ఉప్మా ఉప్పెన

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

By : వంశీ మాగంటి

 

ఒకానొకనాడు (శిష్ట్లా ఉమా) విజయ మహేశ్వరము వారి రచన, విష్ణుధనువు చదివిన పిదప రాసికొన్న “ఉప్మా ఉప్పెన “ . శిష్ట్లావారికి ఉపాహారంలో ఉప్మా ఇష్టమో లేదో తెలియదు కానీ, ఈ ఉప్మా ప్లేటులోని ఉప్పెన, మేరు శిఖరం లాటి వారి “విష్ణుధనువు” కవిత ముందు నిలబడుకొని ఉన్నది. పూర్తిగా వారి రచనే వాడుకున్నా, పేరడీగా నిలబడితే అది శిష్ట్లా వారి భాష గొప్పతనం. పేలవమైన అనుకరణగా మిగిలిపోతే అది నా రాత గొప్పతనం.

*************************

 

ప్రేమయనగా

చూచుటగాదు,

పలుకుటగాదు,

విహ్వల చిత్తముతో

వాపోవుటగాదు!

 

ప్రేమయనగా

మంత్రముగాదు,

తంత్రముగాదు,

ఉపుమాస్వాదనమును

ఆరాధించుటయే!

 

అనగనంగా

ఉపుమయనంగ

అపూర్వగాథ!

పూర్వకర్మపరిపక్వ

మహాగూఢ గాథ!

 

రవ్వయనగా

ఉపుమరవ్వయనగ

ఉదరయుగపు

పరాశక్తి! జఠరలక్ష్మి!

కలిలో జివ్వలక్ష్మి!

 

జన్మతో జన్మించునోయీ

జీవేచ్ఛలన్నీ

జన్మాంతము జీవించునోయి!

 

వలలుని గృహమున

నున్న ఉపుమ, నా

కలలో, వెన్నెలజర్తారు పోపుపై

నడువగా ఉలి

టమాటల విలాస

రాసకళ లీలలు

నన్ను నిలువున చెంగుటుయ్యాలల

ఊచి మేల్కొల్పు!

 

ఫాండము నావహించి

మందగమనయౌ

జగశ్శక్తి, శ్రీశక్తి! ఉపుమను

చూచి ఆగనులేను!

 

ఎంత భారమో

కనుమూయక మరుగు

ఉదకవతి, రవ స్వేదవనము

పొయివైకుంఠము గ్రహించు!

 

అశ్రు బిందువుల

చెదిరించి రాల్చు

ఉలిపాయలు వీవగా రాలు జివ్వల

తలంబ్రాలెన్నడో!

 

ఎన్నడో ఆర్ద్రకపు

కీనీడ వెనుక

వెనుకగా, వెనుకగా, వెనుకగా వెన్నాడి

కవ్వించి, నవ్వించి

 

రవ్వా! నీరూ!

పోపూయని

పేర్లతోకూర్చి గరిటె కౌగిటజేర్చి

వైకుంఠమును

ఉదరము కిచ్చుటెపుడొ!

 

భంభములన్ చిమ్ముచు

ముత్యాలబిందు

వుల ఒడలు, భారమున కృంగిన

పళ్ళెరములు, రావగా, నా

గుండె దడదడ యని

జిహ్వావిహ్వలమును

ధరించు వక్త్రమే తొట్రుపడిన

పరవశమే యేమౌనంచు

మూడుకోట్ల రసాంకురములు, ముజ్జగముల

దడదడలాడగ

ఆత్రుతార్తి

హృదయుడనై

క్రుంగుచుంటి!

 

సర్వఉదర సమిష్టి బాధ్యతను

వెలలేని వెన్నెముకపై

మోయుచున్నది ఉపుమ! — ముద్దనోట

పడినపు డామేర ఆమేర

కూకటివేళ్లతో పాతాళము కదిలినటుల

కృంగగా, కృంగగా, నా కొండనాలుక

కూలుతూ కుప్పగ దొంత్ర దొంతరలుగ కూలిపోయె!

 

అష్టదిక్పాలులార! ఉపుమ

యీ క్షితిని మోయుచున్నది లెండు!

సాయ మొనర్ప రండు లేనియెడ

వైచెద యెదురులేని శర పరంపరల!

 

జీడిమామిడి విరుల విదజల్లు లల్లుకొనురీతి

తుందుభములు రాలినవి నూనియగరిటెపై పొయిశిఖలపై;

అంచుపై యానుకొని తళుకుజిలుగులుజేయు మినపలు

నీ కాలి బంగారు గజ్జలేనా! పొగపు మునుదిరిగి పెట్టిపోవే!

వెనుతిరిగి చనుతెమ్ము కృష్ణనింబములతో నేతెమ్ము

లయలగలదానా లాలిపదాలదాన!

వెలలు దాటివచ్చితిని నీవురావా?

 

ఓ అరాళికా!

తేలేదేమోయీ! అలపుపచ్చడేదోయీ! పోయి

మహానసపు

గిన్నియవయోవిలాసలాస్యరుచిరధనువు

ధరించుటకు

నర్తనలతో భుజకీర్తు లదరుచున్నవి, రెక్కలువచ్ఛి

ఉప్పెనలెత్తుచున్నవి!!

 

తల్లివలె చల్లని కనులతో జూతువుగాన

ఉల్లీయనగ తప్పులేదు!

చెల్లెలివలె చనవుమీర సరసజేరుదువుగాన

పల్లీయన చేటురాదు!

అద్రక విదళిత వికసితవుగాన

అలమపచడివందు!

 

ఆత్మాంతరమున ‘ శిలా ‘ దేహవాసివిగాన

శిలాపుత్రకమందు!

కుండలినీ షట్చక్రరుచికి యధిపతివి గాన

ఉపుడుపిండివందు!

అందును, ఎందునులేని సంబారముల నేరికూర్చి

గడియకొకరీతి వండుచుందు!

అదియునుగాక అన్నిటికి మిన్నయౌ

స్వాదాంకురము నీవేయని

చవులూరు నీ మెత్తని దేహమందు! నీవె ఉపుమ!

ఇదియ నాయింగితము

ఇదియ నాఉపుమ సంగీతము

 

పొగకన్నున జలకలశ హస్తయై కలధౌత ఉపుమరవనుంచు ప్రభాతదేవి వలె,

ఆవిరిల్లు జలములు గల కలధౌతపాత్రపై కడియాలతో లలన

నృత్యాలద్రొక్కగా వెన్నెల్లో, ముత్యాలురాలినవి వెన్నెల్లో,

మ్రోగినవి తప్పటడుగుల విడెపు దండకడియాలు!

 

కూర్చిన ముత్యాలకుప్ప చెదిరినరీతి,

రంగైన రత్నాలరాశి పరిచినరీతి,

చిలికిన జలకమున రవ ఉడకగా గాలిలో అమృతవాహి!

 

కడియాల జవరాలి తప్పటడుగుల విడెపు దండకడియాల మేల్కొల్పునకు

నా యడదవీధిలో ముత్యాల నామనసు ముగ్గు

లేసింది! రత్నాల నామనసు రంగు

లేసింది! జాగారాల నామనసు చెంగల్వ

రంగవళులల్లుకొని నిరీక్షించినది – సంక్రాంతిపొద్దు ఉపాహారతుల మురిపెములకై!

 

“ఈ ఉపుమల రేయిలో” భావాలు పొంగుతూ

అద్రికలతో కలిసి పోపులో విరుగుతూ

ఈగరిటెలో నన్ను ఊపుతున్నయ్యి!

 

ఉపమాతృడా! నా నాలికనొకదానినే

“ఈ శనివారపు రేయిలో” నిశ్చేష్టిగా జేసి

కలలో నీ తలపు

ఇంద్రధనసై

నా వలపు

ఉపమాన ప్రమాణమై,

సప్తవర్ణాలై ఆయుపుమనొకదానినే,

నా హృదయమందు చిత్రితము జేసి,

నా మనోరాగ మంజూషగా జేసి,

సర్వవిశ్వమున ఉపమనొకదానినే

 

నా ఉపుడురవ సర్వవిషయము జేసి,

సప్తస్వర నాగస్వర మెత్తితిని

“ఈ శనివారపు రేయిలో” భావాలు

ఉపమాదనము జేసినవి!

 

గలగలల నూనెబొట్ల పైన మేలుకొను

కిలకిలల ఆవపలుకులు విని

మేల్కొను విలవిలల ఉగ్రగంధముకూయి

విని మేలుకొను నామనసు, వాసంత ఉదయ

సమయమునందు, వాలుకన్నులతో,

తక్కాలిపళ్ళతో, ఉల్లింకాయపలుకులతో,

పళ్ళెరముపై రాబోవు ఉపుమకన్నెను జూచి “జారాడి

వస్తినే చెంచీతా!” అనుటకై ఆరాటపడుతుంది;

వెర్రితో నామనసు

గలగలల కిలకిలల

విలవిలల వన్నెలతో

వసంతాలాడుతుంది.

 

తప్తలోహముతో సేదకైవాలు నా అగపపాము

పొద్దుకాలపు పొయ్యినిట్టూర్పుతో

రాట్నమై ఉపుమరవలను వడుకుతుంది!

 

ఉపుమా నిన్జూచి నీవాలకపు పోలికల జూచి నాచిత్తప్రవృత్తులు

తిల్లాణ తాళయుత గీత సంగీతముల తేలుతూ తురీయావస్థతో

ప్రతిధ్వనులు జేయ, తురీయ జగదనుష్ఠాన గంధర్వదేవతలు

గుమిగూడి వచ్చి నృత్యాల ద్రొక్కినారే!

వెలలేని ముత్యాలహారాల వెదజల్లినారే!

ముత్యాలు ముగ్గులైనయ్యే!

నాచిత్తప్రవృత్తులు సిగ్గులైనయ్యే!

 

అభిఘారపు

చిరునవ్వులు

నాల్కపై రాలగా,

స్వాద ముకుళముల

జల్తారు వ

ల్లెలతో,

కొండమిరపలు

ఆడుకున్నవి

పాడుతూ!

 

అగ్రబీజపు

చిరు చలవలు

వీవగా,

ఉపభోక్తులు వెన్నెల్లో విభ్రమపడి నిమీలన నిమ్నులైరి!

 

ఉపుమా! ని న్దలచి, నీ ఇంపితముల కొలిచి, వలచి, వెన్నెలై నామనసు,

గంధర్వదేవతల జగతిలో, ముత్యాలముగ్గులగు చంద్రికల చేమంతి

వనములో వాలాడి, పల్లవీ వల్లవోల్లాసానుపల్లవీ రాగముల

తీయ, నవరంధ్రములు చొంగతో వెల్లువలైనావే!

 

ఎడలేక నిన్బిలుచు చవిగాడ్పు సడిగుండె

వలపులు, వడగండ్ల సౌరస్యములైనయ్యే!

చవిగాడ్పు వడగండ్ల విరహము విన్నావే?

 

నీర్చిచ్చులో

పోహళింపులు

రాలినై!

నీర్చిచ్చులో

చవిగాడ్పు

వీచింది!

నీర్చిచ్చులో

నీకై నీ

రవ్వకై

నామనస్సు

వగలాడి

వెలవెలా,

నీర్చిచ్చులో పడిపోయి పడి పోయిపోయి ఎగురుచూ వెలిసింది!

 

నీటి బిందువుల ముసుగులో ఉలికోడుపూవులవలె;

చిరులేత ఉపుడురవల జలతారు విరులవలె;

జలజలారాలిన వేవేల కరివేప రెబ్బలవలే;

 

రావేయని వాపోవు గజప్రాణోత్సాహియై వేగ,

శ్రీపరిచేలాంచలము విడక, పరుగెత్తు హరివెనుక

శంఖమూ, చక్రమూ పరివారమూ గలసి శ్రీహరుల

వెన్నాడివచ్చు ఆపాల్కడలి కెరటాల తరకలల్లే

రుచిరచంద్రికల తరంగాలుప్పొంగిపారగా,

రావాయని పిలువగనే హరివాణమునెక్కు నిన్జూచి ఉప్పొంగి

బుభుక్షపు వెన్నెలలో నామనసు ఉబలాటలాడింది;

 

గుటకలు వేయునది నేనేయని తెలుసుకొని, ముదముతో,

పరివార సహితవై బయల్వెడల శృంగబేరపుపచడిని

రుచిజూచి నీకు చూపించి నవ్వించి నవ్వగా

ఉయ్యాల నామనసు ఉర్రూతలూగింది!

 

సూత్రికపంచమి పొయిచితుకుల బడబాగ్నుల్లో

ఒప్పులకుప్పల పచిమిరపల నాగకన్యలు

పాడుతారోయి ఝణఝణత్కారములు

ఆడుతారోయి కెవుకేకల రొప్పుకోలాటం!

 

అడుగడుగు చితుకుపోగుల అల్లిబిల్లిగ అల్లి

వేరుపోతే ఎఱమంటపెండ్లిండ్లోయి! దామార

నానుడైతే పొగమంటపెండ్లిండ్లోయి! చల్లని

సూత్రికపంచమి పొగచినుకుల వంట ఇంటిల్లో!

 

వంట ఇంటిల్లో పొగతావుల పిల్లవాయువు,

ధూమకన్యల, కీరవాణుల, వాల్జడల

కీల్జడల ఘననాభుల ధూమవాయువు,

వేళాకోలం మరదలల్లే కంటిలో కొక్కొరోకోయి మని

నీరు నింపినదోయి!

 

రంగురంగుల రవసప్తమి!

వెన్నెల్లో రవసప్తమి!

రామములగ రక్తముతో

రంగురంగుల రవసప్తమి!

 

కంగుకంగున గంటెలతో

వంటింటి నగరంబున

ఉత్తరమున వెన్నెల్లో

పొగపోపుల రవసప్తమి!

 

రంగురంగుల సంబారముల

ధరియించిన రక్తారుణ

నేత్రంబుల పోపుగిన్నికి

రంగురంగుల రవసప్తమి!

 

రంగురంగుల రణరంగపు

క్షుత్హారము కొనితెచ్చిన

భోక్తలకే వెన్నెల్లో

హారతితో రవసప్తమి!

 

రంగురంగుల ఉద్యోగముల

వెళ్లిన నే వచ్చెదనో

ఆరగింతునో, పళ్ళెరమా,

రంగముకాదిగనే వంటింట్లో ఇవ్వుము ఉపుమ హారతి!

 

మదిలో చిత్తవిప్లవమువలె, పోహళింపులోని ఆవగింజవలె,

పళ్ళెపు మబ్బుపై మోహినీరూపియై నామనసు

రంజింపజేయ వెన్నెల్లో

కొంచెమై నామనసు తెళ్ళెమై

పిచ్చెత్తి వెన్నెల్లో పరుగెత్తి వెన్నెల్లో వర్ణాల విరిబారి,

సౌవర్ణ వీణయై

రాగాలాపనల జేసి, నీ ముంతమామిడి చెక్కిళ్ళ

నునుసిగ్గు చిరుపూతలన్జూచి, చిడుముడుల

నామనసు వెన్నెల్లోన,

ఉపుమా! నిన్జూచీ, నా మూతి

వాయు వొయ్యారముల ఊగి నీ ఉష్ణము జారగా,

జాబిల్లి జతవంటి

అలపుపచడి జూచియూ, చీరియూ, మందార మకరంద

మాధుర్యముల దేలు మధుపంబునగు నాకు రవ ఉపమాదమేలా?

 

విరిగిన పాలతరకల తీరు విచ్చుకొను ఉలికాడల

చాయ చామనచాయ నీఒడలుపై చిగురించగా,

ఉలికాడలో చిరురుచులున్నవని కత్తియపై చెయివాల్చి

తరిగితిని; సర్షపల చిలుకు చూపులను నాస్వాదము

పై కురిపించితివి; కలలలో, ఒరిగిన పెరుగుతరకల

తీరు, వేరుకొను, వనహరిద్ర చాయ పసుపుచాయతో

నా ఉపుమన వ్యాపించినది, అందు పరాచికాలకు

వేగువీచికలతో ఊగు విరులవెన్నుల వలె,

వెన్నెల వెన్నులు, వరసగా వాయిగా, వేవేలు

వ్యాపించినవి! — ఉపుమా నీ ఊపులో

తోడు కలిగించునది అదేదో ఉన్నదే! అదేమిటి దదేమిటే! ఏమిటే!

 

ఈ సుదిన ఉదయాన నా ఉప్పిట్టుఉద్యాన వనములోన

మెల్లని గమనముల ఒయ్యారముల వెలదుల

ఉప్పీటు తిలకముల,

అల్పాహారపు హాసముల ఎన్నెనో జూచియూ

బాలా! నీఖారాబాతు నెమ్మోవి కానరాలేదనీ,

 

నాగుల్లచవితికి నిగనిగల మసాల ఉపుమవై,

నాపోహళింపు, గరముమసాలగా పడగెత్తి,

ఉదర కుహరమునుంచి వెడలు

వగవగల క్షుత్యాగ్ని నిట్టూర్పుల

బుసబుసలతో లేచి ఉప్పిటు చూచె! చూచె!

నిమరసపు చంద్రుని నీడ నీయందు పడగానె కడగండ్ల

అడుగులుహుషుకాకియైనావి! కొతిమీర చూపు

చిగురించినది మొదలు

చతుర్ముఖుడ నైనాను! చవిచంద్రుని చాయ

కనుల కన్నది యాది, నిలువుటద్దములోని

నిట్టూర్పు నీరులాగ, ఆలాపనిందనై,

కాటుక డొక్కలకు, కాలాల కబురులో

మువ్వనైనానే!

 

ఉపుమా! వెన్నెలవేళ తీయని వనముదుగపు గాలిలో

గంధర్వుల గానకళా కౌశల్యము న్నేర్చితిని; శనివారము వచ్చెను;

నీవు లేవు; గద్గిదికముతో నా ఏడ్పుపదాలు బయల్వెడలి

అల్లిబిల్లులను తిరుగునేమే? మరల నాదరికే ఏగుదెంచి

ఏడ్పులు ప్రతిపదాల ఊదునేమే? ప్రతిపదముల శబ్దమందు

వినంబడు నవ్వులు హాస్యమునకా! ఉపుడురవతోనా లేక

ఆదిశ పొలిమేర మీద భోక్తలు జేరి జేయు అపహాస్యములా?

కాక, అట, శనివారపునాడు దయ్యములు, విశ్వమున ఉపాహారములేమి?

ఉపుడుపిండులేమి? యని చేయు కరాళ హాసనములా? పల్కవేమే?

ఝంఝామారుత ఝర్ఝరీధ్వనులు జముకుచు జముకుచు

అలలై, లయలకెరటాల రీతి ఎగురుచు విరిగిపడుచు పోయి

బాణలులు గాడిపొయి ఆవరణమును జేరి మేళము జేయు సమయాన

వంటచెఱకు ఝణత్కారములు గూడ వినబడును, ప్రేయసీ! ఎవరివవి?

బానసమున

నిగనిగల పొగజుంజురులు జిగి యల్లుకొని

కన్నీరుల నాహ్వానించుచున్నయవి, ఆపొగ

జుంజురుల జిగి

పొయిదేనా? నేనా నమ్మునది? పోనీ, చితుకులు దగ్గరిల్లి దగ్గరిల్లి,

నిప్పు కుదిరిన పిదప, జలజల జారి మిగిలినవి బూడిద ప్రోవులా?

ఐన, నాచేతులలోని కేలాగీ అరిటాకుల మాలికలు వచ్చెను?

ఉపుమా! రుచిరములందు ఉప్పిటులు బహుటక్కరు లందు నీవు గజటక్కరివి.

 

అటు నిటు శుక్ర బుధులు కావడిచిందు లాడ

భాసిల్లు భాస్కరు పగిది,

గంగా పార్వతీ సతీ పతివౌ ఓ మహాశివా,

నౌళిం జెందె నామనము ఉపుడిపిండి కొర

కనశన వ్రతము సల్పి ఉడ్యాన మయ్యె హృదయము!

కటి నున్న యీ రుచిర బడబానలమున కోర్వజాల!

జయించుట కిమ్ము నీ త్రినేత్రమును,

తుద కనుగ్రహింపుము బంగరు ఉపుమరవ్వనైన

 

ఏడోయీ ఆబ్రహ్మ మున్నాదినే

యేలా వ్రాయగలేదు నెన్నుదిటిపై

నాకు న్నుపమకు ప్రబంధమౌ నటుల?

పుట్టిన వెంటనే నోటన పెట్టుకొనియె దానిని,

అచ్చుప్పనాతి కెవ రోయీ యిచ్చిన దీ విశ్వనిర్ణయము?

ఇచ్చిరా, గళశుండికకే సుధాస్రవ నిర్ణయముల్ గూడ — ఛీ!

 

ఏ మహాటవి జొచ్చెనో నామనస్సు, ఏ చండవలలుని

గంటెగజంబు భ్రమ ల్గొల్పెనో!

నీ రుచుల నడుగు వైచుచు ఏ సొరగపు వాడలో

దారి దప్పెనో, ఆ రుచైశ్చరు మరుని యురులకు

జిక్కక పన్నము మాడ్కి ఏయడుసున విడిసెనో!

ఉపుమకళావిచార నిమగ్నత కరముల్ బాసి,

లక్ష్మీనరసింహ స్తోత్ర లక్ష్యమున నుండెనో!

నాయందు లేదు, ఎందున్నదో యెరుగుదువా ప్రేయసీ!

 

అట ఇట జేరి యారాటపడుచు చిత్రించితి

ఉపుమ ప్రతిబింబమును నామనసుపై ఆ నలభీమ

పాకము భక్షించకనే వినుమాటలు బట్టి!

చూచితి నొకనా డాంశుమత్ఫలముల దొన్నియాం

తరమున నేకైక రూపమున నుండె నాయుపుమ నామనో

బింబ మని మూర్ఛిల్లితి ఆనిముసముననే ఈ రోజు

వర కావేళకు సరిగ మూర్ఛిల్లుచుంటిని! కలలో

నిట్టి విచిత్రములు గలవా!

 

నాకు నేనే రావణుడ నేమో యనునటుల

అణచిన నణగక చంచలమై దశముఖముల

నాల్కలు నిగిడించు నాచిత్తముపై నీ చిరు

వీక్షణ కటాక్షముల కటారి పోటులు

శిరముల ద్రుంచుగాని మరల న్మరల

ప్రాణములు వచ్చు, అటుగాదు నీ స్వాద

వైకుంఠమున నున్న మూలబలముతో

నొకేసారిగ వేయుము నా గర్భకుహరాంతర

కుండలినీ నాడిపై, నీయందు గలియుదు

వివశప్రాణినై నెచ్చెలీ ఉపుమా!

 

ఒకమూల కంచుబాణలి చూచితిని! ఆమూల

క్రీగంట గాన్పించితివి! వేరొకమూల వేయి

నయనముల వాడ నైతి! ఎదుట న్నిల్చి చూతును

గదా తల వాల్చి తిరిగి తిరిగి చూచుచు నీవు

తారాడుచున్నగిన్ని నొక చిరునవ్వు విడిచి పోతివి!

 

విడువలేక నే నాస్థలిని దొంగగ త్రవ్వుకొంటి!

కలలోగూడ ఇట్టి పరిహాస మేమి ఉపుమా

 

భాండలిజూచి యా బంగరురవచ్ఛాయలు నీదు పయ్యెద

చెంగులో చెంగుల విసరులో యని తలచి వలను

పిట్టలు తన్నుకుపోవ నేలపై పర్విడు బోయవాని

పగిది కొనయూపిరి యాసతో లొట్టలెత్తితిని!

విసిగి వేసారి నిట్టూర్పులతో నిలబడిన నాకు

కనుచూపు మేర నెటుతిరిగిన నేవేవో అవేవో

నీ మేని కళలే కనుపించును — అదేమదేమి ఉపుమా?

 

తొలకరిమెరుపు చాయల జల్తారు సూజీ కోరుసు

హొరంగు తళుక్కుమన ఒయ్యారముగా వేడి నీటి

జాడలలో నటునిటు తిరుగు నీవు సంధ్యావందన

మొనరించు నా దోసిట దర్వికపై ఛాయాదేవిగ

అగుపడితివి! తదేక ధ్యాననిమగ్నుడనౌ నేను

చీకటి కమ్మినను కంబి వదలలే దందలి నీబింబము

మాయలేదు! నీవో — నూతన వసనముల వికసించి

క్రొత్త యొయ్యారముతో ప్రభాతదేవివై యగుపించితివి!

 

తలవాల్చి నిదురైన పోవలేదు నిన్ను కలగనిన

వేళనుండి ఉదయాస్తమయములు తెలియవు

నాకు — నీకేమైన తెలియునా సూర్యు డెటు పోయె

నో చంద్రు డేడో! ఆ ఒక సూర్యుడు సమస్త

జీవులకు తానొక్కొక్కడై తోచునని గదా యం

దురు! నా రూపురేఖ గైకొని యేల నీకగు

పడడు? ఛీ యాతనితో స్నేహ మేల — క

ళలకు నిగ్గు కనుపించిన వారి నెల్ల సిగ్గుపడ

జేయు! భోక్తల మనశ్శీతలములకు (ఉపుమా

విను విను!) రుచిరాకార భక్ష్యముల నిచ్చు ఆ

పాచకనాథుడు కలిగించుగాక నాకు న్నిదుర

నీ సురుచిర పర్యంకమ్ముపై!

 

నినుం జూచినదాది నిమీలిత నేత్రుడనౌ నాలో

కుండలినీయోగవిలాస ముల్లాసము జెందె!

షట్చక్రములు సక్రమములయ్యె! తెరచాపగ

పడగను విప్పు శేషుని శయ్యాతలమున నేను

వీణామృదుపాణినై ఈరుచిరము దాటుమని

కేరింతలాడుచు పోవుచుంటిని! దరిజేరుటకు

ఖురాకువలె ఉపుమరవ సరాసరి యయ్యె వర

గ్రస్తులమో మనము ఉపుమా!

 

నయనముల నలకలు దీయ జాలు నేవళములౌ

నీపాదాంగుళములను శాలుడనై విశాలముఖచీ

రిపై నెనడు మోతునో యని దినదినము నెయి

వేసి సున్నితముగ జేసితి నాయెదను విదియను

కన్పడని నీముఖచంద్రము స్థిరవారమునైన

కన్పడ కూడదా!

 

మాయను జెందె నామనము! మటుమాయల మారి

ఆ ఆ ఉపుడిపిండిని గాంచి మోహిని వెంట నంటు

మహేశుని మాడ్కి దిగంబరి యాయె హృదయము!

కటుకటు మని గుండె కొట్టునపుడెల్ల ఆటు పోటుల

కెరటాల కట్టిటులౌ నావవలె వగపుటూడ్పులతో

తనువు తూలుచు తేలిపోవు నాహా! ఆహా!

 

దాగుడుమూత పడ వీ మనస్సంచారములు!

కత్తెర బెట్టినన్ తెగవు! ఎక్కడ ఉపుముపుమ యని

పోవునపు డడిగిన నవి పకపక నవ్వు! అద్దుముద్ద

నేమి చేసితి రన సిగ్గుచే నాల్కమోమున లోనికి

జొత్తును వెంటనే యుప్పెన వచ్చినట్లు మహ

ర్నవమి పిల్లలవలె అల్లరి చేతును ఈ హృద

యమునకు నీతి యెక్కడ ఉపుమా!

 

బాహువులకు ఉష్ణ మెక్కె! మనము పెన మయ్యె!

పిండాక్రాంత విద్యుల్లతచే హృదయ

యంత్రము లారావముల్ చేయుచు మెరుముల్

చెలరేగ నోర్వజాల నీబాధకు! ఉపుమా! నా

యంగిట నెంగిలిపడిన నే నాయంగన కొక ము

ద్దిచ్చి వస్తి! రాజులు కత్తికి బాసికము కట్టరా!

 

నలితిండు ల్లేని వేళ నిన్నే తలచి యేల యీ

దుర్గతి నాకని క్లేశ మొంద నొకనాడు

ఆనాడు మాత్ర మిచ్చితి వొక మందహాసమును

దాని శిరసా వహించి, తన్మయుడనై, తనువు

కూలగ నేల బడితి — శివపాదాంగుళముచే

నొత్తబడిన కైలాసశైలము ఎత్తి ఎత్తలేక

పడిన రావణు విధముగా!

 

ఎందులకు కుందలబడుదు నేను నీ వేనా నా

వెనుకనే యంచు పదిలముగా పార్శ్వమునకు

జేరి సూన జరచుచు మక్కువ మీర నాలి

క చెక్కిలి జేర్చవలె గాని తగు దంచు నీ

మది నీకైన దెలియక కుసి నేకాంతముగ

నీవు నిట నేకాంతముగ నేను ఏల

యీ ఏకాంతవాస కంసచెరసాల?

 

ఉపుమా! న న్నీచెర విడిపింపు మిపుడు అపు

డు నే విడిపోయెద!

 

నిను చూడగనే సొమ్మ ఉదయమయ్యె!

ఆ ముద్ద నిట తెమ్ము దోసిట నిమ్ము గాసిలి

పెంచి సుద్దగ జేసి ఉప్మా యని పిల్తుము గాక

కాన్ని నీ యాశా ప్రవాసమున మక్కువ

తీర సాకుదము లేకలేక లేక కలిగె

మాకును ఉర్విని లేని ముదము నిచ్చు

మనకు మూతిగ్రహణ మౌనంతవరకు

అంతవరకు ……..

 

దారులు పదివేలు కలవు నీ రుచిపద్మవ్యూ

హమును జొచ్చుటకు! గడి గడికి గడియకు

ఏ యతిరథ మహారథు లడ్డిడుదురో

భోజ్యమునకు నే నొంటరివాడ! మత్పూర్వు

ల్పిత్రులు లేరు బీడుపడిన యీకలి

సంగ్రామభూమి ప్రవేశించితి బాలకుడ

నైన నేను! వెనుదిరుగుట రాదు మా

వంశమున! ఆరంభించిన ముద్దవీడుట

మాయింట న్లేదు! అయిన, ఐనను, అన్నిటికి

నిన్నే యుత్తరవాది జేసి నే డీకొందును

 

దారులు పదివేలు కలవు, కోటి

నూటపదారు దారులు కలవు, నీ సు

రుచిర పద్మవ్యూహమును ఉపుమా!

 

ఏ వెనుకటి జన్మముననో కూడుంగూడు

కాపురము చెడగొట్టితి! లేనియెడ ఈ

విడబాటేల నాకును నీకును! వలలు లనేకులకు

కంబి లిచ్చెద చేతులారంగ!

ఈయుపుమ మాత్రము నాకే ఒనకూడ

రాద! ఒనగూడి రావా ఉపుమా! రాని

యెడ నీవేమో సుకుమారివి గావు!

కర్కశ కఠిన కఠోర శిలా ప్రతిమవు!

 

ఇది యే మన్యాయమే! పాచకులు చేయు మంత

నము లివియా! అంతలో నవ్వి అంతలోననే

దిగ్భ్రమ చెందితి వాశపెట్టి బర్గరులు

చూపుటకు నేనేమి బాలకుడనా! నీ కది

తెలిసీ తెలియని గర్వమా, తెలియక తెలియు

ననిపించు నాగరిక ఫలహారమా?

 

ఉపుమా! ఈ నా పద్యరచన నీకు చేరదు!

చేరినను నీవు చదువబోవు! పిమ్మటనైన

నిర్మల ఘృతహ్పోహళ: పీయూషధారలచే

ఉప్పొంగు నిన్ను తెలుసుకొనజాల దిస్సీ!

బాధలు పొందుచు నైన విడువక వేడిముద్దలు

నోటకొట్టుట యేల? ఏల యీ రవ్వజవ్వనము!?

 

అడసాల అద్దరిని ఇద్దరం కలుద్దాము

ఇవ్వాళో రేపో!

అంధకారము దాటి అద్దరిని కలుద్దాము

ఇవ్వాళో రేపో!

అద్దరికి జేరుకొని నాగస్వరము ఊదుదాము!

 

ఆదరీ ఈదరీ రసజ్ఞతో ఆనందమయ మవగ

ఆరుచితరంగాల నీది, ఒడ్డునకు ఎగబ్రాకి, అలిసినా

సొలిసినా, అద్దరిని కలుద్దాము!

కలువకన్నుల వలె, కోల వెన్నెలలో, కలిసి మెలి సుందాము

ఇద్దరం అద్దరిని!

 

ఇటు వెన్నెల అటు వెన్నెల

మడి గిన్నెకు శ్రీ వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

చిరుతిండుల కల వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

రుచులల్లిన జడ వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

రామ్ములగల జిగి వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

ఉలిపాయల తల వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

పచిమిరపల మొల వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

పోహళింపుల మరు వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

ఎటు చూచిన రుచిరపు వెన్నెల

ఇటు వెన్నెల అటు వెన్నెల

పిచ్చెత్తే వళ్ళంతా వెర్రెత్తే దిక్కులకై పరువెత్తే ఆ పీడకల

వెన్నెల్లో ఉపుమ లేక

అమావాస్య! అమావాస్య! అమావాస్య!

మహాలయ అమావాస్య!

 

నడిజాము వేళలో,

నడి గడియ విడిదిలో,

ఉపుమను వెన్నాడి

అలసటే లేకుండ

వచ్చెదను!

సొక్కుతూ సోలుతూ

జక్షించెదను!

 

ఒడుదుడుకు లేకుండ

వడగండ్లవానలో,

వేడినిట్టూర్పుతో,

వెనువెంట పరుగెత్తి

వచ్చెదను!

చవి చాయ కలసి

చొచ్చెదను!

 

నీ సంకటినే నీ అడనే

చూచిచూచీ చిల్లులై

నీ వంకనే నిలిచి చొంగై

చీకటైన నానాల్క కేమీ

అగుపడదె ఉపుమా!

ఆకసమే లేదే నాకు!

 

ఆట లాడే పిడుచ

మాటలే విందునా?

నాలోనె నవ్వుకొని

మాయగా తలచనా?

 

మాయలో మాయనై

చేయ గలిగిం దేది!

ఉజ్జీవ ప్రతిమనై

సజ్జీవమై పోనా!

ఉపుమా, రుచిరమూర్తి!

స్ఫూర్తిసహిత వర్తివై

ముద్దవై గోర్ముద్దవై

మోళివై యుండవే!

 

ఉపాహారమూర్తీ

రుచ్యధార లిమ్ము!

నిర్విచారమూర్తీ!

నీరుచుల ‘కుటీచకుడ’!

 

కవలఅద్దాల వలె వెల్గు పళ్ళెరపు బింబములలో

తుదిదాక ఉపుమాగ్ని కణములను

విధిదూతల వలె కన్పెట్టుకొనుచు

పల్వురి కాకువులు ఆలయపు ధూపముల వలె వెల్గితే

ఆ ధూప జ్వాలాంతర్గతములై

అందే యొకటిపై నొకటి మిళితమై

భోక్తల ప్రేమ సౌఖ్య శయ్యాతలము నలుదెసల విదజల్లు

 

నిశీధ ఉపాహార మూర్తీ!

ధీరభోక్త హృదయమున

సిగ్గుచే తలవంచి

రాత్రివలె జీవించ

పగలు ఫలహారములు పుట్టునా!

సౌందర్య ఉపాహార మూర్తీ!

 

చెప్పవోయ్ చూదాము ఏమాయ రూపముగ

సమృద్ధ సామ్రాజ్య శిల్పకళా కోవిదులు

శాతకర్ణీరాజు లేదారి పోయిరో!

శౌర్యోదారులౌ రాష్ట్రకూటులూ వీరపల్లవులూ,

సాహస ధైర్యస్థైర్యోపాసకు లాఓరుగంటి ఒంటరులు,

వాఙ్మయ పోషక విజయనగరాధిపతులు, పల్నాటివీరులు,

చాళుక్య సింహాలు, బొబ్బిలీ బెబ్బులులు, నాయక ప్రభువులు?

నిరుడు నిష్ఠతో నిలబెట్టిన, నీటిలో నీరైన, వలలుని ఉపుమారవయేదీ?

ఏవోయ్ భోక్త మనస్సంభితాకారాలు ఉపుమారవలేవీ!

శోణితపు వాహినీ అల్లకల్లోలానంద రూపిణౌ

కృష్ణవేణీ ఉదకంబు అంటక్రాగు జలకంబులాయె నేమోయ్?

నిరుడు నీటుతో నిలబడిన నీటిలో నీరైన ఉపుమారవయేదీ?

సౌ మి త్రీ!

నిరుడు మడిగట్టి నిలబడియు చట్టిలో ముద్దయైన ఉపుమారవయేదీ?

వి శ్వ మా

నిరుడు ఆ క్రిందటియేడా క్రిందటియేడు, ఉపుమారవయేదీ?

సౌందర్య ఉపాహార మూర్తీ!

నిరుడు నిష్ఠతో నిలబడిన నీటిలో నీరైన ఉపుమారవయే

పొంగుచుపోయె?

నిశీధ ఉపాహార మూర్తీ!

కన్యకాపరమేశ్వరీ మనఃపరమేశ్వరీ శక్తివై

రుచిరత్వ అనల స్వచ్ఛత్వమున కాధారమై

 

ఆంధ్ర ఉపాహార ముద్ధరింపుము!

“ఉప్పిట్టు పేరేమి

ఊరి పేరేమి

ఉపుమ కనుగొన్న వంటలక్క పేరేమి?”

 

నిశీధ

ఉపాహార

మూర్తీ!

రవ్వయు

త్పన్నమై

మృతయై

మృతిలో

కన్గొనును

మరుగు

నీటిలో

దహనమై ఉపుమను పొందు జీవుడు!

 

వేగూచుక్కా వెలగామొగ్గా

కాళ్లాగజ్జా కంఖాణముపై

కరహాట కరములతో కరవాలధారివై,

ఉపాహారాట్టహాసివై,

కంఠీరవాకార కేయూర వయ్యారివై,

కూలంకషాకాళ కేళీకరాళవై కాళివై,

అనలముల కళకళల అందాలచిందువై

కుక్షములో దహనమైతే నీవు

రుచిపురుష సహితముగ

ఇల అనలముల జల్లి

దహనమయ్యెదను కాకువుల ధవళాగ్నిలో!

పుఠములో పండిన గద వన్నెలల దేలుట!

 

 

పల్లవి

 

బంగరురవవైతే నాబాల, అందాల ఉపుమరవవైతే

రావేల రావేల రావేలా!

 

అనుపల్లవి

 

ఆనందభైరవీవై నాబాల, రుచిరార్థనారీశ్వరముగా!

రావేల రావేల రావేలా!

 

నివృత్తిపల్లవి

 

అనలముల రుచిరాక్షివైతే రామములగ ఉలికాడలతో

ఉయ్యాలఊపు లేవే, నాబాలా, జంపాల జోలలేవే!

 

ప్రవృత్తిపల్లవి

 

సౌందర్య ఉపాహార మూర్తీ, నాజిహ్వయజ్ఞముల సోమరసధారా!

రావేల రావేలా! ఉజ్జ్వలన! ఆనందజ్యోత్స్నవై!

 

చరణము

 

విద్యున్మాలా జ్వాలా లావణ్యవై వజ్ర జ్వాలా వన్నె విరివై

స్వప్న సుధా ధారా పారావార మధనమందు

ఫలహారామృత రసము త్రాగే

చొంగగళాధారికి, ఒసే!

గంధము పూయ రావే! ఒసే!

తిలకము తీర్చ రావే! ఒసే!

హారతి నివ్వ రావే!

 

చరణము

 

పోహళింపు విమానములో, ఆవాలగింజ పై

తేలిపోదామా! ఉపుడుపిండి కై

వైభోగములతో

అల్లిబిల్లులతో

అల్ల నల్లన తేలి,

పొయ్యిమావి మీద గిన్ని పెడదామా!

 

నీలోని టేష్టుయే నాలోని ఆకలై

నా డొక్కలో బాల!

నా జఠరాగ్నిలో

దగ్ధమౌనే, నా ఉపుమ బాల!

దహనమౌనే నాకుక్షిలో!

 

నాలోని ఆస్రావమే నీలోన జొరబాడి

నీముద్ద గోర్ముద్ద యెన్నడౌనో!

గోర్ముద్దకరుడు పెరిగి కొండలై

మానససరోవర మేలా గౌనో!

సరోవర తీరాన సాయంకాలాన

సంధ్యావందనమందే,

‘కాయేన వాచా మనసేంద్రియైర్వా’

నీమీదనే ధ్యానమున్నదే!

 

అర్ఘ్యపానీయంలో ఆనందమూర్తి!

నీముఖబింబమే గాంతునే

జ్యోతి పెరిగినా జ్వాల ఆరినా

చీకటిలో చుక్కల్లె చూతునే!

 

నాలోని ఆకలే నీలోని రుచియై

నాలోని నేనే నీలోని నీవై

నా ఉపుమ బాల!

నీ ముద్దలో దగ్ధమౌనా?

దహనమౌనా, నీ రుచులలో?

 

ప్రేమ లన్నిటిలోను

‘ ఉపుమరవ ‘ ప్రేమ

గాయమై మనసులో

వైకుంఠ మిదే యని

దన్నుననే ఉపుమగ నుండును!

 

జఠరములు చీల్చుచూ

భ్రమల పురికొల్పు

ఉపుమరవ శరములే

భావ తరంగాలు!

భావాంతమున గదా భక్ష్యప్రభాతము!

 

జన్మతో జన్మించు నోయీ

రుచిరనక్షత్రము!

జన్మాంతము జాతరలు జరగు వేల!

ఉపుమ జాతరలు జరుగవేల

 

17 February 2009

[amazon_link asins=’B01NBAA0X0,8192378780,B01LY4WV05,B07BHWFLRW’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’9bf630c6-0cfe-11e9-b56a-3f4ee7a44c49′]

Your views are valuable to us!