వైకుంఠపాళీ – ఇరవై ఐదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గతభాగం

 

“ఓన్లీ టూ పీపుల్ కేమ్, మేడమ్!” – దిగులుగా ముఖం పెట్టి రెండే పేర్లు వ్రాసివున్న కాగితాన్ని రంజని చేతికి అందిస్తూ చెప్పిందా అమ్మాయి. ఆ కాగితాన్ని అందుకుంటూ “దట్స్ ఓకే డియర్!” అంది రంజని పెదవులపై చిరునవ్వుని వెలిగిస్తూ.

“క్లబ్ హౌస్ కు వచ్చిన ప్రతివారికీ మీ ప్రోగ్రామ్ గురించి చెప్పాను మేడమ్! అందరూ చూస్తాం చూస్తాం అన్నారంతే. ఈ ఇద్దరమ్మాయిలు మాత్రం పేర్లు రాసిచ్చారు. ప్రాంప్ట్ గా వచ్చారు కూడా! మీరు ఇంకో ప్రోగ్రాం చెయ్యండి. ఈసారి ఇంకా ఎక్కువమంది వచ్చేలాగా ట్రై చేస్తా! ” అని మళ్ళీ అందా అమ్మాయి.

“థాంక్స్ కల్పనా! ఐ లైక్డ్ యువర్ ఆప్టిమిజమ్!” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది రంజని.

“సార్ ను నేను పిల్చుకువస్తాను. మీరు పదండి మేడమ్!” అంటూ విశ్వేశ్వర్ చేయి పట్టుకుని నడిపించసాగింది కల్పన అనబడే క్లబ్ హౌస్ రిసెప్షనిస్ట్.

మూడువందల ఎనభై ఫ్లాట్లున్న తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో సనాతన సంస్కృతి, సాహిత్యాలపై యువతరానికి అవగాహన కల్పించే తరగతుల్ని నిర్వహించాలన్న సంకల్పంతో, An Introduction to Telugu folklore అన్న విషయంపై విశ్వేశ్వర్ సహాయంతో మొదటి తరగతిని ఏర్పాటు చేసింది. అనుకోకుండా వచ్చిన ఆలోచనని ఉన్నపళాన అమల్లోకి పెట్టింది రంజని. దానివల్ల ఆ కాంప్లెక్స్ లో ఉన్న అందరికీ తెలియజేసేందుకు సమయం తక్కువైంది. కల్పన పూనుకుని క్లబ్ హౌస్, జిమ్, పార్టీ హాల్ మొదలైన చోట్ల రంజని కార్యక్రమం గురించి వివరిస్తూ ప్రింటౌట్లని అతికించింది. రంజనికి వచ్చిన అపురూపమైన ఆలోచనకు, తన కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోదగ్గ సంఖ్యలో శ్రోతలు వస్తారని ఎంతో ఆశపడిన కల్పనకు కార్యక్రమం మొదలయ్యే సమయానికి ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు మాత్రమే రావడంతో తీవ్ర నిరాశకు గురైంది. కానీ రంజని పెదవులపైని చిరునవ్వును చూసాకా ఏదో కొత్త ఆశ చిగురించినట్టైంది ఆ అమ్మాయికి.

క్లబ్ హౌస్ లోని ఆ మీటింగ్ హాల్లో ఓ యాభైమంది దాకా కూర్చునే ఏర్పాటువుంది. ప్రసంగీకులకు కేటాయించిన వేదిక వద్దకు వచ్చిన రంజని అంత పెద్ద గదిలో మధ్య వరుసలో కూర్చున్న ఓ ముద్దైన ముఖంతో ఉన్న బొద్దైన అమ్మాయిని, మరో రెండు వరుసల వెనుక కూర్చున్న మరో పొడవాటి అమ్మాయిని చూసి “హల్లో!” అని చేయి ఊపింది. “ప్లీజ్ కమ్ క్లోజర్!” అంటూ ముందువరుసలోని కుర్చీల వైపుకు చూపించింది. ఆలోపు కల్పన సహాయంతో అక్కడకు వచ్చాడు విశ్వేశ్వర్.

బుద్ధిగా వచ్చి ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నారా అమ్మాయిలు. ఇద్దరికీ పదహారో, పధ్ధెనిమిదో ఉంటుంది వయసు. తొలగిపోవడానికి ఒప్పుకోని పసితనం, తొందరపడుతూ వచ్చేస్తున్న యవ్వనాల విచిత్ర సమ్మేళనంతో వింత వెలుగుల్ని విరజిమ్ముతున్నాయా ముఖాలు. రంజనికి తన తొలి యవ్వనవు రోజుల ప్రతిఛాయలు పంచవర్ణాల్లో ప్రతిఫలించి, మనసులో ఇంద్రధనస్సును వికసింపజేసాయి. అనుకోని పులకింత అపురూపానుభవాన్ని కూడిక వేస్తుంటే, మౌనంతో దాన్ని హెచ్చవేసే ప్రయత్నం చేస్తోంది రంజని.

తాను వచ్చి నిలబడినదానికి సూచనగా గొంతు సవరించుకున్నాడు విశ్వేశ్వర్. అందమైన కల నుండి ఉక్కపోతల వాస్తవంలోకి జారిపడినట్టుగా ఉలిక్కిపడింది రంజని. తనూ ఓమారు సర్దుకుని మాట్లాడ్డం మొదలుపెట్టింది. ముందుగా తమ తమ పరిచయం చేసుకోమని కోరింది.

ముద్దైన బొద్దమ్మాయి లేచి “మై నేమ్ ఈజ్ స్మితా కౌర్!” అని అంది, గాఢమైన పంజాబీ యాసను జోడించి.

పొడవైన పిల్ల నిలబడి – “మై నేమ్ ఈజ్……భ్రమరాంబ!” అంది “నేను తెలుగమ్మాయిని సుమా!” అన్న హెచ్చరిక చేస్తున్నట్టుగా.

“థాంక్స్!” అంటూ తన సంక్షిప్త పరిచయాన్ని చేసుకుని విశ్వేశ్వర్ ఇంగ్లీష్ లో గురించి వివరించింది. “ఆవిధంగా, ఓ అంధుడు ప్రాచీన జ్ఞానాన్ని, ముఖ్యంగా తెలుగు జానపద పాటల్లోని పురాణ కథల గురించి విశేషంగా తెలుసుకోవడం మనందరికీ ఓ విలువైన పాఠాన్ని నేర్పుతుంది. అవయవాలు ఎలావున్నాయన్నదాని కంటే ఉన్న అవయవాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న తపనతో ఆయన అధ్యయనానికే ఎక్కువ సమయం వెచ్చించారు. ఈయన్ని కలుకున్న మొదట్లో ఇన్ని విషయాల్ని ఎలా తెలుసుకోగలిగారని నేనడిగిన పిచ్చి ప్రశ్నకు విశ్వేశ్వర్ ఇచ్చిన సమాధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనేమన్నారంటే, ’ప్రారబ్ధం వల్ల పుట్టగానే కళ్ళు పోయినా, చెవులు పనిచేస్తున్నాయి కదా! అందుకే చెవుల్నే కళ్ళుగా మార్చుకున్నాను.’ ఈ సమాధానం విన్న తర్వాత నేను నేర్చుకోవల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నట్టుగా తెలుసుకొన్నాను.” అని చెప్పగానే ఆ ఇద్దరమ్మాయిలు చప్పట్లు కొట్టినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంది రంజని. తను ఏం చెబుతోందో, అది ఆ పిల్లలకు ఆసక్తిగా ఉందో లేదోనని తికమకపడుతున్న ఆమెకు ఆ చప్పట్లు ముందుకెళ్ళేందుకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చాయి.

“ఆ తర్వాత ఎన్నోసార్లు ఈయన దగ్గర మంచి మంచి విషయాల్ని తెలుసుకున్నాను. ఇప్పుడు మీలాంటి కొత్తతరం వాళ్ళతో వాటిల్ని పంచుకుని ఆ విలువైన సంపద జారిపోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసాను. ఎవ్వరూ రారేమోనన్న గట్టి నమ్మకంతో వచ్చిన నాకు మీరిద్దరు రావడంతో నిజంగానే భయమేసింది సుమా!” అని గంభీరంగా అంది రంజని. ఆ నాటకీయమైన గాంభీర్యానికి అమ్మాయిలిద్దరూ గట్టిగా నవ్వారు. రంజని నవ్వుతూ “ఇక విశ్వేశ్వర్ మాట్లాడుతారు…” అని అతని చేతిని పట్టుకుని ముందుకు నిలిపి, తను పక్కకు జరిగి కూర్చుంది.

మరోమారు గొంతు సవరించుకుని, అందరికీ నమస్కారం చేసి మాట్లాడబోయాడు విశ్వేశ్వర్. అంతలో వాకిలి వద్ద ఎవరో వచ్చిన అలికిడైంది. అందరూ అటుకేసి చూసారు.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

స్థూలకాయంతో ఉన్న మధ్యవయస్కురాలైన ఒకావిడ హడావిడిగా లోపలికి వచ్చింది. వచ్చీ రాగానే “అందరికీ నమస్కారం!” అని తెలుగులో పలకరించింది. ఆవిడను చూడగానే స్మితా కౌర్ లేచి నిలబడి “రంజని మేడమ్! షీ ఈజ్ మై మామ్. నేమ్ భానుమతి. షీ ఈజ్ తెలుగు!” అని పరిచయం చేసింది. ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ “వాటే సర్ప్రైజ్!” అంటూ భానుమతికి షేక్ హ్యాండిచ్చింది రంజని.

“నేను ఆర్మీ మెడికల్ కోర్ లో పనిచేస్తున్నప్పుడు స్మితా తండ్రిని…అదే…హర్మీందర్ని కలిసాను. ఇద్దరం ఇష్టపడడంతో బాటూ రెండు వైపులా పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్ళి చేసుకొన్నాం. అఫ్ కోర్స్ నా చిన్నప్పుడే అమ్మానాన్నా పోయారు. పిన్ని దగ్గరే పెరిగాను. ఆవిడ నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. లాస్ట్ ఇయర్ మావారు ఆర్మీ నుండి రిటైరై ఇక్కడే ఓ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ హెడ్ గా జాయిన్ అయ్యారు. ఈ కాంప్లెక్స్ లోకి వచ్చి ఆరు నెల్లైంది. మీ ప్రోగ్రాం పోస్టర్ చూసి ఎంతఎంత థ్రిల్లైయానో. ఆక్చువలీ నేనే వద్దామనుకొన్నా కానీ ఇంపార్టెంట్ గెస్ట్స్ రావడంతో స్మితాని పంపాను” అనర్గళంగా చెప్పుకుపోయింది భానుమతి.

“చాలా సంతోషమండీ. మీరూ జాయినైతే బావుంటుంది!” అంది రంజని.

“సారీ! గెస్టులున్నారు కదా! నెక్స్ట్ టైమ్ తప్పకుండా వస్తాను. ఐ వాంట్ మై డాటర్ టు నో మోర్ అబౌట్ తెలుగు కల్చర్!” అని గట్టిగా అని, రంజని చెవిలో “స్మితాని చక్కటి తెలుగబ్బాయికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని నా కోరిక!” అని అంది భానుమతి. మెచ్చుకోలుగా నవ్వింది రంజని. “ఓహ్! మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను సర్! ప్లీజ్ క్యారీ ఆన్!” అని హుందాగా చెప్పి చకచకా వెళ్ళిపోయింది భానుమతి.

సుడిగాలి వెళ్ళిపోయినట్టుగా భావించిన రంజని “ఉఫ్!” అని నిట్టూర్చి, “విశ్వేశ్వర్! మొదలెట్టండి. ప్లీజ్!” అని అంది. సరేనన్నట్టుగా తల పంకించిన విశ్వేశ్వర్ ఇంగ్లీష్ లో మొదలుపెట్టాడు.

“మైఖెల్ జాక్సన్, లేడీ గాగా, బ్రిట్నీ స్పియర్స్, చెట్నీ లవర్స్ లాంటి ఇంకా ఏవేవో నా నోరు పలకలేని పేర్లున్న వాళ్లని, ఆడవాళ్ళ సెంటు ఏది? మగవాళ్ళ ఫేస్ క్రీములెన్ని?ఎలాంటి చెప్పులు వేసుకోవాలో  చెప్పేందుకే పుట్టిన ఛానల్స్ గురించిగానీ, నార్నియాకు సీక్వెల్ హెర్నియానా? అని అడిగే ఈకాలపు మేధావుల్నీ వదిలేసి ఈ గుడ్డివాడు చెప్పబోయే పిచ్చి పాటల్ని వినడానికి వచ్చిన మీ ఇద్దరికీ నా అభినందనలు.” అన్నాడు విశ్వేశ్వర్, ఉపోద్ఘాతంగా.

ఫక్కున నవ్వారు అందరూ.

“నదిలో నీరు ఏ ఒక్కరి కోసమో పారదు. కేవలం మనుషుల కొరకే పారదు. చిన్ని పిచ్చుక, చిట్టి ఉడుత, భయంకరమైన సింహం, భారీ ఏనుగుతో బాటు చుక్క నీరు కోసం మెడను వంచడానికి విచిత్రమైన ఫీట్లు చేసే జిరాఫీకి కూడా దప్పిక తీరుస్తుందా నది. మనమేమో తాగడానికే కాదు, దేహ వ్యర్థాల్ని శుద్ధి చేసుకోవడానికి కూడా అదే నది నీళ్లని వాడతాం. కానీ ఆ నది ఏ మాత్రం విసుక్కోక, అసహ్యించుకోక నింపాదిగా, నిబ్బరంగా పారుతుంది….మన మన అమ్మల్లా. ఆవిధంగా నదికి, అమ్మకు, మన ప్రాచీన సంస్కృతికి ఎన్నో పోలికలున్నాయి.”

చప్పట్లు కొట్టారు అమ్మాయిలు. వారితో బాటే తనూ కలిసింది రంజని.

“ఇప్పటిలాగా ఎలాంటి వ్యర్థ వ్యాపకాలు, నిరుపయోగమైన వ్యసనాలు లేని ప్రాచీనకాలంలోని జిజ్ఞాసువులు, విజ్ఞానులు, మేధావులు తీవ్రంగా ఆలోచించిన ఒకేఒక్క విషయం – ’జీవితం’. సీ.ఎఫ్.ఎల్. లైట్ల కృత్రిమ కాంతిలో కాకుండా వెన్నెల వెలుగులో జీవితాన్ని గడిపిన ఆ ప్రాచీనులు, సహజత్వానికి దగ్గరగా, దాదాపు లీనమై జీవించినవాళ్ళు. అందుకే వాళ్ళ మాటల్లోని లోతు చాలా గంభీరమైనది. తమలో చెలరేగిన అనుమానాల్ని, భయాల్ని, బాధల్ని, సంతోషాన్ని, ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పుకోగలిగిన స్వచ్ఛమైన మనసులున్న మనుష్యులు వాళ్ళు. అందుకనే వాళ్ళు వ్రాసిన ఆ తొలి అక్షరాల్ని ’మధురం మధురాక్షరం’ అని ఈరోజుకూ మనం చెప్పుకుంటున్నాం.

భారతీయులకు రామాయణ, భాగవత, భారతాలు మూడు కన్నుల్లాంటివి. మీ భాషలో చెప్పాలంటే త్రీ డైమెన్షల్ మూవీల్లాంటివి. ఆ మూడు కన్నులతో విశ్వంలోని అన్ని రహస్యాల్నీ సులభంగా గ్రహించగలిగారు వారు. ఆ రహస్యాలేమిటో మరోసారి తెలుసుకుందాం.

జానపద సాహిత్యం సంస్కృతం తెలియనివాళ్ళు కనిపెట్టిన కెలైడోస్కోప్ లాంటిది. మీరిద్దరూ ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతున్నారని విన్నాను. భవిష్యత్తులో పెళ్ళిళ్ళు చేసుకోబోయే మీకు సంబంధించిన అందమైన విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకొందాం. బిడ్డను కనడం ప్రతి స్త్రీకీ  అపురూపమైన అనుభవం. కౌసల్య-రాముడు, అదితి-వామనుడు, దేవహూతి-కపిల భగవానుడు, ఇలా పుట్టు-చావుల్లేని ఆ దేవుడు కూడా భూలోకానికి రావల్సి వచ్చినప్పుడు అమ్మ ద్వారానే వచ్చాడు. ఆ విషయాన్ని మరింత బలంగా చెప్పడానికి కాబోలు కృష్ణుడిగా పుట్టినప్పుడు దేవకి కడుపు నుండి ప్రభవించి యశోద దగ్గర అల్లరి చిల్లరిగా పెరిగాడు. ఇద్దరమ్మల ఆప్యాయతల్నీ, కోపాల్నీ, దుఃఖాల్నీ చవిచూసాడు. అదీ అమ్మదనంలో ఉన్న గొప్పదనం.

తమకు పుట్టినవాడు సామాన్యుడు కాడని ఈ తల్లులకు తెలిసినా మామూలు పిల్లలకు మల్లేనే లాలపోసారు. జోలపాడారు. ఐతే, ఈరోజుల్లో దేవుడు పుట్టడం లేదు. కానీ ఆనాటి ఆ అమ్మదనపు గొప్పదనాన్ని పొందగలుగుతున్నారు ఈనాటి తెలుగు అమ్మలు. ఎలాగంటారా? ప్రస్తుతంలో అందరు తల్లులు కాకపోయిన కొద్దిమందైనా ‘రామా లాలీ మేఘశ్యామా లాలీ’ అనో ’జో అచ్యుతానంద జోజో ముకుందా, లాలి పరమానంద రామ గోవిందా!’’ అంటూ బిడ్డల్ని నిద్రపుచ్చుతున్నారు. ఆ పాటలో లీనమైపోయి, ఉయ్యాలలో ఉన్న తన బిడ్డ రాముడేనని, తాను కౌసల్యనేననీ అనుకొగలుగుతున్నారు.

సంస్కృతంలో జుషీ అంటే సంతోషం అని అర్థం. బహుశా ఈ పదం నుండే జోష్ అన్న హిందీ లేక ఉర్దూ పదం పుట్టివుంటుందని నా ఊహ. ఆవిధంగా చూసినప్పుడు, జో అచ్యుతానంద అంటే ‘ఓ బిడ్డా నువ్వు సుఖంగా నిద్రపో’ అని ఆ తల్లి అంటున్నట్టుగా అర్థమౌతుంది. లాలి కూడా ఆనందాన్ని సూచించే పదం. సంస్కృతంలో ’లా’ అంటే స్వీకరించడం, ’లీ’ అంటే కౌగిలించుకోవడం.  సుఖకరమైన, ఆనందకరమైన నిద్ర తన చిన్నిబిడ్డను స్వీకరించి, ఆలింగనం చేసుకోవాలన్న తల్లి తపనకు గుర్తులు ఈ చిన్ని పదాలు. చూశారా! చిన్నపిల్లలకు నిద్రే బలం అన్న సామాన్య విజ్ఞానం మన పూర్వీకులకు ఎంత బాగా తెలుసో!

సరళమైన, లయ బధ్ధమైన పదాలను పిల్లలు వెంటనే గ్రహిస్తారు. ఆ పదాలను శ్రావ్యంగా పాడితే మరింత బాగా గ్రహిస్తారు. అలా, చిన్నపిల్లల మనస్తత్వాన్ని పూర్తిగా అవపోసన పట్టిన మన పూర్వీకులు’జో జో’ అంటూ ’లాలీ’ అంటూ మన తల్లుల చేత పాడించారు.” అని ఆగాడు విశ్వేశ్వర్.

నిర్ఘాంతపోయి వింటున్నారా యువతులు. రంజనికి సంపూర్ణంగా మతిపోయింది. ఈ విషయాల్నీ ఎన్నడూ విశ్వేశ్వర్ నుండి వినలేదు.

అతను చెబుతున్నది వింటుంటే వెంటనే ఓ ముద్దబంతిపువ్వులాంటి పసిపాపను ఒడిలో వేసుకుని లాలించాలన్న తపన రంజనిలో సుడిగాలిలా చెలరేగసాగింది.

“ఇప్పుడొక లాలిపాట చూద్దాం” అంటూ గొంతు సవరించుకుని సన్నటి స్వరంతో పాడసాగాడు విశ్వేశ్వర్.

ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||

కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ||

శుభశుక్రవారమున సుదతులు వూచ
నూరి జనము పొగడ సుందరముగాను
కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను
కావేటీ రంగనితో కలసినీవూగ ||ఉ||

శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ
శ్రీరంగధాముని చేపట్టితివమ్మా
చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి
చేతనులను రక్షించ చెలులందరు ఊచ ||ఉ||

లక్ష్మీదేవి తామరపువ్వులో పుట్టింది. తామరపువ్వులాంటి కన్నులున్న నారాయణుణ్ణి పెళ్ళాడింది. పూలబాణాలను వదిలే మన్మథుణ్ణి కొడుకుగా కనింది. ఇంత సరళమైన మాటల్లో ఎంత లోతుందో చూద్దాం.

సనాతనధర్మంలోని అక్షరాలే కాదు దేవతల ఆకారాలు, ఆహార్యాలన్నీ కూడా గూఢార్థాలతో నిండివున్నవి.

లక్ష్మీదేవికి పుట్టినిల్లైన తామరపువ్వు ప్రకృతికి నిదర్శనం. అంటే ఆవిడ మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రపంచానికి అధినాయకురాలు. అలాంటి ఆమె, తామరపువ్వుల్లాంటి కనులున్న హరిని పెళ్ళి చేసుకుంది. అంటే, బురదలో పుట్టినా తనకు బురద అంటుకోకుండా నిలబడివుంటుంది తామర. అలాగే, ఈ ప్రకృతిలో ఉన్నట్టుగా కనబడుతున్నా, ప్రకృతికి అభిమాని ఐన లక్ష్మిని పెళ్ళి చేసుకున్నా ఆ శ్రీహరి ప్రకృతికి లోబడినవాడు కాడు. తామరపువ్వల్లే స్వచ్ఛమైనవాడు. నిర్దుష్టుడు.

ఈ రమానారాయణుల సమాగమంలో కాముడు ప్రభవించాడు. కాముడు కోరికలకు చిహ్నం. ప్రకృతికి ప్రాపంచిక సుఖాలపై కోరికలు కలిగితే, అప్రాకృతానికి భగవంతునిపై కోరిక కలుగుతుంది. ఈ ఉయ్యాలలో ఊగుతున్న పసిబిడ్డకు మొదట అమ్మ అనుగ్రహానికి లోనై, ప్రకృతిని జయించి, ఆపై అయ్య అనుగ్రహానికి లోనయ్యే విధంగా కోర్కె పుట్టాలని భావిస్తూ తల్లి ఉయ్యాలనూపాలి.” అని కొద్దిగా ఆగాడు విశ్వేశ్వర్. “మీరింకా చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా అర్థం కాలేదేమో!” అన్నాడు.

రంజని కల్పించుకుని – “ఆర్ యూ ఫైండింగ్ ఎనీ డిఫికల్టీ?” అని అడిగింది. లేదన్నట్టుగా తలలని ఊపారా అమ్మాయిలు. “ఆర్ యూ ష్యూర్ స్మితా?” అని ప్రశ్నించింది రంజని.

దానికి సమాధానంగా “మేడమ్! నేచర్ అండ్ గాడ్ పెళ్ళి చేసుకొన్నప్పుడు డిజైర్ పుట్టింది. బట్, ఆ డిజైర్ వరల్డీ డిజైర్ కాక ఫిలాఫికల్గా ఉండాలని నాకు అర్థమైంది. యామై కరెక్ట్, సర్?” అని అంది స్మిత.

“ఫెంటాస్టిక్! అబ్సొల్యూట్లీ కరెక్ట్!” అని ప్రశంసాపూర్వకంగా అన్నాడు విశ్వేశ్వర్.

ఆపై మిగిలిన పాటకు కూడా వివరణనిచ్చాక “ఈరోజుకు ఇంత చాలు. మీకు మరింత వినాలన్న ఆసక్తివుంటే వచ్చేవారం కలుద్దాం!” అంటూ చేతులు జోడించాడు విశ్వేశ్వర్.

గది బైటకి వచ్చాక విశ్వేశ్వర్ చేతిని గట్టిగా పట్టుకుని “మీకు తెలీదు నేనెంత సంతోషంగా ఉన్నానో!” అని అంది రంజని.

“నేను కూడా మేడమ్!” అన్నాడు విశ్వేశ్వర్.

“నెక్స్ట్ క్లాస్ సూపర్ హిట్టౌతుంది!” అని జత కలిసింది కల్పన.

విశ్వేశ్వర్ ను అతని ఇంటి వద్ద దిగబెట్టి బయల్దేరే ముందు “విశ్వేశ్వర్! మీరు లాలి పదాన్ని గురించి చెబుతున్నప్పుడు ఓ బుజ్జిపాపని ఎత్తుకొని ఆడించాలన్న తపన ఎంత కలిగిందో! డూ యూ థింక్ ఐ విల్ హావ్ దట్ లక్…..అగైన్?” అని అడిగింది రంజని.

 

ఆమె గొంతులోని నైరాశ్యం విశ్వేశ్వర్ ను బలంగా తాకింది.

“తప్పకుండా మేడమ్! ఎన్నో మంచిపనుల్ని చేసారు, చేస్తున్నారు. మీకు పిల్లలు కలగకపోవడమా? ఒక్కోసారి మనం కోరుకుంటున్నదాన్ని ఇవ్వకుండా దేవుడు దాటవేస్తున్నాడంటే వాడి మనసులో ఏదో గొప్ప ఆలోచనే ఉండివుంటుంది. ఒకటికి పదింతలుగా ఇవ్వబో తున్నప్పుడు, వాడిలానే పరీక్షిస్తాడని గురువుగారు చెప్పారు.” అన్నాడు.

‘అర్థమైం’దన్నట్టుగా తల పంకించి, దీర్ఘంగా నిట్టూర్చి కారును ముందుకు నడిపింది రంజని.

* * * * *

“మూడు శిఖరాలున్న నూటాపద్నాల్గవ గడిని చేరిన నీ మొదటి పావు చెప్పదల్చిన విశేషమేమి దేవీ?” అన్నాడు అశేషగుణసంపన్నుడు.

“ప్రభూ! దేవాలయానికి గర్భగుడి శిఖరం ఎంత ముఖ్యమో జీవుల సాధనలో కాయక, మానసిక, వాచిక తపస్సులు అంతే ముఖ్యం.  మానవులకు ఈ మూడూ ముఖ్యలక్షణాలు. ఎవరైతే మాటలోనూ, ఆలోచనలోనూ, చేతల్లోనూ ఒకేవిధంగా వ్యవహరించగలుగుతారో వారు శిఖరప్రాయులై అలరారుతారు.” అంది మారజనని.

“అంటే నీ మొదటిపావు శిఖరసమానమైన వ్యక్తిత్వాన్ని సాధించిందన్న మాట!” అన్నాడు కంసధ్వంసి.

“మీరు చెప్పిన మాటలకు తిరుగులేదు కదా స్వామీ!” అంది కంజదళాయతాక్షి. “మరి మీ రెండో ఆటకాయను నడిపి తత్త్వోపదేశం చేయండి”.

“అవశ్యం!” అంటూ పాచికల్ని వేసాడు ముచుకుందవరదుడు. ఆ పాచికలు దశకంఠ నిర్మూలనోద్యుక్త శ్రీరామ ధనుష్టంకారం వలే ధ్వనించాయి.

* * * * *

Your views are valuable to us!