అసహనం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 2]

 

అసహనం

ఈ పదం కొన్ని నెల్లుగా నన్ను కలవర పెడుతుంది
ఇది కేవలం మత అసహనమేనా? తరచి చూస్తుంటే అంతం కాని ఆలోచనకు దారితీస్తుంది

తల్లిదండ్రుల మీద ఎదిగిన పిల్లల అసహనం వృద్ధాశ్రమాలను నింపుతోంది
దంపతుల మధ్య అసహనం విడాకుల సంఖ్య పెంచుతోంది
అత్తకు కోడలిపైన అసహనం.. కోడలికి అత్తపైన… కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తుంది
ఉపాధ్యాయుల అసహనం కసురుమొగ్గల వీపు తట్టు తేరుస్తుంది
మార్కుల ఎక్కువతక్కువల అసహనం విద్యార్ధుల ప్రాణాలు కడతేరుస్తుంది
చిన్నపాటి అభిప్రాయభేదాల అసహనం మానవ సంబంధాలను సమూలంగా తెగ్గోస్తుంది
మనసిచ్చగించని కార్యక్రమం పైన అసహనం రిమోట్ మీటలను చిత్రహింసలు పెడుతుంది
అడుగు బయట పెడితే చాలు అసహనం చెవులు చిల్లులు పడే హార్న్ గా మారుతుంది
నెమ్మది ప్రయాణాల అసహనం.. రహదారులను రక్తసిక్తం చేస్తుంది
కులాలమధ్య అసహనం.. మతాలమధ్య అసహనం
వర్గాలమధ్య అసహనం… వర్ణాలమధ్య అసహనం
అధికార పక్షానికి విపక్షం పైన .. విపక్షానికి అధికార పక్షంపైన అసహనం
అయినదానికి అసహనం..ఆలస్యమైనందుకు…
కానిదానికి అసహనం.. అసలు పనే కానందుకు..
అనవసరమైన అసహనం…. విశ్వరూపం ధరించి వికటాట్టహాసం చేస్తుంది..!
కానీ చిత్రం.. చిత్రం.. చిత్రం….!!
అవసరమైన చోట అసహనం అంతర్ధానమైపోతుంది..!
అనవసరమైన సహనం నేనున్నానంటూ ముందుకొస్తుంది..!
బహిరంగంగా వేలమందిని పొట్టనపెట్టుకుంటూ దొరికిన ముష్కరులను
యేళ్ళతరబడి కాపుకాసేటప్పుడు సహనం కొత్త హొయలుపోతుంది..!
చట్టసభల్ని అవేశకావేషాలతో యుద్ధక్షేత్రాలుగా మారుస్తూ, స్పూర్థికి
సమాధి కడుతున్న మనమెన్నుకున్న ప్రతినిధులపైన అపారమైన సహనం పొంగుకొస్తుంది!!

అన్నదాతలు అప్పులఊబిలో కూరుకుపోయి ఆకలి చావులు చస్తుంటే.. అసహనం రాదే?!!
పశు వాంఛకు పడతులను బలిచేసే మృగాళ్ళు చట్టాల్ని తమ చుట్టంగా చేసుకుంటూ
ఱొమ్ము విరుచుకు తిరుగుతుంటే దాని జాడకూడా తెలీదే??
రాజకీయ ఊసరవెల్లులు ఇంద్రధనస్సును పరిహసిస్తున్నా అసహనం రాదు..! ఎటుపోతుందో!?
ముందుండి సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యతను విస్మరించి రాబందులను తోడేళ్ళను
మరిపిస్తున్న శవరాజకీయాల మీద అసహనం ఎన్నికలవేళ ఎలా మాయమౌతుందో?
ప్రభుత్వోద్యోగుల జవాబుదారీ లేమిపైన అసహనం ఏమూల నక్కిపోతుందో?
మాతృభాషను తూష్ణీకరించే విద్యాలయాలమీద అసహనం కాదు.. వ్యామోహం పెరిగిపోతుంది
పసి భుజాలను విరగదీసే బరువులపైన అసహనం లేదు..సహనం..మరింత మోపేందుకు సిద్ధపడిపోతుంది
విద్యావ్యాపారుల పై సహనం.. అడుగులకు మడుగులొత్తుతుంది..!
ప్రేమ పేరున కామాన్ని ప్రదర్శిస్తూ సమాజం మెదళ్ళను కలుషిత కాసారంగా మార్చే
చిత్ర రాజాలమీద అసహనం కాదు ఆప్యాయత పెరుగుతుంది..బాక్స్ ఆఫీసులను బద్దలు చేస్తుంది
కక్షలు..కార్పణ్యాలు..కుట్రలు..కుతంత్రాలు విశృంఖలంగా చూపించే బుల్లితెరమీద
అసహనం కాదు అనురాగం రోజు రోజుకూ పెరిగిపోతుంది..టి.ఆర్.పి. రేటింగులు పెంచుతోంది

ఔనులే.. నిండు సభలో ధర్మపత్నిని పణంగా పెట్టిన జూదగాళ్ళ వారసులం
సహనం మనకు కాక ఇంకెవరికుంటుంది
వలువలూడదీస్తుంటే చేష్టలుడిగి చూసిన యావత్సభకు ప్రతినిధులం మనం
సహనం మనకు కాక ఇంకెవరికుంటుంది
ఎవరో అన్నట్టు.. తిరగబడే ధైర్యంలేని పిరికితనంతో మన చేతకాని తనానికి
మనం వేసుకున్న ముసుగు సహనం
ఎదురుతిరిగే చేవ చచ్చిన మనం
మన భావితరాలకు ఇవ్వగలిగిన బహుమానం.. అన్యాయాన్ని ఎదిరించలేని సహనం..!
అన్యాయాన్నెదిరించే అసహనం కాదు
అణిచివేతను సహించగలిగే మిథ్య సహనం

*****

Your views are valuable to us!