వైకుంఠపాళీ – ఇరవై ఆరవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

గత భాగం: ఉద్యోగం నుండి రాజీనామా చేసిన రంజని తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ప్రాచీన సాహిత్యం గురించి అవగాహనా తరగతుల్ని నిర్వహిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే  వస్తారు. విశ్వేశ్వర్ జానపద సాహిత్యంలోని గొప్పదనాన్ని వివరిస్తాడు.

 

“డుమువులు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయా విభక్తి…ఊ…ఊ…” అంటూ ఆగిపోయాడు చంద్రశేఖరం.

“ఏరా మోహన్రావుగారి అబ్బాయీ? తృతీయావిభక్తిని మర్చిపోయావా?” అంటూ జారిన కళ్ళజోడు సందులో నుంచి చూస్తూ గద్దించాడు త్ర్యంబయ ఉపాధ్యాయ.

తీరికవేళల్లో పిల్లలకు తెలుగు వ్యాకరణం నేర్పించమని మోహన్రావు మరీమరీ కోరడంతో ఒప్పుకొన్నాడు ఉపాధ్యాయ. అక్కడే కూర్చునివున్న కేశవశర్మ “మర్చిపోయావా?” అన్నాడు.

“ఔనండీ!” అంటూ బిక్కమొహం వేసాడు చంద్రశేఖరం.

“అందుకనే మాటిమాటికీ తల్చుకోమని చెబుతుంటాను. నువ్వేమో పాడు సినిమా పాటల్ని పాడుతుంటావు!” అని సుతిమెత్తగా విసుక్కొన్నాడు ఉపాధ్యాయ.

శర్మ కల్పించుకుని “గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. నీకు రామాయణ కథ తెలుసుకదా!” అన్నాడు.

“తెలుసు.”

“బాగు బాగు. నేను ఒక్కో ప్రశ్న వేస్తాను. నువ్వు చెప్పే సమాధానాల్తో రామాయణ కథను క్లుప్తంగా చెప్పుకుందాం! సరేనా!”

అలాగేనన్నట్టు తలూపాడు చంద్రశేఖరం.

“రాముడి తండ్రి ఎవరు? రాముడెలా పుట్టాడు?”

“దశరథుడు రాముని తండ్రి. సంతానం గురించి పుత్రకామేష్టి చేస్తే రాముడు పుట్టాడు.”

“చూశావా! మొదటి రెండు విభక్తులు నీకు తెలుసు. దశరథు’డు’, రాము’డు’ ప్రథమావిభక్తి. ‘గురించి’ అన్నది ద్వితీయావిభక్తి! అవునా?” అన్నాడు శర్మ.

చంద్రశేఖరం ముఖం వికసించింది. “నెక్స్ట్ ప్రశ్న అడగండి!” అన్నాడు ఉత్సాహంగా.

“విశ్వామిత్రుడు యాగరక్షణకు రాముణ్ణి తీసుకెళ్ళినప్పుడు అతనికి తోడుగా వెళ్ళిందెవరు? రాముడు మిథిలానగరానికి ఎందుకు వెళ్ళాడు?”

“విశ్వామిత్రునితో వెళ్ళిన రాముడికి లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. సీతాస్వయంవరం కొరకు రాముడు మిథలకు వెళ్ళాడు.”

“భలే! తోడన్, తోన్ తృతీయా విభక్తి. కొరకు లేక కొరకున్ అన్నది….”

“చతుర్థీ విభక్తి!” అని శర్మ వాక్యాన్ని పూర్తి చేసాడు చంద్రశేఖరం.

ఆపై మిగిలిన విభక్తుల్ని కూడా చకచకా చెప్పేసాడు చంద్రశేఖరం.

“భలే బాగా చెప్పావోయ్ శర్మా! స్కూల్ మేష్టారుగా నువ్వెళ్తే బడుద్ధాయిలందరూ బుద్ధిమంతులైపోతారనుకో!” అని మెచ్చుకున్నాడు ఉపాధ్యాయ. ఆ పొగడ్తని చిరునవ్వుతో స్వీకరించాడు శర్మ.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

– – – – – – –

 

“చాలాసేపు అక్కడే ఉండిపోయారే!” అంది సుమతి, లోనికి వస్తున్న శర్మను చూసి.

“మోహన్రావు గారి అబ్బాయి చంద్రశేఖరానికి ఉపాధ్యాయగారు వ్యాకరణం చెబుతుంటే నేనూ వింటూ కూర్చున్నా!” అన్నాడు.

“సంధులా? సమాసాలా?” అందు సుమతి.

“విభక్తి.” అన్నాడు శర్మ.

“ఆహా….” అని క్షణమాగి “విభక్తికి భక్తికి సంబంధమేదైనా ఉందా?” అని అడిగింది సుమతి. చప్పున తలెత్తి చూసాడు శర్మ. “వెఱ్ఱి ప్రశ్న వేసానా?” అంది సుమతి.

“లేదు!” అన్నాడు శర్మ. సుమతి ప్రశ్నకు అతని మేధస్సులో మథనం మొదలైంది.

“హమ్మయ్య! తిక్క ప్రశ్న కాదు కాబట్టి మీరిప్పుడు సమాధానం చెబుతారు!” అంది మెల్లగా నవ్వుతూ.

కొద్దిక్షణాల మౌనం తర్వాత నోరు విప్పాడు శర్మ – “రెండు వేర్వేరు పదాల్ని కలిపేదాన్ని విభక్తి అంటారు. ఇది వ్యాకరణ నిర్వచనం. పరస్పర భిన్నాలైన భగవంతుణ్ణి-జీవిని కలిపేదాన్ని విభక్తి అంటారు. ఇది ఆధ్యాత్మిక నిర్వచనం.” అన్నాడు.

“బావుంది. కానీ భక్తికి-విభక్తికి తేడా ఏమిటి?”

“విభక్తి అంటే విశేషమైన లేక విశేష్టమైన భక్తి. ప్రహ్లాదుడు, ధృవుడులాంటి వాళ్ళు ఎన్ని కష్టాలెదురైనా శ్రీహరి పట్ల చూపింది ఈ విభక్తినే!” అన్నాడు శర్మ.

“ఆహా…” అంది సుమతి.

“విభక్తి అంటే విరుద్ధ భక్తి అని కూడా అర్థముంది!” అని ఆగాడు శర్మ, సుమతిలో కౌతుకాన్ని రేపేందుకు.

శర్మ ఊహించినట్టుగానే కళ్ళను పెద్దవి చేసి “విరుద్ధమైన భక్తా? అది పాపం కదా!” అంది సుమతి.

నవ్వాడు శర్మ – “హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు, రావణ-కుంభకర్ణులు, శిశుపాల-దంతవక్రులు చేసింది విరుద్ధమైన భక్తినే! ద్వేషంతో రగిలిపోతూ క్షణమైనా విడువకుండా హరినామ స్మరణ చేసిన విభక్తికి నిలువెత్తు నిదర్శనాలు వీళ్ళే!” అన్నాడు శర్మ.

సుమతి ముఖంలో ఆశ్చర్యం మరింత తొంగిచూసింది.

శర్మ చెప్పుకుపోసాగాడు – “కర్త, కర్మ, కరణ, సంప్రదాన, అపాదాన, సంబంధ, అధికరణ అన్నవి సంస్కృత వ్యాకరణంలోని ఏడు విభక్తులు. ప్రపంచంలోని సర్వధర్మాలూ ఒకదానికొకటి సమన్వయపూరకంగా నడవాలంటే పై ఏడూ ఎంతో అవసరపడతాయి. ప్రతి పనికీ ఒక కర్త ఉంటాడు. ఇది ప్రథమా విభక్తి. ఆ కర్త చేత చేయబడే పని కర్మ అవుతుంది.  దీన్నే ద్వితీయవిభక్తి అంటారు. ఆ పనిని చేసేందుకు కొన్ని పనిముట్లు కావల్సివస్తాయి. అవే కరణాలు. ఇది తృతీయావిభక్తి. కర్త, కర్మ, కరణాలన్నీ ఒకానొక ప్రతిఫలం కోసమే పనిచేస్తాయి. దాన్నే చతుర్థీవిభక్తి ఐన సంప్రదాన అన్నారు. ప్రపంచంలోని ప్రతి చర్య వెనుకా ఒక మూలం ఉంటుంది. అంటే సోర్స్ అన్న మాట. అపాదానమంటే ఈ మూలమే. ఇది పంచమీవిభక్తి. అలాగే అన్ని చర్యలకూ ఒక మిగులు అంటే శేషముంటుంది. అదే సంబంధం. ఇది షష్టీవిభక్తి. ఈ కర్త, కర్మ, కరణ, సంప్రదాన మొదలైనవన్నీ ఒక కాలానికి అనుగుణంగా నడుస్తాయి. ఆ కాలమే వీటన్నిటినీ నిర్దేశిస్తుంటుంది. అదే సప్తమీ విభక్తిగా పిలువబడే అధికరణం. ప్రపంచావసరాలకు ఉపయోగపడే ఈ ఏడు విభక్తుల్ని అదే ప్రాపంచికమైన పనుల్లోనే భగవంతుడితో అనుసంధానం చేసినప్పుడు సాధారణ భక్తి విశేష భక్తిగా మారుతుంది. ఇదే విభక్తి సారం.”

“లౌకికమైన పనుల్ని దేవుడితో అనుసంధానం చేసేదెలాగా?”

“తీసి వేసే ప్రతి అడుగు ఒక తీర్థయాత్రలా భావించడం, కనబడే ప్రతి జీవిలోనూ వస్తువులోనూ భగవంతుడున్నాడని భావించడం, చక్కటి భోజనం చేయడం, మంచి దుస్తుల్ని వేసుకోవడం హరిపూజగా భావించడం, చెవిలో పడే నానా రకాల వార్తలు హరికథాశ్రవణమనుకోవడం, పొగడ్తలన్నీ హరినామావళి అని అనుకోవడం ద్వారా అన్ని లౌకిక చర్యలూ భగవంతుని సేవలుగా మార్చుకోవచ్చు!”

“ఎంత సున్నితమైన అనుసంధానం! అలాంటిదాన్ని వివరించిన చెప్పిన మీరు నిజంగా గొప్పవారు!” అంది సుమతి.

“పిచ్చిదానా! ఇందులో ఏ ఒక్క పదమూ నా స్వంతం కాదు. ఇంద్రియాలపై విజయం సాధించి, విఠలుని పాదదాసులైన మహామహులెందరో తమ మాటల్లో చెప్పింది, ఆచరించి చూపించినవాటిల్లో ఈ మూర్ఖుడు తెలుసుకోగలిగింది ఎంత? తెలుసుకోవలసింది ఇంకెంత?” అన్నాడు శర్మ.

“మాకూ విషయాలు అర్థమయ్యా”యన్నట్టుగా కిలకిలమన్నారు కవలలు. వారి చిట్టి చేతుల్ని సుమతి పట్టుకుంటే, ఆమె భుజాలు పట్టుకుని నవ్వాడు శర్మ.

* * * * *

“పరాశక్తి గడి నుండి కదలిన మీ రెండో పావు పరమపదంలోని హనుమంతుణ్ణి చేరింది!” అని అర్ధోక్తిలో ఆగింది అంబుజసదన.

“దేవీ! నవవ్యాకరణ విద్యానిపుణుడైన హనుమంతుడు మూర్తీభవద్విద్యాసంపన్నుడు. కించిత్తూ అపశబ్దాలు పలుకని సుశిక్షిత భాషావేత్త. దేహబలంతో బాటూ బుద్ధిబలం, జ్ఞానశక్తి నిండిన ఉత్తముడు. అన్నీవున్న ఆకు అణిగివున్నట్టే సకలవిద్యాపారంగతుడైనా వినయసంపన్నుడు. మానవుల్లో ఉండే మిడిసిపాటులేని సద్గుణశీలి.” అన్నాడు లక్ష్మీలోలుడు.

“ఏమిటి స్వామీ! మీ ప్రియదాసుని ప్రశంసలలో మునిగితేలుతున్నారు!” అంది సత్యార్థసంధాయిని.

“గుర్తుందా దేవీ! రావణ సంహారానంతరం నిన్ను చూడాలని కపిసైన్యం ఉత్సుకత పడింది. ఎవరి కోసం వారంతా భీకరయుద్ధం చేసారో ఆ వ్యక్తి ఎలా ఉంటుందోనన్న ఉబలాటానికి ప్రతి కపివీరుడూ లోనయ్యాడు. అగ్నిపునీతవైన నువ్వు నా వైపు నడిచివస్తున్నప్పుడు సుగ్రీవ, అంగద, నల, నీలాది ఆజానుబాహువులు ముందువరుసలో నిలబడ్డారు. ఆకారంలోను, అధికారంలోనూ మరుగుజ్జులైన అనేక కపిజాతులు వెనకనే ఉండిపోయి నిన్ను చూడలేక నిరుత్సాహపడ్డాయి. వాటి మనోగతాన్ని, దైన్యాన్ని గ్రహించిన హనుమంతుడు ఆజానుబాహులైన కపివీరులకు ఒక్క కనుసైగ చేసాడు. ఏకాంతభక్తుడు, భటాగ్రేసరుడైన హనుమ భౄభంగానికి తలవొగ్గిన ఆజానుబాహువులైన కపులు తమ భుజస్కంధాల పైకి మరుగుజ్జు కోతుల్ని ఎక్కించుకున్నారు. ఆవిధంగా బలజ్ఞానాలలో అల్పులైనా రామసేవాసక్తులైనవారికి హనుమ దయతో నీ దర్శనం లభించింది. నీ దర్శనమంటే వేదజ్ఞానప్రాప్తియనే అర్థం!” అన్నాడు హనుమహృత్కమలవాసి.

“ఆ ఘటనని మీ నోట వింటుంటే ఒళ్ళు పులకరించింది స్వామిన్!”

“పుత్రోత్సాహం ఒక్క తండ్రికి మాత్రమే పరిమితం కాదుగా!” అన్నాడు నారాయణుడు.

మనోహరంగా నవ్వింది హరిమనోహారిణి. “మీ రెండో పావు కూడా ముక్తికి చేరువయింది. మరి నా మొదటిపావు గతి ఏమిటో?”

“సుమతిని సాధించినవారికి మన్మనోరంజకమైన సద్గుణసాంగత్యం లభిస్తుంది. అదే మోక్షమార్గానికి మొదటి మెట్టు. నీ పావు దారితప్పడం లేదు. నడుపు!”

అమ్మ పాచికల్ని వేస్తే  రామముద్రికను చూసినప్పుడు సీతాసతి కంట వొలికిన ఆనందబాష్పాల పులకరింతల్ని ప్రతిధ్వనించాయి.

 

* * * * *

 

Your views are valuable to us!