మరాఠా సామ్రాజ్య నిర్మాత బాజీరావ్ పేష్వా – భాగం 2

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

 


This article was originally published in esamskriti.com

Link to original article: Bajirao Peshwa – The Empire Builder


 

మొదటి భాగం కు కొనసాగింపు…

 

ఈవిధంగా బుందేల్ ఖండ్ ప్రాంతంలో విజయాన్ని సాధించి, అర్థ రాజ్యాన్ని సంపాదించుకున్న పేష్వా బాజీరావ్ మరాఠా పాలనను సతారా నుండి యమున-చంబల్ నదుల తీరాల దాకా విస్తరించాడు. అయితే, మరాఠాల మధ్యనే విభేధాలు తలెత్తాయి. మరాఠాల సైన్యాధిపతి త్రయంబక్ రావ్ దభడేకు, పేష్వాకు మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయి. చివరకు అవి వాళ్ళిద్దరి మధ్య యుద్ధానికి దారి తీసాయి. గుజరాత్ లోని దభోయ్ అనే ప్రాంతంలో ఇరు సేనలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో త్రయంబక్ రావ్ చనిపోయాడు. బాజీరావుకు తన సేనాధిపతిని చంపుకోవాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. కానీ అతని సైన్యంలోని ఒక బుద్ధిహీనుడైన సైనికుడు త్రయంబక్ రావును తన తుపాకీతో కాల్చి చంపేసాడు. అనుకోని ఈ ఘటనకు పేష్వా ఎంతగానో బాధపడ్డాడు. తన జైత్రయాత్రను వాయిదా వేసుకొని  ఛత్రపతి సాహూ వద్దకు వెళ్ళాడు. ఛత్రపతి సగం గుజరాత్ ను పేష్వా పరం చేసాడు.

అంతర్గత పోరాటాలు అన్నీ సద్దుమణిగాయి. మరాఠా సైన్యంలోని వివిధ నాయకులు మళ్ళీ ఒక్కటైనారు. ఆవిధంగా ఉత్తర భారతదేశం వైపుకు దృష్టి సారించడం జరిగింది. ఉత్తర భారతాన్ని మరాఠా అదుపులోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని భావించాడు బాజీరావ్. ఇందులో భాగంగా జైపూర్ రాజ్యా పాలకుడయిన సవాయ్ జైసింగ్ తో మాటమంతి జరిపాడు బాజీరావ్. మొగలాయిల పాలనను సుస్థిరం చేయడానికి మరాఠాలు ముందుకు వస్తే తన సహాయం తప్పక ఉంటుందని హామీ ఇచ్చాడు జైసింగ్. కానీ, పేష్వా కోరిన విధంగా ’సనద్’లు (రాజాజ్ఞలు) తెప్పించడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మొగల్ ఆస్థానంలో ప్రాబల్యం కోసం పరస్పరం పోరాడుతున్న రెండు వర్గాల మధ్య నలిగిపోయాడు జైసింగ్.

జైసింగ్ ద్వారా మొగలాయిలతో చర్చలు జరుపుతున్న బాజీరావ్ ఉన్నట్టుండి కొంకణ ప్రాంతాన్ని ముట్టడించాడు. మరాఠా నావికాదళ అధిపతి అయిన షేఖోజీ ఆంగ్రే పేష్వాకు తోడుగా నిలిచాడు. ఆ సమయానికి కొంకణ ప్రాంతం జంజీర్ కోట నుండి సిద్ధీ అని పిలువబడే అబిస్సీ ముస్లిమ్ నాయకుడి ఆధీనంలో ఉండేది. పేష్వా-ఆంగ్రేల సైన్యాలు కొంకణ్ లోని చాలా ప్రాంతాలను సిద్ధీ పట్టునుండి విడిపించాయి. అయితే 1733లో షేఖోజీ ఆంగ్రే చనిపోయాడు. దాంతో కొంకణ్ దండయాత్ర నుండి బాజీరావ్ విరమించుకోవల్సి వచ్చింది. అదే అదునుగా సిద్ధీ డిసెంబర్ నెలలో ఆంగ్లేయుల సహాయం కోరాడు. సిద్ధీ కుటుంబానికే చెందిన ఒక వ్యక్తిని తన ప్రతినిధిగా నియమించిన బాజీరావ్ కొంకణ్‍ను వదిలిపెట్టాడు.

Buy ‘Era of Bajirao’ on Amazon
1735 నాటికి బాజీరావ్, ఇతర మరాఠా సర్దార్ల సైన్యాలు బుందేల్ ఖండ్ నుండి రాజస్థాన్ వరకు గల విశాల భూభాగంలో మొగల్ సైన్యాలతో అనేక యుద్ధాలలో తలమునకలుగా ఉన్నాయి. ఈ సమయంలో బాజీరావ్ తల్లి రాధాబాయి తీర్థయాత్ర చేయాలని సంకల్పించింది. తీవ్రమైన యుద్ధంలో మునిగివున్న పేష్వా తల్లికి ఉదయ్‍పూర్, జైపూర్ పాలకులు వెన్నుదన్నుగా నిలిచారు. అడుగడుగునా రక్షణ కల్పించారు. అంతేకాదు, బాజీరావ్ ప్రత్యర్థులైన బంగాష్ వంటి మొగల్ సర్దార్లు కూడా రాధాబాయికి బాసటగా నిలిచి కాశీ, గయా వంటి పుణ్యక్షేత్రాలకు పిల్చుకెళ్ళారు. మరొకవైపు తల్లి తీర్థ పర్యటన పూర్తయ్యే వరకూ బాజీరావ్ ఎటువంటి దండయాత్రలు చేయలేదు. ఆమె తిరిగి రాగానే మళ్ళీ యుద్ధరంగంలోకి దుమికాడు. రాజస్థాన్ వైపుకు కదిలిన బాజీరావ్‍ను అక్కడి రాజపుత్రులు సాదరంగా ఆహ్వానించారు. ఉదయ్‍పూర్, జైపూర్ లలో బాజీరావ్ రాయబారాల్ని సాగించాడు. ఆ ప్రయత్నాల ఫలితంగా భారీగా డబ్బు వచ్చి పడింది. ఆవిధంగా తన సైనిక అవసరాలకు కావల్సినంత ధనం సమకూర్చుకోగలిగాడు పేష్వా. ఇక్కడితో ఆగక అతను నేరుగా ఢిల్లీ దర్బారునే చేరుకున్నాడు. అక్కడ కూడా మొగల్ బాద్‍షా నుండి అనేక హామీలను పొందాడు. మాళ్వా ప్రాంతాన్ని మరాఠాల పరం చేస్తూ ఫర్మానా జారీ చేస్తానని మొగల్ పాలకుడు చెప్పడంతో అక్కడి నుండి దక్కను ప్రాంతం వైపుకు బయల్దేరాడు.

అనేక యుద్ధాలలో వరస విజయాలు సాధించిన మరాఠా సైన్యమంటే ఆకాలపు పాలకులెందరో భయపడేవాడు. అలా పేష్వా బాజీరావ్ నేతృత్వంలో దేశమంతటా మరాఠాల ప్రాబల్యం పెరిగింది. కొంకణ్, గోవాలలో ఉన్న పోర్చుగీసులు, ముంబైలో స్థావరం ఏర్పర్చుకున్న బ్రిటీష్, దక్కనులో చక్రం తిప్పుతున్న నిజాం ఉల్ ముల్క్ – ఇలా ఎందరో పాలకులు మరాఠా సైన్యాన్ని, పేష్వాను మర్యాదతో చూసేవారు. దక్కను ప్రాంతంలో దాడులు నిర్వహిస్తున్న పేష్వా తమ వద్దకు త్వరగా రాలేడన్న ధీమాతో మొగల్ బాద్‍షా మాళ్వా ప్రాంతాన్ని మరాఠాల వశం చేస్తానని తాను ఇచ్చిన మాటను నిలుపుకోలేదు.  ఎంతకాలమైన తన ఫర్మానాను ఇవ్వలేదు. దాంతో విసుగు చెందిన పేష్వా 1737 లో ఢిల్లీని  ముట్టడించాడు. బాజీరావ్ యుద్ధ చరిత్రలో ఈ ఢిల్లీ ముట్టడి అత్యంత ప్రముఖమైన ఘట్టం. దక్కను నుండి ఢిల్లీ నగరాన్ని ఎవ్వరూ ఊహించనంత త్వరగా చేరుకున్న పేష్వా మెరుపు వేగం ప్రతి సైనికుణ్ణీ నివ్వెర పరచిన తరుణం అది.

1737 మార్చ్ నెలాఖరుకు పేష్వా బాజీరావ్ ఢిల్లీ నగరం వాకిలి ముందు ఉన్నాడు. తనకు, ఢిల్లీకి మధ్యలో అడ్డుగా నిలబడివున్న మూడు మొగల్ సుబాలను చిటికెలో దాటాడు. బాజీరావ్ రాకను విన్న ఢిలీ దర్బార్ దిగ్భ్రాంతికి గురయింది. మొగల్ పాలకుడు మహమూద్ షా కు మూర్ఛ వచ్చినంత పనైంది. కోపంతో వచ్చిన పేష్వా తన వివేకాన్ని కోల్పోలేదు. మొగల్ బాద్‍షా పై గల ఆగ్రహాన్ని సామాన్య ప్రజలపై చూపలేదు. ఢిల్లీ దాడి తర్వాత పేష్వా తన తమ్ముడు చీమాజీ అప్పాకు వ్రాసిన ఉత్తరంలోని అంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తన దాడి కేవలం మొగల్ దర్బారు మీదేనని, ఢిలీ ప్రజల్ని, పరిసరాల్ని హింసించి తగలబెట్టే ఉద్దేశం తనకు లేదని వ్రాసాడు బాజీరావ్.

మరాఠా సైన్యాన్ని ఎదిరించడానికి కొందరు మొగల్ సైనికాధికారులు ప్రయత్నించారు కానీ చివరకు తోక ముడవాల్సి వచ్చింది. మొగల్ బాద్‍షా, అతని సలహాదారు ఖాన్ దౌరాన్ లు ప్రతిపాదించిన సంధికి ఒప్పుకున్న బాజీరావ్ మాళ్వా ప్రాంతానికి తరలివెళ్ళాడు.

హిందూ రాజు హేము నుండి ఢిల్లీ నగరాన్ని అక్బర్ వశం చేసుకున్నప్పటి నుండి ఏ సైనిక శక్తి కూడా ఆ నగరం వైపుకు కన్నెత్తి చూడలేదు. అంటే 1556 నుండి 1737 లో పేష్వా బాజీరావు దండేత్తే వరకు సుమారు 180 సంవత్సరాల పాటు ఢిల్లీ నగరం శత్రుదుర్భేధ్యంగా ఉండింది. అటువంటి నమ్మకాన్ని ఒక్క దెబ్బతో మట్టిపాలు చేసాడు బాజీరావ్. అతను సాధించిన ఈ ఘనత ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ప్రాకింది. అప్పటి పర్షియా పాలకుడు నాదిర్ షా ఈ విషయాన్ని విని మహమూద్ షా కు ఒక ఘాటైన ఉత్తరం వ్రాసాడు. రాజధానిని రక్షించుకోలేని అతని అసమర్థతను అనేక విధాలుగా తిట్టిపోసాడు నాదిర్. ఈ అవమానాలను తట్టుకోలేని మహమూద్ షా దక్కను ప్రాంతం నుండి నిజామ్ ను ఢిల్లీకి రప్పించాడు. ఎలాగైనా సరే బాజీరావు దూకుడును తగ్గించాలని చెప్పాడు. నిజామ్ ను అత్యున్నత బిరుదులతో సత్కరించాడు షా. ఔరంగజేబ్ కాలం నుండి పైకి ఎదగడానికి కాచుకుని కూర్చున్న నిజామ్ ఆనందంగా బిరుదుల్ని అందుకున్నాడు. కొద్దికాలంలోనే పెద్ద సైన్యాన్ని పోగు చేసి బాజీరావును ఎదుర్కోవడానికి బయల్దేరాడు నిజామ్. పేష్వా కూడా సైన్యసమేతంగా మాళ్వా ప్రాంతానికి వచ్చాడు.

దక్కను ప్రాంతం నుండి నిజామ్ సహాయానికి బయల్దేరిన నిజామ్ కుమారుడు నాసిర్ జంగ్ ను అడ్డుకున్నాడు చీమాజీ అప్పా. నిజామ్ దూసుకొస్తున్న మరాఠా సైన్యం నుండి కాచుకోవడానికి భోపాల్ కోటలో దాక్కున్నాడు.  గతంలో ఫాల్కేడ్ గ్రామం వద్ద నిజామ్ ను తిండితిప్పలకు లేకుండా బంధించి బాధించినట్లే భోపాల్ కోటలో కూడా నిజామ్‍కు, అతని సైన్యానికి నరకం చూపించాడు బాజీరావు. పేష్వా నిర్బంధం నుండి బయటపడడానికి సిద్ధపడిన నిజామ్ ను దోర్హా గ్రామం వద్దగల మైదాన ప్రాంతంలో చిత్తుగా ఓడించాడు బాజీరావ్. సిగ్గుతో తలెత్తుకోలేని నిజామ్ అతనితో సంధి చేసుకుని బయటపడ్డాడు. మరుసటి సంవత్సరంలో పర్షియా పాలకుడు నాదిర్ షా పెద్ద సైన్యంతో వచ్చి ఢిల్లీ నగరాన్ని ముట్టడించాడు. అన్నివిధాలుగా ధ్వంసం చేసాడు. కనిపించిన సంపదను దోచుకున్నాడు. అడ్డు పడిన వారిని నిలువునా నరికివేసాడు. నాదిర్ షా దాడికి అసలైన మొగల్ సామ్రాజ్యం అస్తమించింది.  అతని దాడి తర్వాత మొగల్ పాలన యొక్క నీడ మాత్రమే మిగిలింది. అయితే మరాఠా సైన్యం అందించిన సహాయం వల్ల మొగల్ పాలన మరొక వంద సంవత్సరాలు కుంటుతూ నడిచింది. చివరకు 1857లో పూర్తిగా అస్తమించింది.

నిజామ్ పై రెండోసారి విజయం సాధించిన పేష్వా బాజీరావ్ పోర్చుగీసువారి ఆధీనంలో ఉన్న వసాయ్ కోటను జయించాడు. సముద్ర తీరంలో ఒక ద్వీపంలా ఉన్న ప్రాంతంలో కట్టబడిన ఈ కోటను స్వాధీనం చేసుకోవడంతో 12,000 మంది మరాఠా సైనికులు ప్రాణత్యాగం చేసారు. చివరకు వసాయ్ తో బాటు షష్టి అని పిలువబడే ముంబయ్ నగర ఉత్తరభాగాన్ని కూడా తమదిగా చేసుకున్నారు మరాఠాలు. కొంకణ్ ప్రాంతంలో బాజీరావ్ తమ్ముడు చీమాజీ అప్పా విజయ విహారం చేసాడు. ఇది పోర్చుగీసులకు తగిలిన కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. పేష్వా, అతని తమ్ముడు జరిపిన దాడుల్తో చిక్కి శల్యమైన పోర్చుగీసులు 1739 నాటికి ముంబై ప్రాంతం నుండి తోకలు ముడిచారు.

తన జీవితపు చివరి సంవత్సరంలో బాజీరావ్ నిజామ్ కుమారుడితో ఔరంగాబాద్ వద్ద యుద్ధానికి తలపడి విజయం సాధించాడు. సంధిలో భాగంగా నిజాం పాలనలోని రెండు జిల్లాలను బహుమానంగా పొందాడు. మరొక్కమారు ఉత్తర భారతంపై దాడి చేయడానికి 1740 , మార్చ్ నెలలో బయల్దేరాడు. ఖర్గాంవ్, హండియా అనే రెండు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం పేష్వా లక్ష్యం. మరొకవైపు, పేష్వా రాయబారులు మాళ్వా స్వాధీనం గురించి మొగల్ ఆస్థానంతో చర్చలు జరుపుతున్నారు.

జీవితపు నడిమధ్యన, తన సైనికుల నడుమ, యుద్ధ శిబిరంలో తుదిశ్వాసను వదిలాడు మరాఠా సామ్రాజ్యపు మహాప్రధాని.

మరణించేనాటికి పేష్వా బాజీరావు వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. మరికొద్ది నెలలు జీవించివుంటే 40వ పుట్టినరోజును జరుపుకునేవాడు.

మొగలాయిలు, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీల నడుమ విస్తారమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన బాజీరావ్ మనదేశ చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం. బాజీరావ్ మరణం తర్వార కేవలం ఇరవై సంవత్సరాలలో అతను కట్టిన సామ్రాజ్యపు సరిహద్దులు అటు ఆఫ్ఘనిస్తాన్ వరకూ  ఇటు కావేరీ నది వరకూ విస్తరించడం మరొక సువర్ణ ఘట్టం. ఈ ఘనత బాజీరావుకే చెందుతుంది.

పద్దెనిమిద శతాబ్దం నిస్సందేహంగా ’మరాఠా శతాబ్దం.’ అంతేకాదు అది ’బాజీరావ్ యుగం’ కూడా!

బాజీరావ్ కాలానికి చెందిన కవి భూషణ్ పేష్వా గురించి ఇలా వ్రాసాడు:

“బాజీరావుతో కలిసి సతారా రాజు బయల్దేరితే

పర్వతాలు కంపిస్తాయి, ఉరుములు కురుస్తాయి

రావణుల్లాంటి పరాయి పాలకులు కోటలు, పేటలు వదిలి పరుగుదీస్తారు

భూమి అదుపును కోల్పోయింది, దిక్పాలకులు నిస్సయులయ్యారు

ఆదిశేషుడు కూడా బాజీరావ్ ఘనతను చాటలేక

చుట్టలు చుట్టుకుపోయాడు…”

—సమాప్తం—

 

Buy ‘Solstice at Panipat’ on Amazon

Your views are valuable to us!