్టేసింది. మొన్న కూడా అన్నాను…వీళ్ళిద్దరిదీ ఏదో జన్మల ఋణానుబంధం! ఔనంటారా?” ఆగకుండా మాట్లాడుతోంది రామలక్ష్మి.

అంతలో – “శర్మగారూ! ఒక్క నిముషం!” అంటూ ఆపరేషన్ గది నుండి బైటకి వచ్చిన డాక్టర్ అరుణాచలాన్ని చూసి నోరు కట్టేసుకుండి రామలక్ష్మి. శర్మ వడివడిగా అతని వైపుకు నడిచాడు. అతని భుజాన్ని పట్టుకుని పక్కకు తీసుకెళ్ళాడు అరుణాచలం.

“శర్మగారూ!” అంటూ అతని చేతుల్ని ఊపేయసాగాడు అరుణాచలం. “కవలలు! అమ్మాయి – అబ్బాయి.” అన్నాడు.

సంతోషంతో బాటూ దిగ్భ్రమకు లోనైయ్యాడు శర్మ. “మీకు పాపాయిలొద్దా? ఒక్క పాపాయే కావాలా?” అంటూ పది నిముషాల క్రితం సుశీల అన్న మాటలు గుర్తుకొచ్చాయి. “ఏవరీ అమ్మాయి? సుమతికీ ఈ అమ్మాయికీ గల సంబంధమేమిటి? రామలక్ష్మి అన్నట్టు ఏ జన్మలోని ఎలాంటి ఋణమిది?” – ఆలోచనాపరంపరలతో సతమతమౌతూ మౌనం వహించిన శర్మను మరోలా అర్థం చేసుకున్న అరుణాచలం “మీరు వర్రీ కావల్సిన పనిలేదండీ! నార్మల్ డెలివరీ. నో ప్రాబ్లమ్స్!” అని భుజం తట్టాడు.

“అంతా భగవంతుని కృప!” అని మాత్రం అనగలిగాడు శర్మ.

సంపూర్ణమ్మ ద్వారా విషయం తెలుసుకున్న రామలక్ష్మి, అపర్ణ, ఉపాధ్యాయలు శర్మను చుట్టుముట్టారు. శర్మ వినయంగా వంగి ఉపాధ్యాయ దంపతులకు నమస్కారించాడు.

“తీరదేమో అని అనుకున్న కోర్కెను ద్విగుణీకృతం చేసాడు దేవుడు. మీ ఇద్దరి పుణ్యం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే మరో సందర్భం కావాలా శర్మా? పిల్లలిద్దరూ మీలాగే గుణసంపన్నులు కావాలని ప్రార్థిస్తాను.” అన్నాడు ఉపాధ్యాయ.

మోహన్రావు దంపతులు శర్మకు శుభాకాంక్షలు చెప్పారు.

అరుణాచలం అనుమతించడంతో పురిటిగదిలోకి వచ్చిన శర్మను అలసిన కన్నులతో చూస్తూ నవ్వింది సుమతి. ఆమె పక్కనే పొత్తిళ్ళలో ’పాపాయిలు’.

అందరికంటే ముందుగా నడచి, రెండు చేతుల్నీ వెనక్కి కట్టుకుని, గంభీరంగా పిల్లల వైపు చూస్తూ – “బాగున్నారు. బాగా ఉంటారు.” అని అంది సుశీల.

“బాలవాక్కు బ్రహ్మవాక్కంటారు. ఇంకేం! అమ్మాయి శుభం పలికింది శర్మా!” అన్నాడు ఉపాధ్యాయ.

“టూ బర్డ్స్ అట్ వన్ స్టోన్ అని ఇంగ్లీషువాడన్నట్టు ఆర్తికి అమ్మాయిని, కీర్తికి అబ్బాయిని ఒకే ఛాన్సులో పొందారు శర్మగారూ! మీ పరోపకారఫలమే ఇదంతానూ!” అని అన్నాడు మోహన్రావు.

“అనుమానమటండీ? పూజ కొద్దీ పురుషుడు పుణ్యం కొద్దీ బిడ్డలని వూరకేఅన్నారా?” అని దీర్ఘం తీసింది రామలక్ష్మి.

“ఔనౌను! ముమ్మాటికీ నిజం” అన్నాడు ఉపాధ్యాయ.

అపర్ణ సుమతి పక్కన చేరి, ఆమె చేతిని మృదువుగా నొక్కి – “ఇరవైనాలుగ్గంటల్లో నలభైఎనిమిది గంటల పనిబడింది నీకు! ఐనా భయమొద్దులే మేమున్నాంగా!” అని చిరునవ్వు నవ్వింది.

“హుష్! పాపాయిలు మట్టి మోస్తున్నారు. గొడవచెయ్యొద్దండి!” అని దండించింది సుశీల.

“పసిగుడ్డులు మట్టి మోయడమేమిటే మొద్దుబుర్రా?” అని సుశీల తల మీద మొట్టికాయవేసింది రామలక్ష్మి.

“నీకు తెలీదులే! లావణ్య మట్టిమోయడంతో సుమతికి పాపాయిలు పుట్టారు. ఇప్పుడు వీళ్ళు మట్టి మోస్తేనే ఇంకొకరికి పాపాయి పుట్టేది. ఔనా సుమతీ!” అని అంది సుశీల.

ఔనన్నట్టుగా తలాడించింది సుమతి.

ఏమీ అర్థం కాని రామలక్ష్మి – “ఏమిటో! కుదిరిందనుకున్న పిచ్చి ముదిరిందో ఏం పాడో? ఇలా మాట్లాడుతోందేమిటండీ?” అని మొగుణ్ణి మోచేత్తో పొడిచింది రామలక్ష్మి.

సుశీల చెప్పిన విషయం అర్థమైన వాళ్ళందరూ రామలక్ష్మిని చూస్తూ నవ్వసాగారు.

“ఇదేం చోద్యంరా బాబూ! అందరూ నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నారు!” అంటూ నిట్టూర్చింది రామలక్ష్మి. “ఇలారా పిన్నీ! పాపాయి-మట్టి గురించి చెప్తాను. ఇలా రా…” అంటూ ఆమె చేతిని పట్టుకుని లాగింది సుశీల.

“వెళ్ళవే! ఇన్నాళ్ళకి అది నీతో మాట్లాడబోతోంది.” అని ముందుకు తోసాడు మోహన్రావు. అందరి వైపూ వెర్రిగా చూస్తూ సుశీల వెంట గది బైటకెళ్ళింది రామలక్ష్మి. అందరూ మరోమారు గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు నుంచి మొదటగా తేరుకున్న ఉపాధ్యాయ – “మనం వెళ్దాం పదండి.” అంటూ అపర్ణకు సైగ చేసాడు. మోహన్రావు కూడా వాళ్ళతో బాటే బైటకొచ్చేసాడు.

అందరూ వెళ్ళిపోయాక సుమతి పడుకున్న మంచం మీద కూర్చున్నాడు శర్మ.

“ఇకపై మీరిద్దరే కాదు సుమా! మేమూ ఉన్నా”మన్నట్టుగా కేర్ మన్నాయా కవలలు.

సుమతి కళ్ళల్లో నుండి వెడలిపోతూ పలకరించాయి ఆనందబాష్పాలు.

* * * * *

“మత్పుణ్యం త్వద్దయా బలాత్ – మీ దయా విశేషమే భక్తులకు పుణ్యరూపంలో దక్కేది. అందరికంటే మొదటగా పరమపదాన్ని చేరిన మీ మొదటి ఆటకాయ పుణ్యం అంతా ఇంతా కాదు!” అని మెచ్చుకుంది సర్వవర్ణాభిమానిని.

నవ్వాడు పార్థసఖుడు.

“స్వామీ! ఈ పరమపదం గురించి ఈ అల్పమతికి వివరించండి!” అని ప్రార్థించింది మారజనని.

“దేవీ! ఐదు శిరస్సులతో శోభిస్తున్న నాగేంద్రుని ఫణాల క్రింద యోగపట్టికాసనంలో నేను కూర్చునివున్నాను. నా చుట్టూ నువ్వు శ్రీ, భూ, దుర్గా రూపాలతో కొలుస్తున్నావు. ఇదీ పరమపదం యొక్క చిత్రీకరణ. పంచశీర్షాలతో ఉన్న ఫణీంద్రుడు పంచాగుల్నీ, పంచక్రతువుల్నీ తెలపడమే కాకుండా వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, నారాయణ అనబడే నా పంచరూపాల్నీ సూచిస్తున్నాడు. ఆవగింజంత పరిమాణంలోవున్న పంచభేదాత్మకమైన ప్రపంచాన్ని తన పడగల మీద అవలీలగా మోసే ఫణీంద్రుడు అహంకారానికి గుర్తు. అహమ్ అన్నది జీవుల్లో ఉండే అతిసూక్ష్మమైన నా రూపమే. ఆ రూపం పనిచేయబట్టే ’నేనున్నాను’ అన్న ప్రజ్ఞ జీవుల్లో కలుగుతోంది. ఈ ప్రజ్ఞాశక్తి వల్లనే సాధనకు పూనుకుంటారు జీవులు. అలా సర్వప్రేరకుడినైన నేను అహమ్ బ్రహ్మాస్మి!” అన్నాడు విశ్వవ్యాపకుడు.

“ఏ ఒక్క జీవినీ విడిచిపెట్టక వారి హృదయాల్లో వెలసి అతిదగ్గరగా నివసిస్తూ ’అహమ్’ నామంతో అలరారుతున్నారు. మీ పేరును తమ అస్తిత్వంగా చెప్పుకుంటూ విర్రవీగే జీవుల్ని సైతం ఉద్ధరించే మీరు నిజమైన కరుణాసముద్రులు.” అని నమస్కరించింది దైత్యసంతాపకారిణి.

“అహమ్ వైశ్వానరో భూత్వా – హృద్యేశ అర్జున తిష్టతి – అహమాత్మా ఇలా ఎన్నో విధాలుగా నా ’అహర్నామక’ రూపాన్ని వివరించాను. విస్తృతపరిచాను. మనుష్యాణామ్ సహస్రేషు అన్న చందాన తెలియవలసిన వారికి తెలిసివస్తుంది.” అన్నాడు లోకబంధువైన లోకనాథుడు.

“త్వద్దయా బలాత్!” అని మ్రొక్కింది రూపవైలక్షణామణి.

“మరి నీ మొదటి పావు సంగతేమిటో తెలుపు దేవీ!” అని నారాయణుడంటే – “చిత్తం!” అంటూ అంబ పాచికల్ని వేసింది.

అవి నవజాతశిశువు హృద్గోషలా శబ్దించాయి.

* * * * *

Your views are valuable to us!