“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం
ఉదయం:
ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ…
జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి తప్పించుకుని అజ్ఞాత తిమిరాల్లో తచ్చాడుతున్నాను.
బండబారిన దేహంలో పూర్వ నియంత్రిత చర్యలు అసంకల్పితంగా జరిగిపోతున్నాయి. అంతా “యంత్రారూఢానిమాయయా”లా. అంతే, అంతే…అంతమెరుగని జీవికి, అంతుచిక్కని దేవుడే అంతేవాసి….అంతే, అంతే !!
మధ్యాహ్నం:
ఒక్కో ముద్దనీ లోనికి లాక్కునే నాలుక, వందల లక్షల పదాల్ని వదరుతోంది.
సరస్వతీ హస్తాలంకృత అక్షమాలలా అక్షరాలు. భయదోగ్ర చండచండికా గళావృత రుండమాలలా అవే అక్షరాలు. రూపంలేని, పాపంలేని, తాపంలేని అక్షరాలు…గేయంలానో, హేయంలానో కంఠనాడుల్ని ఒరసికొని, త్రోసుకొని…….
బంధువుల్లో ఏకాకి. బంధువుల్లేని ఏకాకి. ఏకాకి బంధువు. ఏకాకే బంధువు. ఏమిటిదంతా? శాఖాచంక్రమణమా? చర్విత చర్వణమా? పునరుక్తా?
తోటివాడి మరణవార్త విన్నా చలించలేదు. కఠోరసత్యానికి పదునుండదా ? లేక నిష్ఠుర జీవితానుభవ దగ్ధ మానసం కరుడుగట్టిపోతుందా? అసలింతకీ ఈ పాంచభౌతికంలో ఏం జరుగుతోంది ! సాధనా ? వేదనా ?
రాత్రి:
గుర్రం గిట్టల్ని భుజాన మోస్తున్నట్టు, గాండీవంలో త్రిశూలాన్ని సంధిస్తున్నట్టూ…నా కలలు. Dream represents reality in symbols అని చెప్పిందెవరు చెప్మా ?
“ఏం తీసుకొచ్చామనీ?” అనే మెట్టవేదాంతి మిటకరింపుల్లో గుట్టుగా, గుట్టగా పచ్చి అబద్ధం. ఏదో ప్రయోజనార్థమే లోకానికి వచ్చినట్టుగా కృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు.
జటిల జీవన పటలం మీద కుటిల వేదాంత ధూమం.
ధూమం…హోమం…కామం…కామహోమధూమధామంలోన…లోలోన…లోనలోన…ప్రేమం. స్నిగ్ధం…ముగ్ధం…అమలినం.
పసిపాప ఉజ్వల నేత్రాల్లోకి దూకితే మనిషి మూలం దొరుకుతుంది. దూకడం కాదు కదా దేకడం కూడా చేతకాదే !
భంగ, వికలాంగ, కుంఠిత, క్షతగాత్ర మానవుణ్ణి వెంటాడే లోకమృగం. మృగం. మృగ్యం. మృగతృష్ణావృత ఉష్ణమైదానాల్లో హరితం మృగ్యం.
“ఎక్కి కూరుచున్న కొమ్మ,
టక్కునా విరిగితే ఎవరేమి చేతురో అవనియందు !”
పాడుతూ పోయాడో హరిదాసు. అంటే మృత్యు ఘూకం జీవ శాఖేన తిష్టతి అనా ?
దివాంధ మనోఘూకానికి విషాద తమాల శాఖే సింహాసనం. చీకటితో అల్లుకుపోయిన జీవితానికి గుడ్లగూబే అధిదేవత.
చచ్చు సినిమా పాటల్లో కూడా జీవం జవజవలాడుతూ…అప్పుడప్పుడూ…
జిందగీతో బేవఫా హై ఏక్ దిన్ ఠుక్ రాయెగీ,
మౌత్ మెహబూబా హై ఉస్ కీ సాథ్ లేకర్ జాయెగీ
జిల్ జిల్…..దిల్ will….మెహబూబా మౌత్ కీ మెహెఫిల్
చావు…చాకిరేవు…బండకేసి బాదుతున్న గుండె….హుం…ఆహుం….చావు మూలుగు. ఛిద్రవస్త్రం చిల్లుపడుతోందేగాని తెల్లబడడంలేదు !
ముగింపు:
ఒకప్పుడు భ్రమరమై భ్రమించిన సౌకుమార్యం గతం ఇనుము పాదాల క్రింద గతిస్తే, నలిగిన దాని దేహం నుండి విరజిమ్మిన, మనోవైకల్య ఝర్ఝరితమైన ఈ వాక్కులే…ఓ కథలా….!!
*****